అధికారులేనా? మంత్రులు బాధ్యులు కారా?

సింహాచలం గోడ కూలిన ఘటనపై చర్యలు ఎవరిపైన? నాలుగు రోజుల్లో గోడ కట్టాలన్న ఒత్తిళ్లతోనే కట్టానన్న కాంట్రాక్టరు.;

Update: 2025-05-02 14:04 GMT
కాంట్రాక్టరు, ఇంజినీరింగ్‌ అధికారులను విచారిస్తున్న విచారణ కమిటీ సభ్యులు

అధికారులు, అమాత్యుల నిర్లక్ష్యంతో ఏడుగురి భక్తుల నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. సింహాచలేశుని చందనోత్సవం నాడు గోడ కూలిన దుర్ఘటనలో ఏడుగురు భక్తులు దుర్మరణం పాలయిన సంగతి తెలిసిందే.

కూలిన గోడ నిర్మాణంలో వాడిన ఇటుకలను పరిశీలిస్తున్నకమిటీ

 ఈ ఘటనపై తప్పు తమది కాదంటే తమది కాదని ఎవరికి వారే తప్పించుకునేందుకు తంటాలు పడుతున్నారు. మంత్రులైతే ఈ దుర్ఘటనకు బాధ్యత కాంట్రాక్టరు, అధికారులదేనని చెప్పకనే చెబుతున్నారు. ఇందులో తమ తప్పిదం ఎక్కడ బయట పడుతుందోనని పనిలో పనిగా ఎప్పటి మాదిరిగానే ఈ ప్రమాదాన్ని కూడా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ ఖాతాలోకి వేసేసేందుకు ప్రయత్నిస్తున్నారు. చందనోత్సవం నాడు సింహగిరిపై క్యూ లైన్లో నిలుచున్న వారిపై ఇటీవల నిర్మించిన గోడ కూలిపోవడానికి అధికారులతో పాటు మంత్రులకు బాధ్యత ఉందనడంలో ఎవరికీ ఎలాంటి సందేహాలు లేవు.

ఏడాదికోసారి మాత్రమే జరిగే అప్పన్న చందనోత్సవానికి లక్షల్లో భక్తులు వస్తారన్న సంగతి ఇటు అధికారులకు, అటు మంత్రులకు తెలుసు. అందుకు తగినట్టే ఏటా ఏర్పాట్లు చేస్తుంటారు. ఈ ఏడాది చందనోత్సవానికి రెండు నెలల ముందు నుంచే హడావుడి మొదలు పెట్టారు. చందనోత్సవం నిర్వహణపై ఏర్పాటైన నలుగురు మంత్రుల కమిటీ సంబంధిత అధికారులతో నాలుగ్గోడల మధ్య ఏసీ గదుల్లో కూర్చుని సమీక్షలు చేశారు. ఈసారి నభూతో..! అన్నట్టుగా గతంలో ఎన్నడూ జరగనంత ప్రశాంతంగా, విజయవంతంగా సామాన్య భక్తులు సింహాచల స్వామిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామని తరచూ మీడియా ముందుకొచ్చి ఊదరగొట్టారు. వారి ప్రకటనలను చూసి ప్రజలతో పాటు స్వామి భక్తులు కూడా ఎంతో మురిసిపోయారు. కానీ చందనోత్సవం నాటి దుర్ఘటనలో ఏడుగురు అమాయక భక్తులు ప్రాణాలు కోల్పోయాక తెలిసింది అధికారులు, మంత్రుల నిర్లక్ష్యం, బాధ్యతా రాహిత్యం వల్లే ఈ దారుణం జరిగిందని. ఇక ఈ ఘటన తర్వాత తమ వైఫల్యాలను, తప్పులను కప్పి పుచ్చుకోవడానికే మంత్రులు పొంతన లేని ప్రకటనలు చేస్తున్నారు.
గోడ నిర్మాణమే అడ్డగోలు..
సింహాచలం కొండపై ఏడుగురు భక్తులను బలి తీసుకోవడానికి కారణమైన గోడ నిర్మాణంపై ఒక్కో వాస్తవం వెలుగులోకి వస్తోంది. అసలు ఈ గోడ (రిటైనింగ్‌ వాల్‌) నిర్మాణానికి అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులూ లేవు. దానికి ఇంజినీరింగ్‌ అధికారులు డ్రాయింగ్‌ కూడా గీయలేదు. ప్లాన్‌లో లేకపోయినా చందనోత్సవం నాటికి గోడ నిర్మాణం పూర్తి చేయాలని, పనులు వెనువెంటనే చేపట్టాలని ఇంజినీరింగ్‌ అధికారులు దేవస్థానంలో ‘ప్రసాద్‌’ స్కీములో పనులు దక్కించుకున్న కాంట్రాక్టరు లక్ష్మణరావును మౌఖికంగా ఆదేశించారు. తొలుత ప్లాన్‌లో లేని గోడను తాను కట్టబోనని, అయినా చందనోత్సవం నాటికి పూర్తి చేయలేనని కాంట్రాక్టరు చెప్పినా వినిపించుకోలేదు. దీంతో కేవలం నాలుగు రోజుల్లోనే ఈ గోడను ఆదరాబాదరాగా కట్టేసి పూర్తయిందనిపించారు. ప్లాన్‌ లేని, డ్రాయింగ్‌ గీయని గోడకు బిల్లులు వస్తాయో రావోనన్న ఉద్దేశంతో అధికారుల ఆదేశాలను కాదంటే ఏమవుతుందోనన్న ఉద్దేశంతో కాంట్రాక్టరు కూడా నాసిరకం మెటీరియల్‌తో మమ అనిపించారు.
గోడ నాణ్యతను పరిశీలించిన వారేరి?
అయితే గోడనైతే కట్టమని ఒత్తడి చేశారు తప్ప దాని నాణ్యతను ఇటు అధికారులు గాని, మంత్రులు గాని పరిశీలించిన దాఖలాలు లేవు. గోడ నిర్మాణంలో వాడిని ఇటుకలు గాని, సిమెంటు, ఇసుక పాళ్లను గాను తనిఖీ చేసిన పాపాన పోలేదు. ఒకట్రెండు సార్లు ఇంజినీరింగ్‌ అధికారులు గోడ నిర్మాణాన్ని వచ్చి చూసినా దాని పురోగతినే తప్ప దాని నాణ్యతను పట్టించుకోలేదు. నాణ్యతను పరిశీలిస్తే నిర్మాణ రంగంలో అనుభవం లేని వారికి సైతం అది ఎంత లోపభూయిష్టంగా నిర్మించారో ఇట్టే తెలిసిపోతుంది. చందనోత్సవానికి ఆరు రోజుల ముందే గోడ నిర్మాణాన్ని చేపట్టి రెండు రోజుల ముందు పూర్తి చేశారు. 60 మీటర్ల పొడవు, 10 మీటర్ల ఎత్తు ఉన్న ఈ గోడను ఎవరైనా కచ్చితంగా భూమిలోంచి పునాదులు తవ్వి, ఐరన్, కాంక్రీటుతో పిల్లర్లు వేసి మధ్యలో ఇటుకలతో నిర్మిస్తారు. కానీ పిల్లర్లు లేకుండానే గోడను పూర్తి చేశారు. చందనోత్సవ సమీక్షల కోసమని పలుమార్లు బుగ్గ కార్లలో రయ్‌రయ్‌ మంటూ కార్లలో వచ్చి వెళ్లిన మంత్రులు ఒక్కసారి కూడా ఈ గోడ వైపు తొంగి చూడలేదు. ఇది వారి బాధ్యతా రాహిత్యాన్ని స్పష్టం చేస్తోంది. పునాది, పిల్లర్ల బలం లేని ఈ గోడ రెండు సెం.మీల వర్షానికే కుప్పకూలిందంటే అందులో నాణ్యత ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.
అధికారుల ఒత్తిడితోనే గోడ కట్టాః కాంట్రాక్టరు..
పర్యాటక, దేవదాయ శాఖ ఇంజినీరింగ్‌ అధికారుల ఒత్తిడి చేయడం వల్లే తాను ఆదరాబాదరాగా గోడ నిర్మాణాన్ని చేపట్టానని కాంట్రాక్టరు లక్ష్మణరావు కుండ బద్దలు కొట్టారు. సింహగిరి దుర్ఘటనపై విచారణకు ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని నియమించింది. ఈ కమిటీలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ సురేష్‌కుమార్‌ చైర్మన్‌గా, ఐజీ ఆకే రవికృష్ణ, జలవనరుల శాఖ చీఫ్‌ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ ఎం వెంకటేశ్వరరావులు సభ్యలుగా ఉన్నారు. వీరు గురువారం సింహాచలం కొండపై గోడ కూలిన ప్రాంతాన్ని సందర్శించి గోడ నాణ్యతను, వాడిన మెటీరియల్‌ను పరిశీలించారు. కమిటీ సభ్యులు దేవాలయ అధికారులు, ఇంజినీర్లు, పర్యాటక శాఖ అధికారులు, గోడ నిర్మాణాన్ని చేపట్టిన కాంట్రాక్టరు లక్ష్మణరావులను విచారించారు. గోడ నిర్మాణంతో పాటు, దాని నాణ్యతపైన, నిర్మాణ సమయంలో ఏ ఇంజినీర్లు ఉన్నారు? ఎవరు ఒత్తిడి చేశారు? వంటి పలు ప్రశ్నలను సంధించారు. దానికి కాంట్రాక్టరు సమాధానమిస్తూ.. తనకు అసలు గోడ నిర్మాణం చేపట్టడమే ఇష్టం లేక మధ్యలో ఆపేశానని, డ్రాయింగ్‌ లేకపోయినా ఇంజినీరింగ్‌ అధికారుల (దేవస్థానం, పర్యాటక శాఖ ఇంజినీర్లను చూపిస్తూ) వారి ప్రెజర్‌తో పాటు గడువు కూడా ఇవ్వకపోవడంతో తాను నాలుగు రోజుల్లోనే పూర్తి చేశానని చెప్పారు.
మంత్రుల కమిటీది బాధ్యతా రాహిత్యం కాదా?
చందనోత్సవం నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం నలుగురు మంత్రుల కమిటీని నియమించింది. ఇందులో మంత్రులు ఆనంద రామనారాయణరెడ్డి, డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి, అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనితలు ఉన్నారు. అయితే వీరు అధికారులతో సమీక్షలు నిర్వహించడమే తప్ప క్షేత్ర స్థాయిలో పర్యటించలేదన్న ఆరోపణలున్నాయి. అలా క్షేత్రస్థాయిలో పర్యటించి ఉంటే గోడ నిర్మాణంపై దష్టి సారించి ఉండేవారని, నాణ్యత లేమి బయటపడి అక్కడ క్యూలైన్‌ లేకుండా చూసేవారని, దీంతో ఏడుగురు ప్రాణాలు దక్కేవని చెబుతున్నారు. మరోవైపు చందనోత్సవానికి కొన్ని రోజుల ముందు నుంచి దేవదాయ శాఖ కమిషనర్‌ రామచంద్రమోహన్‌ కూడా సింహాచలంలోనే ఉన్నారు. ఆయన కూడా అనుమతులు లేని ఈ గోడను ఎందుకు నిర్మిస్తున్నారని ప్రశ్నించలేదు. ఆయన వెళ్లి గోడను పరిశీలించలేదు. సింహాచలంలో జరిగిన దుర్ఘటనపై 72 గంటల్లో కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంది. దీంతో నేడో రేపో కమిటీ ప్రాథమిక నివేదికను అందజేయనుంది. ఇందులో సంబంధిత ఇంజినీరింగ్‌ అధికారులు, కాంట్రాక్టరునే తప్ప అమాత్యుల వైఫల్యాలను, బాధ్యతా రాహిత్యాన్ని జోడించరన్న ప్రచారం ఉంది. ‘సింహాచలం దుర్ఘటనపై బాధ్యులైన అధికారులు, కాంట్రాక్టరుతో పాటు చందనోత్సవ నిర్వహణకు ఏర్పాటైన మంత్రుల కమిటీ బాధ్యతా రాహిత్యంపై కూడా ప్రభుత్వం విధిగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాం’ అని సీపీఐ (ఎం) విశాఖ జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు ‘ద ఫెడరల్‌ ఆంధ్రప్రదేశ్‌’ ప్రతినిధితో చెప్పారు.
Tags:    

Similar News