లారీని ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు, బస్సును ఢీకొట్టిన కారు
గన్నవరం వే బ్రిడ్జ్ సమీపంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
ఆంధ్రప్రదేశ్‌లోని గన్నవరం వే బ్రిడ్జ్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విజయవాడ నుండి శ్రీకాకుళం జిల్లా పెళ్ళూరు వెళ్లి తిరిగి వస్తున్న ఎస్‌వీకే ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు, హనుమాన్ జంక్షన్ నుండి హైదరాబాద్ వెళ్తున్న లారీని ఢీకొట్టింది. అదే సమయంలో వెనుక వస్తున్న కారు బస్సును ఢీకొట్టింది. దీంతో మూడు వాహనాలు కొట్టుకుని దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. అతడిని వెంటనే పిన్నమనేని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అదృష్టవశాత్తు బస్సులో 18 మంది ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. వారంతా సురక్షితంగా బయటపడ్డారు.
ప్రమాద సమయంలో లారీ యూటర్న్ తీసుకుంటుండగా బస్సు డ్రైవర్ అదుపు తప్పడంతో ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. వెనుక వస్తున్న కారు బస్సును ఢీకొట్టడంతో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. అయితే కారులోని ఎయిర్ బ్యాగ్ ఆటోమేటిక్‌గా ఓపెన్ కావడంతో ప్రయాణికులు తక్కువ గాయాలతోనే బయటపడ్డారు. ఈ ఘటన గన్నవరం ఎయిర్‌పోర్ట్ సమీపంలోని బిజీ రోడ్డు మీద జరగడంతో ట్రాఫిక్ కొంతసేపు గందరగోళంగా మారింది. స్థానిక పోలీసులు వాహనాలను క్లియర్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.