దేవిశ్రీ ని ప్రేమవర్ధన్ ఎందుకింత దారుణంగా చంపేశాడు?
బెంగుళూరులో హత్య, ఒకరిది అన్నమయ్య జిల్లా.. మరొకరిది చిత్తూరు జిల్లా..
By : The Federal
Update: 2025-11-25 04:49 GMT
బెంగుళూరులోని మదనాయకనహಳ್ಳಿ ప్రాంతంలో 21 ఏళ్ల విద్యార్థిని దేవిశ్రీ అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఈ అమానుష ఘటనతో ఈ ప్రాంతంలో కలకలం రేగింది. ఆచార్య కాలేజీలో చివరి సంవత్సరం BBM చదువుతున్న దేవిశ్రీని ఓ యువకుడు హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈమెది అన్నమయ్య జిల్లా అన్నమయ్య జిల్లా. రామసముద్రం మండలం బిక్కింవారిపల్లెకు చెందిన రెడ్డెప్ప, జగదాంబ దంపతుల కుమార్తె. బెంగళూరు కళాశాలలో చదువుతూ అక్కడే ఓ అద్దె గదిలో ఉంటోంది. ఆమెకు సన్నిహితుడైన చిత్తూరు జిల్లా చౌడేపల్లె మండలం పెద్దకొండామర్రికి చెందిన ప్రేమవర్ధన్ అనే యువకుడు తలపై మోది హత్య చేసినట్లు మాదనాయనకహళ్లి పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. నిందితుడు పరారీలో ఉండటంతో గాలింపు తీవ్రం చేశారు.
ఆదివారం ఉదయం 9.30 గంటలకు దేవిశ్రీ, ప్రేమవర్ధన్ అనే వ్యక్తితో కలిసి మానస అనే మహిళ అద్దెకు తీసుకున్న గదికి వెళ్లారు. ఇద్దరూ అక్కడ దాదాపు 11 గంటల పాటు ఉన్నారు. సాయంత్రం 8.30 గంటలకు ప్రేమవర్ధన్ గదిని బయట నుంచి లాక్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడని పోలీసులు గుర్తించారు.
దేవిశ్రీ స్నేహితులు పోలీసులకు ఇచ్చిన సమాచారం మేరకు మదనాయకనహಳ್ಳಿ పోలీసులు అక్కడికి చేరుకుని గదిలో దేవిశ్రీ మృతదేహాన్ని కనిపెట్టారు.
పోలీసు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అక్కడ దొరికిన ఆధారాన్ని బట్టి- ఇనుప రాడ్ తో తలపై మోది కొట్టి చంపి ఉంటారేమోననే అనుమానాన్ని పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. హత్యకు గల కారణం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. వ్యక్తిగత విభేదాలా లేక మరేదైనా కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాల్ డిటైల్స్ ను పోలీసులు పరిశీలిస్తున్నారు.
ఈ ఘటనపై 23 ఏళ్ల జయంత్ టి అనే యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 103(1) కింద హత్య కేసు నమోదు చేశారు.
నిందితుడు ప్రేమ వర్ధన్ ప్రస్తుతం పరారీలో ఉండగా, అతడిని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
పోస్టుమార్టం నివేదిక కోసం పోలీసులు వేచి చూస్తున్నారు. అది అందిన తర్వాత మృతికి గల కారణంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. చదువు పూర్తి చేసుకుని పట్టాతో ఇంటికి వస్తుందన్న కుమార్తె హత్యకు గురికావడాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేక విలవిల్లాడుతున్నారు.