శ్రీసిటీలో భాగవత సప్తాహ మహోత్సవం

25 మంది సభ్యుల బృందం వారం రోజుల పాటు 12 స్కంధాల 335 అధ్యాయాలలోని 18 వేల భాగవత శ్లోకాలను పఠనం

Update: 2025-11-29 11:03 GMT
శ్రీసిటిలో భాగవత సప్తాహం సందర్బంగా కలశ పూజ

ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా శ్రీసిటీ (Sri City) శ్రీ ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయంలో చేపట్టిన భాగవత సప్తాహ మహోత్సవం (Bhagavata Saptaham) శనివారం దిగ్విజయంగా ముగిసింది. శ్రీసిటీ-శ్రీవాణి సౌజన్యంతో భాగవత భక్త సమాజ బృందం ఈ నెల 23న ఆలయ ఆవరణలో భాగవత సప్తాహ కార్యక్రమం ప్రారంభించారు. 25 మంది బృంద సభ్యులు వారం రోజుల పాటు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు అత్యంత భక్తి శ్రద్దలతో 12 స్కంధాలతో కూడిన 335 అధ్యాయాలు, 18 వేల భాగవత శ్లోకాలను పఠనం గావించి, శనివారం మధ్యాహ్నం ప్రత్యేక పూజలతో కార్యక్రమం పూర్తిచేశారు.

భాగవత సప్తాహ పఠనం చేస్తున్నభాగవత భక్త సమాజ బృందం 

ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జున చేసే క్రమంలో భాగవత వైశిష్ట్యాన్ని వివరిస్తూ రాష్ట్రమంతటా ప్రతినెలా భక్తులు కోరిన చోట ఈ భాగవత భక్త సమాజ బృందం వారు భాగవత సప్తాహన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 421 సప్తాహాలు పూర్తిచేయగా, శ్రీసిటీలో 422 వ కార్యక్రమం నిర్వహించినట్లు బృంద సభ్యులు తెలిపారు. పచ్చదనం నిండిన చల్లని ఆహ్లాదకర వాతావరణంలో శ్రీసిటీ ఆలయంలో వారం రోజుల భాగవత సప్తాహం తమకు ఎంతో హాయిని ఇచ్చిందని వారు పేర్కొన్నారు. అన్ని వసతులు సమకూర్చి తమకు ఈ అవకాశం కల్పించిన శ్రీసిటీ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 

శ్రీసిటీ ఎండీని సత్కరించిన భాగవత భక్త సమాజ బృందం

చివరిరోజు కార్యక్రమంలో పాల్గొని, భాగవత భక్త సమాజ బృందానికి కృతజ్ఞతలు తెలిపిన డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి, వరుసగా మూడవ ఏడాది శ్రీసిటీలో శ్రీమద్భాగవత సప్తాహం చేయడం సంతోషంగా ఉందన్నారు. ఇది ఈ ప్రాంతానికి అత్యంత ప్రయోజనకరమైన ఒక యజ్ఞం లాంటిదని వ్యాఖ్యానించారు. మొత్తం బృందం యొక్క దైవిక ప్రయత్నాన్ని ఆయన అభినందించారు. భాగవత భక్త సమాజ సభ్యులను శాలువాలతో సత్కరించి, స్వామి వారి తీర్థ, అన్న ప్రసాదాలను అందచేశారు. 

పరిసర గ్రామాల ప్రజలు భాగవత సప్తాహం మరియు శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. శ్రీసిటీ ప్రతినిధులు పి.ఎస్.బి.శాస్త్రి, పల్లేటి బాలాజీ ఏర్పాట్లను పర్యవేక్షించారు.


Tags:    

Similar News