పాక్ ఆటగాళ్లపై ఫిర్యాదు చేసిన భారత్
మైదానంలో పాక్ ఆటగాళ్లు చేసిన అతి ప్రవర్తన పై ఐసీసీకి ఈ మెయిల్
By : Praveen Chepyala
Update: 2025-09-25 06:13 GMT
దుబాయ్ వేదికగా ఆసియాకప్ లో భారత్- పాకిస్తాన్ జట్లు ఆదివారం తలపడిన సంగతి తెలిసిందే. అయితే గ్రౌండ్ లో పాక్ ఆటగాళ్లు ఓవర్ యాక్షన్ చేయగా, భారత ఆటగాళ్లు తమ చేతలతో పాటు, మాటలతో వారికి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు ఇరు దేశాలు ఐసీసీకి ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. గ్రౌండ్ లో చెత్త సంజ్ఞలు చేశారని అందులో ఆరోపించుకున్నారు.
మొదట భారత జట్టు పాక్ ఆటగాళ్లు అయిన హరీస్ రవూఫ్, షహోజాదా ఫర్హాన్ మైదానంలో రెచ్చగొట్టే సంజ్ఙలు చేసినట్లు తన ఫిర్యాదులో పేర్కొంది. ఆదివారం నాడు జరిగిన సూపర్ ఫోర్ మ్యాచ్ లో దాయాదీ ఆటగాళ్లు ఆటతో కాకుండా వివాదాస్పదమైన వ్యక్తిత్వంలో వార్తల్లో నిలిచారు. బీసీసీఐ ఆదివారం ఐసీసీకి సదరు ఆటగాళ్లపై ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేసింది.
హరిస్ రవూఫ్, షహజాదా ఫర్హాన్ ఇంటర్నేషనల్ గవర్నరింగ్ బాడీ ముందు రాతపూర్వకంగా ఈ ఆరోపణలను తిరస్కరిస్తే వెస్టీండీస్ మాజీ ఆటగాడు, ఐసీసీ ఎలైట్ ప్యానెల్ రిఫరీ రిచర్డ్ సన్ ముందు ప్రత్యక్షంగా హజరుకావాల్సి ఉంటుంది.
పాక్ కూడా భారత్ పై అధికారికంగా ఐసీసీ ఫిర్యాదు చేసింది. భారత్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తమ విజయాన్ని పహల్గామ్ బాధితులకు అంకితం చేయడం పై అభ్యంతరం వ్యక్తం చేసింది.
అలాగే ఆపరేషన్ సిందూర్ లో పోరాటం చేసిన సైన్యానికి కూడా ఈ విజయాన్ని అంకితం చేశారు. సూర్యకుమార్ యాదవ్ ఆటలో రాజకీయ వ్యాఖ్యలు చేశారని పాక్ తన ఫిర్యాదులో ఆరోపించింది.
అయితే ఈ ఫిర్యాదును సాంకేతికంగా చూడాల్సి ఉంది. ఐసీసీకి ఫిర్యాదు చేయాలనుకుంటే సూర్య మాట్లాడిన ఏడు రోజుల లోపే చేయాలి. ఆ తరువాత ఫిర్యాదు చేస్తే ఐసీసీ పట్టించుకోదు.
హరిస్, షహిబ్ జాదా సంజ్ఙలు..
హరిస్ రవూఫ్ బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ప్రేక్షకులు ‘‘కోహ్లీ కోహ్లీ’’ అంటూ నినాదాలు చేశారు. 2022 టీ20 వరల్డ్ కప్ సమయంలో హరిస్ రవూఫ్ బౌలింగ్ లో కోహ్లి ఇన్ క్రెడిబుల్ క్రికెట్ షాట్లతో రవూఫ్ బౌలింగ్ లో రెండు భారీ సిక్స్ లు బాదాడు.
దీనికి ప్రతిస్పందనగా తన వేళ్లతో ఆరు అని చూపించాడు. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్ ఆరు భారత పైటర్ జెట్ లను కూల్చిందని ప్రచారం చేసుకుంది. ఇదే విషయాన్ని రవూఫ్ చేతి వేళ్లతో చూపించాడు. అలాగే తన బౌలింగ్ లో భారత ఒపెనర్లు శుభ్ మన్ గిల్, అభిషేక్ శర్మ అలవోక బౌండరీలు బాదుతుండటంతో వారిపై కూడా నోరు పారేసుకున్నాడు.
ఈ మ్యాచ్ లో పాక్ ముందుగా బ్యాటింగ్ చేసింది. ఈ సందర్భంగా ఒపెనర్ షహిబ్ జాదా హఫ్ సెంచరీ పూర్తి చేసిన తరువాత బ్యాట్ ను ఏకే-47 తో షూట్ చేసినట్లు సంబరాలు జరుపుకున్నాడు. దీనిపై విమర్శలు చెలరేగాయి.
‘‘ఆ సంబరాలు అప్పటికప్పుడు జరుపుకోవాలని అనుకున్నాను. 50 దాటాకా నేను ఎప్పుడు అలా సంబరాలు జరుపుకోలేదు. కానీ అప్పుడు అలా చేయాలని అనిపించింది.. చేశాను. ప్రజలు నా గురించి ఏమన్నా నేను పట్టించుకోను.’’ అని విలేకరుల సమావేశంలో ఫర్హాన్ అన్నారు.
ప్రస్తుతం భారత్ ఫిర్యాదు చేసిన సందర్భంగా వీరు ఇద్దరు ఐసీసీ ప్యానెల్ ముందు విచారణకు హజరుకావాల్సి ఉంటుంది. వీరి వివరణకు ఐసీసీ సంతృప్తి చెందితే ఫర్వాలేదు కానీ.. లేకపోతే క్రమశిక్షణా చర్యలకు గురికావాల్సి ఉంటుంది.
నఖ్వీ ఎక్స్ వీడియో...
ఈ వివాదానికి ఆజ్యం పోస్టూ ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ మెహిసిన్ నఖ్వీ బుధవారం ఎక్స్ లో ఓ వీడియో పోస్ట్ చేశాడు. ఫుట్ బాల్ ఆటగాడు క్రిస్టియానో రోనాల్డో స్లో మోషన్ వీడియోను పోస్ట్ చేస్తూ.. పోర్చుగల్ ఆటగాడు ఒక విమానం అకస్మాత్తుగా కూలిపోయిందని సంజ్ఞ చేస్తున్నట్లు అందులో కనిపించింది. ఫ్రీ కిక్ ఎలా గోల్ పోస్ట్ లోకి ప్రవేశిస్తుందో అందులో ఫుట్ బాట్ ఆటగాడు వివరించాడు. అంటే తమ ఆటగాడు రవూఫ్ చేసిన సంజ్ఞ కరక్ట్ అని వెనకేసుకు వచ్చే ప్రయత్నం చేశాడు.
నఖ్వీ పీసీబీ చైర్మన్ గా కూడా ఉన్నాడు. తన అంతర్గత మంత్రిగా మంత్రివర్గంలో ఉన్నాడు. అనేకసార్లు భారత్ కు వ్యతిరేకంగా రెచ్చగొట్టే ప్రకటనలు చేశాడు. భారత్ ఆసియాక ఫైనల్ కు చేరుకున్న నేపథ్యంలో ఏసీసీ ఛైర్మన్ గా ఉన్న నఖ్వీ వేదికను ఎలా పంచుకుంటాడో చూడాలి.
ఈ విషయం బీసీసీఐ, ఐసీసీ అధికారుల దృష్టికి వెళ్లిన నేపథ్యంలో నఖ్వీపై ఏదైనా చర్య తీసుకుంటారా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది.
ఈరోజు జరిగే పాకిస్తాన్- బంగ్లాదేశ్ లో మ్యాచ్ లో పాక్ గనుక గెలిస్తే భారత్ తో పాక్ మరోసారి ఫైనల్ లో తలపడే అవకాశం ఉంది. తొలి మ్యాచ్ లో శ్రీలంకను ఓడించిన బంగ్లాదేశ్, బుధవారం జరిగే రెండో మ్యాచ్ లో భారత్ చేతిలో 41 పరుగుల తేడాతో ఓడిపోయింది.