రైతు ఆత్మహత్యలతో తల్లడిల్లుతున్న పల్నాడు

కౌలు రైతు కష్టాలు: అప్పులు తీరే మార్గం లేదు. ప్రభుత్వం సాయం అందడం లేదు.;

Update: 2025-08-03 05:49 GMT

పదిహేను నెలల క్రితం భర్త బండ్ల నారాయణ ఆత్మహత్య చేసుకోవటం తో ఈ కుట్టు మిషనే నాకు యిప్పుడు జీవనాధారం అంటోంది అతని భార్య రమాదేవి. ఆయన చనిపోయేనాటికి వుండిన 4.5 ఎకరాల పొలం తమకు వున్న 70 లక్షల అప్పు చెల్లించటానికి అమ్మేయవలసి రావటంతో కుటుంబానికి సెంటు భూమి కూడా మిగలలేదు. అప్పులు కట్టగా తనకు మిగిలింది యిదే అని తన యింటిని ఆవేదనతో చూపుతూ చెబుతుంది. గురజాల మండల మాడుగుల గ్రామ వాసి రమ. “20 ఏళ్ల క్రితం మా పెళ్లి అయిన కొత్తలో దీనిని కట్టుకున్నాము. మాకు వున్న అప్పులను 100 కి 40 పైసల లెక్కన మాత్రమే కట్టగలిగాను. ఈ యింటి మీద కూడా అప్పు వుంటే దీని మీద వున్న లోన్ ను చెల్లించి మిగిలిన డబ్బు అప్పులు కట్టాను. యిప్పుడు మా బంధువుల దుకాణం లో ముందు టేలర్ పని చేస్తున్న. తొమ్మిదో తరగతి చదువుతున్న నా కొడుకు, బిటెక్ మూడవ సంవత్సరం చదువుతున్న కూతురు బ్రతకటానికి ఇదే ఆధారం. నేను మా ఆయన కు చాలా సార్లు పొలాలు అమ్మి వున్న అప్పులు కట్టేయమని చెప్పాను కానీ ఆయన అందుకు సిద్దపడ లేదు. మన పిల్లలకు ఆవే కదా జీవనాధారం అనేవారు. ఆయన నెల క్రితమే తాను పురుగుల మందు కొన్నారని యిటీవలే తెలిసింది. తాను మానసికంగా అంతగా ఎలా బలహీన పడ్డారో అర్థం కాలేదు,” అని విషాద వదనంతో రమ అన్నారు

పల్నాడు జిల్లాలో ఆత్మహత్యల పరిస్థితిని పరిశీలించేందుకు రైతు స్వరాజ్య వేదిక, మానవ హక్కుల వేదిక బృందం జూలై  29,30 తేదీలలో గురజాల మండంలోని పలు గ్రామాలలో పర్యటించింది. ఇక్కడ కుటుంబానికి ఆలంబనగా ఉండాల్సిన వ్యక్తి వ్యవసాయం విఫలమై ఆత్మహత్య చేసుకోవడం, తర్వాత కుటుంబం చితికిపోవడం, ఇలాంటి కుటుంబాలను ఆదుకోవడంలో అధికారుల అలసత్వం ఈ పర్యటనలో వెల్లడయ్యాయని వేదిక ప్రతినిధులు తెలిపారు. 

ఒకపుడు ఈ ప్రాంతమంతా  గంటూరు జిల్లాలో ఉండింది.  వైసిపి ప్రభుత్వం కాలంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి  జిల్లాలను పునర్వ్యవస్థీకరించినపుడు పల్నాడు ప్రాంతం ప్రత్యేక జిల్లాలో అయింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో కౌలు రైతులు చాలా ఎక్కువ.  80 శాతం పైబడి వ్యవసాయం కౌలు రైతులో చేతుల్లోనే ఉందని నబార్డు లెక్క. పల్నాడు జిల్లాలో ఉన్న కౌలు రైతుల సమాచారం లెక్క తేలకపోయినా ఇక్కడ కూడా వ్యవసాయం కౌలు రైతులచేతుల్లోనే ఉంది. అయితే, వాళ్లకి రైతుగా గుర్తింపు లేదు. ఫలితంగా వాళ్లకి అందుతున్న సాయం బాగా తక్కువ.  ఈ నేపథ్యంలో కుటంబాన్ని పోషించాల్సిన వ్యక్తి వ్యవసాయం విపలమై ఆత్మహత్య చేసుకుంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఈ వేదికల పర్యటనలో వెల్లడయింది. 

రైతుల ఆత్మహత్యల అని గూగుల్ లో సెర్చ్ చేస్తే మొదటి కనపించేవన్నీ పల్నాడు రైతులవే. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం తూబాడు గ్రామానికి చెందిన ఇద్దరు  పొగాకు కౌలు రైతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. కారణంలో అప్పుల భారం. పొగాకు పంటకోసం భారీ అప్పు చేశారు. పంటమీద రావలసిన ధర రాలేదు. అప్పులు తీరలేదు.

రైతుల ఆత్మ హత్యలకు దారితీస్తున్న పరిస్థితులను రైతు స్వరాజ్య వేదిక, మానవ హక్కుల వేదిక ప్రతినిధులు అధ్యయనం చేశారు. 

పల్నాడు ప్రాంతంలో రైతులు పొగాకు, పచ్చిమిరప, పత్తి, కందులు,  వరి పండిస్తుంటారు. అయితే, వర్షాలు వ్యవసాయంతో దోబూచు లాడటంతో రైతులకు ప్రాణసంకటంగా మారింది. వర్షాభావ పరిస్థితులతో పాటు, భూగర్భజలాలు పడిపోవడం కూడా  వ్యవసాయాన్ని కరువు  బారిన పడేస్తున్నది. దీనికితోడు కౌలు రైతుల సంఖ్య పెరగడంతో ఎకరా కౌలు రేటు బాగా పెరిగింది. ఇపుడిది ఇరవై అయిదు వేల రుపాయల దాకా పెరిగిందని ఈ ప్రతినిధులు తెలిపారు. పంట విఫలం అయితే, అప్పులొక వైపు, కౌలు భారం మరొక వైపు రైతు మీద పడి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. దీనివల్లే రైతులు గత్యంతరం లేక ఆత్మహత్యలు చేసుకుంటున్న ఈ వేదికల అధ్యయనంలో వెల్లడి అయింది.

ఇలా అప్పుల ఊబిలో కూరుకు పోయి వున్న కుటుంబాలు పొలాలు అమ్మి అప్పులు కట్టాలా లేక  వాటిని కాపాడుకుని వారసులకు ఎలా అందివ్వాలా అనే సందిగ్ధంలో రైతులు సతమతమవుతున్నారని ఈ ప్రతినిధులు తెలిపారు. 

గురజాల మండలం పులిపాడు గ్రామం శివ గంగరాజు కుటుంబంతో మాట్లాడుతున్న మానవ హక్కుల వేదిక, రైతు స్వరాజ్య వేదిక సభ్యులు

34 సంవత్సరాలకే చనిపోయిన అదే గ్రామానికి చెందిన గంటా గణేష్ అనే రైతు తండ్రి ముందు వున్న సమస్య కూడా యిదే.భర్త చనిపోయాక ఇద్దరు కూతుర్లను తన పుట్టింటికి తీసుకెళ్లింది గంట కల్పన. పొలం అమ్మి అప్పులు కట్టటానికి ఆమె వ్యతిరేకం. మరి ఆ అప్పు తీర్చే మార్గం ఏమిటి అనేది 70 సంవత్సరాల ఆమె మామ ముందు వున్న ప్రశ్న. అప్పు తీర్చకపోతే ఇచ్చిన వాళ్ళు ఊరకుంటారా అనేది ఆయన పెద్ద అల్లుడు లక్ష్మీ నారాయణ ప్రశ్న. గణేష్ కు 3.5 ఎకరాల స్వంత పొలం వుంది. మరొక 10 ఎకరాల పొలం కౌలుకు తీసుకుని లో పత్తి, మిర్చి, వరివ్యవసాయం కుటుంబానికి మిగిల్చిన అప్పు 20 లక్షల రూపాయలు.

“ఒక్క సంవత్సరం పంట నష్టపోయినా రైతు కోలుకోవటం కష్టం. నష్టపరిహారం వచ్చినా కేవలం రెండు మూడు వేలు మించదు. పైగా కౌలు రైతులకు అది కూడా రాదు. నష్టపరిహారానికి సంబంధించి మా బావ కాగితాలు పై అధికారులకు చేరాయి అని ఎన్నికల ముందు వీఆర్వో చెప్పారు. నష్ట పరిహారం వస్తుందేమో అని ఆశించేలోపు ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. దీనితో నష్ట పరిహార కార్యక్రమం ఆగిపోయింది. ఆ తరువాత మేము ఈ విషయాన్ని ముందుకు తీసుకెళ్లలేక పోయాము.నాటి అధికారులంతా మారిపోయారు,” అని చెప్పారు లక్ష్మీ నారాయణ.

నిజానికి ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలు జీవో 43 ప్రకారం 7 లక్షల నష్టపరిహారానికి అర్హులు. దీనికి మొదట ఎస్ఐ, ఎమ్ఆర్వో, మండల వ్యవసాయ అధికారులతో కూడిన త్రిసభ్య కమిటీ తదుపరి జిల్లా స్థాయి కమిటీ చావును వ్యవసాయ సమస్యల వలన జరిగినది గా నిర్ధారిస్తే వారికి ఈ నష్ట పరిహారం డబ్బులు ప్రభుత్వం చెల్లిస్తుంది. కానీ చాలా అరుదుగానే ఈ ప్రక్రియ జరుగుతోంది. దీనితో తెలుగు దేశం, జన సేన, బీజేపి కూటమి ప్రభుత్వం వచ్చాక దాదాపు 300 వరకు రైతులు ఆత్మహత్య చేసుకున్నా కేవలం 39 మంది మాత్రమే చనిపోయారని ప్రభుత్వం అసెంబ్లీ లో చెప్పిందని ప్రభుత్వం చెబుతున్నది,” అని మానవ హక్కుల వేదిక తెలుగు రాష్ట్రాల సమన్వయ కర్త వి.ఎస్. కృష్ణ చెప్పారు. 


ఆత్మహత్యలన్నింటికి కారణం అప్పుల భారమే అని రికార్డులకెక్కింది.

“నేర పరిశోధన విభాగం వారి లెక్కల ప్రకారం పల్నాడు జిల్లాలో ఈ దశాబ్ద కాలంలో 400 పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.ఇది సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన సమాచారం. కుటుంబాన్ని పోషించాల్సిన వ్యక్తు ఆత్మహత్య చేసుకంటే వారి కుటుంబాలు ఎంత సంక్షోభంలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపధ్యంలో ఆ కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఎప్పటికి రావచ్చని అధికారులను మా బృందం సంప్రదిస్తే వారి దగ్గర కూడా ఎటువంటి సమాధానం లేదు. వాస్తవానికి రాష్ట్రమంతటా ఇదే పరిస్థితి కనబడుతుంది. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు న్యాయంగా ఎక్స్ గ్రేషియా అందాలంటే రాజకీయాలు అడ్డువస్తున్నట్లు అర్థమవుతున్నది,” అని కృష్ణ తెలిపారు.

తాము ఫలానా పార్టీ వాళ్లకు చెందిన వాళ్లం కాబట్టి ఎక్స్ గ్రేషియా రాదు అనే భయం చాలా కుటుంబ సభ్యుల్లో కనిపిస్తుంది. ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన, అవతటి పార్టీకి మద్దతుదారు అని ముద్ర వేసి సంక్షేమ ఫలితాలు అందుకుండా అడ్డుకోవడం తెలుగు రాష్ట్రాలో కనిపిస్తుంది.

ఆత్మహత్య జరిగిన రైతు కుటుంబాలలోని మహిళల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఏ ఒక్క కుటుంబంలో మహిళకు వితంతు పెన్షన్ రావడం లేదని నిజనిర్ధారణ లో వెల్లడయింది.

తాము పెన్షన్ రు. 4,000 కు పెంచామని పదే పదే ఘనంగా చెబుతున్న ప్రభుత్వం ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలలోని వారికి కూడా పెన్షన్ యివ్వటం లేదు. ఉదాహరణకు వెల్దుర్తి మండలానికి రాచమల్లపాడు గ్రామం, చెందిన ఐతంరాజు వెంకటేశ్వర్లు తండ్రి కి పెన్షన్ యివ్వటం లేదు. “భర్త చనిపోయాక మా మమ గారి చెల్లెలు మాతోనే వుంటున్నారు కాబట్టి తన పేరు మా మమ గారి పేరుమీద వున్న రేషన్ కార్డ్ లో వుంది. తనకు మాత్రమే పెన్షన్ వస్తోంది మామ గారికి రావటం లేదు,” అని చెప్పారు వెంకటేశ్వర్లు గారి భార్య అంజమ్మ. భర్త రైతు గా ఆత్మహత్య చేసుకుని చనిపోయినా వితంతు పెన్షన్ రావటం లేదని ఆమె చెబుతున్నారు.

తాము సందర్శించిన పల్నాడు, గురజాల, వెల్దుర్తి మండలాలలో 10 కుటుంబాలలో కేవలం ఒక కుటుంబానికి మాత్రమే నష్ట పరిహారం అందిందని నిజనిర్ధారణ పర్యటన ప్రతినిధులు జి. బాలు (రైతు స్వరాజ్య వేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కో కన్వీనర్), బి. కొండల్ (రైతు స్వరాజ్య వేదిక AP రాష్ట్ర కమిటీ సభ్యులు) కె. అనురాధ ( మానవ హక్కుల వేదిక రాష్ట్ర కార్యవర్గ సభ్యులు) వై. రాజేష్ (మానవ హక్కుల వేదిక AP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) తెలిపారు.

“అధికారులు తూతూ మంత్రంగా విచారణ చేసి నివేదికలు పంపుతున్నారు. ఒక ఆదివాసి కౌలు రైతు ఆత్మహత్య చేసుకుంటే ఆ కుటుంబాన్ని ఈరోజు వరకు కూడా మండల స్థాయి అధికారులు పరామర్శించలేదు. ఆ కుటుంబాని ఆహార భద్రత కూడా కరువయింది. ఆ కుటుంబాలలోని పిల్లల చదువు అగమ్య గోచరంగా మారింది,” అని బి. కొండల్ తెలిపారు.

పల్నాడు ప్రాంతంలో మిగిలిన డెల్టా ప్రాంతాల కంటే కౌలు రైతులు తక్కువగా ఉండేవారు కానీ గత కొన్ని సంవత్సరాలుగా అక్కడా కౌలు రైతుల సంఖ్య పెరిగింది. దీనితో కౌలు రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. దాదాపు 25 వేల రూపాయల కౌలు చెల్లించి పత్తి, మిరప, వరి, కందులు సాగు చేసిన రైతులు అధిక వర్షాలు, అనావృష్టి, చీడ పీడల కారణాలతో తీవ్ర నష్టాలతో అప్పుల పాలవుతున్నారు. ఈ వత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. దీనికి తోడు వెల్దుర్తి మండలంలో భూగర్భజలాలా బాగా అడుగంటి పోయాయి, వెయ్యి అడుగులు దాటితే గాని బోర్లలో నీళ్లు పడని పరిస్థితి ఉంది. ఇటీవలి కాలంలో తీవ్రమైన తెగులు కారణంగా మిర్చి పంట దిగుబడి పడిపోయింది. దానికి తోడు గణనీయంగా రేట్లు కూడా పడిపోయాయి. వీటన్నింటి వల్ల రైతులు అప్పుల ఊబిలో కూరుకు పోతున్నారని ఈ వేదిక ఒక ప్రకటనలో తెలిపింది.


Tags:    

Similar News