విజయ్‌కుమార్‌పై ఏసీబీ ప్రశ్నల వర్షం

సుదీర్ఘం సమయం విచారణ చేపట్టిన ఏసీబీ, దాదాపు 9 గంటల పాటు విజయ్‌కుమార్‌రెడ్డిని విచారించారు.;

By :  Admin
Update: 2025-04-03 04:48 GMT

వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్‌ సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్‌గా పని చేసిన తుమ్మా విజయ్‌కుమార్‌రెడ్డి మీద ఆంధ్రప్రదేశ్‌ యాంటీ కరప్షన్‌ బ్యూరో(ఏసీబీ) ప్రశ్నల వర్షం కురిపించింది. గత ప్రభుత్వంలో తుమ్మా విజయ్‌కుమార్‌రెడ్డి అక్రమాలకు పాల్పడ్డారనే అభియోగాలపై ఆయన మీద గత నవంబరులో ఏసీబీ కేసు నమోదు చేసింది. రెండు సార్లు విచారణకు హాజరు కావాలని నోటీçసులు జారీ చేయగా, రెండో సారి నోటీసులకు స్పందించిన విజయ్‌కుమార్‌రెడ్డి బుధవారం ఏసీబీ విచారణకు హాజరయ్యారు.

నిబంధనలు ఉల్లంఘించి మరి అక్రమాలకు ఎందుకు పాల్పడ్డారు. ప్రభుత్వానికి సంబంధించిన ప్రకటనలను జారీ చేసే విషయంలో ఎందుకు నిబంధనలను పరిగణనలోకి తీసుకోవాలని తెలియదా? ప్రకటనల జారీతో పాటు వాటికి సంబంధించిన బిల్లుల చెల్లింపుల్లో ఎందుకు నిబంధనలు మీరారు? అలా చేయమని మీ మీద ఒత్తిడులు ఏమైనా వచ్చాయా? ఎవరు ఒత్తిడి తెచ్చారు? ఎవరి ఆదేశాల మేరకు నిబంధనలను అతిక్రమించి అలా చేశారు? ఒక సాక్షి పత్రిక, సాక్షి టీవీకే ఎందుకు భారీ స్థాయిలో ప్రకటనలు ఇచ్చారు?

ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో సమాచారం పౌరసంబంధాల విభాగంలోను, ఆంధ్రప్రదేశ్‌ డిజిటల్‌ కార్పొరేషన్‌లోను నియామాలు చేపట్టిన సమయంలో రిజర్వేషన్లు ఎందుకు పాటించలేదు? ఉద్యోగాలు ఇవ్వాలని ఎవరు సిఫార్సులు చేశారు? ఎంత మంది సిఫార్సులు చేశారు? వంటి విజయ్‌కుమార్‌రెడ్డి మీద ఉన్న అన్ని అభియోగాలకు సంబంధించి ప్రశ్నల వర్షం కురిపించారు. వీటితో పాటుగా విజయ్‌కుమార్‌రెడ్డి కుటుంబ నేపథ్యం, సెంట్రల్‌ సర్వీసుల్లో ఉన్న విజయ్‌కుమార్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌కు ఎందుకని డిప్యూటేషన్‌ మీద రావాలనుకున్నారు, ఎలా వచ్చారు, డిప్యూటేషన్‌ మీద ఆంధ్రప్రదేశ్‌కు రావడానికి సహకరించిన, హెల్ప్‌ చేసిన నాయకులు, వ్యక్తులు ఎవరు, వారికీ విజయ్‌కుమార్‌రెడ్డికి ఉన్న సంబందాలు ఏమిటి వంటి అనేక కీలక అంశాల మీద కూడా ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. ప్రకటనలు జారీ సమయంలో కానీ బిల్లుల చెల్లింపుల సమయంలో కానీ నిబంధనలు అతిక్రమించి చేయడం కష్టమని, అలా చేయకూడదని అభ్యంతరాలు వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయా అంటూ కూడా విచారణ కొనసాగించారు.

బుధవారం గుంటూరులోని ఏసీబీ కార్యాలయంలో విచారణకు హాజరైన విజయ్‌ కుమార్‌ రెడ్డిని సుదీర్ఘంగా ఉదయం 10:30 గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. విజయ్‌కుమార్‌ నుంచి వివరాలు రాబట్టేందుకు ఆయన మీద ఉన్న ఆరోపణల మీద దాదాపు 25కు పైగా ప్రశ్నలు ఏసీబీ అధికారులు సంధించారు. అయితే హైకోర్టు ఆదేశాల మేరకు ఏసీబీ విచారణకు హాజరైన తుమ్మా విజయ్‌ కుమార్‌రెడ్డి విచారణ సమయంలో ఏసీబీ అధికారులకు పూర్తి స్థాయిలో సహకరించలేదని, విచారణ సమయంలో ఏసీబీ అధికారులు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పినా, ఎక్కువ శాతం తెలియదు, గుర్తు లేదు అంటూ దాటవేత ధోరణిలో సమాధానాలు వెల్లడించారనే చర్చ ఏసీబీ అధికారుల్లో వినిపిస్తోంది. విజయ్‌ కుమార్‌రెడ్డి విచారణ సమయంలో కో ఆపరేషన్‌ లేక పోవడంతో అసంతృక్తికి లోనైన ఏసీబీ అధికారులు మరో సారి విచారణకు రావలసి ఉంటుందని అక్కడే నోటీసులు కూడా అందజేశారు. ఈ నేపథ్యంలో గురువారం కూడా విజయ్‌కుమార్‌రెడ్డి ఏసీబీ విచారణకు హాజరు కావలసి ఉంటుంది.
Tags:    

Similar News