రామాయణంలో కుమారస్వామికథ ఏం చెబుతోంది?

రామాయణంలో నిరుత్తరకాండ-28

Update: 2024-10-01 07:24 GMT

సోర్స్: https: mythoworld.


సంతానం కనడంలో స్త్రీపాత్రను చిన్నది చేసి, పురుషుడి పాత్రను పెద్దది చేయడం; అసలు సంతానం కనడానికి స్త్రీ అవసరమే లేదనడం; అంతలోనే స్త్రీపాత్రను గుర్తించవలసిన అనివార్యతను తప్పించుకోలేక ఏదో ఒకవిధంగా మళ్ళీ స్త్రీని ప్రవేశపెట్టడం—

ఈ జోడు గుర్రాల స్వారీ మన పురాణ, ఇతిహాసకథల్లో చాలా తరచుగా కనిపిస్తుంది. సంతానం కనడానికి స్త్రీ అనే మాధ్యమమే అవసరం లేదని బ్రహ్మ పుట్టుక గురించిన వివిధపురాణకథనాలు చెబుతాయి. సాధు లక్ష్మీనరసింహశర్మ గారు తన ‘పురాణనామసంగ్రహము’లో వాటిని సంగ్రహంగా క్రోడీకరించారు. వాటిలోని ఒక కథనం ప్రకారం, ఒకానొక కల్పం ముగిసిన తర్వాత అంతా నీటితోనూ, అంధకారంతోనూ నిండి ఉన్నప్పుడు మర్రి ఆకు మీద యోగనిద్రలో ఉన్న నారాయణుడు వరాహరూపం పొంది తన కోరతో భూమిని పైకెత్తాడు; అప్పుడు బ్రహ్మ నారాయణుని గర్భంలోకి ప్రవేశించి బ్రహ్మాండతత్వాన్ని తెలుసుకుని ఆ నారాయణుని నాభికమలం నుంచి బయటికి వచ్చి జగత్తును సృష్టించడం ప్రారంభించాడు. పురాణాల లెక్క ప్రకారం కల్పమంటే 43కోట్ల 20లక్షల మానవసంవత్సరాలు. ఒక కల్పం, బ్రహ్మకు ఒక రోజు. కల్పమంటే ప్రళయమని నిఘంటువు చెప్పే మరో అర్థం.

ప్రజలను పుట్టించడానికి బ్రహ్మ మనసునుంచే మరీచి, అత్రి, అంగిరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, భృగువు, వసిష్ఠుడు, దక్షుడు అనే తొమ్మిదిమంది ప్రజాపతులు పుట్టారు. మరో పురాణకథనం ప్రకారం, ఈ తొమ్మిది మందీ బ్రహ్మ అవయవాలనుంచి పుట్టారు. అర్ధనారీశ్వరుడైన రుద్రుడు కూడా బ్రహ్మకే పుట్టాడు. అలాగే, సనకుడు, సనందుడు, సనత్సుజాతుడు, సనత్కుమారుడు, ఋభుడు, నారదుడు, వరానుడు, అరుణి, యతి మొదలైనవారు కూడా బ్రహ్మ మానసపుత్రులుగా పుట్టి, సృష్టి మీద ఆసక్తి లేక ఊర్ధ్వరేతస్కులు, జ్ఞానులు అయ్యారు. ఊర్ధ్వరేతస్కులంటే రేతస్సును, లేదా వీర్యాన్ని కిందికి జార్చే బదులు పైకి పంపి తేజస్సుగా మార్చగలిగినవారు.

వీరుకాక, సరస్వతి కూడా బ్రహ్మ దేహంనుంచే పుట్టిందనీ, ఆమెను చూసి బ్రహ్మ తత్తరపడ్డాడనీ, కామాతురుడై ఆమెను భార్యను చేసుకున్నాడనీ పురాణాలు చెబుతున్నాయి. ఇలా పై కథనాల్లోకి స్త్రీ ఎట్టకేలకు అడుగుపెట్టడమైతే పెట్టింది కానీ, పైన చెప్పిన సృష్టిక్రమంలో పురుషుడికే తప్ప ఆమెకు పాత్రలేదు.

మరికొన్ని పురాణ, ఇతిహాసకథనాలు పురుషునిలో కామోద్దీపన, లేదా లైంగికేచ్ఛ కలిగించే మేరకే స్త్రీని ప్రవేశపెడతాయి కానీ; సంతానోత్పత్తి మాత్రం ఆమె అవసరం లేకుండా పురుషుడివల్లే జరిగిపోయినట్టు చెబుతాయి. ఉదాహరణకు, మహాభారతంలో ద్రోణుని పుట్టుక. ఘృతాచి అనే అప్సరస కనిపించగానే భరద్వాజుడనే ఋషికి కామోద్దీపన కలిగి రేతస్సు జారింది; దాని నతడు ఒక ద్రోణిలో, అంటే ఆకుడొప్పలో ఉంచాడు. దానినుంచి పుట్టినవాడే ద్రోణుడు. సంతానోత్పత్తికి పురుషుడి శుక్లమొక్కటే చాలు, స్త్రీ శోణితం అక్కర్లేదని ఈ కథ చెబుతుంది. ఇలాంటిదే మహాభారతంలో వసురాజు గురించిన మరో కథ. చేదిరాజ్యాన్ని ఏలే వసురాజు వేటకెళ్ళాడు. అంతలో అతనికి భార్య గిరిక గుర్తొచ్చి కామోద్దీపన కలిగి రేతస్సు జారింది. దానినతడు ఒక డొప్పలో ఉంచి ఒక పెంపుడు డేగకిచ్చి దానిని తీసుకెళ్లి తన భార్యకు ఇమ్మన్నాడు. అది వెడుతుండగా మరో డేగ ఎదురై దానితో పోట్లాడి ఆ డొప్పను తీసుకోబోయింది. అది కాస్తా యమునానదిలో పడేసరికి శాపవశాన చేపగా మారిన అద్రిక అనే అప్సరస దానిని మింగి గర్భం ధరించింది. ఆమెకు ఒక కొడుకు, ఒక కూతురు పుట్టారు. కొడుకు మత్స్యదేశానికి రాజైతే, కూతురు సత్యవతి అనే పేరుతో పెరిగి పరాశరుడనే ఋషివల్ల వ్యాసునికి తల్లీ, ఆ తర్వాత కురురాజైన శంతనునికి భార్యా అయింది. సంతానోత్పత్తికి శుక్లమే చాలు, శోణిత మక్కర్లేదని వసురాజు కథ కూడా చెబుతుంది.

భాగవతం ప్రకారం, వ్యాసునికి శుకమహర్షి పుట్టుక కూడా ఇలాగే ఉంటుంది. వ్యాసుడు అగ్నికార్యం కోసం అరణి మథిస్తుండగా కామోద్దీపన కలిగింది. అది గమనించిన ఘృతాచి అనే అప్సరస చిలుక రూపం ధరించి అతని కంటబడింది. ఆమెను ఘృతాచిగా గుర్తించిన వ్యాసునికి రేతస్సు జారి అరణిలో పడింది. దానినుంచి శుకుడు పుట్టాడు. పురాతనకాలంలో నిప్పు పుట్టించడానికి రంధ్రమున్న ఒక అడ్డుకొయ్యలో మరో నిలువు కొయ్యను ఉంచి మథించేవారు. ఆ కొయ్య సాధనాలను, వాటితో నిప్పు పుట్టించడాన్ని ‘అరణి’ అంటారు. శుకమంటే చిలుక.

ఇక్కడ ఒక ముఖ్యమైన సంగతిని గుర్తుపెట్టుకోవాలి. పై కథనాలను పైపైన చూసినప్పుడు విడ్డూరమైన ఊహలుగాను, అర్థరహితాలుగానూ కనిపిస్తాయి. కానీ ఆధ్యాత్మికంగా, తాత్వికంగా, ఇతరత్రా వాటికి వేరే అన్వయాలు కూడా ఉండవచ్చు. అలా ఒకే కథను వేర్వేరు అన్వయాలకు అవకాశమిస్తూ చెప్పడం పౌరాణికశైలి. మన దగ్గరే కాక ఇతరచోట్ల కూడా పౌరాణికశైలి ఇలాగే ఉంటుంది. విలియం ఇర్విన్ థామ్సన్, ‘ది టైమ్ ఫాలింగ్ బాడీస్ టేక్ టు లైట్ -మైథాలజీ, సెక్స్యువాలిటీ అండ్ ది ఆరిజిన్స్ ఆఫ్ కల్చర్’(The Time Falling Bodies Take To Light- Mythology, Sexuality & the Origins of Culture) అనే తన పుస్తకంలో సుమేరు తదితర పురాణకథలను చర్చించే సందర్భంలో ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడని ఇంతకుముందు అనుకున్నాం. పురాణగాథను అనేక గొంతులను వినిపించే స్వరమేళగానూ, అనేక అన్వయాలకు అవకాశమిచ్చేదిగానూ ఆయన అభివర్ణిస్తాడు. ఒక పురాణకథకు చెందిన అన్ని రకాల అన్వయాలనూ పరిశీలనలోకి తీసుకోవాలని ప్రముఖ మానవశాస్త్రవేత్త లెవి-స్ట్రాస్ అంటాడు. కాకపోతే ఆ అన్వయం మరీ నేల విడిచిన సాము కాకూడదు. ప్రస్తుతసందర్భానికి వస్తే, సంతానోత్పత్తిలో పురుషుడి పాత్రను పెద్దది చేసి, స్త్రీపాత్రను చిన్నది చేసే మేరకే పై కథనాలను అన్వయించుకోవాలి.

అంతేకాదు, విలియం ఇర్విన్ థామ్సన్ తన పుస్తకంలో ఇతర పురాణకథలకు ఇచ్చిన అన్వయాలూ, చారిత్రక నేపథ్యాల వెలుగులో పై కథనాలను పరిశీలించడం మనకు ఆశ్చర్యంతోపాటు సరికొత్త అనుభవాన్ని, అవగాహనను, ఆసక్తిని కలిగిస్తుంది. మన పురాణకథల నిర్మాణంలోనూ, ఇతర పురాణకథల నిర్మాణంలోనూ ఉన్న పోలికలు, లేదా పరస్పర ప్రభావాలు, ఏకసూత్రతా చాలా స్పష్టంగా కనిపించి విస్మయం కలిగిస్తాయి. కనుక పై కథలను గుర్తుపెట్టుకుంటూ వాటిని మించి ఆశ్చర్యం కలిగించే ఇంకో కథ గురించి చెప్పుకుందాం.

అది రామాయణంలోనే ఉన్న కుమారస్వామికథ. కుమారస్వామి శివుని కుమారుడు. బాలకాండలోని 35, 36, 37వ సర్గలు, 83 శ్లోకాలలో అతని పుట్టుక గురించి చెబుతాయి; అది కూడా రెండు పాఠాలుగా ఉంటుంది. విశ్వామిత్రుడు తన యాగరక్షణ కోసం రామలక్ష్మణులను వెంటబెట్టుకుని వెడుతూ గంగాతీరానికి చేరుకున్నప్పుడు; గంగకు ‘త్రిపథగ’ అనే పేరు ఎలా వచ్చిందని రాముడు అడుగుతాడు. ‘త్రిపథగ’ అంటే- ఆకాశం, భూమి, పాతాళమనే మూడు మార్గాలలో ప్రవహించేది. అప్పుడు విశ్వామిత్రుడు గంగ పుట్టుకా, విస్తరణల గురించి చెబుతూ కుమారస్వామి కథను ఎత్తుకుంటాడు. అది ఇలా ఉంటుంది:

మేరుపర్వతపుత్రిక అయిన మనోరమకూ, హిమవంతునికీ పుట్టిన ఇద్దరు కూతుళ్లలో గంగ పెద్దది; ఉమ రెండవది. మూడు మార్గాలలో ప్రవహిస్తూ మూడు లోకాలకూ మేలు చేయగల గంగను తమకిమ్మని దేవతలు హిమవంతుని అడిగారు; హిమవంతుడు ఇచ్చాడు. ఆవిధంగా గంగ ఆకాశమార్గం పట్టి సురనది అయింది. ఆ తర్వాత హిమవంతుడు గొప్ప తపస్సు చేసిన తన రెండో కూతురు ఉమను రుద్రుడికిచ్చాడు.

ఈశ్వరుడిగానూ, శివుడిగానూ కూడా పిలిచే రుద్రుడు ఉమతో మైథునానికి ఉపక్రమించాడు. నూరు దివ్యసంవత్సరాలు గడిచినా వారికి కుమారుడు జన్మించలేదు. నూరుదివ్యసంవత్సరాలంటే, మన సంవత్సరాల లెక్కలో 36వేల సంవత్సరాలు. శివుని వల్ల ఉమకు కలగబోయే సంతానాన్ని ఎవరైనా ధరించగలరా అని సందేహించి దేవతలు ఆందోళన చెందారు. శివుని వద్దకు వెళ్ళి, నీ తేజస్సును, అంటే వీర్యాన్ని లోకాలు ధరించలేవనీ, నీలోనే ఉంచుకుని లోకాలకు మేలు చేయమనీ ప్రార్థించారు. అలాగే చేస్తాననీ; దేవతలూ, భూమీ భయపడనవసరంలేదనీ శివుడు అంటూ; చలించిన శ్రేష్ఠమైన నా వీర్యాన్ని ఎవరు ధరిస్తారో చెప్పమని అడిగాడు. భూమి ధరిస్తుందని దేవతలు చెప్పారు.

తన వీర్యాన్ని తనలోనే ఉంచుకుంటానని శివుడు మాట ఇస్తూనే, దానిని ఎవరు ధరిస్తారో చెప్పమని అడగడంలో పొంతన కనిపించదు. ఈ వైరుధ్యానికి వ్యాఖ్యాతనుంచి ఎలాంటి వివరణా లేదు. దానినలా ఉంచితే...

శివుడు తన వీర్యాన్ని భూమిపై విడిచిపెట్టాడు. అది పర్వతాలు, అరణ్యాలతో సహా భూమి అంతటా వ్యాపించింది. అప్పుడు దేవతలు, “వాయువుతో కలసి శివుని వీర్యంలోకి ప్రవేశించ”మని అగ్నిని ఆదేశించారు. అగ్ని అలాగే చేశాడు. శివుని వీర్యం అగ్ని వల్ల వ్యాపించి శ్వేతపర్వతం అయింది. అక్కడే అగ్నితోనూ, సూర్యునితోనూ సమానమైన రెల్లుగడ్డితో వనం అవతరించింది. అందులోనే గొప్ప తేజశ్శాలి అయిన కుమారస్వామి జన్మించాడు. అగ్ని ధరించిన శివుని వీర్యం నుంచి పుట్టాడు కనుక ‘అగ్నిసంభవు’డనీ, కృత్తికలు అనే నక్షత్రాలు అతనికి తల్లులై పాలిచ్చి పెంచడంవల్ల ‘కార్తికేయు’డనీ పేరుపొందాడు.

అశ్విని మొదలైన 27 నక్షత్రాలలో కృత్తిక మూడవది. ఇది నిజానికి ఆరు నక్షత్రాల గుంపు. కనుక ‘కృత్తిక’ అని ఏకవచనంలో చెప్పినా అది నిత్యబహువచనం. సప్తర్షు(ఏడుగురు ఋషులు)లలో ఒకడైన వసిష్ఠుని భార్య అరుంధతి కాగా, మిగతా ఆరుగురు ఋషుల భార్యలే కృత్తికలు. అగ్ని ఋషిభార్యలను మోహించాడనీ, అప్పుడు అతని భార్య స్వాహాదేవి మిగతా ఆరుగురు ఋషుల భార్యల రూపం ధరించి భర్తతో రమించింది కానీ అరుంధతి రూపం మాత్రం ధరించలేకపోయిందనీ, అందుకే సప్తర్షి మండలంలో అరుంధతి ఒక్కతే కనిపిస్తుందనీ పురాణకథ.

తిరిగి అసలు కథకు వస్తే; పుత్రుడు కావాలనుకుని తను భర్తతో సంభోగిస్తుంటే దేవతలు అడ్డుపడినందుకూ, తన భర్త వీర్యాన్ని భూమి ధరించినందుకూ ఉమ ఆగ్రహించింది. మీరు కూడా మీ భార్యలవల్ల సంతానం పొందలేరని దేవతలను శపించింది; అలాగే, అనేక రూపాలతో అనేకమందికి భార్యవవుతావని, నాకు పుత్రానందం లేకుండా చేశావు కనుక నువ్వూ ఆ ఆనందానికి దూరమవుతావని భూమిని శపించింది. ఆ తర్వాత ఉమా, శివుడూ హిమవత్పర్వతం మీదే పశ్చిమదిశగా వెళ్ళి తిరిగి తపస్సు ప్రారంభించారు.

రాముడు గంగ గురించి అడిగితే ఇంతవరకూ ఉమ గురించి చెప్పిన విశ్వామిత్రుడు, ఆ తర్వాత గంగ గురించి మళ్ళీ ఎత్తుకున్నాడు. అది కుమారస్వామి కథకే మరో పాఠం. దేవతలందరూ బ్రహ్మను కలసి, “నువ్వు మాకు సేనాపతిగా నియమించిన శివుడు తపస్సు చేసుకుంటున్నాడు కనుక, ఆయన స్థానంలో మరో సేనాపతిని నియమించ”మని అడిగారు. శివుని వీర్యాన్ని ధరించిన అగ్ని, హిమవంతుని పెద్దకూతురైన గంగ ద్వారా దేవతలకు సేనాపతి కాగలిగిన పుత్రుని పుట్టిస్తాడని, ఉమ కూడా అందుకు అంగీకరిస్తుందని బ్రహ్మ చెప్పాడు. అప్పుడు దేవతలు ధాతువులతో నిండిన కైలాసపర్వతానికి వెళ్ళి నీలో ఉన్న శివుని వీర్యాన్ని గంగలో ఉంచమని అగ్నిని ఆదేశించారు. ధాతువు అనే మాటకు బంగారం, వెండి, ఇత్తడి, రాగి, ఇనుము తదితర లోహాలతో సహా అనేక అర్థాలున్నాయి.

అగ్ని గంగ దగ్గరికి వెళ్ళి శివుని వీర్యంతో గర్భం ధరించమని కోరాడు. గంగ అంగీకరించి దివ్యమైన రూపం ధరించింది. అగ్ని తనలో ఉన్న శివుని వీర్యాన్ని ఆమె దేహమంతటా వ్యాపింపజేశాడు. అప్పుడు గంగ, “విజృంభించిన నీ తేజస్సును నేను ధరించలేను, అది నన్ను దహిస్తోంది, నాకు స్పృహ తప్పుతోంది” అని అగ్నితో అంది. “నీ గర్భాన్ని హిమవత్పర్వతం దగ్గరలో ఉన్న చిన్న పర్వతం మీద విడిచిపెట్టు” అని అగ్ని అన్నాడు. గంగ అలాగే విడిచిపెట్టింది. అప్పుడా శివుని వీర్యమనే తేజస్సునుంచి బంగారము, వెండి పుట్టాయి. అందులోని క్షారంనుంచి రాగి, ఇనుము పుట్టాయి. అందులోని మలం తగరమూ, సీసమూ అయింది. ఆవిధంగా నేల మీద పడిన ఆ వీర్యంనుంచి అనేక ధాతువులు వృద్ధి చెందాయి. ఆ పర్వతం మీదే మొలిచిన రెల్లుగడ్డి, చెట్లు, లతలు, పొదలతో సహా అన్నీ బంగారంగా మారిపోయాయి. అగ్నితో సమానమైన కాంతి కలిగింది కావడంవల్ల బంగారానికి ‘జాతరూప’మనే పేరు వచ్చింది.

ఆ తర్వాత ఆ వీర్యంనుంచి కుమారస్వామి పుట్టాడు. కృత్తికలు ఆరుగురూ ఏకకాలంలో అతనికి పాలిచ్చి పెంచేలా దేవతలు ఏర్పాటు చేశారు. కృత్తికలు పెంచడంవల్ల ‘కార్తికేయు’డనీ, గంగ గర్భంనుంచి స్రవించాడు కనుక ‘స్కందు’డనీ, ఆరుగురు కృత్తికలనుంచి ఏకకాలంలో ఆరుముఖాలతో పాలు తాగాడు కనుక ‘షణ్ముఖు’డనీ అతనికి పేరు వచ్చింది. ఒక్కరోజు మాత్రమే పాలు తాగి అతను దైత్యసేనలను జయించాడు. దేవతలు అతణ్ణి దేవసేనకు నాయకుడిగా నియమించారు. అతని భార్యలలో ఒకరి పేరు ‘దేవసేన’.

ఈ కథలో- కారణం ఏమైనప్పటికీ, సంతానోత్పత్తిలో ఉమ అనే స్త్రీ మాధ్యమాన్ని పక్కన పెట్టడం, పురుషవీర్యానికి ప్రాధాన్యం ఇవ్వడం కనిపిస్తుంది. అందుకు ఉమ ఆగ్రహించి దేవతలను, భూమిని శపించినట్టు కూడా ఈ కథ చెబుతూనే ఉంది. ఆ పురుషవీర్యం కూడా సామాన్యమైనది కాదు; దానిని లోకాలు ధరించి భరించలేవు. మరోపక్క, అదెంత గొప్ప వీర్యమైనా దానినుంచి సంతానం కలగాలంటే ఏదో ఒక మాధ్యమం అవసరమన్న స్పృహనూ ఈ కథ వ్యక్తం చేస్తూనే ఉంది. ఆ మాధ్యమం ఉమలాంటి స్త్రీ కాదు; మొదటి పాఠంలో స్త్రీగా మానవారోపం చేసిన భూమి. అయితే, భూమి శివుని వీర్యాన్ని స్వీకరించినా స్వయంగా దానినుంచి సంతానాన్ని పుట్టించలేకపోయింది. అగ్ని అనే పురుషుడు ఆ వీర్యంలోకి ప్రవేశించి, వాయువు సాయంతో దానిని వ్యాపింపచేయవలసివచ్చింది. అలా వ్యాపింప చేయడంలో అది శ్వేతపర్వతం అయింది. ఆ పర్వతం మీద ఒక రెల్లుగడ్డి వనం మొలిచి, చివరికి అందులో కుమారస్వామి జన్మించాడు.

రెండవ పాఠంలో శివుని వీర్యానికి మాధ్యమంగా మారినది, స్త్రీగా మానవారోపం చేసిన గంగ అనే నది. ఆ నది కూడా నేరుగా మాధ్యమం కాలేదు, అగ్ని అనే మరో పురుషమాధ్యమం ద్వారానే ఆమెకూ శివుని వీర్యం సంక్రమించింది. అత్యంత తేజోవంతమైన ఆ వీర్యాన్ని ఆ నది భరించలేక, అగ్ని చెప్పడంతో హిమవత్పర్వతాలలోనే ఉన్న ఒక చిన్న పర్వతం మీద దానిని విడిచిపెట్టింది. అక్కడే మొలిచిన ఒక రెల్లుగడ్డి వనంలో కుమారస్వామి జన్మించాడు. మొత్తానికి, ఈ రెండు పాఠాలలోనూ ఉమ అనే స్త్రీయే కాదు సరికదా; స్త్రీ ఆరోపం జరిగిన భూమికి, నదికీ కూడా కుమారస్వామి జననంలో పురుషుడితో సమానమైన స్వతంత్రపాత్ర లేదు!

స్త్రీకి స్వతంత్రపాత్ర లేకపోవడం ప్రస్తుతసందర్భానికి అవసరమైన ఒకానొక అన్వయం మాత్రమే. ఈ కథకు ఇతరేతరమైన అన్వయాలు కూడా ఉన్నాయి. ఇంతకుముందు ఉదహరించుకున్న ‘ఎంకి-ప్రపంచవ్యవస్థ’(Enki and the World Order)అనే సుమేరు పురాణకథకు విలియం ఇర్విన్ థామ్సన్ తన పుస్తకంలో చేసిన విశ్లేషణ వెలుగులో ఈ కుమారస్వామిజననగాథను పరిశీలించినప్పుడు ఆ ఇతరేతర అన్వయాలు అద్భుతంగా మన దృష్టికి వస్తాయి. మొత్తంగా మన పురాణ, ఇతిహాసకథలను ‘మన’ అనే సంకుచితపు హద్దులు దాటించి విశాల పౌరాణికజగత్తులో భాగం చేస్తాయి; కొత్త వైజ్ఞానికపు వాకిళ్ళు తెరచి సరికొత్త అవగాహనవైపు నడిపిస్తాయి.

దాని గురించి తర్వాత...





Tags:    

Similar News