ప్రతీకారమా? ప్రక్షాళనా!

2019 ఎన్నికల తర్వాత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాగానే ప్రక్షాళన పెద్ద ఎత్తునే జరిగింది. తర్వాత దానిమీద ఎంతో అసంతృప్తి కూడా పెల్లుబికింది. ఇప్పుడు టిడిపి తరహా ప్రక్షాళన మొదలువుతుందా?

Update: 2024-06-09 09:19 GMT

ప్రభుత్వాలు మారగానే మొదటగా మొదలయ్యేది ' ప్రక్షాళన '. పాలనా వ్యవస్థలో ప్రమాణాలు మెరుగు పరచడానికి ప్రక్షాళన జరిగితే దానిని ఎవరూ కాదనలేరు. కానీ ప్రతీకార ధోరణితో జరిగితే అది అధికార యంత్రాంగంలో తీవ్ర అసంతృప్తికి దారి తీస్తుంది. దాని పరిణామాలు కూడా ఆందోళనకరంగానే ఉంటాయి. 2019 ఎన్నికల తర్వాత టిడిపి ప్రభుత్వానికి తెరపడి వైఎస్సార్సీ ప్రభుత్వం రాగానే అటువంటి ప్రక్షాళన పెద్ద ఎత్తునే జరిగింది. తర్వాత దాని మీద ఎంతో అసంతృప్తి కూడా పెల్లుబికింది.

పోలీసు విభాగం, రెవెన్యూ, మైనింగ్, రిజిస్ట్రేషన్, ఇరిగేషన్ వంటి విభాగాల్లో అధికారులు ప్రభుత్వాలు మారగానే వణికిపోతుంటారు. తమపై ఎప్పుడు ఎలాంటి వేటు పడుతుందో తెలియక సతమతమవుతూంటారు. ఆ ఆందోళనలో వారు ప్రత్యామ్నాయాలు చూసుకుంటూ ఉంటారు. తాజా ఎన్నికల తర్వాత జగన్ ప్రభుత్వం దిగిపోవడం, చంద్రబాబు ప్రభుత్వం వస్తుండడంతో ఇప్పుడు మళ్లీ అదే దృశ్యం కనిపిస్తోంది. ఇప్పటికే కొందరు నేతలు బదిలీ అయ్యారు. కొందరు సెలవుపై వెళ్లడానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు, మరి కొందరు పాత ప్రభుత్వ విధేయులు కొత్త ప్రభుత్వ విధేయులుగా మారే పనిలో నిమగ్నమయ్యారు.

కొన్ని జిల్లాల్లో పోలీసు, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు జగన్ ప్రభుత్వంలో ఏకపక్షంగా వ్యవహరించి టిడిపి నేతల పట్ల దురుసుగా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. కొందరు నాయకులను సైతం పోలీసు, రెవెన్యూ అధికారులు ముప్పుతిప్పలు పెట్టారనే అభియోగాలున్నాయి. చివరికి పోలీసు అధికారులు కొందరు థర్డ్ డిగ్రీని కూడా ప్రయోగించి జగన్ వ్యతిరేకులకు చుక్కలు చూపించినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ఆ అధికారులంతా దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారనే అభిప్రాయం వినిపిస్తోంది. ముఖ్యంగా కొందరు పోలీసు అధికారులపై కొత్త ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకొంటుందో అనే ఉత్కంఠ నెలకొని ఉంది.

రఘురామకృష్ణంరాజు, అచ్చెన్నాయుడు, పట్టాభి, పిన్నమనేని వంటి నాయకుల విషయంలో అప్పటి ప్రభుత్వం లోని పోలీసు, మున్సిపల్ అధికారులు వ్యవహరించిన తీరు చాలా వివాదాస్పదమైంది. ఉండి నుంచి ఎన్నికైన రఘురామ కృష్ణంరాజును ఒకసారి అరెస్టు చేసే సమయంలో పోలీసులు ఎంత మాత్రం దయాదాక్షిణ్యాలు లేకుండా థర్డ్ డిగ్రీని సైతం ప్రయోగించారనే ఆరోపణలు వినిపించాయి.

ఒక కేసులో అచ్చెన్నాయుడును అరెస్టు చేయడానికి వెళ్లిన పోలీసులు తెల్లవారుజామున ఆయనను ఇంటి నుంచి ఉన్నవాడిని ఉన్నట్లుగా లాక్కుని వెళ్లిన ఘటన అప్పట్లో ఎంతో సంచలనం కలిగించింది. పట్టాభిని పోలీసులు అరెస్టు చేయడానికి తీసుకుని వెళ్లి, రాత్రంతా పోలీసు స్టేషన్‌లోనే ఉంచి థర్డ్ డిగ్రీని ప్రయోగించినట్లు ఆరోపణలు వచ్చాయి. అటువంటి ఘటనలే పల్నాడులో కూడా కనిపించాయి .

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న జవహర్ రెడ్డి వైఖరి పైనే టిడిపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు అధికారులను మార్చవలసిందిగా ఎన్నికల కమిషన్ ఆదేశించినా, ఆయన తాత్సారం చేసి వ్యవహారాన్ని నీరుగార్చడానికి యత్నించారనే ఆరోపణలు వచ్చాయి. ఇంకా ఇలాంటి ఉదంతాలు కొన్ని డజన్ల సంఖ్యలో ఉన్నాయి. వైఎస్సార్సీ మంత్రులు, ఎమ్మెల్యేల సూచనల మేరకు టిడిపి నేతలు, కార్యకర్తలపై దాదాపు అన్ని జిల్లాల్లో దాడులు జరిగినట్లుగా ఆరోపణలు వచ్చాయి. వాటన్నిటికీ ఇప్పుడు మూల్యం చెల్లించుకోవాల్సిన సమయం వచ్చిందని భావిస్తున్నారు. దానికి అనుగుణమైన చర్యలు ఇప్పటికే మొదలయినట్లు కనిపిస్తోంది కూడా.

నంద్యాలలో ఒక కేసు విషయంలో చంద్రబాబును అరెస్టు చేసిన సందర్భంలో కూడా పోలీసులు, అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో కొందరు పోలీసు అధికారులు యధేచ్ఛగా వ్యవహరించిన తీరు ఎంతో వివాదాస్పదమైంది కూడా. గత ఐదేళ్లలో అటువంటి ఘటనల్లో అనుచితంగా వ్యవహరించిన పోలీసు, రెవెన్యూ, మున్సిపల్, ఇతర విభాగాల్లోని అధికారుల జాబితా ఒకటి టిడిపి నేతలు సిద్ధం చేసి చంద్రబాబుకు ఇచ్చారనీ, వాటిని పరిశీలించి ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటారనీ అంటున్నారు.

సచివాలయంలో కీలక స్థానాల్లో ఉన్న పూనం మాలకొండయ్య, రేవు ముత్యాలరాజు, నారాయణ భరత్ గుప్తా వంటి సీనియర్ ఐఏఎస్ అధికారులను రెండు రోజుల క్రితమే బాధ్యతల నుంచి తప్పించి జిఏడికి రిపోర్ట్ చేయవలసిందిగా ఆదేశించారు. సీనయర్లకు ఇటువంటి చర్య పెద్ద శిక్ష వంటిదే. మరి కొందరు రాజీనామాలు చేశారు. కొందరి రాజీనామాలను సెలవు విజ్ఞాపనలను తిరస్కరించి ' మీ భరతం పడతాం, ఇక్కడే ఉండండి ' అనే సంకేతాలిచ్చారు. నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారందరు ఇప్పటికే రాజీనామా చేసి ఇంటి బాట పట్టారు. ముందు ముందు ఇంకా అనేక పరిణామాలు సంభవించవచ్చు. అయితే ప్రతీకారం కోసం కాకుండా పాలన మెరుగుపరచడానికి ఈ ప్రక్షాళన చర్యలు సాగితే బాగుంటుందనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది.

Tags:    

Similar News