లీగల్ 'క్విడ్ ప్రో కో' కేసు: ముగ్గురు ఐపీఎస్ ల సస్పెన్షన్ నేర్పే గుణపాఠాలు

ఎస్ రాము: ఒక అపూర్వ వ్యాపార మిత్రుడిని ఆదుకునేందుకు ఒక ముంబయి నటి మీద కేసు పెట్టి జగన్ మోహన్ రెడ్డి గారి అప్పటి ప్రభుత్వం లీగల్ క్విడ్ ప్రో కో వ్యూహం పన్ని అడ్డంగా ఇరుక్కుంది.

Update: 2024-09-16 10:12 GMT

వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో 'క్విడ్ ప్రో కో' అనే లాటిన్ మాట బహుళ ప్రాచుర్యంలోకి వచ్చింది. 'సమ్ థింగ్ ఫర్ సమ్ థింగ్' లేదా 'దిస్ ఫర్ దట్' అనే దాని ఇంగ్లిష్ వివరణకు తెలుగులో చెప్పుకోవాలంటే 'నాకిది... నీకది.' లేకపోతే, నాకు ఇది ఇస్తే, నీకు అది ఇస్తా అన్నమాట. అధికారంలో ఉన్న నేను నీకు ప్రభుత్వ భూమి ఇస్తే, నువ్వు మా కుటుంబ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టు.... అన్నట్టు. ఒక అపూర్వ వ్యాపార మిత్రుడిని ఆదుకునేందుకు ఒక ముంబయి నటి మీద కేసు పెట్టి జగన్ మోహన్ రెడ్డి.. అప్పటి ప్రభుత్వం లీగల్ క్విడ్ ప్రో కో వ్యూహం పన్ని అడ్డంగా ఇరుక్కుందని స్పష్టమవుతోంది.

వైద్యవృత్తి అభ్యసించి సినిమాల్లో నటించిన డాక్టర్ కాదంబరి జెత్వానీ ఒక ధనికస్వామి మీద ముంబాయిలో పెట్టిన ఒక సీరియస్ కేసు లేకుండా చేయడానికి ఆమెను ఆంధ్రప్రదేశ్ లో ఒక కేసులో ఇరికించి జైల్లో పెట్టించి చెల్లుకు చెల్లు చేయడం లీగల్ క్విడ్ ప్రో కో కాక పేరేమిటి? ఈ వెర్రి ఆలోచన వచ్చిన వాడి బుర్ర బురదగుంట అయితే కావచ్చు గానీ, బాగా చదివి ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐ పీ ఎస్) లో చేరి ఉన్నత స్థాయికి ఎదిగిన ముగ్గురు అధికారులు ఆ బురదగుంట లో మునిగితేలి తరించాలనుకోవడం విచిత్రం. అన్ని రోజులూ ఒకే లాగా ఉంటాయని భ్రమించి ఈ పన్నాగం పన్నిన వాడు తెలివితక్కువ అయితే అందులో భాగసాములు ఆయన ఈ ముగ్గురు ఐపీఎస్‌లను ఏమనాలి? అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ముగ్గురు అధికారాలపై నిన్న వేటువేసింది. సివిల్ సర్వీసెస్ అధికారులను వివిధ కేసుల్లో సస్పెండ్ చేయడం, విచారణ తర్వాత కొందరిని తీసుకోవడం ఉత్తర ప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాల్లో తరచూ చూస్తాం గానీ ఏకంగా ముగ్గురు పోలీస్ ఉన్నతాధికారులపై (ఒక డీజీపీ స్థాయి అధికారి సహా) సస్పెన్షన్ వేటు వేయడం మన దగ్గర ఇదే ప్రథమం. వారి పట్ల మాజీ ఐ పీ ఎస్ ల నుంచి, సభ్యసమాజం నుంచి ఎలాంటి సానుభూతి రాకపోగా, కఠినంగా వారిని శిక్షించాలన్న అభిప్రాయమే వ్యక్తకావడం మరొక ముఖ్యాంశం.

కుక్కల విద్యాసాగర్ అనే అధికార పార్టీ మనిషి పెట్టిన దొంగ కేసులో తానూ, వయోవృద్ధులైన తన తల్లిదండ్రులు నరకయాతన పడ్డామని మాస్క్ ధరించి టీవీ 5 షో లో ఆ నటి వివరించిన కథనం విని రెండు తెలుగు రాష్ట్రాలు విస్తుపోయాయి. తనకు శాపమై చుట్టుకున్న తన అందానికి తెరవేయడం బాగని అనిపించి మాస్క్ ధరించారో ఏమో గానీ ఆమె పూసగుచ్చినట్లు చెప్పిన వివరాలు అధికార మదాంధుల వికృత స్వరూపాన్ని ఆవిష్కరించాయి. మీడియాలో ఆమె కథనాలు, ఫిర్యాదులో పేర్కొన్న విషయాలు, ఎఫ్ ఐ ఆర్ కాపీ, తదనంతరం విడివిడిగా వెలువడిన మూడు సస్పెన్షన్ జీవోలు చూస్తే ముగ్గురు ఐ పీ ఎస్ లూ పీకల్లోతు ఇరుక్కున్నట్లు స్పష్టమవుతుంది. సత్యం అనేది స్ఫటికమంత స్వచ్ఛంగా ఉండదు. మెలికలు, మలుపులు, చిక్కుముళ్లు ఉన్నప్పటికీ, ఇప్పుడు ముగ్గురు ఐ పీ ఎస్ లు, ఇద్దరు ఇతర పోలీసు అధికారులు మూల్యం చెల్లించకున్నారు. ఐపీఎస్ లు సెంట్రల్ అడ్మినిస్ట్రేవిట్ ట్రిబ్యునల్ (క్యాట్) కు వెళ్లడం, వాదనలు జరగడం, తీర్పు వెలువడడం జరుగుతుంది కానీ ఈ లోపు వ్యక్తిగత, కుటుంబ ప్రతిష్ఠ మంట గలవడంతో పాటు సివిల్ సర్వీసెస్ మీద ఇప్పటికే జనంలో ఉన్న జుగుప్స భావన ఇంకా పెరుగుతుంది. జగన్ భక్త ఐ పీ ఎస్ లు, వై పీ ఎస్ లు అని వారిని ఇప్పటికే పిలుస్తున్నారు.

1992 బ్యాచ్ ఐపీఎస్ అయిన నిఘా అధిపతి ఇద్దరు ఐ పీ ఎస్ లను ( ఒకరు 2004 బ్యాచ్ , మరొకరు 2010 బ్యాచ్) ముఖ్యమంత్రి కార్యాలయానికి పిలిపించుకుని ఆ అమ్మాయిని పట్టుకురమ్మని హుకుం జారీ చేసారని అయన సస్పెన్షన్ ఆర్డర్ (జీ ఓ ఆర్టీ నంబర్ 1592) లో స్పష్టంగా ఉంది. దీన్ని బట్టి చూస్తే సినిమా ఇంకా పెద్దగానే ఉన్నట్లు కనిపిస్తోంది. ఆ రోజున (జనవరి 31, 2024) సీఎంఓ లో ఈ మీటింగ్ జరిగినప్పుడు ఇంకా ఎవరు ఉన్నారు? కుక్కల విద్యాసాగర్ లాంఛనంగా ఫిర్యాదు ఇవ్వడానికి ముందే యమ అర్జంటుగా ముంబాయి టిక్కెట్లు ఎందుకు, ఎలా బుక్కయ్యాయి? ఈ 'ప్లాన్' వెనక అసలు సూత్రధారులెవరు? ఆ సమయంలో సీఎంఓ లో సజ్జలు ఆరబోసి ఉన్నాయా? లేవా? వంటి సూక్ష్మాతి సూక్ష్మమైన అంశాలు కూడా తదుపరి దర్యాప్తులో బయటపడతాయి. నరేంద్ర మోదీ మూడో సారి ప్రధాన మంత్రి కావడానికి కావలసిన దన్ను ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే కేంద్ర పెద్దలతో ఈ కేసు గురించి చర్చించి స్పష్టమైన ఆలోచనతో ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది.

ఈ సివిల్ సర్వీసెస్ లలో ఉన్న ఒక పెద్ద చిక్కు-బాస్ ఈజ్ రైట్... అన్న కాన్సెప్ట్. దాంతో పాటు చట్టానికి పొడవైన చేతులు ఉంటాయనీ, ఇవ్వాళ కాకపోతే రేపు దొరికిపోతామని కూడా ముస్సోరి శిక్షణలో బోధిస్తారు. కెరీర్ వైకుంఠ పాళిలో గబగబా పైకి ఎగబాకడానికి, ప్రాణం సుఖంగా ఉండటానికి, పదో పరకో వెనకేసుకోవడానికి ప్రాధాన్యమిస్తూ... బాస్ ఈజ్ రైట్ అన్నారు కాబట్టి బ్యాడ్, గుడ్ తో సంబంధం లేకుండా ఐ ఏ ఎస్ లు, ఐ పీ ఎస్ లు వ్యవహరిస్తారు. బాసులిచ్చే ప్రమాదకరమైన ఆర్డర్స్ మౌఖికంగా ఉంటే అమలు చేయకూడదని, అయ్యా... అదే ముక్క ఒక మెయిల్ లో రాసి పడేస్తే రికార్డులో పడి ఉంటుందని చెప్పాలన్న స్పృహ వీళ్ళు కోల్పోయి ఇరుక్కుంటారు. చట్టం అరటిపండు ఒలిచిపెట్టినట్లు నిర్దేశించిన పద్ధతులు పాటించకుండా అడ్డదారులు తొక్కి బద్నాం అయితే... ఇప్పుడు అయ్యో పాపం అన్నవాడే లేకుండా పోయాడు. ఈ ఐ పీ ఎస్ ల పొలిటికల్ కాలిక్యులేషన్ దెబ్బతినబట్టి రొంపిలో దిగబడ్డారు. వై నాట్ 175? అని జగన్ మోహన్ రెడ్డి గారు ధీమాగా చెబితే, అది నిజం కావడం ఖాయమని, దాంతో తమ పంట పండడం తధ్యమని భ్రమించి ఈ ఖాకీ త్రయం బోర్లాపడినట్లుంది.

హింసను, అవమానాలను, అఘాయిత్యాలను దిగమింగి అనుకూలమైన రాజకీయ పరిస్థితి రాగానే డా. కాదంబరి ధైర్యంగా బైటికి రావడం ఆహ్వానించదగిన పరిణామమే అయినా ఆమె హానీ ట్రాప్ స్పెషలిస్టు, జగత్ కిలాడీ అని జగన్ అనుకూల ప్రసార, ప్రచార మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ప్రచారం కావడం చూశాం. ఆ ఆరోపణల్లో నిజానిజాల గురించి చెప్పడం చిలక జోస్యం చెప్పడంతో సమానమే. ఎవరైనా మహిళను కిమ్మనకుండా చేయాలంటే ఆమె తిరుగుబోతని, శీలవతి కాదని ప్రచారం చేయడం, వెర్రి జనాలను నమ్మించడం తేలికైన విషయం. అందరితో చనువుగా ఉండే అందగత్తె మహిళ అయితే ఆమె పరువు పంచనామా చేసి సోషల్ మీడియా లో ప్రచారం చేయడం చాలా చాలా తేలిక.

మహిళ అయినా, పురుషుడు అయినా నైతిక విలువలు పాటించడం, పాటించకపోవడం వ్యక్తిగతం. ఒక వర్గం మీడియాలో వరస కథనాలలో చెప్పినట్లు ఆమె నిజంగానే డబ్బున్న వారికి వలపు వల విసిరి డబ్బుచేసుకుంటే అది ఆమె ఒక్కరి తప్పే కాదు. సొంగ కార్చుకుంటూ నంగ నాచి పనులు చేయబోయిన వారి తప్పూ అందులో ఉన్నట్టే కదా! అలాంటి వారు నిజంగానే తాము మోసపోయినట్లు భావిస్తే ఆమెపై కేసులు నమోదు చేసుకోవచ్చు కదా! ఇది మరిచిపోయి రాజకీయ ఉద్దేశంతో మీడియా లో వ్యక్తిత్వహననం చేయబోవడం మంచిది కాదు.

ఆంధ్రప్రదేశ్ ప్రజలు కొత్త ప్రభుత్వానికి పట్టం కట్టకపోయినా, మీడియా చొరవచూపకపోయినా ఈ కేసు బైటపడేది కాదు. సర్వీస్ రూల్స్ మంటగలిపి విజయోత్సాహంతో అధికారం బూట్లు నాకిన ముగ్గురు ఖాకీలకు ప్రమోషన్లు వచ్చి ఉండేవి, నిస్సహాయ స్థితిలో భారత ప్రజాస్వామ్య వ్యవస్థపై నమ్మకం కోల్పోయి ఒక విద్యావంతురాలైన మహిళ బిక్కుబిక్కున బతకాల్సి వచ్చేది. గొలుసుకట్టు పరిణామాలతో దేశ వ్యాప్తంగా ను సంచలనం సృష్టించిన ఈ కేసు ఆద్యంతం కీలకమైనది. నిస్సందేహంగా ఇది ముస్సోరిలో సివిల్ సర్వీసెస్ ట్రైనింగ్ లోనే కాకుండా... భారత దేశ బిజినెస్, కార్పొరేట్ రంగం లో కూడా ఒక గుర్తుంచుకోదగిన కేస్ స్టడీ గా మిగిలిపోతుంది.


(The Federal seeks to present views and opinions from all sides of the spectrum. The information, ideas or opinions in the articles are of the author and do not necessarily reflect the views of The Federal)

Tags:    

Similar News