ఐఏఎస్ అధికారులకు రెండే ఆప్షన్లున్నాయా ?

కొందరు అఖిల భారత సర్వీసు అధికారులకు డెడైలైన్ ముంచుకొచ్చేస్తోంది. ఎందుకంటే ఇంతకాలం తామున్న ప్రాంతాన్ని వదిలేసి కొత్త ప్రాంతానికి వెళ్ళటానికి.

Update: 2024-10-12 10:11 GMT

కొందరు అఖిల భారత సర్వీసు అధికారులకు డెడైలైన్ ముంచుకొచ్చేస్తోంది. ఎందుకంటే ఇంతకాలం తామున్న ప్రాంతాన్ని వదిలేసి కొత్త ప్రాంతానికి వెళ్ళటానికి. ఇంతకీ విషయం ఏమిటంటే తెలంగాణాలో గడచిన పదేళ్ళుగా పనిచేస్తున్న ఐదుగురు ఐఏఎస్ అధికారులు, ముగ్గురు ఐపీఎస్ అధికారులు తమిష్టంతో సంబంధంలేకుండా ఏపీకి వెళ్ళక్క తప్పటంలేదు. తెలంగాణాలో రిలీవ్ అయిపోయి ఏపీలో రిపోర్టుచేయటానికి వీళ్ళకి ఈనెల 16వ తేదీయే డెడ్ లైన్. అంటే వీళ్ళకి ఉన్నది వీళ్ళకి నాలుగురోజులు మాత్రమే. ఈ నాలుగురోజుల్లో రెండురోజులు విజయదశమి, ఆదివారం తీసేస్తే మిగిలింది రెండురోజులు మాత్రమే.

తెలంగాణాను వదిలేసి ఏపీలో రిపోర్టు చేయబోతున్న ఐఏఎస్ అధికారులు జీహెచ్ఎంసీ కమీషనర్ కాటా అమ్రపాలి, విద్యుత్ శాఖలో ట్రాన్స్ కో, జెన్కో ఎండీ రొనాల్డ్ రాస్, మహిళా, శిసుసంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి వాకాటి కరుణ, అటవీశాఖ ముఖ్య కార్యదర్శి వాణీ విశ్వనాధ్, ఎం ప్రశాంతితో పాటు ఐపీఎస్ అధికారులు అనంజనీ కుమార్, అభిలాసా బిష్త్, అభిషేక్ మహంతిలు ఏపీలో జాయిన్ అవ్వక తప్పేట్లులేదు. ఎలాగైనా తాము తెలంగాణాలోనే కంటిన్యు అయ్యేట్లుగా వీళ్ళు చాలా ప్రయత్నాలే చేసుకున్నా సాధ్యంకాలేదు. తమ ప్రయత్నాల్లో వీళ్ళు డీవోపీటీ (డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్)తో పాటు కేంద్రప్రభుత్వానికి చాలాసార్లు విజ్ఞప్తులు చేసుకున్నారు.

అయితే కేంద్రం వీళ్ళ విజ్ఞప్తులను అంగీకరించలేదు. అందుకనే సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్(క్యాట్), కోర్టుల్లో కేసులు వేసినా ఉపయోగంలేకపోయింది. అన్నీ ప్రయత్నాలు విఫలమైన తర్వాతే డీవోపీటీ మూడురోజుల క్రితం పై ఎనిమిది మంది అధికారులను వెంటనే వెళ్ళి ఏపీలో జాయిన్ అవ్వాలని ఆదేశించింది. వీళ్ళని వెంటనే రిలీవ్ చేసేయాలని తెలంగాణా చీఫ్ సెక్రటరీని ఆదేశించినట్లే వీళ్ళు రిపోర్టు చేయగానే పోస్టింగులు ఇవ్వాలని ఏపీ చీఫ్ సెక్రటరీని కూడా ఆదేశించింది. అఖిలభారత సర్వీసు అధికారుల శిక్షణ, బదిలీలు, వచ్చిన ఫిర్యాదులను పరిశీలించటం, చర్యలు తీసుకోవటం లాంటి అనేక విషయాలను ప్రత్యక్షంగా డీవోపీటీయే పర్యవేక్షిస్తుంటుంది. అందుకనే ఏఐఎస్ అధికారుల సర్వీసుకు సంబంధించి డీవోపీటీ చాలా పవర్ ఫుల్ అనే చెప్పాలి.

అసలు బదిలీ ఎందుకు చేశారు ?

వీళ్ళని ఎందుకు బదిలీచేశారంటే రాష్ట్ర విభజన సమయంలో వీళ్ళల్లో కొందరు తమ సొంతూళ్ళు ఏపీ అనే చెప్పారు. తెలుగురాష్ట్రాలకు సంబంధంలేని అధికారులు విభజన సమయంలో తాము ఎక్కడ పనిచేస్తున్నామో చెప్పారు. 2014లో సమైక్య రాష్ట్రంలో పనిచేస్తున్న ఏఐఎస్ అధికారులందరి దగ్గర నుండి డీవోపీటీ ప్రత్యేకంగా దరఖాస్తులను తీసుకున్నది. దరఖాస్తుల్లో వాళ్ళు ఇచ్చిన సమాచారం ఆధారంగా తెలంగాణాలో పనిచేస్తున్న వాళ్ళని ఏపీకి బదిలీచేసింది. అలాగే కొందరు ఏపీలో పనిచేస్తున్న అధికారులను తెలంగాణాకు బదిలీచేసింది. వీళ్ళని ఎందుకు బదిలీచేసిందంటే ఏపీ అధికారులే అయినప్పటికీ తాము తెలంగాణాలో పనిచేస్తామని రిక్వెస్టు పెట్టుకున్నారు. దరఖాస్తుల్లో సొంతూర్లు+ఇచ్చిన ఆప్షన్ ఆధారంగానే వీళ్ళని బదిలీచేసింది.

అయితే తెలంగాణాలో పనిచేస్తున్న అధికారులు ఏపీకి వెళ్ళకుండా తాముంటున్న తెలంగాణాలోనే ఉండేట్లుగా అప్పట్లో మ్యానేజ్ చేసుకున్నారు. రెండు ప్రభుత్వాలు కూడా వీళ్ళని చూసీచూడనట్లుగా వదిలేశాయి. అయితే వీళ్ళ బదిలీ విషయాన్ని డీవోపీటీ గట్టిగా పట్టుకోవటంతో వీళ్ళంతా క్యాట్, కోర్టుల్లో కేసులు వేశారు. అయినా వీళ్ళ వాదన చెల్లుబాటుకాలేదు. దాంతో ఇపుడు తెలంగాణా నుండి ఏపీకి-ఏపీనుండి తెలంగాణాకు మారక తప్పటంలేదు.

ఇంకా ప్రయత్నాలు చేసుకుంటున్నారా ?

తెలంగాణాను వదిలి వెళ్ళటం ఇష్టంలేని పై అధికారులంతా చివరి ప్రయత్నం చేసుకుంటున్నట్లు సమాచారం. ఎలాగంటే డీవోపీటీ ఆదేశాల ప్రకారం వీళ్ళంతా ఏపీలో రిపోర్టు చేస్తారు. అయితే ఏపీలో పోస్టింగుల్లో చేరరు. ఎందుకంటే రిపోర్టు చేసిన వెంటనే మళ్ళీ తెలంగాణాకే డిప్యుటేషన్ మీద వచ్చేట్లుగా ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒక రాష్ట్రం నుండి మరోక రాష్ట్రానికి డిప్యుటేషన్ కు వెళ్ళాలంటే ప్రత్యేకించి డీవోపీటీ అనుమతి అవసరంలేదని సమాచారం. ముఖ్యమంత్రులు తలచుకుంటే డిప్యుటేషన్ మీద ఏపీ నుండి తెలంగాణాకు వచ్చి పనిచేయచ్చు. దానికన్నా ముందు పై అధికారులు ఇప్పుడు ఏరాష్ట్రంలో పనిచేస్తున్నారో అదే రాష్ట్రానికి కేటాయించేట్లుగా అనుమతి కోరుతు ప్రభుత్వం తరపున డీవోపీటికి రిక్వెస్టు లెటర్ ను పంపాలని కూడా ఆలోచిస్తున్నారు.

ఒకవేళ రిక్వెస్టును డీవోపీటీ అంగీకరించకపోతే అప్పుడు రేవంత్ రెడ్డి,-చంద్రబాబునాయుడు మాట్లాడుకుని తెలంగాణా నుండి ఏపీకి వెళ్ళాల్సిన అధికారులు అలాగే ఏపీ నుండి తెలంగాణాలో పనిచేయాల్సిన అధికారుల డిప్యుటేషన్ విషయమై చర్చించుకోబోతున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రులు ఇద్దరు నిర్ణయం తీసుకుంటే డిప్యుటేషన్ మీద తాము ఇపుడు పనిచేస్తున్న రాష్ట్రాల్లోనే పనిచేయటం పెద్ద కష్టంకాదని అనుకుంటున్నారు. చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News