ఉద్యోగుల ఆరోగ్య సమస్యలు ఈహెచ్ఎస్ కమిటీ తీరుస్తుందా?
ప్రభుత్వం ఇహెచ్ఎస్ ఉద్యోగుల ఆరోగ్య ఇబ్బందుల పై కమిటీ వేసింది. ఈ కమిటీపై ఉద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
రాష్ట్రంలోని 24 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్లు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య భద్రతకు 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశపెట్టిన ‘‘ఎంప్లాయిస్ హెల్త్ స్కీం (ఇహెచ్ఎస్)’’ ఇప్పటివరకు పూర్తిస్థాయిలో సత్ఫలితాలు ఇవ్వలేకపోయిందనే విమర్శలు ఉన్నాయి. సీఎం చంద్రబాబు గత నెలలో ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన హామీ మేరకు గురువారం వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఏడుగురు సభ్యులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయడం ద్వారా ఈ పథకంలోని దీర్ఘకాలిక లోపాలను సరిచేసే ప్రయత్నం ప్రారంభమైంది.
ఇహెచ్ఎస్ ఎందుకు పూర్తిగా విజయవంతం కాలేదు?
ఉద్యోగులు చికిత్స తీసుకున్న బిల్లులు నెలల తరబడి పెండింగ్‌లో పడటం, ఆసుపత్రులకు సకాలంలో చెల్లింపులు జరగకపోవడం వల్ల ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రులు ఇహెచ్ఎస్ కార్డు తీసుకోవడానికి నిరాకరిస్తున్నాయి. ఫలితంగా ఉద్యోగులు జేబులోంచి డబ్బు చెల్లించి తర్వాత రీయింబర్స్‌మెంట్ కోసం తిప్పలు పడాల్సి వస్తోంది.
2014లో నిర్ణయించిన చికిత్సా ప్యాకేజీ ధరలు ఇప్పటికీ మారలేదు. ఇప్పుడు మందులు, ఆపరేషన్ ఖర్చులు రెట్టింపు కాగా, ఆసుపత్రులు ఆ పాత రేట్లకే చికిత్స చేయడానికి ఇష్టపడటం లేదు.
ఇహెచ్ఎస్ పోర్టల్ సామర్థ్యం తక్కువగా ఉండటం, తరచూ సర్వర్ డౌన్ కావడం, బిల్లులు అప్‌లోడ్ చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
జిల్లా స్థాయిలో ఇహెచ్ఎస్ సమన్వయకర్తలు లేకపోవడం, ఫిర్యాదులు నమోదైనా స్పందన లేకపోవడం పెద్ద సమస్యగా మారింది.
ప్రస్తుతం ఏటా దాదాపు రూ.350 కోట్లు ఖర్చవుతున్న ఈ పథకంలో ప్రభుత్వం, లబ్ధిదారులు 50:50 నిష్పత్తిలో భరిస్తున్నారు. కానీ రీయింబర్స్‌మెంట్ ఆలస్యం వల్ల ప్రభుత్వ వాటా సకాలంలో చెల్లించకపోవడం మూలంగా ఆసుపత్రులు దూరంగా ఉంటున్నాయి.
అప్పుడప్పుడు ప్రైవేట్ ఆస్పత్రుల తమ బకాయిలు చెల్లించడం లేదని ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈహెచ్ఎస్ వారికి వైద్యసేవలు బంద్ చేసిన సందర్భాలు ఉన్నాయి.
ఇప్పుడు ఏర్పాటైన కమిటీ సమస్యలు తీరుస్తుందా?
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ నేతృత్వంలోని ఈ ఏడుగురు సభ్యుల కమిటీలో జీఏడీ, ఫైనాన్స్, హెల్త్ శాఖల స్థాయి అధికారులతో పాటు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ సీఈఓ, ఉద్యోగ సంఘాల నుంచి ఇద్దరు ప్రతినిధులు ఉండటం ద్వారా సమస్యలు లోతుగా పరిశీలించే అవకాశం ఉంది. ‘‘8 వారాల్లో నివేదిక ఇవ్వాల్సి ఉండటం’’ కూడా ఆశాజనకంగానే కనిపిస్తోంది.
ఉద్యోగ సంఘాల స్పందన
ఏపీఎన్జీవో సంఘం నాయకులు చౌదరి, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు వేణుగోపాల్ మాట్లాడుతూ “గత ప్రభుత్వం ఐదేళ్ల పాటు ఇహెచ్ఎస్‌ను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఇప్పుడు కమిటీ ఏర్పాటు, త్వరలోనే పరిష్కారం ఆశిస్తున్నాం. ప్యాకేజీ రేట్ల పెంపు, క్యాష్‌లెస్ చికిత్స, సకాలంలో రీయింబర్స్‌మెంట్ లాంటి కీలక అంశాలు నివేదికలో రావాలి” అని డిమాండ్ చేశారు.
ఆదర్శ పథకం భారమైంది...
2013లో దేశంలోనే ఆదర్శంగా ప్రవేశపెట్టిన ఇహెచ్ఎస్ పథకం ఈ రోజు ఉద్యోగులకు భారమైపోయింది. ఇప్పుడు ఏర్పాటైన కమిటీ నిజంగా లోతుగా పరిశీలించి, ఆచరణీయ సిఫార్సులు చేస్తేనే 24 లక్షల మంది లబ్ధిదారులకు నిజమైన ఉపశమనం లభిస్తుంది. లేకపోతే ఇది మరో “కమిటీ కోసం కమిటీ”గానే మిగిలిపోతుందనే అనుమానం ఉద్యోగ వర్గాల్లో ఉంది. ఫిబ్రవరి నాటికి వచ్చే నివేదిక ఆ సందేహాలకు సమాధానం చెప్పగలదా? అందరి దృష్టీ ఇప్పుడు ఆ 8 వారాల మీదే ఉంది.