అమెరికన్ పాలకులకు చైనా అంటే అంత బెదురెందుకు?
చైనాను ప్రాబల్యాన్ని అడ్డుకోవడం, ఆర్థికంగా బలహీన పరచడం అమెరికా ప్రధాన లక్ష్యం గా ఎంచుకుంది. ఎందుకంటే...;
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండవసారి బాధ్యతలు స్వీకరించిన తరువాత చైనా వ్యతిరేక వ్యూహానికి మరింత పదును పెట్టారు. ఒక దశలో చైనా వస్తువులపై అత్యధిక [145 శాతం వరకు] సుంకాలు విధించారు. అది ఏ హేతువుకు అందని కక్ష పూరిత వ్యవహార విధానానికి నిదర్శనం. అది వాణిజ్యం, సుంకాలతో ఆగిపోదు. సామ్రాజ్యవాద ఆధిపత్యానికి లొంగిపోయేలా చైనాపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నంలో ఒక భాగం. అమెరికా సామ్రాజ్యవాద వ్యూహం- రాజకీయ, ఆర్థిక, సైనిక బెదిరింపులతో కూడి వున్నది -మునుపు చూడని స్థాయిలో కొనసాగుతోంది. దీనికి కారణం ఏమిటి? ఇది ఆ రెండు దేశాల మధ్య వాణిజ్య పోటీ మాత్రమేనా? అమెరికా పెట్టుబడిదారీ వ్యవస్థను మౌలికంగా సవాలు చేసేలా చైనా ఏం సాధించింది? చైనా అభివృద్ధి, దాని ప్రత్యామ్నాయ మార్గం పెట్టుబడిదారీ వ్యవస్థ పునాదు లను సవాలు చేసేలా ఎదుగుతోంది కనుకనే చైనాను అడ్డుకోవడం, బలహీన పరచడం అమెరికా ప్రధాన లక్ష్యం గా ఎంచుకుంది.
ఎక్కువగా లాభాపేక్షతో నడిచే పాశ్చాత్య విధానానికి భిన్నంగా, చైనా యొక్క శాస్త్రీయ, సాంకేతిక పురోగతి దాని ప్రజల శ్రేయస్సును మెరుగు పరచడానికి ఉపయోగపడుతోంది. సుస్థిర అభివృద్ధి, దీర్ఘకాలిక శ్రేయస్సును ప్రోత్సహించడానికి ఉద్దేశించ బడింది. ఇటువంటి ప్రత్యామ్నాయాలు అమెరికా నేతృత్వంలోని సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ వ్యవస్థకు ప్రత్యక్ష సవాలు విసురుతున్నయి- వీటిని ఆధిపత్య పాలక వర్గాలు తమ పెట్టుబడిదారీ పెత్తనానికి తీవ్ర ముప్పుగా పరిగణిస్తున్నాయి.
పెట్టుబడిదారీ విధానం అంటే "సృజనాత్మక వినాశన" ప్రక్రియ అని కొందరు అభివర్ణించారు. ఇక్కడ సృజనాత్మక నవకల్పన అంటే పూర్తిగా కొత్తది అని అర్థంకాదు. కాలం చెల్లిన ఉత్పాదక పరిశ్రమల వ్యవస్థలో, మరింత సమర్థవంతమైన, తక్కువ ఖర్చుగల ఉత్పత్తిని సాధించే ఆవిష్కరణలతో భర్తీ చేయడమే. వాస్తవానికి ఇది కూడా ఒక అపోహనే. పెట్టుబడిదారీ విధానం పట్ల, పెట్టుబడిదారీ సృజనాత్మకత పట్ల గల సానుభూతి నుండి ఈ అవగాహన ఉద్భవించింది. నిజంగా సృజనాత్మకమైనది శ్రమ. పెట్టుబడిదారీ విధానంలో, శ్రమ యొక్క సృజనాత్మక సామర్థ్యం పూర్తి స్థాయిలో విడుదల కాదు. లాభ-ఆధారిత వ్యవస్థను కొనసాగించడానికి, విస్తరించడానికి కావలసి న మేరకే సృజనాత్మక సామర్ధ్యం ఉపయోగించ బడుతుంది. శ్రామిక ఉత్పాదకత నియంత్రించ బడుతుంది. శ్రమ ఉత్పాదక, సృజనాత్మక సామర్థ్యాలకు చోటు కల్పించడానికి లేదా వాటిపై ఆధిపత్యం వహించడానికి పెట్టుబడిదారీ వ్యవస్థ నిరంతరం తనను తాను పునర్నిర్మించుకుంటుంది. ఈ లక్ష్యానికి లోబడి శ్రామిక ఉత్పాదక తను తన అవసరాల మేరకే అభివృద్ధి చేస్తుంది. ప్రణాళికాబద్ధమైన ఒక శ్రామిక అణచివేత వ్యూహాన్ని అనుసరిస్తుంది. ఉత్పత్తిదారుల లాభం కోసం ప్రకృతిని, వనరులనీ, మానవులనీ దోపిడీ చేస్తుంది. ఆధునిక నవకల్పన, సాంకేతిక పురోగతి ఈ దోపిడిని వేగవంతం చేస్తాయి.
వేగవంతమైన సాంకేతిక పురోగతి, మానవ పురోగతికి దోహదం చేయడానికి బదులుగా, ఈ దోపిడీ వ్యవస్థను కొన సాగించడానికి ఎక్కువగా ఉపయోగించబడుతుంది. ఈ ప్రణాళికాబద్ధమైన పెట్టుబడిదారీ తర్కం ఉద్దేశపూర్వకంగా పరిమిత ఆయుర్దాయం, పరిమిత మన్నిక కలిగిన ఉత్పత్తులను డిజైన్ చేస్తుంది, అవి త్వరగా కాలం చెల్లిపోయేలా చేస్తుంది. ఇది "యూజ్ అండ్ త్రో" సంస్కృతికి ఆజ్యం పోస్తుంది- ఇది వినియోగాన్ని నిరంతరం పెంచుతూ సరుకుల పై ఆధారపడటాన్ని ప్రోత్సహిస్తుంది. నిజమైన సృజనాత్మకతను ప్రోత్సహించ డానికి బదులుగా, ఈ చక్రం దానిని బలహీనపరుస్తుంది. మన్నికైన పురోగతి స్థానాన్నిస్వల్పకాలిక లాభదాయ కతతో భర్తీ చేస్తుంది.
అమెరికా,యూరోపియన్ పెట్టుబడిదారీ విధానంలో సాంకేతిక పురోగతి ప్రధానంగా ఈ ప్రణాళికాబద్ధమైన నిరంకుశత్వం యొక్క తర్కం ద్వారా నడపబడుతుంది. ఇది నిజమైన మానవ అవసరాలను తీర్చడానికి కాదు, సరుకు ఆధారిత వినియోగం కోసం నిరంతరం కొత్త కోరికలను తయారు చేయడానికి పనిచేస్తుంది. ఉత్పత్తులు, సేవలు ఉద్దేశ పూర్వకంగా తక్కువ ఆయుర్దాయంతో రూపొందించబడ్డాయి, పునరావృత మయ్యే కొనుగోళ్ల వ్యవస్థను ప్రోత్స హిస్తాయి- ఇవి కార్పొరేట్ ప్రయోజనాలకు, వారికి నిరంతర లాభాన్ని కొనసాగించే లక్ష్యంతో అనుసరిస్తున్న వ్యూహాలు. ఈ చక్రం సహజ వనరుల క్షీణతను వేగవంతం చేయడమే కాకుండా వినియోగదారుల లో నిత్యం ఒక ఆతృత కు దారి తీస్తుంది. ముఖ్యంగా "కోల్పోతామనే భయం" దొరుకుతుందో లేదో అనే ఆందోళన తో కూడిన మానసిక ఒత్తిడిని పెంచుతుంటుంది. దానితో దీపముండగానే ఇల్లు చక్క బెట్టుకోవాలనే తలపుతో వినియోగదారులు అవసరానికి మించి కొనుగోలు చేసి దాచుకుంటారు. నిన్న ట్రంప్ దిగుమతి సుంకాలు పెంచుతున్నట్లు ప్రకటించగానే అది అమలు కావటానికి ముందే తక్కువ ధరలో వస్తువులు కొనాలని ప్రజలు, ఆ అవకాశాన్ని వాడుకోవటానికి వాణిజ్య కారులు ఎలా పరుగులు తీసింది మనం చూసాము. ఈ విధంగా, పెట్టుబడిదారీ విధానం- భౌతిక వస్తువులనీ భావోద్వేగ అనుభవాన్ని- రెండింటినీ కలుపుతుంది. ఆధారపడే సంస్కృతిని బలపరుస్తుంది.
పెట్టుబడిదారీ వినియోగ చక్రాలు, ప్రణాళికాబద్ధమైన నిరంకుశత్వం నుండి ఉద్భవించిన వృథా "ఉపయోగించడం -విసిరి పారవేయడం" వంటి వైఖరిని, సంస్కృతిని ఎదుర్కోవడం ద్వారా చైనా ఒక ప్రత్యామ్నాయ నమూనాను అనుసరిస్తోంది.
చైనా యొక్క శాస్త్రీయ , ఆర్థిక పురోగతి దాని ప్రజల శ్రేయస్సుపై కేంద్రీకృతమైన దీర్ఘకాలిక దార్శనికత ద్వారా మార్గనిర్దేశం చేయబడింది- ఇది ప్రణాళికాబద్ధమైన పెట్టుబడిదారీ నిరంకుశత్వ వ్యూహానికి ప్రాథమికంగా వ్యతిరేక మైన విధానం. దోపిడీ ఆధారంగా లాభాలకు ప్రాధాన్యమిచ్చే అమెరికన్, యూరోపియన్ మార్కెట్-ఆధారిత వ్యవస్థల మాదిరిగా కాకుండా, చైనా నమూనా ప్రజా సంక్షేమాన్ని దాని సాంకేతిక అభివృద్ధి ఎజెండాలో ప్రధానాంశంగా ఉంచుతుంది.సుస్థిరత,మన్నికలో నూతన ప్రమాణాల మార్గాన్ని అందించడం ద్వారా పాశ్చాత్య పెట్టుబడిదారీ వ్యవస్థ యొక్క పునాదులకు ముప్పు కలిగిస్తోంది.
పాశ్చాత్య పెట్టుబడిదారుల వ్యూహం స్వల్పకాలిక జీవితం గల ఉత్పత్తులు తయారు చేయటం, వాటి నిరంతర నవీకరణ ద్వారా పునరావృత వినియోగాన్ని ప్రోత్సహించటం. ఉదాహరణకు, ఐఫోన్లు వంటి ఆపిల్ ఉత్పత్తులు ప్రతి సంవత్సరం కొత్త మోడల్ లో విడుదల చేస్తూ నిరంతరం మార్కెట్ ను సృష్టించుకుంటూ ఉంటాయి. చేసేవి స్వల్ప మార్పులే అయినా కొత్త ఒక వింత అన్నట్లు వినియోగదారులను మభ్యపెట్టి ఆకర్షిస్తాయి. కొత్త మోడల్ కొనేట్లు చేసుకుంటాయి.
చైనా ప్రత్యామ్నాయ మార్గానికి ఒక అద్భుతమైన ఉదాహరణ, చైనా ప్రభుత్వ సహకారంతో చైనా కంపెనీ బెటావోల్ట్ చిన్న అణు బ్యాటరీని అభివృద్ధి చేయడం. ఈ బ్యాటరీ జీవితకాలం 50 సంవత్సరాలు. మొబైల్ ఫోన్లు , ఎలక్ట్రిక్ వాహనాలు వంటి పరికరాలలో దీన్ని వాడితే మళ్ళీ మళ్ళీ రీఛార్జ్ చేయాల్సిన అవసరం వుండదు. ఇటువంటి సాంకేతిక పురోగతి తరచుగా ఛార్జింగ్ చేయటాన్నిఅనవసర ప్రక్రియగా మార్చడమే కాకుండా, అమెరికన్, యూరోపియన్ ఎలక్ట్రానిక్స్ కంపెనీల వ్యాపార నమూనాలకు విఘాతం కలిగిస్తుంది.
చైనా ప్రత్యామ్నాయ ఇంధన వనరులను ఆవిష్కరిస్తోంది. కర్బన ఉద్గారాలను తగ్గించే , భూతాపాన్ని అరికట్టే, పర్యావరణ హిత ఆవిష్కరణలు అభివృద్ధి చేస్తోంది. సొంతంగా స్పేస్ స్టేషన్, లూనార్ ఎక్స్ ప్లోరేషన్ ప్రోగ్రామ్ ను అభివృద్ధి చేసుకుంది. అమెరికా, యూరోపియన్ పెట్టుబడిదారీ నమూనాకు విరుద్ధంగా చైనా శాస్త్రీయ, రాజకీయ, ఆర్థిక వ్యవస్థ సాధించిన విజయాలకు ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే.
ఈ సందర్భంలో, చైనా కేవలం ఒక భౌగోళిక రాజకీయ ప్రత్యర్థి గా మాత్రమే కాకుండా, ఒక ఆధునిక నాగరిక ప్రత్యామ్నాయాన్ని అందిస్తున్న శక్తిగా ఎదుగుతున్నది. ఇది లాభం యొక్క ఆధిపత్యాన్ని సవాలు చేస్తుంది. ప్రజల సంక్షేమానికి పెద్ద పీట వేస్తుంది.ఈ కారణంగానే అమెరికా సామ్రాజ్యవాదం, దాని యూరోపియన్ మిత్రదేశాలతో కలిసి చైనాను, దాని విజయాలను బలహీనపరచడానికి, అడ్డుకోవడానికి అవిశ్రాంతంగా ప్రయత్ని స్తోంది. ఈ భయం కేవలం ఆర్థిక పోటీలో మాత్రమే కాదు, చైనా నిర్దేశించుకున్న అభివృద్ది పంథాకు వ్యతిరేకంగా పురుడు పోసుకుంది. శాంతి, పురోగతి, సమాజ శ్రేయస్సుపై ఆధారపడిన ప్రణాళికాబద్ధమైన ఆర్థిక అభివృద్ధి యొక్క రాజకీయ నమూనా అది. పెట్టుబడిదారీ దోపిడీని అధిగమించే భవిష్యత్తును ఊహించ డానికి,ఆధిపత్యవాదుల ప్రణాళికా బద్ధమైన అణచివేతను ఎదుర్కోవడానికి తగిన పునాదిని నిర్మించడానికి చైనా కృషి చేస్తున్నది.
అందుకే ప్రపంచమంటే తన పెరటి గడ్డగా, తన ప్రాబల్యం తలదాల్చే నయా వలసల సముదాయంగా భావిస్తూ వస్తున్న అమెరికా ఆధిపత్య వాదం తనకు రాబోతున్న ముప్పును గ్రహించి దాన్ని ప్రపంచాని కంతటికి ముప్పు అని వక్రీకరించి ప్రచారం చేస్తున్నది. దానికి కారణమైన చైనాను ప్రపంచ శత్రువుగా చిత్రీ కరించి, దాన్ని ఏకాకిని చేయాలని పన్నాగాలు రచిస్తున్నది. అయితే ప్రపంచ ప్రజాభిప్రాయం చైనా అందిస్తు న్న ప్రత్యామ్నాయ శాంతి అభివృద్ధి మార్గానికి అనుకూలంగా మారుతుండటంతో, అమెరికా ఆధిపత్యం రోజు రోజుకు తానే ఏకాకిగా మారిపోతూ అసహనంతో, కల్లు తాగిన కోతిలా ప్రపంచమంతా యుద్దాగ్నిజ్వాలలు రగిలిస్తున్నది. నేటి ప్రపంచంలోని అస్థిరత కు అశాంతికి మూల కారణ మవుతున్నది. దాన్ని ఎదుర్కునే ప్రత్యామ్నాయ ప్రజాశక్తిగా చైనా నిలుస్తున్నది. శాంతి, సామరస్యాలతో పరిఢవిల్లే భవిష్య మానవ సమాజ నిర్మాణానికి దేశాలను ఏకం చేస్తున్నది. అమెరికా అక్కసుకు ఇంతకు మించి కారణమేమి కావాలి? మానవ మహోదయానికి పెట్టుబడిదారీ ప్రతిఘటనగా అమెరికా చర్యలను అర్ధం చేసుకోవలసి వుంటుంది.