ప్రతీకార సుంకాలు మన నుంచి ఎందుకు లేవు?
అమెరికాపై ఈయూ, కెనడా, మెక్సికో, చైనా ల వాణిజ్య పోరు;
By : Praveen Chepyala
Update: 2025-03-13 06:31 GMT
ప్రసన్న మెహంతి
ట్రంప్ చేస్తున్నసుంకాల బెదిరింపు ముందు భారత్ మోకరిల్లినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ బెదిరింపుల తరువాత న్యూఢిల్లీ, వాషింగ్టన్ నుంచి చమురు, గ్యాస్, ఆయుధాలు కొనుగోలు చేయడానికి సమాయత్తమవుతోంది.
ఇప్పటికే సుంకాల బెదిరింపులు ఎదుర్కొంటున్న కెనడా, మెక్సికో, చైనా, యూరోపియన్ యూనియన్ లు అమెరికాపై ప్రతీకార సుంకాలు విధించాయి. కానీ ఇందులో భారత్ లేకపోవడం నిజంగా ఆశ్చర్యకరం.
అమెరికా ప్రస్తుతం యూరప్, యూకే, జపాన్, తైవాన్ వంటి దేశాలతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతోంది. అయితే ఇవి ఆశించినంత మేర విజయం సాధించలేదు.
కేంద్ర మంత్రి ఏమన్నారంటే..
కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లి వచ్చారు. వాటికి సంబంధించిన విషయాలను ఆయన పార్లమెంటరీ ప్యానెల్ ముందు పెట్టారు. యూఎస్ ఎవరికి మినహయింపులు ఇవ్వడానికి సిద్దంగా లేదని వివరించే ప్రయత్నం చేశారు.
ఇక్కడ రెండు ముఖ్య విషయాలు ఉన్నాయి. ఇంతకుముందు భారత్, డబ్ల్యూటీఓలో టారిఫ్ కేసులను ఈయూ, జపాన్, తైవాన్ పై పెట్టింది. అయితే ఇండియా ఈ కేసులో ఓడిపోయింది.
రెండో విషయం ఏంటంటే.. 2023 లో భారత్ ఇన్పర్మేషన్ వస్తువులైన ల్యాప్ టాప్ లు, పీసీలపై డబ్ల్యూటీఓ నిబంధనలను ఉల్లంఘిస్తూ పన్నులు విధిస్తుందని అమెరికా పాయింట్ అవుట్(ఎత్తిచూపడం) తో న్యూఢిల్లీ రాత్రికే రాత్రే పన్నులను ఉపసంహరించుకుంది.
డబ్ల్యూటీఓ స్పెషల్ అండ్ ఢిపరెన్షియల్ ట్రీట్ మెంట్ సుంకాలను మాత్రమే అనుమతిస్తోంది. కాబట్టి భారత్ సుంకాల పాలసీని తిరిగి సవరించుకోవడం తప్పుకాదు. సాక్ష్యం, ఆర్థికతర్కం పాలసీలు అన్ని మనకు అనుగుణంగా ఉన్నాయా? ఇవి ముందు ముందు చూడాలి.
సుంకాల అడ్డంకులు..
భారత్ ను ట్రంప్ ఇంతకుముందే సుంకాల రారాజుగా అభివర్ణించారు. న్యూఢిల్లీ చాలాకాలంగా రక్షణవాదం వైపు మొగ్గుచూపుతోంది. అప్పటి ప్రధాన ఆర్థిక సలహదారుల అర్వింద్ సుబ్రమణియన్ తన పదవీ విరమణ తరువాత ఓ విషయం చెప్పారు.
భారత్ 1991 నాటి స్వేచ్చా వాణిజ్య విధానాన్ని తిప్పికొట్టిందని, సుంకాల అడ్డంకులను ఏర్పాటు చేయడం ద్వారా స్వదేశీ పరిశ్రమలను రక్షించుకోవడానికి నడుంబిగించిందని సుబ్రమణియన్ ‘ఇండియాస్ ఇన్ వర్డ్ (రీ)టర్న్’ అనే పత్రంలో పేర్కొన్నారు.
గత మూడు దశాబ్దాలుగా భారత వృద్దిని పెంచడానికి స్వేచ్చా వాణిజ్యం అద్బుతమైన ఎగుమతి పనితీరును అందిస్తున్నప్పటికీ ఈ విధానం తీసుకొచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకోవడంతో రక్షణ వాదం తెరపైకి వచ్చింది.
ఇందులో భాగంగానే ఆత్మ నిర్భర భారత్ పథకం రూపుదిద్దుకుంది. న్యూఢిల్లీ ఇంతకుముందు కూడా ఈ రక్షణ వాదాన్ని 1960-70 లలో తీసుకొచ్చింది కానీ అనుకున్నంత మేర విజయం సాధించలేకపోయింది.
ప్రస్తుతం భారత్ వియత్నాం, దక్షిణ కొరియా, చైనాపై యాంటీ డంపింగ్ సుంకాలను విధిస్తోంది.
నాన్ టారిఫ్ అడ్డంకులు..
చైనా వైరస్ కల్లోలం తరువాత ఇలాంటి అడ్డంకులు వచ్చాయి. వాటిలో గోధుమ, బియ్యం, చక్కెర, ఉల్లిపాయ, పప్పు ధాన్యాలు, ఉక్కు, ల్యాప్ టాప్ లపై తరుచూ నిషేధాలు, పరిమితులు వచ్చాయి.
వీటిలోనే క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్లు కూడా వచ్చాయి. అయితే నాన్ టారిఫ్ అడ్డంకుల వల్ల వస్త్ర ఎగుమతులు ప్రభావితం అయ్యాయని, వీటిని వెంటనే రద్దు చేయాలని అర్వింద్ సుబ్రమణియన్ తో పాటు నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ కూడా కోరారు.
పున: చర్చలు ఆలస్యం..
భారత్ చాలా సంవత్సరాలుగా అన్ని ద్వైపాకిక్ష స్వేచ్ఛా వాణిజ్య ప్రాంతాల (ఎఫ్ టీ ఏ) లపై చర్చలు జరుపుతోంది. 2021- 24 మధ్య మారిషస్, యూఏఈ, ఆస్ట్రేలియా లతో చర్చలు ముగించింది.
2017 లో భారత్ ఏకపక్షంగా 68 దైపాక్షిక పెట్టుబడుల ఒప్పందాలను రద్దు చేసింది. వీటిపై ఇంకా భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తన ఉత్పత్తి, మార్కెట్ లను విస్తరించే ప్రయత్నాలు చేయడం లేదని ప్రకటించిన తరువాతే ఎఫ్టీఏలపై తిరిగి చర్చలు ప్రారంభం అయ్యాయి.
మెగా వాణిజ్య కూటములు..
ప్రపంచంలో ఎక్కువ వాణిజ్యం జరుగుతున్న అనేక కూటముల నుంచి భారత్ దూరంగా ఉంటోంది. ఉదాహరణకు ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం(ఆర్సీఈపీ), ఇండో - ఫసిఫిక్ ఆర్థిక నడవా(ఐఫీఈఎఫ్), ట్రాన్స్ ఫసిఫిక్ భాగస్వామ్యం(సీపీ టీపీపీ) వంటి కూటముల్లో చేరలేదు.
దీనిపై ప్రపంచ బ్యాంకు కూడా స్పందించింది. బహుపాక్షిక సహకారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వాణిజ్య ఏకీకరణ కోసం న్యూఢిల్లీ ప్రయత్నించాలని కోరింది. ఇందుకోసం తన వాణిజ్య వ్యూహాన్ని పున: పరిశీలించుకోవాలని సూచించింది.
అమెరికా ఆంక్షలతో..
రష్యాతో వ్యాపారం చేయడానికి అమెరికా ఆంక్షలను భారత్ విస్మరించింది. ఫలితంగా 2024 లో 19 సంస్థలపై అమెరికా నిషేధం విధించింది.
2014 నుంచి భారత ఎగుమతులు గణనీయంగా పడిపోయాయి. వస్తువుల ఎగుమతుల 2014 నాటి జీడీపీలో 17 శాతం ఉండగా, 2023 ఆర్థిక సంవత్సరానికి 13 శాతానికి పడిపోయింది. అలాగే మొత్తం ఎగుమతులు 25 శాతం నుంచి 24 శాతానికి క్షీణించాయి.
2024 ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం.. చైనా బహుళజాతి సంస్థల చేతిలో భారత్ ఓడిపోయింది. బంగ్లాదేశ్, వియత్నాం, జర్మనీ, నెదర్లాండ్స్ ప్రాథమిక లబ్దిదారులుగా పేర్కొంది.
తక్కువ నైపుణ్యం గల కార్మికులు ఉత్పత్తి చేసే దుస్తులు, తోలు, వస్త్రాలు, పాదరక్షల ఎగుమతుల్లో భారత్ వాటా 2022 నాటికి 3.5 శాతానికి తగ్గింది. ఇది 2013 లో 4.5 శాతంగా ఉండేది. 2002 లో చైనా ఈ ఎగుమతుల నుంచి వైదొలిగిన తరువాత భారత్ 0.9 శాతం ఉండేది కాస్త.. నాలుగు శాతానికి చేరింది.
ఇజ్రాయెల్ - హమాస్, రష్యా- ఉక్రెయిన్ యుద్దాల వల్ల సంభవించిన వాణిజ్య నష్టాల నుంచి తప్పించుకోవడానికి కీలకమైన అనేక దేశాలు కూటములను ఏర్పరచుకోవడానికి సిద్దపడగా, భారత్ మాత్రం దూరంగా ఉండిపోయింది.
భవిష్యత్ లో ఇబ్బంది..
అమెరికా ఒత్తిడికి తలొగ్గడంతో భారత్ వాణిజ్య మిగులును భారీ కోల్పోనుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 35.3 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇది మొత్తం వాణిజ్యంలో - 21.6 నుంచి -24.8 శాతానికి చేరుతుంది. ఇది వృద్దిరేట్ ను తగ్గించే అవకాశం ఉంది.
‘‘అమెరికా ప్రత్యేక సుంకాలను విధించాలని అనుకుంటే.. వ్యవసాయ ఉత్పత్తులపై అదనపు సుంకం 32.4 శాతం, పారిశ్రామిక ఉత్పత్తులపై 3.3 శాతం ఉంటుంది.
ప్రస్తుతం అమెరికాకు వెళ్లే భారత వ్యవసాయ ఉత్పత్తులు 5.3 శాతంగా ఉన్నాయి. కానీ అమెరికా నుంచి ఇండియా వచ్చే వ్యవసాయ ఉత్పత్తులపై మాత్రం 37.7 శాతంగా ఉంది.
దీనితో రెండు దేశాల మధ్య 32.4 శాతం అంతరం ఉంది. పారిశ్రామిక ఉత్పత్తుల విషయానికి వస్తే భారత్ కు అమెరికా ఎగుమతులు 5.9 శాతం సగటు సుంకాన్ని ఎదుర్కొంటున్నాయి. అయితే అమెరికా వెళ్లే భారత పారిశ్రామిక ఎగుమతులకు 2.6 శాతం మాత్రమే ఎదుర్కొంటున్నాయి. వీటి మధ్య 3.3 శాతం అంతరం ఉంది.
వెసులుబాటు ప్రక్రియ..
ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా వెలువడిన సంయుక్త ప్రకటన ప్రకారం.. వాణిజ్య అంతరాన్ని పూడ్చుకోవడానికి చమురు, గ్యాస్, ఆయుధాలను కొనుగోలు చేయడానికి న్యూఢిల్లీకి ఆఫర్ ఇచ్చింది.
అయితే వీటిలో కొన్ని వెసులుబాట్లను పొందడానికి ప్రయత్నించవచ్చు. కానీ అమెరికా నుంచి వచ్చేవి ఏవైనా కూడా చాలా ఖరీదైనవే. చమురు, గ్యాస్ రష్యా నుంచి చాలా చవక ధరకు భారత్ కొనుగోలు చేస్తోంది.
ఇక ఎఫ్ 35 అనేది అత్యంత చెత్త సైనిక విలువకు సమానం అని గతంలో ట్రంప్, ఇలాన్ మస్క్ విమర్శలు గుప్పించారు. భారత యుద్ద విమానాలు అన్నీ కూడా రష్యా, ఫ్రాన్స్ నుంచి వచ్చినవే. ఇప్పుడు అమెరికా నుంచి కొత్తవి కొనుగోలు చేస్తే వాటి నిర్వహణ ఖర్చులు తడిసిమోపడవుతాయి.
సుంకాల విధింపును ఇతర దేశాలపై రుద్దకూడదని భారత్ కోరుతున్నప్పటికీ దీనికి అనేక సమస్యలు ఎదురవుతున్నాయి.