నేలకొరిగిన 150 ఏళ్ల సినీ చెట్టు.. ప్రభుత్వమే కారణమా..!

ఆంధ్రప్రదేశ్‌లో భారీగా కురుస్తున్న వర్షాల తాకిడికి పలు ప్రాంతాల్లో వరదలు వచ్చాయి. అలా వచ్చిన వరదలకు కొవ్వూరు మండలం కుమారదేవం దగ్గర గోదావరి గట్టు మీద ఉన్న చెట్టు ఒరిగింది.

Update: 2024-08-06 07:05 GMT

ఆంధ్రప్రదేశ్‌లో భారీగా కురుస్తున్న వర్షాల తాకిడికి పలు ప్రాంతాల్లో వరదలు వచ్చాయి. అలా వచ్చిన వరదలకు తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం దగ్గర గోదావరి గట్టు మీద ఉన్న చెట్టు ఒరిగింది. ప్రస్తుతం ఈ చెట్టే రాష్ట్రమంతా హాట్‌టాపిక్‌గా ఉంది. దీనినే సినిమా చెట్టు అని కూడా పిలుచుకుంటారు. దీని వయసు 150 ఏళ్లు. ఈ చెట్టు అప్పటి ఏఎన్ఆర్ నుంచి ఎందరో హీరోల సినిమాల్లో కనిపించింది. దాదాపు 300 సినిమాల్లో ఏదో ఒక సన్నివేశం ఈ చెట్టు దగ్గర చిత్రీకరించబడింది. ఇంతటి గొప్ప చరిత్ర ఉన్న ఈ చెట్టు అక్కడి స్థానికులకు కూడా ఎంతో ప్రత్యేకం. అటువంటి ఈ మహావృక్షం రెండుగా చీలి నేలకొరగిపోయింది. ఈ ఘటనపై స్థానికులు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎన్నో జ్ఞాపకాలు..

ఈ చెట్టుతో తమకు ఎన్నో మధుర జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయని అక్కడి స్థానకులు చెప్తున్నారు. ‘‘నేను చిన్నప్పుడు ఈ చెట్టు ఎక్కడి ఆడుకున్నాను. ఈ నిద్రగన్నేరు చెట్టు నేలకొరుగుతుందని కలలో కూడా అనుకోలేదు. ఒకటా రెండా ఈ చెట్టుతో మాకు ఉన్న అనుబంధం మాటల్లో చెప్పలేనిది. సినిమా షూటింగ్ ఉన్నప్పుడల్లా సినీ తారలు వస్తారని పక్క ఊళ్ల ప్రజలు కూడా ఇక్కడి వస్తుండే వారు. ఎన్నో తరాలకు నీడనిచ్చి ఈ చెట్టు ఇప్పుడు నేలకొరగడం చాలా విషాదకరం’’ అని ఓ పెద్దాయన తన బాధను వెలిబుచ్చుకున్నారు. ఈ చెట్టు గురించి తనకు తన తండ్రి ఎన్నో కథలు చెప్పారని, ఆ కథలు విని పొద్దున్నే ఆ చెట్టు కింద ఆడుకున్న ఆ రోజుల్నీ ఇప్పటికీ మరువలేనని మరో వ్యక్తి కూడా ఈ చెట్టుతో తనకున్న జ్ఞాపకాలను నెమరేసుకున్నారు.

 

ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమా..

అయితే 150 ఏళ్లో ఎన్నో వరదలు, తుఫానులను ఎదుర్కొన్న ఈ చెట్టు ఇప్పుడు ఒక్కసారిగా నేలకొరగడంపై అనేక వాదనలు వినిపిస్తున్నాయి. కొందరు బాగా పెద్దది కావడం వల్లే చెట్టు ఒరిగిపోయిందంటే మరి కొందరు మాత్రం ఇంత విశిష్ట చరిత్ర ఉన్న చెట్టు ఇప్పుడు ఇకలేకుండా పోవడానికి ప్రభుత్వమే కారణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ చెట్టు కూలిపోయిందని విమర్శిస్తున్నారు. ఈ చెట్టు తొలిసారి 1975లో పాడి పంటలు సినిమాలో కనిపించింది. ఆ తర్వాత మరెన్నో సినిమాల్లో కూడా కనిపించింది. ఇంత ప్రత్యేకత, 150 ఏళ్ల వయసున్న ఈ చెట్టును సంరక్షించడానికి ప్రభుత్వం కానీ, పర్యాటక శాఖ ఎలాంటి చర్యలు తీసుకోలేదని, అందుకే ఇప్పుడు ఈ చెట్టుకు ఈ అవస్థ పట్టిందని కొందరు అంటున్నారు. అంతేకాకుండా గతంలో పుష్కర గ్రాంటు వస్తే ఈ చెట్టుకు చేయాల్సిన పనులను అరకొరగా చేసి తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారని, అలా కాకుండా పనులు సక్రమంగా చేసి ఉంటే ఈనాటికీ చెట్టు అలానే ఉండి ఉండేదని గ్రామస్థులు అంటున్నారు. మరి వారి విమర్శలకు ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందో చూడాలి.

సినీ వృక్షాన్ని నాటింది ఆ తాతయ్యే

గోదావరి గట్టున సినీ వృక్షంగా పేరుగాంచిన నిద్రగన్నేరు మొక్కను 170 ఏళ్ల క్రితం అదే గ్రామ నివాసి సింగులూరు తాతయ్య అనే వ్యక్తి నాటారు. కాలక్రమేనా ఆ చెట్టు వల్లే ఆ కూరికి పేరు వచ్చింది. ఈ చెట్టు దగ్గర షూటింగ్ చేయడానికి ప్రముఖ దర్శకులు, హీరోలు కూడా ఆసక్తి చూపేవారు. సినిమాలో ఎక్కడో ఒక్కచోటైనా ఈ చెట్టు కనిపిస్తే ఆ సినిమా సూపర్ హిట్ అవుతుందన్న నమ్మకం కూడా అప్పట్లో చాలా మందిలో ఉండేది. దీనిని బట్టే ఈ చెట్టు ఎంత ఫేమస్సో అర్థం చేసుకోవచ్చు.

మరోచెట్టుకు ప్రాణప్రతిష్ఠ

గోదావరి గట్టున్న ఉన్న 150 ఏళ్ల నిద్రగన్నేరు చెట్టు నేలకొరగడంతో అక్కడే మరో చెట్టుకు ప్రాణప్రతిష్ఠ చేయడానికి ఓ సంస్థ ముందుకొచ్చింది. నిద్రగన్నేరు చెట్టు ప్రాంతంలోనే మరో 20 అడుగుల వృక్షాన్ని ప్రతిష్ఠించాలని రాజమహేంద్రవరం రైటింగ్ సంస్థ ఆసక్తి చూపుతోంది. దీని కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా అక్కడ చెట్టును ప్రతిష్ఠించడానికి కావాల్సిన అనుమతుల కోసం కూడా చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. కాగా అక్కడే ఏ చెట్టును ప్రతిష్టిస్తారు అన్న అంశంపై మాత్రం ఇంకా క్లారిటీ లేదు.

Tags:    

Similar News