శ్రీవారి భక్తుల మరణాలు పాలకవర్గం హత్యలేనా?

పద్దతి మార్చారు. శ్రీవారి భక్తుల్లో దర్శనం జరగదేమోననే భయాన్ని మిగిల్చారు. ఆ భయంలోని బాధే వారి చావుకు కారణమైంది.;

Update: 2025-01-09 12:42 GMT

‘అన్ని తెలిసిన వాడికి అమావాస్య మరణం, ఏమి తెలియని వాడికి ఏకాదశి మరణం’ అన్నది పురాణ సామెత. అంటే,, ‘అన్ని తెలిసిన వాడి కంటే.. తెలియని వాడినే భగవంతుడు కరుణిస్తాడని’ పురాణ గాధలు చెప్పేవారు చెప్పేన మాటలు. అందుకేనేమో అమాయక భక్తజనం తొక్కుకుని చచ్చిపోయారు. నిజానికి వారంతకు వారే తొక్కుకున్నారా? దీనికి ఎవరైనా బాధ్యులా? పాలక పెద్దలతో పాటు ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. కలియుగ దైవమైన తిరుమల తిరుపతి చరిత్రలో ఇంతటి ఘోరం ఎప్పుడూ జరగలేదని స్థానికులు చెబుతున్నారు.

చైర్మన్ దిక్కుమాలిన నిర్ణయాలు
పాలక మండలి చైర్మన్ తీసుకున్న దిక్కుమాలిన నిర్ణయాలు భక్తులను బలితీసుకున్నాయనే విమర్శలు ఉన్నాయి. కొన్ని సంవత్సరాలుగా సాగుతున్న వైకుంఠ ఏకాదశి శ్రీవారి ద్వార దర్శన భాగ్యం ఈ ఏడాది ఆరంభంలోనే ఎందుకు విషాదమైంది. వైకుంఠ ద్వార దర్శనానికి టోకెన్లు మూడు రోజుల పాటు ఇవ్వాలని ఒకటిన్నర రోజులోనే ఎందుకు ముగించారు? 1.40 లక్షల మందికి టోకెన్లు ఇచ్చి ఎందుకు సరిపెట్టుకున్నారు. ప్రతి సంవత్సరం పది రోజుల పాటు జరిగే వైకుంఠ ద్వార దర్శనానికి ఏరోజు కారోజు టోకెన్లు ఇవ్వకుండా మొదటి మూడు రోజుల టోకెన్లు తొమ్మిదో తేదీనే ఎందుకు ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నారు? వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం శ్రీవారి ఆలయంలోనే చేసుకుంటే నేను, నాది అనే భావన వదులు కుంటారని స్వామీజీలు భక్తులను ఎందుకు నమ్మిస్తున్నారు. పది రోజుల పాటు అన్నీ మంచిరోజులనే విషయం ఎందుకు భక్తులకు చెప్పలేకపోయారు. అన్నీ ప్రశ్నలే.
ఆన్ లైన్ టోకెన్లు ఎందుకు ఇవ్వలేక పోయారు?
సాధారణంగా మూడు నెలలకు ఒకసారి శ్రీవారి దర్శన టిక్కెట్లు ఆన్ లైన్ లోనే అమ్ముతున్నారు. కోటా అయిపోగానే ఆపేస్తున్నారు. వైకుంఠ ద్వార దర్శన టోకెన్లు కూడా అలాగే పది రోజుల పాటు ఇచ్చి ఉంటే ఈ సమస్య ఉండేది కాదనే వాదన కూడా ఉంది. శ్రీవారి వెబ్సైట్ ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చో పాలకులకు తెలియంది కాదు. ఆన్ లైన్ సేవల ద్వారా ఏదైనా మంచిని సాధించే అవకాశం లేకపోలేదు. ఏఐ యుగంలోకి అడుగిడుతున్న రోజుల్లో కూడా రోడ్లపైన, స్కూలు ఆవరణలో గుంపులు, గుంపులుగా భక్తులు టోకెన్ల కోసం ఎందుకు వేచి చూడాల్సి వచ్చిందనే దానికి పాలకవర్గం సమాధానం చెప్పాలి.
టోకెన్ లేకుండా దర్శనం లేదని ఎందుకు ప్రకటించారు?
వైకుంఠ ద్వార దర్శన టోకెన్ లేకుండా భక్తులు కొండపైకి వస్తే వెంకటేశ్వరుడిని దర్శించుకునే అవకాశం లేదని ఎందుకు చైర్మన్, ఈవో చెప్పారో సమాధానం చెప్పాల్సిన అవరసం ఉంది. గతంలో ఎప్పుడూ ఇలా లేదు. టోకెన్ లేకపోయినా శ్రీవారిని దర్శించుకుని వెళ్లొచ్చు. శ్రీవారి దర్శనానికి వెళ్లిన వారు దర్శనం చేసుకున్న తరువాత బయటకు ఉత్తరం వైపుగా వచ్చేటప్పుడు కుడిచేతి వైపున ఉండేదే వైకుంఠ ద్వారం. టోకెన్ ఉన్న వారు ఈ ద్వారంలో నుంచి శ్రీవారి వెనుకవైపు గుండా తిరిగి దక్షిణం వైపు హుండీకి సమీపంలోని ద్వారం గుండా బయటకు వెళతారు. దేవుడిని ముందు వైపు నుంచి ముందుగా దర్శనం చేసుకుని, తిరిగి వెళ్లేటప్పుడు వెనుక వైపు నుంచి కూడా దర్శనం చేసుకుని బయటకు వెళ్లేదే వైకుంఠ ద్వార దర్శనం. టోకెన్ ఉన్న వారు వైకుంఠ ద్వారం నుంచి లోపలికి వెళ్లి బయటకు వస్తారు. టోకెన్ లేని వారు ఆ ద్వార ముందు నుంచి బయటకు వెళతారు. అలాంటప్పుడు పాలక వర్గానికి వచ్చే బాధ ఏమిటి? ఎందుకు ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నారు.
క్యూలైన్లలో ఎందుకు ఉండనివ్వలేదు?
టోకెన్ల కోసం వచ్చిన భక్తులకు మంచినీళ్లు ఇస్తూ క్యూలైన్లలో ఉండే విధంగా చర్యలు తీసుకుని ఉంటే సమస్య వచ్చేది కాదు. అలా కాకుండా స్కూలుకు పక్కన ఉన్న మునిసిపల్ పార్క్ స్థలంలో ఉండాలని అధికారులు చెప్పారు. దీంతో మునిసిపల్ పార్క్ తో పాటు రోడ్ల పైన సుమారు 5వేల మందికి పైబడి భక్తులు టోకెన్ల కోసం ఉన్నారు. ఒక్కసారిగా టోకెన్లు ఇస్తున్నారని అనగానే గుంపులు గుంపులుగా భక్తులు ఎగబడ్డారు. దీంతో తొక్కిసలాట జరిగింది. ఇందుకు బాధ్యులు అధికారులను సమన్వయంతో పనిచేయించడం చేతకాని పాలవర్గం కాదా?
తొక్కుకుంటూ ఒకరిపై ఒకరు వస్తున్నా చూస్తూ ఊరుకున్నారు...
జనం తోసుకుంటూ వస్తున్నారు. గేటు వద్ద ఉన్న పోలీస్ అధికారి, దేవాలయ సిబ్బంది తోసుకుంటూ వస్తున్న వారిని నివారించే ప్రయత్నం చేయలేదు. కనీసం హ్యాండ్ మైక్ వాడి ఎక్కడి వారు అక్కడ ఆగిపోవాలి. చాలా మంది మీ కాళ్ల కింద ఉన్నారు. వారిని వెంటనే పైకి లేపండి అనే అనౌన్స్ మెంట్ చేసినా ఇంత ఘోరం జరిగేది కాదనేది భక్తుల్లో కొందరి వాదన. కింద పడిపోయిన వారిపై నుంచి తొక్కుకుంటూ వస్తున్న వారిని వదిలేసి కింద పడిన వారిని పక్కకు అక్కడి నిర్వాహకులు లాగి పడేశారంటే ఎంత ధారుణం. వీడియోలు చూసే వారు అయ్యో దేవుడా.. అంటూ గుండెలు బాదుకున్నారు.
ప్రభుత్వం ఎవరిని బాధ్యులను చెయ్యబోతోందో తెలుసా?
టీటీడీ అడిషనల్ ఈవో.. దర్శనాలకు సంబంధించిన అన్ని విషయాలు వారే చూడాల్సి ఉంటుంది. ఇక టీటీడీ ఈవో, టోకెన్ల వద్ద పోలీసుల నుంచి ఇన్ చార్జ్ గా ఉన్న తిరుపతి క్రైం డీఎస్పి రమణకుమార్, టీటీడీ గోశాల డైరెక్టర్, టోకెన్స్ జారీ వద్ద ఇన్చార్జ్ హరనాథరెడ్డి, తిరుపతి కలెక్టర్, ఎస్పిలపై చర్యలు తసుకునేందుకు రంగం సిద్ధం చేశారు. టోకెన్స్ జారీ కేంద్రం వద్ద ఇన్ చార్జ్ లుగా ఉన్న వారిని సస్పెండ్ చేసి మిగిలిన వారిని బదిలీ చేసేందుకు రంగం సిద్ధమైంది
Tags:    

Similar News