రామాయణంలో ఈజిప్టు, హిట్టైట్, ఆర్మీనియా చరిత్ర నీడలు

రామాయణంలో నిరుత్తరకాండ-18 : ప్రశ్న లేకుండా సమాధానం ఉండగలదేమో కానీ, సమాధానం లేకుండా ప్రశ్న ఉండలేదు. రామాయణంలో ఎదురయ్యే ప్రశ్నలకు జవాబు వెదికేందుకే ఈ పరిశోధన

Update: 2024-08-12 05:36 GMT

సోర్స్: వికీమీడియా కామన్స్


కుటుంబ, వివాహరూపాలపై మోర్గన్ ను ఉటంకిస్తూ ఇంతకుముందు చెప్పుకున్న నాలుగు మాటలూ; ఎంతో విస్తృతీ, లోతూ కలిగిన ఆయన అధ్యయనానికి వెయ్యోవంతు కూడా న్యాయం చేసేవి కావు. కాకపోతే, కౌసల్యాదశరథుల గురించిన ప్రస్తుతాంశానికి మరీ దూరంగా వెళ్లలేము కనుక అక్కడితో ఆపి ఇతర సాక్ష్యాలను చూద్దాం.

పురాతన ఈజిప్టు రాచకుటుంబంలో సోదరీ, సోదరులు పెళ్లాడే ఆచారం ఉండేదన్నది చరిత్రప్రసిద్ధమే. రాజునూ, అతని వారసులనూ దైవాంశసంభూతులుగా చిత్రించడం అక్కడ పరిపాటి కనుక, రాచరక్తం కలుషితం కారాదన్న భావనే ఆ వివాహాచారానికి మూలమని చెబుతారు. ఆస్తీ, అధికారం కుటుంబాన్ని దాటి వెళ్లకూడదన్న లౌకికచింతన కూడా దానివెనుక ఉండవచ్చు. అయితే, ఈజిప్టు రాచకుటుంబంలోనే కాక, ఆ ఆనవాయితీ ఈజిప్టు జనంలో కూడా అంతో ఇంతో ఉండేదనీ, ఈజిప్టును రోమన్లు వశపరచుకున్న తర్వాత జనంలోకి మరింతగా పాకిందనీ చరిత్ర చెబుతోంది.

ఈజిప్టు రాజును ‘ఫేరో’ అని పిలిచేవారు. ఆ దేశాన్ని పాలించిన 18వ రాజవంశంలో చివరి ఫేరో అయిన తుతంఖమన్(క్రీ.పూ. 1332-1323) తన సోదరి అయిన ఆంఖే సెనామెన్ ను పెళ్లాడాడు. అతని తల్లిదండ్రులు కూడా సోదరీ, సోదరులే. తుతంఖమెన్ తో ముడిపడిన ఒక ఆసక్తికరకథనం ఆనాటి లిఖితరూపంలో లభిస్తోంది. అప్పట్లో నేటి టర్కీ చుట్టుపక్కల ప్రాంతాన్ని హిట్టైట్లు పాలించేవారు. వీరికి సంబంధించిన లిఖితసాక్ష్యాలు టర్కీలోని బోగజ్ కోయ్ అనే చోట జరిపిన తవ్వకాల్లో బయటపడ్డాయి. హిట్టైట్ లిపిని విజయవంతంగా ఛేదించగలిగిన బెడ్రిక్ హ్రోజ్నీ అనే పురాతత్వ, భాషావేత్త- సంస్కృతం, జర్మన్ తదితర భాషల్లానే హిట్టైట్ కూడా ఇండో-యూరోపియన్ భాషేనని నిరూపించాడు. హిట్టైట్ రాజుల పేర్లలో అనేకం సంస్కృతానికి దగ్గరగా ఉంటాయి. హిట్టైట్లు తమను క్షత్రియులుగా చెప్పుకున్నారనీ, వారి భాషలోని హత్తి, ఖత్తి, హత్తూసా మొదలైన శబ్దాలు క్షత్రియశబ్దానికి రూపాంతరాలనీ- బెడ్రిక్ హ్రోజ్నీ( (Bedřich Hrozný) వెలుగులో రాంభట్ల కృష్ణమూర్తి అంటారు. హిట్టైట్ల రాజధాని పేరు హత్తూసా. సుప్పిలియుమా అనే రాజుకాలంలో హిట్టైట్ల పలుకుబడీ, ప్రాభవమూ ఈజిప్టు వరకూ విస్తరించాయి.

ఇంతకీ పైన పేర్కొన్న కథనం ఏమిటంటే, ఈజిప్టు ఫేరో తుతంఖమెన్ సంతానం లేకుండా చిన్నవయసులోనే మరణించాడు. అప్పుడతని భార్య ఆంఖే సెనామెన్ సుప్పిలియుమాకు ఒక లేఖ రాసింది. తను సంతానం లేని వితంతువునననీ, తన బానిసలలో ఒకరిని పెళ్లాడి అతనికి గౌరవస్థానం కల్పించడం భావ్యం కాదనీ, మీకు చాలామంది కొడుకులున్నారు కనుక ఒకరిని తనకు భర్తగా ఇమ్మనీ అందులో అర్థించింది. ఆ సమయంలో, నేటి లెబనాన్ ప్రాంతంపై దండయాత్రకు వెళ్ళి విజయం సాధించి ఉన్న సుప్పిలియుమా ఆ అభ్యర్థనకు విస్తుపోయాడు. అందులో ఏదైనా మోసం ఉందేమోనని అనుమానించి, నిజానిజాలు కనుక్కొని రమ్మని ఒక దూతను ఈజిప్టుకు పంపించాడు. దూత తిరిగి వచ్చి అక్కడి సమాచారం తెలిపాడు. అయినాసరే, సుప్పిలియుమాకు నమ్మకం చిక్కలేదు. అతనినుంచి సానుకూలస్పందన లేనందుకు నొచ్చుకున్న ఆంఖే సెనామెన్, అదే అభ్యర్థనతో రెండోసారి లేఖ రాసింది. అప్పుడు మెత్తబడ్డ సుప్పిలియుమా తన కొడుకుల్లో ఒకరిని ఈజిప్టు పంపించాడు. కానీ అతను అనుమానించినట్టే జరిగింది; కొడుకు ఈజిప్టు చేరేలోపలే అక్కడి రాజాస్థానంలో కీలకస్థానంలో ఉన్న కొందరు వ్యక్తులు అతన్ని హత్య చేయించారు...

3,300 సంవత్సరాల క్రితం జరిగిన ఈ ఘటన, సుప్పిలియుమా మరో కొడుకు ముర్సిలై-2 ద్వారా లిఖితరూపం పొంది హిట్టైట్ పురాతనపత్రాలలో భాగమై ఈరోజున మనకు అందుబాటులో ఉండడం చెప్పుకోవలసిన విశేషం.

గ్రీకు టోలెమీవంశానికి చెందిన ఈజిప్టురాణి క్లియోపాత్రా కూడా సోదరుని వివాహమాడిన సంగతి చరిత్రప్రసిద్ధమే. అదలా ఉంచితే, మన ప్రస్తుతాంశమైన కౌసల్యా దశరథుల ఉదంతానికీ, పై ఆంఖే సెనామెన్ కథనానికీ పెద్దగా సంబంధం లేకపోయినా ఇంత వివరంగా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఇందులో హిట్టైట్ల పాత్ర కూడా ఉండడం వల్ల! హిట్టైట్లతోనే ముడిపడిన మరో కథనం, అప్పట్లో లైంగిక సంబంధాలలో వావివరసల పాటింపు ఎలా ఉండేదో ఒక అవగాహన కలిగిస్తుంది. పైన పేర్కొన్న బెడ్రిక్ హ్రోజ్న తన ‘ఏన్షియెంట్ హిస్టరీ ఆఫ్ వెస్ట్రన్ ఆసియా, ఇండియా అండ్ క్రీట్’(Ancient History of Western Asia, India and Crete ) అనే పుస్తకంలో దీని గురించి రాస్తాడు:

పురాతనకాలంలో నేటి ఆర్మీనియా కొండల్లో ‘హయషా’ అనే రాజ్యం ఉండేది. తనకన్నా బలవత్తరమైన హిట్టైట్ రాజ్యంతో దానికి రక్షణ ఒప్పందం ఉండేది. పైన చెప్పుకున్న హిట్టైట్ రాజు సుప్పిలియుమా తన సోదరిని హయషా యువరాజైన హుఖనాష్ కి ఇచ్చి పెళ్లిచేశాడు. పెళ్లికూతురును అతని వెంట పంపుతూ హెచ్చరికలా ధ్వనించే ఒక సలహా ఇచ్చాడు; ఆ రెండు రాజ్యాల మధ్య జరిగిన ఒప్పందంలో దానినీ చేర్చారు. అది ఇలా ఉంటుంది:

“నీకిచ్చి పెళ్లి చేసిన నా ఈ సోదరికి సొంత చెల్లెళ్లు, సవతి చెల్లెళ్లు చాలామంది ఉన్నారు. వాళ్ళ సోదరి నీ భార్య కనుక వాళ్ళు కూడా నీకు స్వాధీనులవుతారు. అయితే ఈ హత్తి నేలమీద ఒక నిబంధన అమలులో ఉంది. సోదరుడు తన తోడబుట్టినదానిని కానీ, సవతి సోదరిని కానీ భార్యగా చేపట్టకూడదు. ఎట్టి పరిస్థితులలోనూ దానిని మేము అనుమతించం. ఈ హత్తూసాలో ఆ నియమాన్ని ఎవడు ఉల్లంఘించినా వాడికి మరణశిక్ష తథ్యం. మీది ఆటవికరాజ్యం కనుక సొంతసోదరిని, సవతి సోదరిని పెళ్లాడే ఆచారం మీ దగ్గర ఉంది. ఈ హత్తూసాలో మాత్రం దానిని అంగీకరించం. నీ సొంత సోదరి అయినా, సవతి సోదరి అయినా నిన్ను చూడడానికి వస్తే, ఆమెను మద్యమాంసాలతో సంతోషపెట్టు; నువ్వు కూడా ఆమెతోపాటు మద్యమాంసాలు సేవించి ఆనందించు; కానీ ఆమెతో పడకసుఖం పొందే సాహసం మాత్రం చేయకు. దానిని అనుమతించే ప్రశ్న లేదు. అందుకు సాహసించావా, మరణశిక్ష తప్పదు. కనుక అలాంటి చాపల్యానికి దూరంగా ఉండు. ఎవరైనా నిన్ను అలాంటి పెడదారి పట్టించడానికి ప్రయత్నించినా అతని మాట వినకు. ఏదైనా ఒక ప్రతిజ్ఞ చేసినవాడు దానికి ఎలా కట్టుబడి ఉంటాడో, అలాగే నువ్వు కూడా ఈ నియమానికి కట్టుబడి ఉండాలి...

అలాగే, రాణికి ఆంతరంగిక సేవలందించే గౌరవనీయ పరిచారికలకు కూడా నువ్వు దూరంగా ఉండాలి. వారు కులీనలైనా, గుడిసేవలకు నియోగించిన దేవదాసీ బానిసలైనా సరే; నువ్వు దూరం పాటించాలి, వాళ్ళతో మాట్లాడకూడదు; నీ బానిస కూడా వాళ్ళ జోలికి వెళ్లకూడదు. వాళ్ళ విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. రాణిగారి గౌరవ పరిచారిక ఎవరైనా నువ్వు వెళ్ళే దారిలో కంటబడితే నువ్వు పక్కకు తొలగి ఆమెకు దారి ఇవ్వాలి. ఒక గౌరవనీయపరిచారికను కన్నెత్తి చూడడంవల్ల ఒకసారి ఏంజరిగిందో తెలుసా? ఒక దేవదాసి ఘోషా బండిలో వెడుతుండగా మరియాష్ అనే అతను ఆమెవైపు చూశాడు. అది, ఘనతవహించిన నా తండ్రి కంటబడింది. ఎందుకామెను చూశావని అతన్ని గద్దించి అడగడమే కాక, అతనికి మరణశిక్ష అమలుచేశాడు. కనుక అతని చావుకు దారితీసిన ఆ తప్పును నువ్వు ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి...

ఇంకో విషయం; ఎప్పుడైనా నువ్వు వచ్చేటప్పుడు నీ సోదరుని భార్యను కానీ, నీ సోదరిని కానీ వెంటబెట్టుకుని రావద్దు. హత్తూసాలో అలాంటివి అనుమతించం. అలాగే, నీ హయషా, లేదా అజ్జీ రాజ్యానికి చెందిన ఏ స్త్రీ దగ్గరికీ నీ భార్యను తీసుకు వెళ్లద్దు...”

దీనినిబట్టి క్రీస్తుపూర్వం 14వ శతాబ్దినాటికి ఈజిప్టులోనే కాక, పశ్చిమాసియాకు చెందిన ఆర్మీనియా మొదలైన చోట్ల కూడా సోదరీ, సోదరుల మధ్య వివాహసంబంధమే కాక, వివాహేతర లైంగిక సంబంధం కూడా ఉండేదనీ, వావివరసల పట్టింపు పెద్దగా ఉండేది కాదనీ అర్థమవుతుంది. ఈజిప్టులో అయితే క్రీ.పూ. 69కి చెందిన క్లియోపాత్రా కాలందాకా కూడా సోదరీ, సోదరులకు పెళ్లి చేసే ఆచారం ఉంది. హిట్టైట్ రాజ్యానికి చుట్టుపక్కల ప్రాంతాలలో అలాంటి దురాచారం ఉండేదనీ; హిట్టైట్లు అలాంటి దురాచారాలను నిషేధిస్తూ తమ వ్యవస్థను సంస్కరించుకోవడంలో ముందున్నారనీ, విచ్చలవిడి లైంగిక సంబంధాలకు వ్యతిరేకంగా కఠిన నియమాలను, శిక్షలను అమలు చేయడం ప్రారంభించారనీ- సుప్పిలియుమా తన సోదరి భర్తకు చేసిన పై హెచ్చరిక తెలియజేస్తోంది. అయితే, ఘోషా స్త్రీని చూసినందుకే మరణశిక్ష విధించడం లాంటి మరో వైపరీత్యానికి అది దారితీయడమూ కనిపిస్తోంది.

అదలా ఉంచితే, హిట్టైట్ రాజు చేసిన పై హెచ్చరికలో రాణీ ఆంతరంగిక పరిచారికల గురించిన ప్రస్తావనే చూడండి; అలాంటి పరిచారికవ్యవస్థ యూరప్ రాచకుటుంబాల్లో ఇప్పటికీ, లేదా ఇటీవలి వరకూ ఉంది. పరిచారికలు ఎవరి దగ్గర ఎంతమంది ఉండాలి, వారు ఎలాంటివారై ఉండాలి, ఎలాంటి విధులు నిర్వర్తించాలన్న నిర్దేశాలతో సహా దానిని వ్యవస్థీకరించడం కనిపిస్తుంది. ఉదాహరణకు, పట్టపురాణి దగ్గర ఎనిమిదిమంది, యువరాణి దగ్గర నలుగురు ఆంతరంగిక పరిచారికలుండాలని, వాళ్ళు అవివాహితులై ఉండాలనీ ఆ వ్యవస్థ చెబుతోంది. ఈ వ్యవస్థ మూలాలు అంత సుదూరకాలంలో హిట్టైట్లలో సైతం ఉండడం ఇక్కడ గమనించాల్సిన విశేషం. రాచరికవ్యవస్థకూ, రాజనీతికీ సంబంధించిన నమూనాను అటు యూరప్ కు, ఇటు తూర్పు దేశాలకూ కూడా హిట్టైట్లే అందించారని వేరొక సందర్భంలో రాంభట్ల కృష్ణమూర్తి తన ‘జనకథ’ మొదలైన రచనల్లో చెప్పినదానికి ఇది కూడా ఒక ఉదాహరణగా కనిపిస్తుంది.

ఇంకా విశేషమేమిటంటే, “మీది ఆటవికరాజ్యం కనుక సోదరుడు తన సొంతసోదరిని కానీ, సవతి సోదరిని కానీ పెళ్లాడే ఆచారం మీ దగ్గర ఉం”దంటూ హిట్టైట్ రాజు తన బావమరిదిని ఎత్తిపొడవడం మహాభారతంలోని ఒక ఉదంతాన్ని గుర్తుచేస్తుంది. కర్ణపర్వం, ద్వితీయాశ్వాసంలో కర్ణుడు తన రథసారథిగా ఉన్నశల్యుని ములుకుల్లాంటి ఇలాంటి మాటలతోనే ఎత్తిపొడుస్తాడు. శల్యుడు మాటిమాటికీ అర్జునుని ప్రతాపాన్ని పొగడుతూ కర్ణుని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయబోవడం అందుకు కారణం. దానినుంచే శల్యసారథ్యమన్న నానుడి పుట్టింది. పాండురాజు రెండవభార్య మాద్రికి సోదరుడైన శల్యుడు, మద్రదేశీయుడు...

“నువ్వు పాపదేశంలో పుట్టావు. దుర్భుద్ధి కాక, నీకు సద్బుద్ధి ఎలా వస్తుంది? నువ్వు క్షత్రియాధముడివి, నీచుడివి” అని శల్యుని తిట్టిపోయడంతో కర్ణుడు ఊరుకోకుండా, “మీలో ఆడా, మగా వావీ, వరసా లేకుండా కలుస్తారు. అది మీకు తప్పు కాదు... అనేకమందికి పుట్టి కల్లు తాగుతూ పెరిగే మీకు శీలమూ, సభ్యమైన మాటలూ ఎలా అబ్బుతాయి?” అంటాడు. ఆ సందర్భంలోనే బాహ్లికదేశీయుల ప్రస్తావన కూడా తెచ్చి, వాళ్ళు గోమాంసం నంజుకుంటూ మద్యపానం చేస్తూ, అసందర్భ ప్రేలాపనలాడుతూ, నగ్నంగా తిరుగుతూ ఉంటారనీ, అలాంటి బాహ్లికులకు నువ్వు దగ్గరివాడివనీ, వాళ్ళ కన్నా కూడా నీ మద్రదేశీయులు మరింత అనాగరికులనీ దూషిస్తాడు.

నేటి అప్ఘానిస్తాన్ గా గుర్తించే గాంధారదేశంతో సహా బాహ్లిక, మద్రదేశాలు ఆర్మీనియాలాంటి పశ్చిమాసియాదేశాలకు మరీ అంత దూరంలో… కనీసం దాటలేనంత దూరంలో ఏమీలేవు; మరీ ముఖ్యంగా ఆర్యుల వలస మార్గంలోనే అవి కూడా ఉన్నాయి. ఈ సంగతిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు, హిట్టైట్ రాజు ఆర్మీనియాను ఆటవికరాజ్యంగా పేర్కొంటూ అన్న మాటలకూ; కర్ణుడు మద్ర, బాహ్లికజనాలను అనాగరికులుగా తూలనాడుతూ అన్న మాటలకూ మధ్య సామ్యం కొట్టొచ్చినట్టు కనిపించి ఆశ్చర్యం గొలుపుతుంది.

ఆపైన, గ్రీకు, లాటిన్, జర్మన్, రోమన్ తెగలను కూడా ఆర్యులుగానే మోర్గన్ పేర్కొంటూ, వారు గడచివచ్చిన ఆటవిక, అనాగరికయుగాల తాలూకు అన్ని దశల సాక్ష్యాలూ వాళ్ళ వాఙ్మయాల్లో కనిపిస్తాయనీ, వాటిలో వావివరసలు లేని లైంగిక సంబంధాలు కూడా ఉన్నాయనీ అనడాన్ని కూడా ఈ సందర్భంలో గుర్తు పెట్టుకోవాలి.

***

తిరిగి అసలు విషయానికి వెడితే, పెళ్ళికి ముందే కోసలరాణి అయిన కౌసల్య, కోసలరాజుగా చెబుతున్న దశరథుడు భార్యాభర్తలు ఎలా అయ్యారన్న ప్రాథమికప్రశ్నకు-- మోర్గన్ తో మొదలు పెట్టి, ఈజిప్టు, హిట్టైట్, ఆర్మీనియాల మీదుగా మహాభారతంవరకూ చెప్పుకున్న అన్ని ఉదాహరణలూ, ఉదంతాల నుంచి చూచాయగా ఏమైనా సమాధానాన్ని రాబట్టుకోగలమా? అది ఎవరికి వారే సొంతంగా పరిశీలించి తేల్చుకోవలసినదే తప్ప ప్రత్యేకించి ఒక అభిప్రాయాన్ని రుద్దే ఉద్దేశం ఈ వ్యాసకర్తకు లేదు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, కౌసల్యా దశరథులది కూడా కచ్చితంగా పైన చెప్పిన వావివరసలు పట్టని సంబంధంలాంటిదేనని చెప్పే ఉద్దేశం అసలే లేదు...

కాకపోతే, కోసలరాణి, కోసల రాజు భార్యాభర్తలు ఎలా అయ్యారన్న ప్రశ్నకు ఏదో ఒక సమాధానం చెప్పుకోవడం మాత్రం అవసరం. దానికి సంప్రదాయపండితులైనా సమాధానం చెప్పాలి, లేదా ఆధునికవైజ్ఞానిక వనరులపై ఆధారపడి ఇతరులైనా సమాధానం చెప్పాలి. ఆ సమాధానం మనల్ని సమాధానపరిచేలానూ ఉండాలి. ఎందుకంటే, ఏదైనా ఒక ప్రశ్న తలెత్తిదంటే, లేదా ఒక ప్రశ్నను గుర్తించామంటే, దానికి సమాధానాన్ని మానవజిజ్ఞాస నిరంతరాయంగా అన్వేషిస్తూనే ఉంటుంది. ప్రశ్న అనే తోడు లేకుండా సమాధానం ఉండగలదేమో కానీ, సమాధానమనే తోడు లేకుండా ప్రశ్న ఉండలేదు...

కౌసల్యా, దశరథుల సంబంధాన్ని అర్థం చేసుకోడానికి మరో మార్గం కూడా ఉందని ముందే అనుకున్నాం. అది మాతృస్వామికమార్గం... దాని గురించి తర్వాత...

Tags:    

Similar News