ఫలించని చంద్రబాబు లాబీయింగ్

అమరావతికి సింగపూర్ లింక్ లు లేనట్లే.. తేల్చేసిన మంత్రి నారాయణ;

Update: 2025-08-04 11:46 GMT

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో జోక్యానికి సింగపూర్ ప్రభుత్వం ససేమిరా అంటోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ పర్యటన తరువాత ఆశాజనకమైన ప్రకటన ఉంటుందని భావించినా అలాంటిది ఏమీ లేదని తేలిపోయింది. చంద్రబాబు లాబీయింగ్ ఫలించలేదు.చంద్రబాబుతో పాటు సింగపూర్ లో పర్యటించి, ఆయన వచ్చేసిన తర్వాత కూడా అక్కడి సంస్థలతో సంప్రదింపులు జరిపిన మున్సిపల్ మంత్రి నారాయణ చేసిన ప్రకటనతో ఇక అమరావతి నిర్మాణంలో సింగపూర్ జోక్యం లేనట్లేనని స్పష్టమౌతోంది.2014-19 మ‌ధ్య కాలంలో సింగ‌పూర్ లోని మెజారిటీ షేర్ ఉన్న కంపెనీల‌తో అగ్రిమెంట్ చేసుకున్నామ‌ని, గ‌త ప్ర‌భుత్వం ఆ ఒప్పందం ర‌ద్దు చేయ‌డంతో పాటు సీఐడీ అధికారుల‌ను పంపి విచార‌ణ చేయించిన సగతిన గుర్తు చేసిన నారాయణ ,దీంతో ఆ ప్ర‌భుత్వంతో ఏపీకి ఉన్న సంబంధాలు దెబ్బ‌తిన్నాయని తెలిపారు.

తిరిగి ఆ సంబంధాలు పున‌రుద్ద‌రించడానికే సీఎం చంద్ర‌బాబు సింగ‌పూర్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లార‌ని నారాయణ గుర్తుచేశారు. దీనికి సింగ‌పూర్ ప్ర‌భుత్వాధికారులు ఎంతో పాజిటివ్ గా స్పందించార‌ని అన్నారు. సింగ‌పూర్ ప్ర‌భుత్వానికి సీఎం చంద్ర‌బాబు అంటే ఎంతో గౌర‌వం ఉంద‌ని, అయితే ప్ర‌పంచ బ్యాంకుతో క‌లిసి అమ‌రావ‌తికి స‌హ‌కారం అందించేందుకు మాత్రమే సింగ‌పూర్ ప్ర‌భుత్వం ముందుకొచ్చింద‌న్నారు.అలాగే సింగ‌పూర్ కంపెనీల‌ను విశాఖ‌లో జ‌రిగే భాగ‌స్వామ్య స‌ద‌స్సుకు రావాల‌ని సీఎం ఆహ్వానించిన‌ట్లు తెలిపారు. త‌ర్వాత సింగ‌పూర్ ప్ర‌భుత్వంతో సీఆర్డీఏ క‌మిష‌న‌ర్ అధికారికంగా లేఖ రాసిన త‌ర్వాత సంప్ర‌దింపులు చేస్తార‌ని వెల్లడించారు. ప్రభుత్వం ఇప్పటివరకూ చేసిన ప్రకటనల్లో సింగపూర్ కన్సార్టియం ఈసారి రాజధానికి సహకరించలేకపోయినా, ఇక్కడి నిర్మాణాలకు సహకారం అందిస్తుందని తెలిపింది. ఇప్పుడు నారాయణ కూడా సాంకేతిక సహకారం మాత్రమే ఉంటుందని తేల్చేశారు. ఇప్పుడు మరోసారి రాజధాని నిర్మాణానికి గతంలో చేసుకున్న ఒప్పందాలు పునరుద్ధరించుకోవాలని ఏపీ ప్రభుత్వం సింగపూర్ ను కోరినా ముందుకు రావడం లేదు.
Tags:    

Similar News