ఏపీ టీచర్స్ ఎమ్మెల్సీ బై ఎలక్షన్..ప్రశాంతంగా పోలింగ్
ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి నేడు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.;
ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పీడీఎఫ్ టీచర్స్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ అకాల మరణంతో ఈ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారు. కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల పరిధిలో పోలింగ్ కొనసాగుతోంది. ఈ జిల్లాల పరిధిలోని ఓటర్లుగా ఉన్నా ఉపాధ్యాయులు, అధ్యాపకులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని 113 మండలాల్లో 116 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మండలానికి ఒకటి చొప్పున పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రెవిన్యూ, మునిసిపల్, పంచాయతీరాజ్ శాఖల భవనాల్లో వీటిని ఏర్పాటు చేశారు.
అయితే కొన్ని ప్రాంతాల్లో అదనంగా మరొక పోలింగ్ కేంద్రాన్ని అందుబాటులో ఉంచారు. కాకినాడ, రాజమండ్రి, అల్లూరి సీతారామరాజు జిల్లా వై రామవరం వంటి చోట్ల అదనంగా మరొక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. ప్రధానంగా ఐదుగురు అభ్యర్థులు ఈ ఎన్నికల బరిలో ఉన్నారు. బొర్రా గోపిమూర్తి(భీమవరం), గంధం నారాయణరావు(ద్రాక్షారామం), నామన వెంకటలక్ష్మి(సామర్లకోట), కవల నాగేశ్వరరావు(రాజమండ్రి), పులుగు దీపక్(తాడేపల్లిగూడెం) మధ్య తీవ్ర పోటీ నెలకొంది.