ఎన్నికల్లో మమ్మల్ని ఓడించినా, మీ కోసం వచ్చాను

మన్యం గిరిజనులతో పవన్ కల్యాణ్;

Update: 2025-04-07 12:28 GMT

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి కొణిదెల పవన్‌ కల్యాణ్‌ అడవి తల్లి బాట పేరిట అల్లూరి సీతారామరాజు జిల్లాలో సోమవారం అడుగు పెట్టారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఈ జిల్లాలో తొలిసారి పర్యటనకు శ్రీకారం చుట్టారు. గిరిజనులతో మమేకమవుతూ వారి కష్ట సుఖాలను అడిగి తెలుసుకుని వారి మనసులను చూరగొన్నారు. రాజకీయ ప్రసంగానికి అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదు. అంతేకాదు.. పవన్‌ సభ అంటే ఆవేశ కావేశాలు, పూనకాలు, సవాళ్లతో సాగుతుంది. కానీ అల్లూరి జిల్లా అడవి తల్లి బాటలో ఆయన తన సహజ వైఖరికి భిన్నంగా ఆద్యంతం సావధానంగా, కూల్‌గా ప్రసంగించారు. పైగా మునుపటి వైసీపీ ప్రభుత్వంపైనా అంతగా విరుచుకు పడలేదు. కూటమి ప్రభుత్వం గిరిజన ప్రాంతాల అభివృద్ధికి చేపడుతున్న తీరును వివరించారు. ఇంకా గిరిజన భాషలోనూ మాట్లాడే ప్రయత్నం చేయడంతో పాటు వారి వేషధారణతోనూ అలరించారు. అల్లూరి జిల్లాలో రెండు (అరకు, పాడేరు) ఎమ్మెల్యే స్థానాల్లో వైసీపీ వారినే గెలిపించినా కోపం లేదని, రాజకీయాలకతీతంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

Delete Edit

అడవి తల్లి బాట కార్యక్రమంలో తన రెండు రోజుల పర్యటనలో భాగంగా పవన్‌ కల్యాణ్‌ సోమవారం ఉదయం ప్రత్యేక విమానంలో విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో అల్లూరి సీతారామరాజు జిల్లా, డుంబ్రిగూడ మండలం పెదపాడు వెళ్లారు. చాపరాయి నుంచి పెదపాడు వరకు రూ. 2.12 కోట్లతో 2.2 కి.మీల మేర తారు రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసి అడవి తల్లి బాటకు శ్రీకారం చుట్టారు. అనంతరం పెదపాడు గ్రామస్తులతో పవన్‌ కళ్యాణ్‌ ముఖాముఖీ సమావేశం అయ్యారు. ఆ గ్రామానికి చెందిన పాంగి మాధురి (మ్యాగీ) అనే మహిళ సౌకర్యాలు లేక తాము పడుతున్న ఇబ్బందులు గ్రామస్తుల తరఫున తెలియజేస్తూ అర్జీ సమర్పించారు.పెదపాడు గ్రామస్తులు కోరిన 12 అభివృద్ధి కార్యక్రమాలను ఆరు నెలల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. గతంలో తన ప్రజా పోరాట యాత్రలో కురిడి గ్రామానికి కాలినడకన వెళ్లడం వల్ల గిరిజనుల కష్టం తెలిసిందని.. అప్పుడే గిరిజన గ్రామాల అభివృద్ధికి తన వంతు కృషి చేయాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు.

Delete Edit
సంప్రదాయబద్ధంగా స్వాగతం..
అడవితల్లి బాట కార్యక్రమంలో భాగంగా పెదపాడుకు వచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ కు గిరిజనులు సంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు. గ్రామ శివారుకి వచ్చిన గిరిజన మహిళలు ‘మా కష్టాలు తీర్చే మా దేవుడు.. మా గ్రామానికి వచ్చాడు’ అంటూ గిరిజన తెగకు చెందిన కోది భాషలో పాటలు పాడుతూ.. హారతులతో స్వాగతించారు. కారు. ప్రకృతి ఒడి నుంచి సేకరించిన పూలతో దండలు చేసి ఆయనకు వేశారు. గ్రామ శివారు నుంచి పెదపాడు మహిళలు సంప్రదాయ థింసా నృత్యంతో గ్రామంలోకి ఆహ్వానించారు. అనంతరం పవన్‌ శాస్త్రోక్తంగా అడవితల్లి బాట కార్యక్రమంలో భాగంగా రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సేంద్రీయ పద్దతిలో పండించే గిరిజన ఉత్పత్తుల ప్రదర్శనను తిలకించారు. చింతపండు, పనస, అడ్డకాయ పిక్కలు, శనగకాయలు, చేమగడ్డలు, జీడి పిక్కలతో పాటు చిరు, కాఫీ గింజలను పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రంలో చదువుకుంటున్న చిన్నారులతో ముచ్చటించి వారికి పుస్తకాలు, స్వీట్లు పంచారు. మినీ అంగన్వాడీ కేంద్రం పరిధిలో ఉన్న గర్భిణులు, బాలింతలకు గుడ్లు, పాలు, రాగిపిండి, వేరుశనగ చిక్కీ, బాలామృతం, ఎండు ఖర్జూరంతో కూడిన పౌష్టికాహార కిట్లను పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలో జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులతో కలసి మొక్కలు నాటారు.
Delete Edit
కురుడి గ్రామస్తులతో ఖుషీ..
ప్రజా పోరాటయాత్ర సమయంలో కురిడి గ్రామానికి వెళ్లారు పవన్‌. అప్పట్లో వారి సమస్యలను తెలుసుకున్నారు. ఇప్పడు వాటి పరిష్కారానికి ఉపముఖ్యమంత్రి హోదాలో వచ్చారంటూ కురిడి గ్రామస్తులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. పోరాట యాత్రలో పవన్‌ కళ్యాణ్‌ గారి దృష్టికి సమస్యలు తీసుకువచ్చిన గిరిజన మహిళ రాములమ్మను చూడగానే గుర్తుపట్టి ఆప్యాయంగా పలుకరించి హత్తుకున్నారు. దీంతో ఆమె భోవోద్వేగానికి లోనయ్యారు. మార్షల్‌ ఆర్ట్స్‌ లో శిక్షణ తీసుకుంటున్నచిట్టిబాబు అనే యువకుడు పవన్‌ కళ్యాణ్‌ ను కలవగా తన వంతు ప్రోత్సాహం అందించారు. పెదపాడు నుంచి తిరుగు ప్రయాణంలో పోతంగి గ్రామ పంచాయతీ పరిధిలోని 8 గ్రామాల ప్రజలు పవన్‌ కళ్యాణ్‌ ను కలిసి సమస్యలపై అర్జీ ఇచ్చారు. గిరిజనులతో పాటు చాపరాయిలో నడుస్తూ ఆయా గ్రామాల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బ్రిడ్జి నిర్మాణం ప్రక్రియ తక్షణం చేపట్టేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
Delete Edit
అడ్డాకుల టోపీ ధరించి.. కోది భాషలో ప్రసంగించి...
గిరిజన సంప్రదాయ కోదీ భాషలో పెదపాడు గ్రామస్తులు స్వాగత సత్కారాలు చేయగా పవన్‌ కూడా కోదీ భాష తెలుసుకుని.. ఆ భాషలో ప్రసంగించి ఆశ్చర్య పరిచారు. కోదీ భాషలోనే వారు తన ఎదుట ఉంచిన 12 సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.పెదపాడుకు చెందిన గిరిజనుడు అడ్డాకులతో స్వయంగా కుట్టిన టోపీని పవన్‌ కళ్యాణ్‌అకు అలంకరించారు. ఈ గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో విద్యాబోధన తీరుని పరిశీలించారు. త్వరలో నూతన పాఠశాల నిర్మిస్తానని హామీ ఇచ్చి వారికి తమాషా పిట్టకథల పుస్తకాలు, స్వీట్లు పంచారు.
Delete Edit
పవన్‌ తన ప్రసంగంలో ఏమన్నారంటే..?
అడవి తల్లి బాట కార్యక్రమంలో భాగంగా పెదపాడులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్‌ కల్యాణ్‌ సుదీర్ఘంగా ప్రసంగించారు. ఆయన తన ప్రసంగంలో ఏమన్నారంటే.. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో అల్లూరి జిల్లాలో కేవలం రూ.90 కోట్లతో 90 కి.మీల రోడ్లు మాత్రమే వేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన పది నెలల్లోనే 1050 కి.మీలు రూ.1005 కోట్లతో రోడ్ల పనులు మంజూరు చేశాం. వారం రోజుల్లోనే వీటి పనులు ప్రారంభమయ్యేలా చూస్తాం. ఈ రోడ్లు అందుబాటులోకి వస్తే మీ జీవితాఉల మెరుగవుతాయి. పర్యటాకం అభివృద్ధి చెందుతుంది. ఇంకా అరకు ఇంకా అరకు అభివృద్ధికి ఏం చేయాలనన్న దానిపై ముఖ్యమంత్రితో మాట్లాడతాం. అల్లూరి జిల్లాలో మరో లక్ష ఎకరాల్లో కాఫీ తొటలు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. కాఫీ తోటల్లో పెరిగే సిల్వర్‌ ఓక్‌ చెట్లకు మంటలు రగిలించే గుణం ఉండడం వల్ల అగ్ని ప్రమాదాలకు ఆస్కారం ఉంది. పైగా పర్యావరణానికి అవి మంచివి కావు. అందువల్ల వాటికి ప్రత్యామ్నాయ చెట్లపై దృష్టి సారించాలని అటవీ శాఖ అధికారులకు సూచిస్తున్నాం. గిరిజనులు దయచేసి గంజాయిని పెంచకండి. ఎక్కడైనా పెంచితే పోలీసులకు సమాచారం ఇవ్వండి. గిరిజనులు గంజాయి సాగు వైపు మళ్లకుండా వారు సొంతకాళ్లపై నిలబడేలా ప్రత్యామ్నాయ ఆదాయ వనరులు కోసం కృషి చేస్తున్నాం. అరకు పరిసర ప్రాంతాల్లో చెడుపు, చిల్లంగి, చేతబడితో మూఢ నమ్మకాలు బలంగా ఉన్నాయని, దీంతో ఈ మధ్యకాలంలో 9 మందిని చంపేశారని ఎస్పీ, డీఎస్పీలు నాతో చెప్పారు. అలాంటి మూఢనమ్మకాలు పెట్టుకోకండి. ఇంట్లో వారికి బాగులేకపోతే ఆస్పత్రులకు వెళ్లి వైద్యం చేయించుకోండి.. మనసు బలంగా ఉంటే ఏ దుష్టశక్తీ ఏమీ చేయదు. చట్టాలు మీ చేతుల్లోకి తీసుకోకండి.. దీనిపై వికాస్‌ అనే కార్యక్రమానికి పోలీసులు శ్రీకారం చుట్టారు. దాని ద్వారా అవగాహన పెంపొందించుకోండి.
Delete Edit
ఏజెన్సీలో నా కోరిక ఒకటే..
అల్లూరి జిల్లాలో నా కోరిక ఒకటే. వచ్చే ఎన్నికల్లో ఈ ఏజెన్సీలో కూటమి జెండాలే రెపరెపలాడాలి. మీరు ఓటేయకపోయినా మీకు విలువిచ్చి వచ్చాను. మీ అభివృద్ధికి పాటు పడుతున్నా. మీరంతా నా వాళ్లే. మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటా.. పార్టీలు వేరైనా శత్రువులం కాదు.. అభివృద్ధికి పాటు పడాలి తప్ప రాజకీయాలు చూడకూడదు. కూటమికి 15 ఏళ్లు అధికారం కావాలి. గత ప్రభుత్వంలో ఛిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలంటే అంత సమయం అవసరం అంటూ ఉప ముఖ్యమంత్రి తన ప్రసంగాన్ని ముగించారు. గతానికి భిన్నంగా పవన్‌ కల్యాణ్‌ ఆవేశ కావేశాలకు లోనుకాకుండా సావధానంగా ప్రసంగించడాన్ని అంతా విశేషంగా చర్చించుకున్నారు.
Tags:    

Similar News