'మనమిత్ర వాట్సప్ గవర్నెన్స్'లో ఇక 700 సేవలు
ఆగస్టు 15 నుంచి మరిన్ని సేవలు అందుబాటులోకి తెస్తామని ప్రకటించిన ఏపీ ప్రభుత్వం;
By : V V S Krishna Kumar
Update: 2025-08-10 12:16 GMT
ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరగాల్సిన పరిస్థితి లేకుండా ఏపీ ప్రభుత్వం పౌర సేవలను మనమిత్ర పేరుతో వాట్సప్ గవర్నెన్స్ ను అందిస్తోంది.ఈ ఏడాది జనవరిలో 26 ప్రభుత్వ శాఖలకు సంబంధించిన 161 సేవలతో 'మనమిత్ర వాట్సప్ గవర్నెన్స్' ప్రారంభం కాగా, ఆ సేవలను క్రమంగా పెంచుతూ వచ్చారు. ప్రస్తుతం 500 సేవల దాకా అందుబాటులో వుండగా . వీటిని ఆగస్ట్ 15వ తేది నుంచి 700దాకా పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.మనమిత్ర పేరిట అమలవుతున్న ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో ఎక్కడినుంచైనా సేవలు పొందేందుకు, ఫిర్యాదులు చేసేందుకు సచివాలయ ఉద్యోగుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి.
విద్యార్థులకు పరీక్షల హాల్ టికెట్లు, రేషన్ కార్డుల సేవలు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ స్టేటస్‌లు తెలుసుకునే వెసులుబాటు కల్పించారు. బర్త్ సర్టిఫీకెట్లు , కుల ధృవీకరణ పత్రాలు ఇతర రివెన్యూ సేవలు అందిస్తున్నారు. ప్రజలకు మరిన్ని సేవలను ఇంటి వద్ద నుంచే అందించే క్రమంలో ఇప్పటి దాకా అందుబాటులో వున్న 500 సేవలకు గాను మరో 200 సేవలను వాట్సప్ గవర్నెన్స్ లో ప్రవేశ పెడుతున్నట్లు అధికారులు ప్రకటించారు.పాలనలో టెక్నాలజీ వినియోగాన్ని పెంచడంతో పాటు సెల్ ఫోన్ ద్వారానే ప్రజలు పౌరసేవలు పొందుతున్నారన్నారు.