విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం.. అత్యున్నత విద్యా ప్రమాణాలతో విరాజిల్లుతోంది. దేశంలో మిగతా యూనివర్సిటీల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటోంది. ఈ విశ్వవిద్యాలయం ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎంపీల నుంచి రాష్ట్రపతి వరకు, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ల నుంచి సీఎస్, డీజీపీల వరకు, విశిష్ట న్యాయమూర్తులను, శాస్త్రవేత్తలను.. ఇలా ఎందరినో అందించింది. దేశ విదేశాల్లోనూ మరెందరినో ప్రపంచ ప్రఖ్యాత మేధావులుగానూ తీర్చిదిద్దింది. అలాంటి ఆంధ్ర యూనివర్సిటీ (ఏయూ) కొన్నేళ్లుగా విదేశీ విద్యార్థులను కూడా ఆణిముత్యాలుగా తయారు చేస్తోంది. వీరు ఆయా దేశాల్లో ఉన్నతులుగా నిలిచేలా దోహదపడుతోంది. ఇక్కడ విదేశీ విద్యనభ్యసించిన వారు తమ దేశాల్లో కేంద్ర, రాష్ట్ర మంత్రులుగాను, జడ్జిలుగాను, ఇంకా మరెన్నో అత్యున్నత పదవులను అధిరోహిస్తున్నారంటే ఏయూ కీర్తి కిరీటం ఏపాటిదో వేరే చెప్పాల్సిన పనేముంది? అదేమిటో చదవండి..!
ఏయూలో ఇంటర్నేషనల్ అఫైర్స్ పటం
పది మందితో మొదలై.. 1100కు దాటి..
విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇంటర్నేషనల్ అఫైర్స్ కోర్సులకుు 35 ఏళ్ల క్రితం అంటే.. 1990లో పురుడు పోసుకుంది. ఆరంభంలో పది మంది విద్యార్థులతో మొదలై ఇప్పుడు 1146 మందికి చేరుకుని దేశంలోనే అత్యధికంగా విదేశీ విద్యార్థులకు బోధన చేస్తున్న యూనివర్సిటీగా నిలిచింది. ఆరంభంలో రెండు మూడు దేశాలకు పరిమితమైతే.. గత మూడున్నర దశబ్దాల్లో ఇప్పుడా దేశాల సంఖ్య 58కి చేరింది. వీటిలో బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, బోట్స్‌వానా, కంబోడియా, ఈజిప్ట్, అంగోలా, ఇథియోపియా, కెన్యా, ఇరాక్, ఇండోనేసియా, జపాన్, జోర్డాన్, మడగాస్కర్, మయన్మార్, మాలి, నమీబియా, నేపాల్, నైజీరియా, సోమాలియా, దక్షిణాఫ్రికా, శ్రీలంక, సూడాన్, సిరియా, టాంజానియా, ఎగాండా, ఎమన్, జాంబియా, జింబాబ్వే తదితర దేశాలున్నాయి. సుమారు 60కి పైగా భాషలు మాట్లాడే విదేశీ విద్యార్థులు ఏయూలో విద్యాభ్యాసం చేస్తున్నారు.
సాంస్కృతిక కార్యక్రమంలో వియత్నాం బౌద్ధ విద్యార్థులు
ఏ దేశం నుంచి ఎంతమంది?
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రస్తుతం విద్యాభ్యాసం చేస్తున్న విదేశీ విద్యార్థుల్లో అత్యధికంగా 130 మంది బంగ్లాదేశీయులున్నారు. ఇరాక్ 94 మంది, ఇథియోపియా 70, సూడాన్ 68, మొజాంబిక్ 53, టాంజానియా 51, నేపాల్ 44, ఎస్వంటిని 41, సియారాలియోన్ 38, మెడగాస్కర్ 38, యెమెన్ 31, అంగోలా 30 మంది చొప్పున ఉన్నారు. మిగిలిన వారు ఇతర దేశీయులు. మొత్తంగా చూస్తే ఆఫ్రికా దేశాలకు చెందిన వారు 60 శాతం మంది ఉన్నారు. వీరిలో అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ) కోర్సుల్లో 697 మంది, పోస్టు గ్రాడ్యుయేషన్ (పీజీ) 235, పీహెచ్‌డీ 214 మంది ఉన్నారు. విద్యార్థులకు ఆరు, విద్యార్థినులకు నాలుగు హాస్టల్స్ ఉన్నాయి.
ఇథియోపియా విద్యాశాఖ మంత్రి తిలాయే గెటీ అంబాయే
విదేశీయులకూ ఏయూలో అన్ని కోర్సులూ..
ఈ యూనివర్సిటీలో ఉన్న అన్ని కోర్సులను ఫారిన్ స్టూడెంట్స్‌కు కూడా ఆఫర్ చేస్తోంది. ఇక్కడ ఆర్ట్స్ అండ్ కామర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజినీరింగ్, ఫార్మాస్యూటికల్ సైన్సెస్, లా, ఇంజినీరింగ్ ఫర్ ఉమెన్, ఎడ్యుకేషన్ వంటి ఏడు కాలేజీలున్నాయి. వీటి ద్వారా 124 కోర్సులను స్వదేశీ విద్యార్థులతో పాటు విదేశీ విద్యార్థులకు ఆందిస్తోంది. ఏయూలో ఎక్కువ మంది విదేశీయులు కంప్యూటర్ సైన్స్‌లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. భారత్ నుంచి విదేశాల్లో చదువుల కోసం పోటీ పడుతుంటే.. మన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో సీటు దొరికితే చాలని దాదాపు 60 దేశాల వారు పోటీ పుతున్నారు.
ఇథియోపియా కార్మిక మంత్రి తెసాఫయే
ఐసీసీఆర్ స్కాలర్‌షిప్‌లతో..
విదేశీ విద్యార్థుల విద్యాభ్యాసానికి ఇండియన్ కౌన్సెల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ (ఐసీసీఆర్) స్కాలర్‌షిప్‌లను అందిస్తోంది. ఐసీసీఆర్ 2010 నుంచి స్కాలర్‌షిప్‌లను ఇవ్వడం మొదలెట్టాక వీరి సంఖ్య మరింత పెరుగుతోంది. అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ) కోర్సులకు రూ.18,000, పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులకు రూ.20,000, పీహెచ్‌డీలకు రూ.22,000లతో పాటో ఒక్కొక్కరికి హాస్టల్ అలవెన్స్ రూ.5,500, ఏడాదికి రూ.10 వేలు కంటింజెన్సీ కింద ఐసీసీఆర్ చెల్లిస్తోంది. భారత్‌లోని వివిధ విశ్వవిద్యాలయాల్లో చేరేందుకు విదేశీ విద్యార్థులకు ఐసీసీఆర్ పరీక్ష నిర్వహిస్తుంది. అందులో మెరిట్ ఆధారంగా ఏయూలో చేరడానికే ఎక్కువ మంది మొగ్గు చూపుతుంటారు.
ఆఫ్ఘన్ గవర్నర్ మాజీ సలహాదారు అబీబుల్లా అబీదే
ఇక్కడ చదివి.. అక్కడ ఎదిగి..
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చదివిన విదేశీ విద్యార్థులు తమ దేశాల్లో అత్యున్నత పదవులను అధిరోహిస్తున్నారు. కొందరు ఆ దేశాల్లో కేంద్ర, రాష్ట్ర మంత్రులు అవుతుండగా మరికొందరు జడ్డిలుగానూ, అక్కడ యూనివర్సీటీలకు వైస్ ఛాన్సలర్ల (అక్క వీసీలను ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తారు) గాను అందలం ఎక్కుతున్నారు. ఇథియోపియాలో ఏడుగురు ఆ దేశానికి మంత్రులు కాగా 16 మంది ఛాన్సలర్లయ్యారు. వీరిలో ఆంథ్రోపాలజీలో పీహెచ్‌డీ చేసిన ఎర్గోగీ టెస్‌ఫాయి ఆ దేశ లేబర్ అండ్ సోషల్ అఫైర్స్ మంత్రిగా, పొలిటికల్ సైన్స్ విద్యార్థి హసన్ మాలిన్ పరిశ్రమల శాఖకు కేంద్ర మంత్రులుయ్యారు. అలాగే ఎడ్యుకేషన్‌లో పీహెచ్‌డీ చేసిన డాక్టర్ తెలాయే గెటీ అంబాయే ఆ దేశ విద్యాశాఖ మంత్రిగా, కామర్స్ అండ్ మేనేజిమెంట్‌లో పీహెచ్‌డీ చేసిన డాక్టర్ సామ్యూల్ కిఫ్లే రాష్ట్ర మంత్రిగా, డాక్టర్ టెవోడ్రోజ్ మంత్రి హోదా, డాక్టర్ నెగరీ వెంచో (పీహెచ్‌డీ జర్నలిజం) వాణిజ్య శాఖ మంత్రిగా పని చేశారు. ఎడ్యుకేషన్‌లో పీహెచ్‌డీ చేసిన ఆక్టర్ అసీఫా అబాహుమ్నా ఎంపీగా ఎన్నికయ్యారు. అదే దేశానికి చెందిన మహ్మద్ నూరే గుబేనా ఆరోమియా రాష్ట్రానికి జడ్జి అయ్యారు. ఇక ప్రస్తుతం న్యాయశాస్త్రంలో పీహెచ్‌డీ చేస్తున్న ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన ఆబీదుల్లా అబీదే కొన్నాళ్ల క్రితం వరకు రాష్ట్ర గవర్నర్‌కు సలహాదారుగా ఉన్నారు. ఇంకా ఏయూలో విద్యనభ్యసించిన పలువురు తమ దేశాల్లో ఉన్నత పదవులను అధిరోహిస్తున్నారు. ఆయా దేశాల్లో ఉన్నతోద్యోగాలను పొందుతున్నారు.
ఏయూలో సీటు రావడం అదృష్టం..
వందేళ్ల చరిత్ర కలిగిన ఏయూలో నాకు సీటు రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడ విద్యా ప్రమాణాలు చాలా బాగున్నాయి. ఫ్యాకల్టీ చక్కగా బోధిస్తున్నారు. ఈ సంగతి తెలుసుకునే ఇక్కడ చేరాను. కెమికల్ ఇంజినీరింగ్ ఫస్టియర్ చదువుతున్నాను. చదువు పూర్తయ్యాక మంచి ఉద్యోగావకాశాలు వస్తాయన్న నమ్మకం ఉంది.
– మైఖేల్ ఓబీ నికోమా, ఘనా.
తనయ్ దేవ్‌నాథ్, బంగ్లాదేశ్
మా దేశంలో ఏయూకి మంచి పేరుంది..
ఆంధ్ర యూనివర్సిటీకి మా దేశంలో మంచి పేరుంది. అందుకే ఇక్కడ సీటు తెచ్చుకోవాలని చాలా మంది విద్యార్థులు తపన పడుతుంటారు. ఇప్పటికే మా దేశీయులు 69 మంది ఇక్కడ చదువుతున్నారు. ఈ సంవత్సరం వివిధ ఇంజినీరింగ్ కోర్సుల్లో 32 మంది చేరారు. ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టం కూడా చాలా బాగుంది. నాణ్యమైన విద్యా బోధన జరుగుతోంది. నాకు నెలకు రూ.23,500 స్కాలర్‌షిప్ వస్తోంది.
–తనయ్ దేవ్‌నాథ్, కెమికల్ ఇంజినీరింగ్ విద్యార్థి. బంగ్లాదేశ్.
ఉత్తమ ప్రమాణాలకు ఆకర్షితుడినై..
ఏయూకి నాక్ ఏ++ గ్రేడ్ ఉంది. చాలా దేశాలతో పోల్చుకుంటే ఈ యూనివర్సిటీ విద్యా ప్రమాణాలు బాగున్నాయని, విద్య అనంతరం ఉద్యోగావకాశాలు వస్తున్నాయని మా దేశంలో చెప్పుకుంటారు. మా స్నేహితులు, తెలిసిన వారు ఇక్కడే వేర్వేరు కోర్సుల్లో చేరారు. అందుకే నేనూ ఏయూను ఎంచుకున్నాను. ఇక్కడ రుచికరమైన ఫుడ్ దొరుకుతుంది. మంచి మనుషులు. ఆహ్లాదకర వాతావరణం. మత సామరస్యం ఉంది.
– అహ్మద్, బీబీఏ సెకండ్ ఇయర్ విద్యార్థి, సూడాన్.
ఏరికోరి ఏయూనే ఎంచుకుంటున్నారు..
విదేశీ విద్యార్థులు ఎక్కువగా ఏయూనేఎంచుకుంటున్నారు. దేశంలోని యూనివర్సీటీల్లోకెల్లా వీరి సంఖ్య ఎక్కువగా ఉన్నది ఏయూలోనే. ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్, నాక్ గ్రేడింగ్‌లతో పాటు ఐఎస్‌వో 9001ః2015 సర్టిఫైడ్ విద్యా సంస్థ మాది. వందేళ్ల ఘన చరిత్ర ఏయూ సొంతం. ఇక్కడ అత్యున్నత విద్యా ప్రమాణాలు, నిపుణులైన ఫ్యాకల్టీ, మౌలిక వసతులు ఉన్నందునే విదేశీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో చేరుతున్నారు. ఆఫ్రికా దేశాల నుంచి మరింత మంది వస్తున్నారు. వీరికి ఐసీసీఆర్ స్కాలర్‌షిప్‌లు ఇస్తోంది. ఇక్కడ చదివిన విద్యార్థులు తమ దేశాల్లో మంత్రులు, జడ్జిలు, యూనివర్సిటీల ప్రెసిడెంట్లు వంటి అత్యున్నత పదవులు చేపడ్తున్నారు. మరికొందరు ఉన్నత స్థానాల్లో ఉంటున్నారంటే ఎంతో గర్వంగా ఉందిు’ అని ఏయూ ఇంటర్నేషనల్ అఫైర్స్ డీన్ డాక్టర్ ఎస్.పాల్ డగ్లస్ ‘ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్’ ప్రతినిధితో చెప్పారు.