ఇకపై ప్రభుత్వ ఉత్తర్వులన్నీ సర్కార్ వెబ్ సైట్ లో చూడవచ్చా?

వైసీపీ ప్రభుత్వ హయాంలో రహస్యంగా ఉంచిన జీవోలను జీవోఐఆర్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.

Update: 2024-10-28 11:41 GMT
వైసీపీ ప్రభుత్వ హయాంలో రహస్యంగా ఉంచిన జీవోలను జీవోఐఆర్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో 2021 ఆగస్టు 15 నుంచి 2024 ఆగస్టు 28 వరకూ గోప్యంగా ఉంచిన జీవోలన్నింటినీ ఆ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తారు. సాధారణ పరిపాల శాఖ కార్యదర్శి ఎస్.సురేష్‌కుమార్ ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు. రహస్యంగా ఉంచిన అన్ని జీవోలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం జీవోఐఆర్ వెబ్‌సైట్‌ను పునరుద్ధరిస్తున్నారు. పాత జీవోలన్నింటినీ అందులో అప్‌లోడ్ చేస్తారు.
వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను ప్రభుత్వ వెబ్ సైట్ లో కనిపించకుండా చేశారు. దీనిపై కొంత వివాదం ఏర్పడిన నేపథ్యంలో కొన్ని ఉత్తర్వులను మాత్రమే కనిపించేలా చేశారు. వీటిని కూడా ప్రజలు వెతుక్కోవడానికి చాలా ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వం ఒక్కసారి జారీ చేసిన ఉత్తర్వులు పబ్లిక్ ప్రాపర్టీ అవుతాయి. అటువంటి వాటిని దాచడంలో అర్థం లేదని వివిధ పార్టీలు ధ్వజమెత్తాయి.

నిజానికి వెబ్‌సైట్ ప్రారంభమైన 2008 నుంచి 2019 వరకు అన్ని ప్రభుత్వ ఉత్తర్వులూ జీవోఐఆర్ వెబ్ పోర్టల్‌లో అందుబాటులో ఉండేవి. కొన్నింటిని మాత్రమే రహస్యంగా ఉంచేవారు. అయితే జగన్ ప్రభుత్వం వచ్చాక 2021 ఆగస్టు 15 నుంచి 2024 ఆగస్టు 28 వరకు ఉన్న జీవోలు మాత్రం అందుబాటులో లేకుండా పోయాయి.
పారదర్శకత, సమాచారం నిమిత్తం ప్రభుత్వం విడుదల చేసే అధికారిక ఉత్తర్వులు పౌరులకు అందుబాటులో ఉండాల్సిందేనని సాధారణ పరిపాలశాఖ పేర్కొంది. వాటన్నింటిని అప్‌లోడ్ చేసేలా ఆదేశాలు జారీ చేసినట్లు సురేష్‌ కుమార్ వెల్లడించారు. మూడేళ్ల కాలానికి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు ప్రజలకు అందుబాటులో లేకపోతే సమాచార లోపం ఏర్పడుతుందని, అధికారిక నిర్ణయాలు జీవోల రూపంలో ప్రజలకు స్పష్టత ఇస్తాయన్నారు.
మామూలు జీవోలు కూడా జగన్ ప్రభుత్వ హయాంలో కనిపించకుండా ఉంచడంలో పరమార్థమేమిటో అంతుబట్టడం లేదని చంద్రబాబు విమర్శించారు. తమ ప్రభుత్వం వస్తే వాటిని బయటపెడతామని చెప్పారు. దానికి అనుగుణంగా ఇప్పుడు చర్యలు చేపట్టారు. త్వరలో అన్ని జీవోలు ప్రభుత్వ వెబ్ సైట్ లో ఉండనున్నాయి.




Tags:    

Similar News