రెసిలియెంట్ సిటీగా అమరావతి

అమరావతి విపత్తు నిర్వహణ ప్రణాళిక ప్రకారం కొత్త కన్సల్టెన్సీని ఆహ్వానించింది. వీరి సూచనలు, సలహాల ద్వారా అమరావతి విపత్తులను ఎదుర్కొననుంది.

Update: 2025-10-24 11:30 GMT
అమరావతిలో నూతనంగా నిర్మించిన సీఆర్డీఏ భవనం.

ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సిఆర్‌డిఏ) విపత్తు నిర్వహణ ప్రణాళిక (డిజాస్టర్ రిస్క్ మేనేజ్‌మెంట్ అండ్ రెసిలియెన్స్ ప్లాన్) రూపొందించడానికి కన్సల్టెన్సీ సంస్థలకు ఆసక్తి వ్యక్తీకరణ (ఇఓఐ) ఆహ్వానాలు పంపింది. (రెసిలియెంట్ సిటీ అంటే... విపత్తులను నిర్వహించడమే కాక, నివాసులకు స్థిరమైన, సురక్షిత జీవనాన్ని అందించే నగరం.) ఈ నిర్ణయం జూన్ 2025లో తీసుకున్నారు. ప్రపంచబ్యాంకు, ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు (ఏడీబీ) సహకారంతో ఈ ప్రణాళిక 30 సంవత్సరాల భవిష్యత్ విపత్తులు (వరదలు, తుఫానులు, భూకంపాలు)కు తగిన చర్యలు సూచించాలి. రాజధాని అమరావతి అభివృద్ధికి ప్రపంచబ్యాంకు నుంచి 800 మిలియన్ డాలర్ల (సుమారు రూ.6,700 కోట్లు) నిధులు అందుతున్న నేపథ్యంలో ప్రకృతి విపత్తులను ఎదుర్కొనే అంశం మరోసారి తెరపైకి వచ్చింది. అయితే ఇప్పటికే కొన్ని ప్రణాళికలు ఉన్నప్పుడు మరో కొత్త కన్సల్టెన్సీ ఎందుకు? రైతుల సందేహాలు, ఖర్చు ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

అమరావతి అభివృద్ధి, విపత్తులు

అమరావతి నిర్మాణం 2014లో ప్రారంభమైంది. కానీ 2019-2024 మధ్య రాజకీయ మార్పులతో ఆగిపోయింది. ప్రస్తుత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పునఃప్రారంభించడంతో ప్రపంచబ్యాంకు 2024 డిసెంబర్ 20న 800 మిలియన్ డాలర్ల రుణాన్ని ఆమోదించింది. ఈ ప్రోగ్రాం జనవరి 2025లో మొదలై మార్చి 2025లో మొదటి విడత 207 మిలియన్ డాలర్లు విడుదలయ్యాయి. ఏడీబీ కూడా సహాయం అందిస్తోంది.

అమరావతి కొండవీటివాగు, కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో ఉండటంతో వరదలు, భారీ వర్షాలు, తుఫానులు, భూకంప జోన్-3 ముప్పులు ఉన్నాయి. 2017లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) ఆదేశాల ప్రకారం భవనాలు విపత్తులకు తట్టుకునేలా నిర్మించాలి. గతంలో వరద నివారణకు ఉండవల్లి వద్ద పంపింగ్ స్టేషన్ ఏర్పాటు చేశారు. అయితే వాతావరణ మార్పులు (మరింత తీవ్రమైన వర్షాలు, సముద్ర మట్టం పెరుగుదల) లెక్కలోకి తీసుకోవాలి. ఫిబ్రవరి 2025లో సిఆర్‌డిఏ వరద అధ్యయనం (ఫ్లడ్ స్టడీ) చేపట్టాలని ప్రకటించింది. ప్రపంచబ్యాంకు నిబంధనలు (డిస్బర్స్‌మెంట్-లింక్డ్ రిజల్ట్స్ - డిఎల్‌ఆర్‌లు) ప్రకారం విపత్తు ప్రణాళిక తప్పనిసరి. ఇది డ్రైనేజ్ మెరుగుపరచడం, క్లైమేట్-రెసిలియెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటివి కవర్ చేస్తుంది.


అమరావతిలో కొత్తగా నిర్మించిన భవనాలు

కొత్త కన్సల్టెన్సీ ప్రయోజనాలు

జూన్ 2025లో సిఆర్‌డిఏ డిజాస్టర్ రిస్క్ మేనేజ్‌మెంట్ ప్లాన్‌కు ఇఓఐలు ఆహ్వానించింది. సెప్టెంబర్ 2025లో కన్సల్టెంట్ టీఓఆర్ (టెర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్) విడుదలైంది. ఇది ఫైనాన్సింగ్ ప్లాన్ సమీక్షకు సంబంధించింది. ఈ ప్రణాళిక ద్వారా ప్రపంచబ్యాంకు, ఏడీబీ స్టాండర్డ్స్ ప్రకారం నేచర్-బేస్డ్ సొల్యూషన్స్ (గ్రీన్ ఇన్‌ఫ్రా) చేర్చవచ్చు. 30 ఏళ్లలో భవిష్యత్ ముప్పులు (సముద్ర మట్టం పెరుగుదల, తీవ్ర తుఫానులు) పరిగణనలోకి తీసుకుంటుంది. వరదలు, అగ్నిప్రమాదాలు, ముంపు ప్రాంతాల గుర్తింపు, ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ వంటివి ఇందులో ఉంటాయి.

ఈ ప్లాన్ పూర్తయితే అమరావతి 'రెసిలియెంట్ సిటీ'గా మారి, పెట్టుబడులు ఆకర్షిస్తుంది. గత ప్రణాళికలు పరిమితమైనవి కావడంతో క్లైమేట్ చేంజ్‌కు అనుగుణంగా కొత్తది అవసరమని నిపుణులు అంటున్నారు.

రైతుల అసంతృప్తి, ఖర్చు, పారదర్శకత

ఈ నిర్ణయం వివాదాస్పదం అవుతోంది. అమరావతి రైతులు (ఫార్మర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ) "ఇప్పటికే ప్రణాళికలు ఉన్నాయి, మళ్లీ ఖర్చు ఎందుకు?" అంటున్నారు. అక్టోబర్ 2025లో రైతులు సిఆర్‌డిఏపై అవినీతి, భూమి సేకరణలో బలవంతం ఆరోపణలు చేశారు. అక్టోబర్ 13న ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చి, గ్రీవెన్సెస్ పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సిపిఐ(ఎం) అక్టోబర్ 12న సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ ఉపసంహరించాలని కోరింది. భూమి పూలింగ్‌లో బలవంతం, అవినీతి ఉందని ఆరోపణలు వచ్చాయి.

మరోవైపు కొంతమంది రైతులు స్వచ్ఛందంగా భూములు ఇస్తున్నారు. అక్టోబర్ 16న 40.25 ఎకరాలు, అక్టోబర్ 17న 14 ఎకరాలు ల్యాండ్ పూలింగ్‌కు ఇచ్చారు. అక్టోబర్ 9న సిఎం చంద్రబాబు "అమరావతి అభివృద్ధి ఫలాలు ముందుగా భూములిచ్చిన రైతులకే" అన్నారు. అయినా రైతులు సమావేశం కోరుతున్నారు. పారదర్శకత లేకపోతే ఈ ప్లాన్ 'పేపర్ వర్క్'గా మిగిలిపోవచ్చు.

సమన్వయం కీలకం

కొత్త కన్సల్టెన్సీ అమరావతిని విపత్తు-నిరోధక నగరంగా మార్చగలదు. ప్రపంచబ్యాంకు నిబంధనలు తప్పనిసరి కావడంతో కొన్సల్టెన్సీని పిలవాల్సి వచ్చింది. అయితే గత ప్రణాళికలను అప్‌డేట్ చేసి ఖర్చు ఆదా చేయవచ్చు. రైతుల సందేహాలు తీర్చడానికి పబ్లిక్ కన్సల్టేషన్లు, భూమి బాధితులతో చర్చలు అవసరం. 'ఫార్మర్స్ ఫస్ట్' విధానం అమలు చేస్తే, అమరావతి నిజమైన 'ప్రజల రాజధాని'గా మారుతుంది. 2029 నాటికి పూర్తయ్యే ఈ ప్రోగ్రాం విజయానికి పారదర్శకత, రైతుల భాగస్వామ్యం అత్యవసరం.

Tags:    

Similar News