తెలంగాణా ఫలితాలపై ఖర్గే సీరియస్

ఇటీవలే వెలువడిన పార్లమెంటు ఎన్నికల ఫలితాలపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బాగా సీరియస్ అయ్యారు.

Update: 2024-06-08 10:24 GMT

ఇటీవలే వెలువడిన పార్లమెంటు ఎన్నికల ఫలితాలపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బాగా సీరియస్ అయ్యారు. 8వ తేదీన ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటి (సీడబ్ల్యూసీ) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాల్లో పార్టీ సాధించిన ఫలితాలపై రివ్యు చేశారు. ఓవరాలుగా పార్టీ సాధించిన ఫలితాలపై ఖర్గే తో పాటు సమావేశం సంతృప్తి వ్యక్తంచేసింది. అయితే ఇదే సమయంలో అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కాంగ్రెస్ సాధించిన ఫలితాలపైన ఖర్గే తీవ్ర అసంతృప్తి వ్యక్తచేశారు. తెలంగాణా, హిమాచల్ ప్రదేశ్, కర్నాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. ఈ మూడు రాష్ట్రాల్లోను అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించిన కాంగ్రెస్ పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం ఆశించిన ఫలితాలను సాధించలేకపోయిందని ఖర్గే తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేశారు.

మిగిలిన రెండు రాష్ట్రాలను వదిలేస్తే తెలంగాణా విషయంలోనే అధ్యక్షుడు ఎక్కువగా అసంతృప్తి వ్యక్తంచేసినట్లు పార్టీవర్గాల సమాచారం. కారణం ఏమిటంటే తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలు జరిగి ఐదు నెలలు మాత్రమే అయ్యింది. 2023 నవంబర్ 30వ తేదీన జరిగిన తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 64 సీట్లతో అధికారంలోకి వచ్చింది. మే 13వ తేదీన జరిగిన పార్లమెంటు పోలింగులో పార్టీకి కేవలం 8 సీట్లు మాత్రమే దక్కింది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 64 సీట్ల దామాషాను చూసుకుంటే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ కు 9 సీట్లు దక్కుండాలి. కాని పార్టీ గెలిచింది 8 సీట్లు మాత్రమే. ఇక్కడ విషయం ఏమిటంటే మొదటినుండి రేవంత్ రెడ్డి మాట్లాడుతు పార్టీకి 14 సీట్లు గ్యారెంటీగా వస్తాయని చెప్పారు.

17 నియోజకవర్గాల్లో 27 రోజుల్లో రేవంత్ 53 బహిరంగసభల్లో పాల్గొన్నారు. సభలే కాకుండా కార్నర్ మీటింగులు, రోడ్డుషోలు, ర్యాలీలు అదనంగా పాల్గొన్నారు. రాహుల్ గాంధి, ప్రియాంకగాంధి కూడా చాలాసార్లు ప్రచారం, రోడ్డుషోల్లో పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన సిక్స్ గ్యారెంటీస్ లో నాలుగింటిని పార్టీ అమలు కూడా చేసింది. ఇంతచేసినా పార్టీకి అనుకున్నన్ని సీట్లు దక్కలేదన్నదే ఖర్గే బాధ. 14 సీట్లు వస్తాయని రేవంత్ ఎంతచెప్పినా 10 సీట్లకైతే తగ్గదనే అందరు అనుకున్నారు. పార్టీ నేతలు కూడా అదే అంచనా వేశారు. తీరాచూస్తే ఎనిమిది సీట్లకు మాత్రమే పరిమితమైంది. 2019 ఎన్నికలతో పోల్చితే మంచి ఫలితం సాధించినట్లే అనుకోవాలి.

2019లో కాంగ్రెస్ గెలిచింది కేవలం 3 సీట్లలో మాత్రమే. ఇపుడు గెలిచిన ఎనిమిది సీట్లను చూస్తే మంచి ఫలితం సాధించినట్లే అనుకున్నా అంచనాలకు, ఆశించిన సీట్లకు చాలా తేడా ఉంది. ఈ విషయంలోనే ఖర్గే తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. పై మూడు రాష్ట్రాల్లో పార్టీ ఆశించిన ఫలితాలను సాధించుంటే ప్రభుత్వఏర్పాటులో ఎన్డీయే బాగా ఇబ్బందిపడుండేదనటంలో సందేహంలేదు. ఈ విషయమే ఖర్గేని చాలా బాధపెడుతున్నట్లుంది. అంచనాలకు తగినట్లుగా రాణించని పై మూడు రాష్ట్రాల ఫలితాలపై తొందరలోనే ప్రత్యేకంగా సమావేశం అవబోతున్నట్లు ఖర్గే సమావేశంలోనే చెప్పారని సమాచారం.

Tags:    

Similar News