SHOOTING | స్కూలు ప్రిన్సిపల్ ను కాల్చేసిన విద్యార్థి
ఆంధ్రప్రదేశ్ రాయచోటిలో ఓ టీటర్ ను విద్యార్థులు చంపివేశారనే ఘటనను మరువక మునుపే మధ్యప్రదేశ్ మరో ఘటన జరిగింది. స్కూలు ప్రిన్సిపల్ ను ఓ విద్యార్థి కాల్చి చంపాడు.
By : The Federal
Update: 2024-12-06 12:38 GMT
ఆంధ్రప్రదేశ్ రాయచోటిలో ఓ టీటర్ ను విద్యార్థులు చంపివేశారనే ఘటనను మరువక మునుపే మధ్యప్రదేశ్ మరో ఘటన జరిగింది. ఓ స్కూలు ప్రిన్సిపల్ ను ఓ విద్యార్థి మాటువేసి మరీ కాల్చి చంపాడు. క్రమశిక్షణ, విద్యాబుద్ధులు నేర్పించాలని చూడడమే ఇందుకు కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఛత్తర్పుర్ జిల్లాలోని ధమోరా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ ఘటన జరిగింది.
55 ఏళ్ల ప్రిన్సిపల్ ఎస్‌కే సక్సేనా విధి నిర్వహణలో ఉండగా ఈ ఘటన జరిగింది. డిసెంబర్ 6వ తేదీ శుక్రవారం పాఠశాలకు వచ్చిన ప్రిన్సిపల్ మధ్యాహ్న సమయంలో బాత్రూమ్‌కు వెళ్లారు. అక్కడే కాపు కాసిన 12వ తరగతి విద్యార్థి ఆయన బయటకు రాగానే ఒక్కసారిగా కాల్పులకు పాల్పడ్డాడు. తలలోకి బుల్లెట్ దూసుకెళ్లడంతో సక్సేనా అక్కడికక్కడే మరణించారు. అనంతరం మరో విద్యార్థితో కలిసి ప్రిన్సిపల్ స్కూటర్‌పైనే అతడు అక్కడి నుంచి పరారైనట్లు విద్యార్థులు పేర్కొన్నారు.
జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్పీ ప్రజాపతి ఈ ఘటనపై మాట్లాడుతూ.. సక్సేనా ఐదేళ్లుగా ఈ పాఠశాలలో ప్రిన్సిపల్‌గా విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఆయన వారిని మందలించినందుకే ఈ ఘోరానికి పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. దారుణానికి పాల్పడిన విద్యార్థులకు కఠిన శిక్ష విధించాలని పోలీసులను కోరారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. పరారీలో ఉన్న విద్యార్థుల కోసం గాలింపు చేపట్టారు.
ఛత్తర్పుర్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ అగమ్ జైన్ చెప్పిన వివరాల ప్రకారం సక్సెనాను తలపై కాల్చారు. కాల్పులు జరిపిన విద్యార్థి, అతనికి సహకరించిన యువకుడు కూడా ఇద్దరూ అదే విద్యాసంస్థలో చదువుతున్నారు. సక్సేనా ధమోరా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గత ఐదేళ్లుగా ప్రిన్సిపల్ గా ఉంటున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.