అందుకే పవన్ మహా సూర్య నమస్కారాలకు వెళ్లలేదా?
అరకు సభకు వెళ్తే పదవీ గండమా? కొన్నాళ్లుగా అధికార పార్టీ నేతల్లో అదే సెంటిమెంట్. ఎందుకో చూద్దాం..;
అందాల అరకు అందరినీ రా రమ్మంటుంది. తన అందచందాలతో అలరిస్తుంది. నిత్యం వేలాది మంది పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తుంది. అయితే ఓ సెంటిమెంట్ అధికారంలో ఉన్న ప్రజా ప్రతినిధులను మాత్రం భయపెడుతోంది. వస్తే వచ్చారు గాని సభలు, సమావేశాల్లో పాల్గొన వద్దని హెచ్చరిస్తోంది.
ఎంతటి కాకలు తీరిన రాజకీయ నాయకుడికైనా పదవి పోతుందంటే భయం వేస్తుంది. పోతే పోనీలే అనే సాహసం చేయలేరు. అధికారాన్ని చెలాయించాలంటే పదవే అవసరం. అలాంటి అధికారాన్ని చేజిక్కించుకోవడానికి నానా తంటాలు పడుతుంటారు. కష్టపడి తెచ్చుకున్న పదవులను పోగొట్టుకోవడానికి ఎవరూ సిద్ధపడరు. అసలే సెంటిమెంట్లకు తలొగ్గే రాజకీయ నాయకులు పదవీ వియోగం అంటేనే బెంబేలెత్తిపోతుంటారు. అలాంటి బెంబేలెత్తించే సెంటిమెంట్ అరకు లోయకు ఉంది. అరకులోయలో సభలు పెట్టి, అక్కడే ఆ రాత్రి బస చేసిన ముఖ్యమంత్రులు, మంత్రులు ఆ తర్వాత పదవీచ్యుతులవుతున్నారన్న సెంటిమెంటు చాన్నాళ్లుగా ఉంది. అది నిజమో, కాదో తెలియదు కానీ.. ఆ సెంటిమెంటును కాదని అధికారంలో ఉన్న పెద్దలు అరకులో సభలు, సమావేశాలు పెట్టేందుకు భయపడి పోతున్నారు. చాలా ఏళ్లుగా ఆ మూఢ నమ్మకం సజీవంగానే ఉంది. అదంతా వట్టిదే అని చెప్పినా నమ్మే పరిస్థితి లేదు. గతంలో జరిగిన కొన్ని ఉదాహరణలను సొంత పార్టీ నేతలు చెవిని వేస్తుండడంతో మనకెందుకులే అంటూ అరకులో మీటింగ్లు పెట్టడం లేదు. ఇలా ప్రచారంలో ఉన్న వాటిలో కొన్నింటిని పరిశీలిస్తే.. 1984లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు పదవీ చ్యుతుడు కావడానికి కొన్నాళ్ల ముందు అరకులో నైట్ హాల్ట్ చేశారు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఆయన నాదెండ్ల భాస్కరరావు వెన్నుపోటుతో ముఖ్యమంత్రి పదవి నుంచి దిగి పోవలసి వచ్చింది.
2004 ఎన్నికలకు ముందు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అరకుకు సమీపంలోని ఘాట్ రోడ్డులో హెయిర్ పిన్ బెండ్ రోడ్డు ప్రారంభోత్సవానికి వచ్చారు. అనంతరం ఆయన అరకులో బహిరంగ సభలో పాల్గొన్నారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయన ముఖ్యమంత్రి పదవిని కోల్పోయారు. అలాగే 2012 జనవరిలో అరకు కేంద్రంగా మినీ అసెంబ్లీని నిర్వహించారు. అక్కడ మూడు రోజుల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ఎమ్మెల్యేలందరికీ స్టడీ టూర్ పేరిట అవగాహనా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దానికి అప్పటి అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ నాయకత్వం వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న నల్లారి కిరణకుమార్రెడ్డి హాజరయ్యారు. కొన్నాళ్ల తర్వాత ఆయన సీఎం పదవిని కోల్పోయారు. అలాగే 2015 అక్టోబరులో అరకులో జరిగిన ప్రపంచఆదివాసీ దినోత్సవ సభకు సీఎంగా చంద్రబాబు హాజరయ్యారు. 2019 ఎన్నికల్లో ఓటమి పాలవడంతో ముఖ్యమంత్రి పదవి దక్కలేదు. అలాగే రావెల కిషోర్బాబు మంత్రిగా ఉన్న సమయంలో అరకులో బస చేశారు. ఇలా బస చేసిన నెల రోజుల తర్వాత ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించారు. 2019 నుంచి 2024 వరకు ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి వీటన్నిటినీ ఉదాహరణలుగా చూపడంతో ఒక్కసారి కూడా అరకులో అడుగు పెట్టలేదని ఆ ప్రాంత వాసులు చెబుతున్నారు.
తాజాగా పవన్ కల్యాణ్ పై చర్చ..