సామ్రాజ్యవాదపు కోటలను ట్రంప్ పెకిలించి వేస్తున్నారా?

సుంకాల యుద్ధం అమెరికా పాత్రని ప్రపంచంపై పరిమితం చేయబోతోందా?;

By :  508
Update: 2025-04-07 08:15 GMT
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

(అనువాదం.. ప్రవీణ్ చెప్యాల)

కమ్యూనిస్టు దిగ్గజాలైన లెనిన్, మావో, హోచి మిన్ చేయలేని పనిని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసి చూపిస్తున్నాడు. కమ్యూనిస్టులు అంటే సామ్రాజ్యవాద వ్యతిరేకులు. కానీ వారు తాము అనుకున్న పనిమాత్రం పూర్తిగా చేయలేకపోయారు. కానీ వైట్ హౌజ్ లో కూర్చున్న డొనాల్డ్ ట్రంప్ మాత్రం అత్యంత ప్రభావవంతమైన సామ్రాజ్యవాద వ్యతిరేకిగా మారినట్లు కనిపిస్తున్నారు.

ఇందుకు ఆయన ఎంచుకున్న దారి మనందరి కళ్లముందు కనిపిస్తోంది. అమెరికా గత పాలకులు చేసిన చారిత్రక తప్పును సరిదిద్దడానికి తాను ప్రయత్నం చేస్తున్నానని చెప్పుకుంటూ వాషింగ్టన్ తో వాణిజ్యం చేసే ప్రతిదేశంతోనూ ఆయన సుంకాలు విధించారు.
ట్రంప్ దెబ్బతో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అన్ని దేశాలు అమెరికాను మోసగించాయని, తమ ఉత్పత్తులపై భారీగా సుంకాలు విధిస్తూ మోసం చేస్తున్నాయని ఆయన వాదిస్తున్నారు. ఈ అసమతుల్యతను సరిదిద్దడానికి ఇదే తగిన సమయం అమెరికా అధ్యక్షుడు నిర్ణయించారు.
‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ కోసం మార్పులు..
ట్రంప్.. తనకు తాను అమెరికాను కాపాడటానికి వచ్చిన దూతగా భావిస్తున్నాడు. ‘‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’(మాగా) నినాదంతో అమెరికన్లను మెప్పించిన ఆయన అంతకుముందు ప్రముఖ వ్యాపారవేత్త.
మొదటి టర్మ్ కాలంలోనే ఇదే విధమైన పాలనతో కాస్త మంచి మార్కులు వేసుకున్నారు.అందుకే రెండోసారి నాలుగేళ్ల తరువాత కూడా అధ్యక్షుడు కాగలిగారు. ఆయన వాణిజ్యాన్ని రాజకీయ నాయకుడిగా కాకుండా ఓ వ్యాపారవేత్త గానే చూస్తున్నాడు.
అమెరికాను ఒక మెగా సూపర్ పవర్ గా నిర్మించడానికి గత పాలకులు ఉపయోగించిన విధానాలను, అలాగే తన ప్రత్యర్థి సోవియట్ యూనియన్ ను కూల్చివేయడానికి ఉపయోగించిన అవే వ్యూహాలను ఇప్పుడు ట్రంప్ కూల్చివేస్తున్నాడు.
అమెరికాను దశాబ్దాలుగా వ్యతిరేకించే ప్రపంచ నాయకులు, చేయలేని పని ట్రంప్ చాలా సులువుగా.. ఇంకా చెప్పాలంటే చిన్న కాగితంతో పూర్తి చేశారు. ఆయన రెండోసారి అధికారంలోకి వచ్చాక తన చర్యలతో అమెరికా అధికారాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు.
ఇంతకుముందు పాలకులు దీర్ఘదృష్టి లేనివారా?
కొన్ని సరళమైన ప్రశ్నలకు కాస్త ఆలోచించి చూస్తే సమాధానాలు కనిపిస్తాయి. గత యూఎస్ పరిపాలకులు సుంకాల దృక్కోణం నుంచి ఇతర దేశాలకు అనుకూలంగా ఉండే వాణిజ్యాన్ని ఎందుకు అనుమతించారు?
ట్రంప్ కంటే ముందు అమెరికాను ఏలిన వారు తమ సొంత ఖర్చుతో ఇతరులను సంతోషంగా ఉంచడానికి యూఎస్ ప్రయోజనాలను తాకట్టు పెట్టారా? అంతగా ఆలోచించలేకపోయారా? యునైటెడ్ నేషన్స్, యూఎస్ ఎయిడ్ వంటి ప్రపంచ సంస్థలకు యూఎస్ ఎందుకు నిధులు కేటాయించింది?
రెండవ ప్రపంచ యుద్ధం తరువాత, అమెరికా తన శత్రువులైన జపాన్, జర్మనీ పునర్నిర్మాణం కోసం మిలియన్ డాలర్లను కుమ్మరించింది. ఎందుకు వారికోసం అంత ఔదార్యం ప్రదర్శించింది? దాని హృదయం ద్రవించడం వలన? కాదు ఇక్కడ కూడా అమెరికా ప్రయోజనాలు ఉన్నాయి. వాటి ప్రయోజనాలను వాషింగ్టన్ అనుభవించింది.
డాలర్ దౌత్యం..
అమెరికా సూపర్ పవర్ గా ఎదిగిన తరువాత దాన్ని దశాబ్ధాలుగా నిలబెట్టుకోవడానికి ప్రధాన కారణం డాలర్ ఆధిపత్యం. ప్రపంచ దేశాలన్నీ కచ్చితంగా వ్యాపారం చేయాలంటే డాలర్ ను ఉపయోగించాల్సిన అగత్యం ఏర్పడేలా చేసింది. తరువాత దాన్నే ఆయుధంగా మార్చింది.
ఆర్థికంగా ఉదారంగా ఉండటానికి ప్రతిఫలంగా ఆయా దేశాలు అమెరికా సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకోవడానికి అనుమతించాయి. ప్రాధాన్యత వాణిజ్యాన్ని తమకు దక్కడానికి, అంతర్గత రాజకీయాలలో ప్రభావం చూపడానికి అంగీకరించాయి. ఈ చర్యతో అమెరికా ప్రభావం గణనీయంగా పెరిగింది. అది తనను తాను సూపర్ పవర్ గా మారడానికి వీలు కల్పించింది.
కొన్ని నివేదికల ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా అమెరికాకు దాదాపుగా 900 వరకూ సైనిక స్థావరాలు ఉన్నాయి. ఇవి చాలా శక్తి గలిగినవి. వ్యాపారంలో తమకు ఇచ్చిన ప్రాధాన్యానికి చిహ్నంగా ఆయా దేశాలు వాటిని ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి ఇచ్చాయి.
ఇందులో దాదాపుగా 120 వరకూ జపాన్ లోనే ఉన్నాయి. తరువాత స్థానంలో జర్మనీ, దక్షిణ కొరియా ఉన్నాయి. మొత్తం మీద యూఎస్ సైనిక స్థావరాల విస్తృతమైన నెట్ వర్క్ యూరప్ లో ఉంది. పెంటగాన్ వీటిపై అధికారికంగా సమాచారం విడుదల చేయనందున ఇవి కేవలం అంచనాలు మాత్రమే.
అమెరికా విదేశాంగ విధానం..
19 వ శతాబ్ధం చివరి నుంచే ప్రపంచ ఆధిపత్యం సాధించాలనే స్పష్టమైన లక్ష్యంతో అమెరికా క్రమబద్దమైన బహుముఖ వ్యూహాన్ని రచించింది. అందులో భాగంగా తనను ప్రపంచంలోనే అత్యంత ప్రజాస్వామ్య దేశంగా మార్కెట్ చేసుకుంది.
ఇక్కడ వ్యక్తిగత స్వేచ్ఛలు పవిత్రమైనవి, ప్రభావవంతమైనది నిరూపించడానికి ప్రయత్నించింది. ప్రపంచంలో ఉన్న అత్యుత్తమ విద్యావంతులు, అక్ష్యారాస్యులు, కొన్ని రంగాలలో నిష్ణాతులైన వ్యక్తులు స్వేచ్ఛ, ప్రజాస్వామ్యాన్ని ఆస్వాదించడానికి అమెరికాకు వచ్చారు. అసలు అమెరికా సాధించినవన్నీ కూడా వలస వచ్చిన వ్యక్తులు సాధించినవే.
అమెరికా ఎక్కువగా జెకిల్- హైడ్ విదేశాంగ విధానాన్ని అనుసరించింది. అమెరికన్ డ్రీమ్ అనే నినాదాన్ని ఇది ప్రొత్సహించింది. ఇప్పుడు ట్రంప్ వ్యూహం దానికి భిన్నంగా ఉంది.
ఉచితంగా ఏవి ఇవ్వలేదు
అమెరికా పాలకులు తమ దేశ ప్రయోజనాల దృష్ట్యా మాత్రమే వ్యవహరించారు. నియంతృత్వాలకు మద్దతు పలికారు. సైనిక తిరుగుబాట్లు, నకిలీ విప్లవాలను రూపొందించారు. అన్ని కూడా ఆదేశ ప్రయోజనం కోసం చేసివవే.
అమెరికా సైనిక వ్యయం ప్రపంచాన్ని కలవరపెడుతోంది. పబ్లిక్ డొమైన్ లో ఉన్న సమాచారం ప్రకారం.. అమెరికా సైనిక బడ్జెట్ దాదాపుగా 820 బిలియన్ డాలర్లు. ఇది అమెరికా తరువాత ఉన్న తొమ్మిది దేశాల కంటే ఎక్కువ. దాని సైనిక శక్తి చాలా బలీయమైనది.
ట్రంప్ కంటే ముందు అమెరికాను పాలించిన వారు ఏదీ ప్రపంచానికి ఉచితంగా ఇవ్వలేదు. ఒకవేళ బహుమతిగా, గ్రాంట్ గా, సహాయంగా ఎవరికైనా ఇచ్చిన డాలర్లకు కఠినమైన నిబంధలను అమలు చేసింది. దీనిని జీర్ణించుకోవడం కష్టమే.
కానీ ట్రంప్ మద్దతుదారులు మాత్రం ఈ అంశాన్ని ఉద్దేశపూర్వకంగా విడిచిపెట్టారు. రిపబ్లికన్ల పెద్ద ప్రాజెక్ట్ - 2025 వ్యూహ పత్రంలో భాగమైన 180 పేజీల(ఇంకా విడుదల కాలేదు) గైడ్ ను ప్రస్తుతం ట్రంప్ బృందం అనుసరిస్తోంది.
కొత్త పొత్తులు ఉదయిస్తాయా?
పరస్పర సుంకాలను విధించడం ద్వారా అమెరికా తనకున్న బాధ్యతలను ఇష్టపూర్వకంగా విముక్తి చేసేలా ట్రంప్ చర్యలు కనపడుతున్నాయి. అమెరికా దానధర్మాలపై ఆధారపడిన అనేక యూరప్ దేశాలు ఇప్పుడు పూర్తిగా నిరాశలో కూరుకుపోయాయి.
రష్యా- ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందం కుదుర్చుకున్న ట్రంప్ తీరు.. ఒకప్పుడు శక్తివంతమైన వలసరాజ్యాలుగా ఉన్న జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్ ఎంత బలహీనంగా మారాయో చెప్పడానికి ఒక గొప్ప ఉదాహరణ.
ట్రంప్ విధానాలు కొత్త సమీకరణాలు, పొత్తులకు దారి తీసే అవకాశం కనిపిస్తోంది. ఈ విధానంలో అమెరికా పాత్ర నామమాత్రం లేదా అసలు దాని ఉనికే కనిపించకపోవచ్చు.
ఇప్పటికే యూరోపియన్ దేశాలు చైనా, భారత్ వంటి దేశాలతో వాణిజ్యం పెంచుకోవడానికి కొత్త ఒప్పందాలు చేసుకోవాలని ఆలోచిస్తున్నాయి. ఆగ్నేయాసియాలోని పెద్ద ఆర్థిక వ్యవస్థలు, అమెరికా సన్నిహిత మిత్రదేశాలు జపాన్, దక్షిణ కొరియా కొత్త వాణిజ్య ఒప్పందాలపై తమ ప్రత్యర్థి చైనాతో చర్చలు జరిపాయి.
అమెరికా ప్రభావం అంతమవుతుందా?
అమెరికా సుంకాల దెబ్బకు బాధపడిన అనేక దేశాలు ఇప్పుడు కొత్త ఏర్పాట్లు చేసుకోవడానికి సిద్దమయ్యాయి. ఈ సమీకరణాల చివరి అర్థం ఏంటంటే.. అమెరికా తననే తానే అణగదొక్కడానికి రంగం సిద్దంచేసుకుంటోంది.
ఉదాహారణకు యూఎస్ ఎయిడ్ నిలుపుదల చేయడం వలన అంతర్గత సంఘర్షణలు, ప్రకృతి విపత్తులతో బాధపడుతున్న సూడాన్ ఇతర సబ్ సహారా ఆఫ్రికా దేశాలతో సహ ప్రపంచంలో ఇతర పేద దేశాలకు ఇబ్బందిగా మారింది.
ఈ యూఎస్ ఎయిడ్ లో జాబితాలో పది మిలియన్ డాలర్ల సాయం నుంచి 800 మిలియన్ డాలర్ల సాయం వరకూ ఉన్నాయి. వీటిని ట్రంప్ సర్కార్ రద్దు చేసింది. ఈ కారణంగా అమెరికాలో దాదాపుగా 15 వేల ఉద్యోగాలు పోయాయి. ప్రపంచవ్యాప్తంగా 65 వేల మంది రాత్రికిరాత్రే నిరుద్యోగులుగా మారారు. పరోక్షంగా ఈ జాబితా ఇంకా పెద్దగా ఉండి ఉంటుంది.
అంతర్గతంగా ఎంత నష్టం అంటే..
అమెరికా నిలిపివేసిన ఆర్థిక సాయాల వల్ల స్వల్ప, మధ్యకాలంలో కొన్ని మానవత కార్యాలు దెబ్బతింటాయి. కానీ వీటిని పూరించడానికి చైనా రంగంలోకి దిగవచ్చు. లేదా ఇతర మితవాద శక్తులు బరిలోకి దిగి వాటికి నిధులు కేటాయించవచ్చు. ఇది కాలక్రమేణా అమెరికా ప్రభావం ప్రపంచం నుంచి కనుమరుగు కావడానికి దారితీస్తుంది.
అయితే ట్రంప్ తో పాటు ఆయన అనుచరగణం మాత్రం ‘మగ’ తో తిరిగి అమెరికా ఆర్థిక వ్యవస్థకు మంచి చేస్తామని, ప్రజలకు ఉద్యోగాలు కల్పిస్తామని, జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తామని హమీలు ఇస్తున్నారు. అది కొంతవరకు నిజమైనా.. ఇతర రంగాలలో అమెరికాకు భారీ నష్టం జరగబోతోంది.
అమెరికాలో ఇప్పటికే వేలాది మంది ఫెడరల్ ఉద్యోగులు తమ జాబ్ ను కోల్పోయారు. ఎలాన్ మస్క్ ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించడానికి పూనుకోవడం ఇందుకు కారణం. ఇప్పుడు ట్రంప్ ప్రారంభించిన సుంకాలతో వస్తువుల ధరలు పెరుగుతాయి, ఇప్పటికే నిరుద్యోగంతో కొట్టుమిట్టాడుతున్న జనాభాకు ఇది మరో బలమైన ఉత్పాతంలా మారుతుంది.
ట్రంప్ కు థ్యాంక్స్ చెప్పుకోవాలి..
శతాబ్దానికి పైగా అమెరికా ప్రపంచంలోని ప్రతి మూల జరిగే అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ, నిత్యం రావణ కాష్ఠాన్ని రగిలించింది. ఇప్పుడు ఆ సామాజ్రవాదపు కోరలు ట్రంపే పెకిలించివేయడానికి కంకణం కట్టుకున్నారు.
ట్రంప్ పదవీకాలం ముగిసిపోయిన తరువాత కూడా ఆయన విధానాలు కొనసాగితే అమెరికా పాత్ర గణనీయంగా తగ్గిపోతుంది. కాబట్టి ప్రపంచం ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ట్రంప్ అనంతరం కాలంలో మిగిలిన ప్రపంచం దీనిని సద్వినియోగం చేసుకోగలదు.


Tags:    

Similar News