మేలు కంటే కీడెక్కువ చేస్తున్న సీమ బాబుల్

పర్యావరణాన్ని కాపాడుతుందని తెచ్చిన ఈ విదేశీ చెట్టును అంతమెందించడం ఎలా?;

Update: 2025-05-02 05:36 GMT
తుమ్మ చెట్టు (Prosopis juliflora)

సీమ బాబుల్ (Neltuma juliflora) అనే చెట్టు మెక్సికో, దక్షిణ అమెరికా మరియు కరేబియన్ ప్రాంతాలకు చెందినది. ఇది భారతదేశంలో సహజసిద్ధంగా ఉండే స్థానిక చెట్టు కాదు. ఈ చెట్టుకు స్థానికంగా సీమ బాబుల్, విలాయతి బాబుల్ , ముండ్ల చెట్టు అనే పేర్లు ఉన్నాయి. దీని వేగవంతమైన పెరుగుదల, ఎండలను తట్టుకునే సామర్థ్యం వల్ల ఇది వేగంగా విస్తరిస్తూ, స్థానిక పర్యావరణాన్ని దెబ్బతీసే స్థితికి చేరుకుంది.

బ్రిటిష్ వారి పరిపాలన సమయంలో, భారతదేశంలోని దక్షిణాది రాష్ట్రాలు తీవ్రమైన వరుస కరువులతో బాధపడుతుతుండేవి. అప్పట్లో వర్షాభావం, వరుస పంట నష్టాలు, మరియు వృద్ధిపొందుతున్న జనాభా కారణంగా ఆహార లోపమే కాదు, వంటకు అవసరమైన ఇంధనం కూడా విపరీతంగా కొరతయ్యేది. పల్లె, పట్టణ ప్రాంతాలన్నీ ఒక భయంకరమైన నిరాశలో ఉండే పరిస్థితి నెలకొంది. మరీ ముఖ్యంగా ఇది మలేరియా వ్యాప్తి చేసే దోమలను ‘కరువుకాలం’ఆహారం అందించి కాపాడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఇదెలా వ్యాప్తి చెందింది

ఒకప్పుడు దక్షిణ భారతదేశంలో ప్రజలు తమ జీవనాధారంగా ఉండే వనరులను, అంటే చెట్లను వంటచెరుకుగా వాడటం వల్ల అరణ్యాలలో పచ్చదనం క్షీణించిపోయింది. ఇది నేలపై తేమ తగ్గడానికి, వర్షాలపై ప్రభావం చూపించడానికి, చివరికి కరువులను మరింత ఉధృతం చేయడానికి దారితీసింది.

ఈ పరిస్థితిని అంచనా వేసిన బ్రిటిష్ ప్రభుత్వ అధికారులు, కరువు ప్రభావాన్ని తగ్గించేందుకు ఒక వినూత్న ప్రయత్నం ప్రారంభించారు. దానిలో భాగంగా, 1877లో "సీమ బాబుల్" మొక్కను మెక్సికో నుండి తెప్పించి భారతదేశంలోకి ప్రవేశపెట్టారు. ఇది ముఖ్యంగా ఎడారి ప్రాంతాలలో కూడా వేగంగా పెరిగే లక్షణం కలిగి ఉండటంతో, ఇది నేలపై ఆకుపచ్చ కవచాన్ని కలిగించి వాతావరణాన్ని కొంతమేర మెరుగుపరుస్తుందని భావించారు.

ఢిల్లీ మరుభూమికి ఇలా వ్యాపించింది...

1920లలో న్యూ ఢిల్లీ నిర్మాణ సమయంలో ఎడారిలా కనిపించే బంజరు భూములను ఆకృతివంతమైన అడవులుగా మార్చేందుకు బ్రిటిష్ వారు రెండవ దఫా ఈ చెట్లను మెక్సికో నుండి దిగుమతి చేసుకున్నారు.

స్వాతంత్ర్యానంతరం దేశంలో ఏర్పడిన వరుస కరువును అధిగమించేందుకు అప్పటి ప్రభుత్వాలు కొన్ని కీలక చర్యలు చేపట్టాయి. వాటిలో భాగంగా, చెట్లు లేని బీడు భూముల్లో కొంత జీవం పోసేందుకు జులిఫ్లోరా (Prosopis juliflora) విత్తనాలను హెలికాప్టర్ల ద్వారా వెదజల్లారు. దీని ముఖ్య ఉద్దేశ్యం బీడు నేలల్లో ఆకుపచ్చదనం కలిగించడం, మట్టి ఏరోషన్ కాకుండా చూడటం , భూతాపాన్ని తగ్గించడం మరియు పశువులకు కొంతమేర మేత అందించే ఉద్దెశం.

తమిళనాడులో....

ఆపై 1960లలో, తమిళనాడు రాష్ట్రం తీవ్రమైన కరువును ఎదుర్కొంది. పంటలు తుడిచిపోతుండగా, ప్రజలు తినడానికి తిండికూడా లేక, వండుకోవడానికి వంటచెరుకు కొరత ఎదురవుతూ ఉండేది. ఈ సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా వున్న కామరాజ్ గారు, రాష్ట్రంలో వంట ఇంధన నిమిత్తం ప్రజలు వెదురులాంటి చెట్లను విపరీతంగా నరకండం మూలానా అడవులు అంతరించి క్షామానికి కారణం అవుతున్నాయని గ్రహించారు. అప్పటి పరిస్థితులలో తగట్టుగా కరువు నివారణ చర్యలలో భాగంగా, ప్రజలకు వంట ఇంధనం అందించేందుకు, వనరులుగా వాడదగిన మొక్కల అవసరం గుర్తించారు. నెల్టూమా జులిఫ్లోరా గింజలను దిగుమతి చేసుకుని, ప్రజలకి ఉచితంగా లేదా సబ్సిడీతో అందిస్తూ, ఈ చెట్లను పెద్ద ఎత్తున నాటేలా ప్రోత్సహించారు. ఇది పొలాల చుట్టూ, తోటల చుట్టూ, ఇండ్లకి చుట్టూ జంతువులనుంచి కాపాడే జీవ కంచెగా ఉపయోగ పడుతుందని, మరియు లాభదాయకమైన మొక్కగా వ్యవసాయ శాఖ ద్వారా ప్రచారం చేసి ప్రజలలో విశ్వాసం పెంచారు.

ఇలా అంచెలంచలుగా భారతదేశంలోకి చొరబడిన ఈ విదేశీ మొక్క కొన్ని దశాబ్దాల్లోనే ఈ మొక్క యొక్క అసలైన దుష్ప్రభావాలు బయటపెట్టాయి.

ఈ చెట్లు పెరుగుతున్న చుట్టూ ప్రక్కల స్థానిక జాతుల చెట్ల మొక్కల వృద్ధిని ఆలస్యం చేయడమే కాకుండా వాటి విత్తనాల మొలకెత్తడాన్ని అడ్డుకోడం ద్వారా మరియు వాటి మొలకల అభివృద్ధిని నిలిపివేయడం ద్వారా స్థానిక జాతుల పుష్పజాల జీవవైవిధ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్నాయి.

మిగతా స్వదేశీ చెట్ల కన్నా ఈ చెట్లు అధికంగా భూగర్భ జలాలను పీల్చుకొంటూ భూగర్భజలాలను అడుగంటనించడంలో ప్రముఖపాత్ర పోషిస్తూ ఇతర పంటల పెరుగుదలపై ప్రభావం చూపింది.

వీటికి నీటి దాహం ఎక్కువ

ఈ సీమ బాబుల్ చెట్టు ఒక గ్రామ్ వుడ్‌ను (కలప )ఉత్పత్తి చేయడానికి, స్వదేశీ చెట్ల కంటే సుమారు ఇరవై రెట్లు ఎక్కువ నీటిని గ్రహించుకుంటుంది. ఈ చెట్లు అధిక నీటి వినియోగం పొలాల్లో భూగర్భ జలాల ఉనికిని తీవ్రంగా దెబ్బతీస్తోంది, ప్రత్యేకంగా వర్షాధారంగా ఆధారపడే ప్రాంతాల్లో ఇ చెట్లు మరింత ప్రమాదకరంగా మారుతున్నాయి .

ఆఫ్రికా ఖండం లోని అఫార్ ప్రాంతంలో పి. జులిఫ్లోరా నీటి వినియోగం పై జరిగిన పరిశోధనలలో ఒక హెక్టర్ విస్తీర్ణంలో పెరిగే జులైఫ్లోరా వినియోగించుకొనే నీటితో దాదాపు 46 హెక్టార్ల పత్తి పంటను లేదా 33 హెక్టార్ల చెరుకు సాగుకు సరిపోతుందని తేలింది .

ఈ చెట్టు పండ్లు పశువులకు రుచిగా ఉండటం మూలానా వీటిని పశువులు తినడంలో మితిమీరినపుడు పశువులకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.

ఈ చెట్టు వదిలే గాలిలో తక్కువ ఆక్సిజన్ మరియు ఎక్కువ కార్బన్ డయాక్సైడ్‌ ఉంటుంది కాబట్టి ఇది పక్షులకు కూడా ఆశ్రయం ఇవ్వదు.

భూమిపై తగినంత నీరు లేకపోతే పి. జులిఫ్లోరా భూగర్భ జలాలను పీల్చుకోవడం ప్రారంభిస్తుంది. భూగర్భ జలాలు లేకపోతే, అది పరిసరాల నుండి తేమను గ్రహించడం ప్రారంభిస్తుంది. ఇది భూగర్భ జలాలను కూడా విషపూరితంగా మారుస్తుంది.

మరొక ప్రమాదం మలేరియా వ్యాప్తి

ఈ చెట్టు దోమలకు ఆశ్రయం ఇచ్చి మలేరియా వ్యాప్తికి బలమైన కారణభూతమైంది. జూలిఫ్లోరా చెట్లు గుంపులుగా పెరిగే స్వభావం వల్ల చిన్న అడవిలా మారి, దోమలకు అనువైన నివాస వాతావరణాన్ని కలిగిస్తాయి. ఈ చెట్ల పుష్పాలు సమృద్ధిగా తేనెను ఉత్పత్తి చేస్తాయి. మగ, ఆడ దోమలు ఈ తేనెను తాగేందుకు పూలపై వాలుతుంటాయి. ఈ తేనె మలేరియా వ్యాధిని వ్యాపింపజేసే (ప్లాస్మోడియం పరాన్నాజీవికి) అనాఫీలీస్ ఆడ దోమలు ఎక్కువ కాలం జీవించగలిగేలా చేసి మలేరియా వ్యాప్తికి దోహదపడతాయి.

ఇంతటి దుష్ప్రభావాలను కలిగిస్తున్న ఈ విదేశీ చెట్టు — ప్రాసోపిస్ జులిఫ్లోరా — ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతటా విస్తరించింది. ఇది కేవలం స్థానిక పుష్పజాల జీవవైవిధ్యాన్ని నాశనం చేయడమే కాకుండా, భూగర్భజలాలను కూడా వేగంగా అడుగంటిస్తున్నదని పలు పరిశోధనాత్మక నివేదికలు స్పష్టం చేశాయి.

ఆక్సిజన్ తక్కువ కార్బన్ డైయాక్స్ డ్ ఎక్కువ

మరొక విషయంలోనూ ఈ చెట్టు ప్రకృతి సౌహార్ధతకు వ్యతిరేకంగా పనిచేస్తోంది. ఇది విడిచే గాలిలో తేమ శాతం అత్యంత తక్కువగా ఉండటం వలన వాతావరణం పొడి పరిస్థితులకు లోనవుతోంది. అంతేకాదు, ఇది విడుదల చేసే కార్బన్ డయాక్సైడ్ మోతాదు ఎక్కువగా ఉండటంతో, భూ ఉపరితల ఉష్ణోగ్రతను పెంచే ప్రభావం కలుగుతోంది. దీని వలన పరిసరాల వాతావరణం వేడెక్కడం, స్థానిక వన్యప్రాణుల జీవన స్థితిగతులపై ప్రభావం పడటం వంటి అనేక వ్యతిరేక పరిణామాలు సంభవిస్తున్నాయి.


సామాన్యంగా చెట్లు పర్యావరణాన్ని సమతుల్యం చేయడంలో సహకరిస్తాయి. కానీ ప్రాసోపిస్ జులిఫ్లోరా మాత్రం వ్యతిరేక ప్రభావాలు చూపిస్తూ, పర్యావరణానికి మరియు వ్యవసాయానికి తీవ్రమైన సవాళ్లను విసురుతోంది. అందువల్ల దీనిని గుర్తించి సమగ్రంగా నియంత్రించాల్సిన అవసరం అనివార్యం.

ఈ చెట్టు మీద న్యాయపోరాటం

తమిళనాడు రాష్ట్రమంతా పెరుగుతున్న ఈ చెట్టు దుష్ప్రభావాలను గుర్తించిన ఎండిఎంకె నాయకుడు వైకో, ఈ సమస్య పరిష్కారానికి 2015 సెప్టెంబర్‌లో తమిళనాడు హైకోర్టు మదురై శాఖలో ఈ చెట్ల నిర్మూలన కోసం ప్రజాహిత వ్యాజ్యం (PIL) దాఖలు చేశారు.

సుదీర్ఘ విచారానంతరం జస్టిస్ ఎ. సెల్వం మరియు జస్టిస్ పి. కలైఅరసన్‌లతో కూడిన మదురై బెంచ్‌లోని మద్రాసు హైకోర్టు పిల్ లో దాఖలు పరచిన సమస్య తీవ్రతను గుర్తించి

2017లో రాష్ట్ర ప్రభుత్వానికి వెంటనే ఈ మొక్కను నిర్మూలించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.

అయినా సరే, ప్రభుత్వ చర్యలు తీరుగా లేకపోవడంతో, 2022లో, మద్రాసు హైకోర్టు మరోసారి ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, తక్షణం దీన్ని నిర్మూలించేందుకు ప్రత్యేక విధానాన్ని రూపొందించమని సూచించింది.

దీనికి అనుగుణంగా, 2022 జూలై 13న, తమిళనాడు ప్రభుత్వం ఈ ఆక్రమణదార మొక్కపై ప్రత్యేకంగా ఓ నిర్మూలనా విధానాన్ని (eradication policy) ప్రకటించింది. ఈ విధానం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సీమ బాబుల్ చెట్లను గుర్తించి, వాటిని క్రమంగా తొలగించేందుకు కార్యాచరణ ప్రారంభమైంది.

ప్రాసోపిస్ జులిఫ్లోరా — ప్రకృతిపై పెరిగిన శాపం

ఇంతటి దుష్ప్రభావాలను కలిగిస్తున్న విదేశీ వృక్షం — ప్రాసోపిస్ జులిఫ్లోరా — ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతటా విస్తరించి ఉంది. మొదట్లో ఇది ఎడారి ప్రాంతాల్లో మట్టిని పరిరక్షించేందుకు, ఇంధన వనరుల కోసమే నాటబడింది. కానీ ఇప్పుడు ఇది స్వతంత్రంగా విస్తరిస్తూ పర్యావరణానికి ఒక శాపంగా మారుతోంది.

పలు పరిశోధనాత్మక నివేదికలు స్పష్టంగా చూపిస్తున్నట్లుగా, ఈ వృక్షం కేవలం స్థానిక పుష్పజాలం మరియు జీవవైవిధ్యాన్ని ధ్వంసం చేయడం వరకు మాత్రమే పరిమితం కాకుండా, భూగర్భజలాలను వేగంగా అడుగంటిస్తున్నది. దీని వేళ్లు భూమిలో చాలా లోతు వరకు ప్రవేశించి చుట్టుపక్కల నీటి నిల్వలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ ప్రభావం రైతుల పొలాలను, పశుగ్రాస భూములను, మరియు స్థానిక వృక్షజాతుల పెరుగుదలనే విచ్ఛిన్నం చేస్తోంది.

ఇలాంటి పరిస్థితుల్లో బాధ్యత కేవలం ప్రభుత్వంపైనే కాదు, ప్రతి పౌరుడిపై ఉంది. జులిఫ్లోరా ఉనికిని తట్టుకునే పరిస్థితి లేదని మనం గుర్తించాలి. ఇది వ్యవసాయాన్ని, పర్యావరణాన్ని, మన భవిష్యత్తును ముట్టడిస్తున్న ఆక్రమణ వృక్షం.

ఇంతటి వినాశకర లక్షణాలు కలిగిన ఈ విదేశీ చెట్టును ఆంధ్ర రాష్ట్ర భూభాగం నుండి కూకటివ్రేళ్ళతో పూర్తిగా పేకలించవలసిన అవసరం స్పష్టంగా ఉంది. ఇది కేవలం ప్రభుత్వ విధానాల ద్వారానే కాకుండా — ప్రజల చైతన్యంతో, సామూహిక నాశన ప్రణాళికలతో, శాస్త్రీయ మద్దతుతో సాధ్యమవుతుంది. ప్రతి గ్రామస్థుడు, ప్రతి రైతు, ప్రతి పర్యావరణప్రేమికుడు — ఈ చర్యలో భాగస్వామిగా మారాల్సిన అవసరం ఎంతగానో ఉంది.

ఈ వృక్షాన్ని సమూలంగా తొలగించడం ద్వారా మన భూమికి, నీటికి, జీవవైవిధ్యానికి, మరియు మన జీవనవిధానానికి నూతన శ్వాసనిచ్చే అవకాశాన్ని కల్పించవచ్చు.

Tags:    

Similar News