రివర్స్ టెండరింగ్‌కు బ్రేకులు వేసిన ఏపీ సర్కార్..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచల నిర్ణయాలకు కేరాఫ్‌గా మారుతోంది. ప్రతి విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటూ తన మార్క్ పాలన దిశగా అడుగులు వేస్తోంది ప్రభుత్వం.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచల నిర్ణయాలకు కేరాఫ్‌గా మారుతోంది. ప్రతి విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటూ తన మార్క్ పాలన దిశగా అడుగులు వేస్తోంది ప్రభుత్వం. ఇందులో భాగంగానే ఆదివారం.. రాష్ట్రంలోని రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో రాచరిక పద్దతికి చెల్లు చీటి ఇస్తున్నట్లు ప్రకటించింది ప్రభుత్వం. తాజాగా 2019లో అప్పటి వైసీపీ ప్రభుత్వం అమలు తీసుకొచ్చిన రివర్స్ టెండరింగ్ పద్దతికి స్వస్తి పలికింది. రివర్స్ టెండరింగ్ జీఓ67 ను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఈ మేరకు అధికారిక ప్రకటనను సీఎస్ నీరభ కుమార్ ప్రకటించారు. రివర్స్ టెండరింగ్ స్థానంలో పాత టెండరింగ్ విధానాన్ని పునరుద్ధరించనున్నట్లు సీఎస్ నీరభ్ కుమార్ తెలిపారు. ఈ ఉత్తర్వులు తక్షణం అమలవుతాయని ఆయన తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు అన్నింటికీ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఈ మేరకు ప్రభుత్వం విడుదల చేసిన తాజాగా జీఓలో వెల్లడించారు.
జీఓ 67 రద్దుపై కొత్త జీఓ
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగస్టు 16, 2019న జలనవనరుల శాఖ జీఓ 67ను తీసుకొచ్చింది. దీని ద్వారా అన్ని శాఖల్లో ప్రాజెక్ట్‌ల విషయంలో రివర్స్ టెండరింగ్ ప్రక్రియను తీసుకొచ్చింది. తాజాగా ఈ ఏడాది అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ జీఓ నెం67ను రద్దు చేస్తూ కొత్త జీఓ తీసుకొచ్చింది. ఇకపై అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ సంస్థలు కూడా పాత టెండరింగ్ పద్దతినే పాటించాలని ఈ జీఓ స్పష్టం చేస్తోంది. రివర్స్ టెండరింగ్ అమల్లో లోపాలున్న కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
ఇంజినీర్ల సిఫార్సు మేరకే రద్దు
రివర్స్ టెండరింగ్ విషయంలో చీఫ్ ఇంజనీర్ల బోర్డు సమీక్ష జరిపి సఫార్సులు చేసింది. ఆ సిఫార్సుల మేరకే రివర్స్ టెండరింగ్‌ను రద్దు చేసి పాత విధానాన్నే అమలు చేయాలని నిశ్చయించినట్లు ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. చీఫ్ ఇంచినీర్ల బోర్డు సిఫార్సులను పరిశీలించిన తర్వాతే జీఓ67ను రద్దు చేస్తూ కొత్త జీఓ తీసుకొచ్చామని ప్రభుత్వం తెలిపింది. పాత టెండరింగ్ పద్దతిని తిరిగి అమలు చేయాలని జలవనరుల శాఖకు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. అంతేకాకుండా రివర్స్ టెండరింగ్‌కు బదులుగా ఆన్‌లైన్ ఈ-ప్రొక్యూర్‌మెంట్ సిస్టమ్ ద్వారా అన్ని ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్‌లలో పనులు అప్పగించడానికి సంప్రదాయ టెండర్ ప్రక్రియను పాటించాలని ప్రభుత్వం తన ఉత్తరవుల్లో పేర్కొంది.
ఆ బిడ్లనే ఆమోదించాలి..
తక్కువ ధరకే పనులు చేస్తామని అంగీకరిస్తూ లిఖిత పూర్వకంగా వేసే బిడ్లను ఆమోదించాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తన ప్రకటనలో తెలిపింది. టెండర్‌లో పాల్గొన్న సంస్థల్లో ఎల్-1గా ఉన్న సంస్థలకు పనులు అప్పగించే విధానాన్ని అమలు చేస్తామని ఆగస్టులో జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీర్మానించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఆ విధంగానే ఇప్పుడు జీఓ67ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.