మావోయిస్టుల హిట్‌లిస్ట్‌లో అయ్యన్న పాత్రుడు!
ఏపీ శాసన సభ స్పీకర్‌గా ఎన్నికైన చింతకాయల అయ్యన్న పాత్రుడు మావోయిస్టుల హిట్ లిస్ట్‌లో ఉన్నారు. ఎందుకు అయ్యన్నను మావోయిస్టులు చంపుతామని బెదిరించారు.
Byline : G.P Venkateswarlu
Update: 2024-06-22 08:29 GMT
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏడు సార్లు శాసనసభకు ఎన్నికైన సీనియర్ రాజకీయ నాయకుల్లో చింతకాయల అయ్యన్న పాత్రుడు ఒకరు. సీనియర్ పొలిటీషియన్ కావడం వల్ల తెలుగుదేశం పార్టీ ఆయనకు స్పీకర్‌గా 2024లో అవకాశం కల్పించింది. అయ్యన్న పాత్రుడు ఎందుకు మావోయిస్టుల హిట్ లిస్ట్‌లోకి ఎక్కారు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏమిటి? మావోయిస్టులు ఆయనను వెంటాడుతూనే ఉన్నారనే నిజం తెలియడంతో తెలుగుదేశం పార్టీ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది.
2014లో అధికారం చేపట్టిన తెలుగుదేశం పార్టీ అప్పట్లో విశాఖ ఏజెన్సీలోని బాక్సైట్‌పై కన్నేసింది. బాక్సైట్ తవ్వకాలకు అనుమతి ఇస్తూ ఏపీ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ జీవో నెం: 97ను 2015 నవంబరు 5న జారీ చేసింది. అప్పడు పంచాయతీరాజ్. అటవీ శాఖల మంత్రిగా అయ్యన్న పాత్రుడు ఉన్నాడు. బాక్సైట్ తవ్వకాలను ఆపివేయాలని, ఈ తవ్వకాల వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందంటూ పర్యావరణ వేత్తలు, గిరిజనులు వ్యతిరేకించారు. గిరిజనుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడానికి ప్రధాన కారణం వారి వెనుక మావోయిస్టులు అండగా నిలబడటమేనని అయ్యన్న పాత్రుడికి అర్థమైంది. దీనికి తోడు పోరాటం ఉదృతమైంది.
అయ్యన్నకు మావోయిస్టుల ఫోన్
2015 నవంబరు 5న జీవో జారీ అయితే నవంబరు 9న మావోయిస్టుల నుంచి అయ్యన్నకు ఫోన్ వచ్చింది. బాక్సైట్ మైనింగ్ తవ్వకాలకు అనుమతి ఇస్తూ ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. దీంతో దిక్కుతోచని అయ్యన్న పాత్రుడు ముందుగా అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు వద్దకు పరుగులు పెట్టారు. మావోయిస్టుల నుంచి ఫోన్ బెదిరింపు వచ్చిందని, జీవోను 97ను వెంటనే రద్దు చేయకుంటే చంపేస్తామంటున్నందున వెంటనే జీవోను రద్దు చేయలని కోరారు. ఆ తరువాత అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వద్దకు వెళ్లి తనకు మావోయిస్టుల నుంచి చంపుతామని వచ్చిన బెదిరింపు ఫోన్ కాల్ విషయాన్ని వివరించారు.
చంద్రబాబు కీలక ప్రకటన
అయ్యన్నను శాంతింప జేయడంతో పాటు మావోయిస్టుల నుంచి వ్యతిరేకతను తగ్గించేందుకు చంద్రబాబునాయుడు అప్పట్లో కీలక ప్రకటన చేశారు. ప్రజలకు వ్యతిరేకంగా తాము ఏ నిర్ణయం తీసుకునేది లేదని, గిరిజనుల అభిప్రాయం తీసుకుంటామని ప్రకటించారు. ఇందుకోసం అభిప్రాయ సేకరణ జరిపించారు. గిరిజనుల నుంచి పూర్తి స్థాయిలో వ్యతిరేకత రావడంతో మైనింగ్‌ను ఆపివేస్తున్నట్లు 2015 డిసెంబరులో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు ప్రకటించారు. దీంతో కొంత వరకు గిరిజనులు శాంతించారు. మావోయిస్టుల నుంచి బెదిరింపులు కూడా తగ్గాయి. అయితే జీవోను మాత్రం చంద్రబాబు రద్దు చేయలేదు.
జగన్ ప్రభుత్వంలో జీవో రద్దు
బాక్సైట్ తవ్వకాల జీవోను రద్దు చేస్తానని, గిరిజనుల ఇష్టం లేకుండా ఏజెన్సీలో ఎటువంటి కార్యకలాపాలు ఉండవని వైఎస్ జగన్ గిరిజనులకు ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు. 2019లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన జీవో 97ను 2019 జూన్ 25న రద్దు చేస్తూ జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అయ్యన్న కుటుంబంపై మావోయిస్టుల వ్యతిరేకత
చాలా కాలంగా చింతకాయల అయ్యన్న పాత్రుడికి మావోయిస్టులు వ్యతిరేకంగా ఉన్నానే చర్చ జరుగుతూనే ఉంది. ఈయన అనకాపల్లి జిల్లా నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఒకసారి అనకాపల్లి లోక్ సభకు ఎన్నికయ్యారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. నర్సీపట్నం ప్రాంతంలో గతంలో రంగురాళ్ల వ్యాపారం బాగా జరిగేది. అయ్యన్న పాత్రుడి తమ్ముడు చింతకాయల శ్రీను రంగురాళ్ల డాన్‌గా పేరు పొందారు. రంగురాళ్ల వ్యాపారంలో గిరిజనులను మోసం చేస్తున్నారని, అందుకు అయ్యన్న పాత్రుడు తమ్ముడికి సహకరిస్తున్నారనే ఆరోపణలు చేసి అయ్యన్న తమ్ముడు శ్రీనును మావోయిస్టులు చంపేశారు. అప్పటి నుంచే అయ్యన్నకు మావోయిస్టుల నుంచి ప్రాణాపాయం ఉందని చర్చ ఉంది. ఏజెన్సీలోని అరకు మండలం గాలికొండ, రక్తికొండ, జీకే వీధి మండలం సర్పర్ల, జర్రెల, తూర్పుగోదావరి జిల్లాలోని గుర్తేడు ఏరియాలో బాక్సైట్ గనులు ఉన్నాయి. ఈ గనుల తవ్వకాలకు అనుమతులు ఇప్పించడంలో ప్రధాన పాత్ర అయ్యన్న పాత్రుడిదేనని భావించిన మావోయిస్టులు నేటికీ అయ్యన్నను అనుమానిస్తున్నారని సమాచారం. అరకు ఏరియాలో మావోయిస్టుల ప్రభావం 2014లో ఎక్కువగా ఉన్నప్పుడు నాటి అరకు టీడీపీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోములను కిడ్నాప్‌చేసిన మావోయిస్టులు ఇద్దరినీ కాల్చి చంపిన సంఘటన అప్పట్లో సంచలనమైంది. బాక్సైట్ తవ్వకాలకు జీవో ఇవ్వడంలో వీరి పాత్ర ఉందని మావోయిస్టులు చాల ప్రాంతాల్లో పోస్టర్లు అంటించి హెచ్చరికలు చేశారు. అయినా తీరు మారలేదని చంపేశామని మావోయిస్టులు ప్రకటన చేశారు.
20 ఏళ్లుగా అయ్యన్నపై మావోయిస్టుల గురి
రంగురాళ్ల వ్యవహారంలో అయ్యన్న తమ్ముడు శ్రీనును చంపిన దగ్గర నుంచి మావోయిస్టులు అయ్యన్నపై కూడా పగ పెంచుకున్నారని అక్కడి వారు చెబుతుంటారు. ఎమ్మెల్యేగా ఉంటూ ప్రభుత్వంలో చక్రం తిప్పి మావోయిస్టుల అణచివేతలో కీలక పాత్ర అయ్యన్న పాత్రుడు పోషిస్తున్నాడని నేటికీ మావోయిస్టులు భావిస్తున్నట్లు సమాచారం.