22 ఏళ్ల తరువాత ఉద్యోగాలు ఊడ బీకిన ప్రభుత్వం

రాష్ట్ర ప్రభుత్వంలో 22 సంవత్సరాలు ఉద్యోగులుగా విధులు నిర్వహించారు. కోర్టు ఉద్యోగాలు పీకేయమన్నదని ప్రభుత్వం వారిని ఉద్యోగాల నుంచి పీకేసింది. ఏమిటా కథ...

Update: 2024-12-06 11:35 GMT

రాష్ట్రంలోని వైద్యశాలల్లో పనిచేసేందుకు మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (MPHW) పోస్టులకు 2002లో నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఉద్యోగాల్లో చేరిన వారిని ప్రభుత్వం నానా తిప్పలు పెట్టింది. ఉద్యోగాల్లో చేరినా వారు నానా ఇబ్బందులు పడటానికి కారణం ప్రభుత్వం. నోటిఫికేషన్ ఇచ్చిన తరువాత సర్టిఫికెట్లు సరైనవా? కాదా? అని పరిశీలించుకోవాలి. మెరిట్ లిస్ట్ వేసిన తరువాత ఇంటర్వ్యూ సమయంలోనూ, ఆ తరువాత ఉద్యోగానికి ఆర్డర్ ఇచ్చే సమయంలోనూ సర్టిఫికెట్లు సరైనవో కాదో పరిశీలించి ఉద్యోగం ఇస్తారు. ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చిన తరువాత కోర్టు నుంచి చిక్కులు వచ్చాయి. అంటే కోర్టుకు సరైన సమాధానం ఇవ్వలేకపోవడమే. ఇందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. కానీ అవేమీ లేకుండా 22 ఏళ్ల తరువాత కోర్టు ఆదేశాలతో ఉద్యోగం నుంచి తీసేస్తున్నామంటూ ఆదేశాలు ఇవ్వడం అంటే ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందో అర్థమవుతుంది.

ఉద్యోగాల నుంచి తొలగించిన వారికి ప్రస్తుతం 50 నుంచి 55 ఏళ్ల వయసు ఉంది. ఈ వయసులో వారు ఏ పనులు చేసుకొని బతకాలి. ప్రతి కుటుంబానికి నలుగురు అనుకుంటే తొలగించిన ఉద్యోగులు 1,207 మంది ఉన్నారు. అంటే సుమారు 5000 మంది వీరిపై ఆధారపడి బతుకుతున్నారు. వీరి పరిస్థితి ఏమిటనే విషయం ఒక్క క్షణమైనా ఆలోచించకుండా న్యాయ నిపుణుల అభిప్రాయాలు తీసుకునే తొలగించామని ప్రభుత్వం చెబుతోంది. అంటే తిరిగి మావద్దకు రావొద్దనే సమాధానం ప్రభుత్వం నుంచి వచ్చినట్లైంది. ఈ స్థితిలో తాము ఎలా బతకాలనే ఆవేదన వారి నుంచి వ్యక్తమవుతోంది. తాము, తమ కుటుంబాలు రోడ్డున పడకుండా ఎన్డీఏ ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆదుకోవాలని కోరుతున్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాలు ఇచ్చిన ఎంపీహెచ్ఏలకు అర్హతల విషయంలో కొందరు కోర్టును ఆశ్రయించారు. ఆ వివాదంలో వారిలో 1200 మందిని తొలగించాల్సి వచ్చింది. అంతమందికి ఉద్యోగాలు ఇచ్చి ఎలా తొలగిస్తారంటే ప్రభుత్వం వద్ద సరైన సమాధానం లేదు. అందుకే నాటి ప్రభుత్వం 2013లో జీవో 1207 ద్వారా వీరందరినీ ఉద్యోగాలు ఇచ్చింది. దీనిని కూడా సవాల్ చేస్తూ కొందరు అప్పటి తెలంగాణ హైకోర్టులో పిటీషన్ వేశారు. సుదీర్ఘ విచారణ తరువాత గతంలో తాము ఇచ్చిన తీర్పు ప్రకారం వీరిని తొలగించాల్సిందేని గురువారం తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించింది. దీంతో వారిని తొలగించారు. గుర్తింపులేని కాలేజీల్లో చదివిన వారి సర్టిఫికెట్లు చెల్లవనేది కోర్టులో పిటీషన్ వేసిన వారి ప్రధానమైన ఆరోపణ. ప్రస్తుతం తొలగింపుకు గురైన వారిలో 954 మంది ఏపీలో ఉద్యోగాలు చేస్తుండగా తెలంగాణలో 253 మంది ఉన్నారు. వీరంతా ఉద్యోగాలు ఊడిపోవడంతో ఇంటికి వెళ్లాల్సి వచ్చింది.

ఉద్యోగాల నుంచి తొలగించే నాటికి వీరు రూ. 32 వేల జీతం తీసుకుంటున్నారు. ఇంత మొత్తం ఈ వయసులో ఈ పనులు కాకుండా వేరే పనులకు ఎవరు ఇస్తారనేది కూడా ప్రశ్నార్థకమే. నోటిఫికేషన్ ఇచ్చి, రాత పరీక్షలు పెట్టి, మెరిట్ జాబితా రూపొందించి ఉద్యోగాలు ఇచ్చారు. అయినా వారి సర్టిఫికెట్లు సరైనవో కాదో తెలుసుకోలేని స్థితిలో నాడు ప్రభుత్వం వారికి ఉద్యోగాలు ఇచ్చింది. అప్పుడే వారిని రిజక్ట్ చేసి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. పైగా కొందరు కాలేజీలు అన్ని అనుమతులు ఉన్నాయని చెప్పి నిర్వహించి, ఫీజులు తీసుకుని సర్టిఫికెట్లు ఇస్తున్నారు. అయినా అవి దొంగ కాలేజీలంటే ప్రభుత్వం నిర్వాహకుల విషయంలో ఏమి చేసినట్లనేది కూడా ఆలోచించాల్సి ఉంది. తొలగింపుకు గురైన ఎంపీహెచ్ఏ ల రాష్ట్ర నాయకుడు రమణారెడ్డి మాట్లాడుతూ న్యాయం కోసం సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామన్నారు.

Tags:    

Similar News