ఆంధ్రప్రదేశ్ అవతరణ దినం నవంబరు 1 కాదు, అక్టోబరు 1
అధికార, ప్రతిపక్ష పార్టీలు చారిత్రక వాస్తవాన్ని గుర్తించాలి అంటున్న మాకిరెడ్డి పురుషోత్తమరెడ్డి
By : Admin
Update: 2024-11-02 03:08 GMT
-మాకీరెడ్డి పురుషోత్తమ రెడ్డి
నవంబర్ 1న రాష్ట అవతరణ దినోత్సవ వేడుకలు జరపకపోవడాన్ని ప్రతిపక్ష వైసీపీ నాయకులు అధికార తెలుగుదేశం ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు. ఒక రాష్ట్రానికి అవతరణ దినోత్సవం జరగడం ఆ రాష్ట ప్రతిష్ఠకు సంబందించిన విషయం. అదే సమయంలో చారిత్రక వాస్తవాన్ని పరిగణనలోకి తీసుకోకుండా అవతరణ దినోత్సవాన్ని జరుపుకోవడం కూడా అర్థరహితం.
చరిత్రలో ఏమి జరిగింది...
1953 కి పూర్వం తెలంగాణ ఒక రాష్ట్రంగా ప్రస్తుతం ఉన్న ఆంద్రప్రదేశ్ తమిళనాడులో కలిసి ఉన్నది. కోస్తా , రాయలసీమ పెద్దల అంగీకారంతో శ్రీభాగ్ ఒప్పందం షరతుతో తమిళనాడు నుంచి తెలుగురాష్ట్రంగా విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఉద్యమం ఉవ్వెత్తున జరుగుతున్న సమయంలో పొట్టిశ్రీరాములు ఆత్మార్పణతో 1953 అక్టోబరు 1న తొలి భాషప్రయోక్త రాష్ట్రంగా ప్రస్తుత ఆంద్రప్రదేశ్ రూపంలో నాడు ‘ఆంధ్రరాష్ట్రం’ అవతరించింది. అటుపిమ్మట ఆంధ్రరాష్ట్రం , తెలంగాణ కలిపి పెద్దమనుషుల అవగాహన మేరకు విశాలాంధ్రగా 1956 నవంబరు 1 ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు జరిగింది.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో నవంబరు 1 కి ప్రాధాన్యత లేదు.
2014 న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగింది. సహజంగానే తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ఏర్పాటు జరిగిన జూన్ 2 ను తమ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. విభజనను వ్యతిరేకించిన ప్రాంతం , చారిత్రకంగా 1953 రాష్ట్ర ఏర్పాటు జరిగిన ప్రాంత కావడం వల్ల జూన్ 2 ని రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకోలేము. అదే సమయంలో తెలంగాణ , ఆంధ్రరాష్ట్రం కలయకకు చిహ్నంగా ఉన్న నవంబరు 1 కి రాష్ట్ర విభజన , తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కారణంగా ప్రాధాన్యత కోల్పోయింది. అదే సందర్భంలో 1953 అక్టోబరు 1న ఏర్పడిన పూర్వ ఆంధ్ర రాష్ట్ర రూపంలో శ్రీభాగా ఒప్పం అవగాహన , పొట్టిశ్రీరాములు ప్రాణత్యాగం చేసిన ఫలితంగా ఏర్పడిన ప్రస్తుత ఆంద్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నందున చారిత్రకంగా అక్టోబర్ 1 న ఆంద్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం జరగడం సముచితంగా ఉంటుంది.
రాయలసీమ అంశాలు చర్చకు వస్తుందన్నదేనా కారణం
చారిత్రకంగా చూచినా , నైతికంగా ఆలోచించినా తెలంగాణ , ఆంధ్ర రాష్ట్ర కలయకకు చిహ్నం జరుపుకునే నవంబరు 1 కి విభజన తర్వాత ప్రాధాన్యత లేదు. పూర్వ ఆంధ్ర రాష్ట్ర రూపంలో ఆం ప్రదేశ్ ఉన్న రాష్ట్రానికి చిహ్నంగా ఉన్న అక్టోబర్ 1 ని జరపకపోవడానికి ఎలాంటి ఇబ్బంది లేకున్నా పాలకులు ముందుకు రాకపోవడానికి రాయలసీమ అంశాలు చర్చకు రావడమే ఆటంకంగా ఉన్నాయా ? అన్న అనుమానం కలగక మానదు. నాడు చెన్నై నుంచి కోస్తా ప్రాంతంతో విడిపోవడానికి రాయలసీమ ప్రజలు ఆసక్తి చూపలేదు. రాయలసీమ ప్రజలకు కోస్తా పెద్దలు ఇచ్చిన హామీ పత్రమే శ్రీభాగ్. నేడు అక్టోబర్ 1ని అవతరణ దినోత్సవం జరుపుకుంటే రాజధాని , కృష్ణా నది నీటి లభ్యతలో ప్రధమ ప్రాధాన్యత రాయలసీమకు ఇవ్వాలని అందుకు అనుగుణంగా ప్రాజెక్టుల నిర్మాణం చేయాలన్న విషయాలు చర్చకు రావడం , 70 సంవత్సరాలుగా అమలుకు నోచుకోని కారణంగా రాయలసీమ వెనుకబాటు ప్రజల ముందుకు వస్తుంది. అది ఇష్టం లేకనే అక్టోబర్ 1 ని అవతరణ దినోత్సవంగా జరపడానికి ఆశక్తి చూపడంలేదు అన్న అనుమానం కలగకుండా ఉండదు. పరస్పర అంగీకారంతో కలిసిన రెండు ప్రాంతాల మధ్య కుదిరిన అవగాహన ఉల్లంగించడం , చివరకు ఆ అంశాలను చర్చకు కూడా రాకూడదన్న ఆలోచనలు మారనంతకాలం సమైక్య భావన కేవలం మెడిపండులాంటిదే.
ఏపీ ప్రభుత్వం అక్టోబర్ 1న రాష్ట అవతరణ దినోత్సవం గా ప్రకటించాలి
గత వైసిపి ప్రభుత్వం చారిత్రక ఆధారాలతో సంబంధం లేకుండా నవంబర్ 1ని రాష్ట అవతరణ దినోత్సవం గా ప్రకటించింది. 2024 లో అదికారంలోకి వచ్చిన తెలుగుదేశం నాయకత్వం లోని కూటమి ప్రభుత్వం నవంబర్ 1ని అవతరణ దినోత్సవాన్ని జరపకపోవడం తప్పు కాదు. కాని హేతుబద్ధమైన రోజును రాష్ట అవతరణ దినోత్సవం గా ప్రకటించకపోవడం మాత్రం సరికాదు. గత ప్రభుత్వం తొందరపాటు నిర్ణయాన్ని సరిదిద్ది వచ్చే ఏడాది నుంచి అక్టోబర్ 1 న రాష్ట అవతరణ దినోత్సవం గా జరుపుకునేలా నిర్ణయం తీసుకుంటే సముచితంగా ఉంటుంది.
(మాకీరెడ్డి పురుషోత్తమ రెడ్డి,సమన్వయ కర్త రాయలసీమ మేధావుల ఫోరం తిరుపతి)