అందరి దృష్టి వీటి పైనే

టాప్‌ కేటగిరిలో పది స్థానాలు ఉండగా, మరో 17 స్థానాలు ప్రాచుర్యం సంతరించుకున్నాయి. చంద్రబాబు, జగన్‌ మెజారిటీలు కూడా పెద్ద చర్చగా మారింది.

Update: 2024-05-12 07:21 GMT

అందరి దృష్టి ఈ అసెంబ్లీ నియోజక వర్గాలపైనే ఉంది. సీఎం జగన్, టీడీపీ అధికనేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్, పీఎం మోదీలు ప్రచారం నిర్వహించడం, గెలిపించాలని కోరడంతో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా సాగుతోంది.

అనంతపురం జిల్లా తాడిపత్రి, రాప్తాడు అసెంబ్లీ నియోజక వర్గాలు ప్రముఖంగా ఉన్నాయి. ఇక్కడ ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు అనేది చర్చగా సాగుతోంది. తాడిపత్రి నుంచి టీడీపీ అభ్యర్థిగ జేసీ అస్మిత్‌ రెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి బరిలో ఉన్నారు. జేసీ సోదరుల్లో చిన్నవాడైన జేసీ ప్రభాకరరెడ్డి కుమారుడు అస్మిత్‌ రెడ్డి. తాడిపత్రిలో జేసీ సోదరుల ప్రభావం ఎక్కువుగానే ఉంటుంది. జేసీ దివాకర్‌రెడ్డి 1985 నుంచి 2009 వరకు ఆరు పర్యాయాలు కాంగ్రెస్‌ నుంచి గెలిచారు. 2014లో జేసీ ప్రభాకర్‌రెడ్డి టీడీపీ నుంచి గెలిచారు. జేసీ సోదరులకు ఇది కంచుకోట. అయితే 2019లో కేతిరెడ్డి పెద్దారెడ్డి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా జేసీ అస్మిత్‌రెడ్డిపై గెలుపొందారు. ఈ సారి కూడా వీరే ప్రత్యర్థులుగా బరిలో ఉన్నారు. పెద్దారెడ్డి కుటుంబానికి, జేసీ కుటుంబాని రాజకీయ వైరం ఉంది. ఈ నేపథ్యంలో దీనికి ప్రాచుర్యం సంతరించుకుంది. రాప్తాడు నుంచి మాజీ మంత్రి పరిటాల సునీత పోటీలో ఉండటంతో ప్రాముఖ్యత పెరిగింది. రాప్తాడు 2009లో ఏర్పడింది. 2009, 2014లో టీడీపీ నుంచి పరిటాల సునీత గెలిచింది. 2019లో తోపుతుర్తి ప్రకశ్‌రెడ్డి వైఎస్‌ఆర్‌సీపీ నుంచి గెలిచారు. ఈ సారి కూడా వీరే ప్రత్యర్థులుగా బరిలో ఉన్నారు. ఇరుకుటుంబాల మధ్య కూడా రాజకీయ వైరం ఉంది. ఈ సారి ఎవరు గెలుస్తారనేదానిపై ఉత్కంఠ నెలకొంది.

గుంటూరు జిల్లా తెనాలి కూడా పాపులర్‌ నియోజక వర్గంగా మారింది. ఇక్కడ నుంచి జనసేన అభ్యర్థిగా మాజీ ముఖ్యమంత్రి కుమారుడు, మాజీ స్పీకర్, జనసేన పార్టీ ముఖ్య నాయకుడు నాదెండ్ల మనోహర్‌ బరిలో ఉండటంతో ప్రాముఖ్యత పెరిగింది. గత ఎన్నికల్లో 2004, 2009లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి గెలిచిన మనోహర్, 2019లో జనసేన అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ సైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. ఈ సారి ఎవరు గెలుస్తారనేది చర్చగా మారింది.

చంద్రబాబు కుప్పం, జగన్‌ పులివెందుల తర్వాత అంతటి ప్రాధాన్యం పిఠాపురంకు ఉంది. జనసేన అభ్యర్థిగా ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ పోటీలో ఉండటమే దీనికి కారణం. కూటమి నుంచి బరిలో ఉన్నారు. వంగ గీత వైఎస్‌ఆర్‌సీపీ నుంచి పోటీలో ఉన్నారు. వీరిద్దరి మధ్య పోరు రసవత్తరంగా మారింది. ఈ సారి ఎవరు నెగ్గుతారనేది చర్చగా మారింది.

ఇక మంగళగిరి కూడా రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. టీడీపీ నుంచి నారా లోకేష్‌ బరిలో ఉండటమే దీనికి కారణం. గత ఎన్నికల్లో ఓడిపోయిన లోకేష్‌ ఈ సారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో కార్యక్రమాలు చేపట్టారు. లోకేష్‌ను నిలువరించేందుకు సీఎం జగన్‌ ఎన్నో ప్రణాళికలు రచించారు. చివరకు మురుగుడు లావణ్యను రంగంలోకి దింపారు. పోరు హోరా హోరీగా ఉన్నా గెలుపు లోకేష్‌ వైపే ఉంటే చాన్స్‌ ఉందని స్థానికుల్లో చర్చ సాగుతోంది.

గన్నవరం కూడా ఇటీవల ప్రాచుర్యంలోకి వచ్చిన అసెంబ్లీ నియోజక వర్గం. సిట్టింగ్‌ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైఎస్‌ఆర్‌సీపీ నుంచి బరిలో ఉండగా టీడీపీ నుంచి యార్లగడ్డ వెంకట్రావు పోటీలో ఉన్నారు. 2019లో ప్రత్యర్థులుగా బరిలోకి దిగిన ఇరువురు నేతలు ఈ సారి కూడా తలపడుతున్నారు. పార్టీలు మారి ప్రత్యర్థులుగా బరిలో నిలచారు. గుడివాడ రాష్ట్రంలో పేరున్న నియోజక వర్గం. మాస్‌ లీడర్‌గా కొడాలి నాని వైఎస్‌ఆర్‌సీపీ నుంచి బరిలో ఉన్నారు. మాస్‌ ప్లస్‌ క్లాస్‌ లీడర్‌గా వెనిగండ్ల రాము టీడీపీ నుంచి పోటీలో ఉన్నారు. నాగులు సార్లు గెలిచిన నాని ఐదో సారి గెలవాలనే లక్ష్యంతో ఉండగా దానిని ఎలాగైనా బ్రేక్‌ చేసి తొలి విజయవాన్ని నమోదు చేయాలనే పట్టుదలతో రాము ఉన్నారు.

కాకినాడ సిటీ పేరు కూడా ప్రముఖంగా మారింది. 2009లో ఏర్పడింది. ఒక సారి కాంగ్రెస్, ఒక సారి టీడీపీ, ఒక సారి వైఎస్‌ఆర్‌సీపీ గెలిచింది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి వైఎస్‌ఆర్‌సీపీ నుంచి బరిలో ఉండగా, వనమాడి వెంకటేశ్వరరావు టీడీపీ నుంచి పోటీలో ఉన్నారు. 2019లో ప్రత్యర్థులుగా ఉన్న వారే ఈ సారి కూడా బరిలో ఉన్నారు. విజయవాడ తూర్పు కూడా ఈ సారి ఎన్నికల్లో ప్రముఖ స్థానంగా మారింది. దేవినేని అవినాష్‌ వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా, సిట్టింగ్‌ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ టీడీపీ నుంచి బరిలో ఉన్నారు. రెండు సార్లు గెలిచి మూడో సారి గెలవాలనే పట్టుదలతో ఉన్న గద్దెను ఎలాగైనా ఓడించి తొలి విజయాన్ని నదమోదు చేయాలని లక్ష్యంతో అవినాష్‌ ఉన్నారు. దేవినేని అవినాష్‌ తండ్రి దేవినేని నెహ్రూ 2009లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి ఓడి పోయారు.

మంత్రి ఆర్కే రోజా బరిలో ఉన్న నగరి కూడా ప్రముఖ స్థానంగా గుర్తింపు ఉంది. రెండు పర్యాయాలు గెలిచిన రోజా మూడో సారి హ్యాట్రిక్‌ కొట్టాలనే దూకుడుతో ఉన్నారు. రోజాను ఎలాగైనా ఓడించి నగరిని సొంతం చేసుకోవాలనే పట్టుదలతో టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్‌ ఉన్నారు. ధర్మవరం కూడా ప్రచారంలో ఉన్న వాటిల్లో ఒకటి. సిట్టింగ్‌ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి వైఎస్‌ఆర్‌సీపీ నుంచి పోటీలో ఉండగా, ఎన్డీఏ కూటమి నుంచి వై సత్యకుమార్‌ బరిలో ఉన్నారు. ఈయన ప్రచారానికి బీజేపీ ప్రముఖులు, టీడీపీ, జనసేన ప్రముఖులు కూడా పాల్గొన్నారు.

ఇక నెల్లూరు రూరల్, చీరాల, దర్శి, గుంటూరు పశ్చిమ, విజయవాడ సెంట్రల్, రాజానగరం, రాజమండ్రి, విశాఖపట్నం తూర్పు, అవనిగడ్డ, మచిలీపట్నం, సత్తెనపల్లి, గురజాల, ఆళ్లగడ్డ, నందిగామ, మైలవరం, పోలవరం నియోజక వర్గాలు కూడా ప్రముఖంగానే వినిపిస్తున్నాయి. ఈ స్థానాల్లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడి పోతారనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జోరందుకుంది.

Tags:    

Similar News