మన దేవాలయ వ్యవస్థకు తొలి చిరునామా ఎక్కడుంది?

రామాయణంలో నిరుత్తరకాండ-33 హిందూ ఆలయాల్లోని గర్భగుడిలోని గర్భమనే మాటా, గర్భగుడి రూపకల్పనా వేల సంవత్సరాలగా అవిచ్ఛిన్నంగా కొనసాగుతూవస్తున్న అమ్మమతపు అవశేషమే.

By :  491
Update: 2024-11-10 10:44 GMT

(కల్లూరి భాస్కరం)

దేవాలయం ఫలానా విధంగా ఉంటుందని ఈరోజున కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. దేవాలయాలు మన దగ్గర చిరపరిచితాలూ, అసంఖ్యాకాలూ. అయినాసరే, స్థూలంగా చెప్పుకుంటే, ప్రతి దేవాలయానికీ ఒక ప్రవేశద్వారం, అందులోంచి లోపలికి వెళ్ళాక ఎత్తుగా కట్టిన ఓ నలుచదరపు అరుగు, ధ్వజస్తంభం, చివరిగా దేవుణ్ణి, లేదా దేవతను ప్రతిష్ఠించిన ఒక చిన్న మందిరం ఉంటాయి. దానిపైన, పోను పోను సన్నబడే శిఖరమూ, మొత్తం దేవాలయం చుట్టూ ప్రహరీగోడా ఉంటాయి. కొన్ని దేవాలయాల్లో తటాకమూ, గోశాల, వంటసాల కూడా ఉంటాయి.

బహుశా మనలో చాలామందికి అంతగా తెలియని ఒక విశేషమేమిటంటే, ఇంచుమించు పైన చెప్పిన దేవాలయరూపమూ, దేవాలయానికి అనుబంధంగా ఉండే తటాకం, గోశాల, వంటసాల వంటివీ మన దేశానికి వెలుపల ప్రాచీన సుమేరు సంస్కృతిలో కూడా ఉండేవి. దీని గురించిన విపులమైన పరిశీలన ఈ వ్యాసకర్త రచించిన ‘మంత్రకవాటం తెరిస్తే మహాభారతం మనచరిత్రే’ అనే గ్రంథంలో కనిపిస్తుంది.
దేవతాప్రతిష్ఠ జరిగిన చిన్నమందిరాన్ని ‘గర్భగుడి’ అంటాం. గర్భమంటే కడుపు, కడుపులోని పిండం, లోపలి భాగం వగైరా అర్థాలున్నాయి. కనుక ‘గర్భగుడి’లోని గర్భమనే మాటకు కడుపు, కడుపులోని పిండమనే వాస్తవికార్థాలే చెప్పుకోవలసిన అవసరంలేదనీ, దేవాలయం ‘లోపలిభాగ’మనే అర్థాన్నే చెప్పుకోవచ్చుననీ మనకీరోజున అనిపించవచ్చు. కానీ వాస్తవం ఏమిటంటే, గర్భగుడిలోని గర్భమనే మాట సూచిస్తున్నది కడుపును, అందులోని పిండాన్నే. అది అక్షరాలా మాతృగర్భానికి ప్రతీక!
గర్భగుడీ, దానిని దృశ్యమానం చేసే తీరూ మాతృగర్భానికి నకలుగా ఉంటాయి. ఉదాహరణకు, మొత్తం ఆలయంలో గర్భగుడి ప్రత్యేకంగానూ, విడిగానూ, చిన్నదిగానే కాక, మడీ, ఆచారాలను పాటించవలసినదిగానూ, ఎవరు పడితే వారు వెళ్లకూడనిదిగానూ, అత్యంతప్రధానమైనదిగానూ ఉంటుంది. బయటి వాతావరణానికి భిన్నంగా అది చీకటిగా ఉంటుంది. గర్భగుడిలో ఆముదందీపమే తప్ప విద్యుద్దీపాలు పెట్టకూడదని కంచి పరమాచార్య తరచు చెప్పేవారు.
నిజానికి గర్భగుడిలోని గర్భమనే మాటా, గర్భగుడి రూపకల్పనా వేల సంవత్సరాల వెనకటి ఎగువరాతియుగంనుంచీ నేటివరకూ అవిచ్ఛిన్నంగా కొనసాగుతూవస్తున్న అమ్మమతపు అవశేషాలు. అవి అచ్చంగా అమ్మ గర్భాన్ని, అమ్మతనాన్ని, సృష్టిలో అమ్మపాత్రను సంకేతించేవి. కాకపోతే ఇప్పుడు పురుషదేవుళ్ళను ప్రతిష్ఠించిన తావును కూడా ‘గర్భ’గుడే అంటున్నాం! అంటే, వేల సంవత్సరాల కాలగమనంలో తత్త్వం అడుగంటి, తంతు మిగిలిందన్నమాట!
మన దగ్గర శివాలయాల్లోని గర్భగుడిలో లింగమూ, యోనిని తలపించే పానవట్టమూ ఉంటాయి. గర్భధారణకు మూలాలు కనుక ఇవి కూడా అమ్మమతంతో, అంటే గర్భంతో, తద్వారా గర్భగుడితో సంబంధమున్న పురాతనప్రతీకాలే. అమ్మమతంలో ఇవి ముఖ్యమైనవని ఇంతకుముందు చెప్పుకున్నాం. ఈ రెండింటికీ కూడా అమ్మదేవతే ప్రాతినిధ్యం వహిస్తుందని కూడా అనుకున్నాం. అయ్యమతం పుంజుకున్న తర్వాత లింగాన్నిపూర్తిగా శివుడికి ఆపాదించినట్టు కనిపిస్తుంది.
మనకు చిరపరిచితమైన పై దేవాలయదృశ్యం నుంచి, అంత చిరపరిచితం కాని మరి కొన్ని దేవాలయవిశేషాలను చూద్దాం. మన దగ్గర ఇప్పటికీ అనేకచోట్ల పాతాళ ఆలయాలు, గుహాలయాలు కనిపిస్తాయి. ఉదాహరణకు, శ్రీకాళహస్తిలో పాతాళవినాయకుని ఆలయం ఉంది. మామూలు నేల మట్టానికి చాలా దిగువున ఉన్న ఆ ఆలయంలోని దేవుణ్ణి దర్శించడానికి మెట్లు దిగి వెళ్లాలి.
అలాగే, నాసిక్ దగ్గర పర్ణశాల అనే చోట సీతాదేవి పేరిట ఒక గుహ ఉంది. ఆమెను దర్శించడానికి ఇరుకైన మార్గంలో ఇంచుమించు పాకుతూ వెళ్ళాలి. తిరుమల విషయానికే వస్తే, అలిపిరి నుంచి కాలినడకన స్వామి దర్శనానికి వెళ్ళేదారిలో కొన్ని ఎత్తైన మెట్లున్న భాగాన్ని ‘మోకాలి పర్వత’మనీ, అక్కడి ఒక మండపాన్ని ‘మోకాలి మండప’మనీ అంటారు. భక్తులు అక్కడినుంచి కొంతదూరం మోకాళ్ళ మీద మెట్లెక్కుతూ వెడతారు. ఆపైన అనేక దేవాలయాల్లో భక్తులు పొర్లు దండాల పేరిట నేల మీద పొర్లడం కనిపిస్తుంది.
ఇంతకీ అసలు సంగతేమిటంటే, పైన చెప్పిన ‘గర్భ’గుడి, పాతాళ ఆలయాలు, గుహాలయాలు, మెట్లు దిగీ, ఇరుకైన దారిలో పాకుతూ వెళ్ళి, మోకాళ్ళతో మెట్లెక్కి దైవదర్శనం చేసుకోవడాలు, పొర్లుదండాలు...వీటన్నింటి మూలాలను వెతుక్కుంటూ వెడితే, మన దేశాన్ని దాటి పశ్చిమాసియాలోని నేటి తుర్కియే(టర్కీ)లో ఉన్న చాటల్ హ్యుయక్ (Çatal hüyük) అనే ఒక పురావస్తుప్రదేశానికి చేరుకుంటాం!
చాటల్ హ్యుయక్ కొత్తరాతియుగానికి చెందిన ఓ అతిపెద్ద జనావాసం. జేమ్స్ మెలార్ట్ (James Mellart) అనే బ్రిటిష్-డచ్చి పురాతత్వశాస్త్రవేత్త దీనిని బయటపెట్టాడు. క్రీ.పూ.7500-6400 మధ్యకాలానికి, అంటే ఇప్పటికి దాదాపు 10వేల సంవత్సరాల వెనకటికి చెందినదిగా దీనిని గుర్తించారు. ఇది 32 ఎకరాల స్థలంలో ఉంది. రెండు వేల సంవత్సరాలకు పైగా ఇది అస్తిత్వంలో ఉందనీ, కొన్ని వేలమంది ఇక్కడ నివసించేవారనీ అంచనా వేశారు. విశేషమేమిటంటే, అతిప్రాచీన నాగరికతలుగా చరిత్రకెక్కిన మెసపొటేమియా(క్రీ.పూ.4000), సింధు(క్రీ.పూ.3300-1300), ఈజిప్ట్(క్రీ.పూ 3100-332)ల కన్నా కూడా చాటల్ హ్యుయక్ పురాతనం!
దీనికి పొరుగునే సుబెర్దే(Suberde) అనే మరో కొత్తరాతియుగపు జనావాసం ఉంది. ఇది క్రీ.పూ.6600 కు చెందినది. విలియం ఇర్విన్ థామ్సన్ ఈ జనావాసంతో పోల్చి చాటల్ హ్యుయక్ ప్రత్యేకతను వివరిస్తాడు. సుబెర్దే - వేట, ఆహారసేకరణజనాలకు చెందిన ఓ గ్రామం మాత్రమే. అక్కడ మట్టిగోడలతో కట్టిన ఇళ్ల అవశేషాలు, తిరగలి రాళ్ళు, ఆయా పదార్థాలను నిల్వచేసుకోడానికి మట్టితో చేసిన గాదెలు బయటపడ్డాయి కానీ, కుండలు బయటపడలేదు.
కాకపోతే, ఆహారసేకరణ క్రమంగా పెరటిసాగువైపు మళ్లినట్టు పై సామగ్రి సూచిస్తున్నాయి. ఇదే కాలంలో ఇతరత్రా వ్యవసాయమూ, వర్తకమూ స్థిరంగా పాదుకుంటూ కొత్తరాతియుగపు సమాజం సరికొత్త జీవనవిధానంవైపు మళ్లడం కనిపిస్తుంది. దానికి సంబంధించిన సంపూర్ణ అభివ్యక్తికి అద్దం పడుతున్నదే, చాటల్ హ్యుయక్. సుబెర్దే గ్రామమైతే, చాటల్ హ్యుయక్ పట్టణం కావడం- రెండింటి మధ్యా ఒక ముఖ్యమైన తేడా.
అగ్నిపర్వతంనుంచి వచ్చే లావా గట్టిపడినప్పుడు దానిని గాజుగానూ, ఇతర సామగ్రిగానూ అప్పట్లో వాడుకునేవారు. ఆవిధంగా అది ఒక ముఖ్యమైన వర్తకపు సరకుగా పరిణమించింది. ఆ వర్తకానికి కేంద్రంగా మారిన చాటల్ హ్యుయక్ వస్తూత్పత్తిలో కొత్తపుంతలు తొక్కుతూ, సుబెర్దేకు భిన్నంగా సంకీర్ణనాగరికత దిశగా తొలి అడుగులు వేసింది. అప్పట్లో విలాసవంతంగా భావించిన లావా అద్దాలు, రాగితోనూ, సీసంతోనూ చేసిన పూసలు, నగల వంటి ఇతర అలంకరణ సామగ్రి, రకరకాల కొయ్యపాత్రలు, ఉన్నివస్త్రాలు, కుండల తయారీతో సహా పాదార్థికసంపదలో పడగెత్తిన కొత్తరాతియుగపు తొలి జనావాసం ఇదే.
ఇదొక పార్శ్వమైతే, పాతకొత్తల మేలుకలయిక కావడం చాటల్ హ్యుయక్ కు చెందిన మరొక పార్శ్వం. ఈ సందర్భలో జర్మనీకి చెందిన పురావస్తుపండితుడు హైన్ రిచ్ ష్లీమన్ (Heinrich Schliemann)కనుగొన్న ట్రాయ్(Troy) తో చాటల్ హ్యుయక్ కు పోలిక తెస్తాడు థామ్సన్. ఈ రెండు అద్భుతావిష్కారాలూ పౌరాణికయుగాన్ని చరిత్రపూర్వకాలంలోకి తీసుకొచ్చి చరిత్రకారుల పనిని ఎంతో తేలిక చేశాయంటాడు. ఎగువరాతియుగానికి చెందిన సంప్రదాయాలు, ఆచారాలు కొత్తరాతియుగంలోకి ఎలా అవిచ్ఛిన్నంగా ప్రవహించాయో చాటల్ హ్యుయక్ కళ్ళకు కడుతుంది.
గుహాచిత్రాలనుంచి కుడ్యచిత్రాలకు మళ్లిన క్రమం కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఎగువరాతియుగానికి చెందిన మతపరమైన ప్రతిమాకల్పనను, చిత్రశైలిని పుణికిపుచ్చుకున్న ఇక్కడి కుడ్యచిత్రాలు ఆ తర్వాతి కాలానికి చెందిన క్రీటు, మైసీనియా మూర్తులకు మాతృకలు కావడం మరో విశేషం. కొత్తరాతియుగానికి చెందిన చాటల్ హ్యుయక్ చిత్రకళారంగంలో అటు ఎగువరాతియుగానికి చెందిన లస్కో గుహలకు, ఇటు కంచుయుగానికి చెందిన క్రీటు, మైసీనియాలకు మధ్య వారధి అయిందన్నమాట. కాకపోతే లస్కో గుహాచిత్రాలకు, చాటల్ హ్యుయక్ కుడ్యచిత్రాలకు ఒక తేడా ఉందంటాడు థామ్సన్. లస్కో చిత్రాలలో అవ్యక్తంగా ఉన్నది కాస్తా చాటల్ హ్యుయక్ చిత్రాలలో వ్యక్తంగా మారింది.
వర్తకానికీ, పట్టణనాగరికతకూ, వస్తూత్పత్తికి చాటల్ హ్యుయక్ దాదాపు తొలి చిరునామా కావడం సరే; మరోవైపు అది అమ్మమతానికి చెందిన విశ్వాసాలకు, తంతులకు కేంద్రస్థానంగానూ; ఆ పురాతన, విశ్వజనీనమతం తాలూకు ఒక విద్వత్పీఠం(అకాడెమీ)గానూ చెబుతాడు థామ్సన్. ఆవిధంగా, మన దగ్గర ఒకప్పుడు వర్తకానికీ, వ్యవసాయానికీ అనువుగా ఉండే నదీతీరాల్లోనూ, మార్గాలలోనూ వెలసిన కంచి, కాశీ, శ్రీశైలం లాంటి పుణ్యక్షేత్రాలను చాటల్ హ్యుయక్ గుర్తుచేస్తుంది.
కాకపోతే, పుణ్యక్షేత్రం గురించిన ఇప్పటి మన అవగాహనకు చాటల్ హ్యుయక్ నిర్మాణం భిన్నంగా ఉంటుంది. అక్కడ నివాసగృహాలు, దేవాలయమూ దేనికవే కాకుండా కలసిపోయి ఉంటాయి. ఇళ్ళు ఉమ్మడి గోడలతో ఒకదానికొకటి దగ్గరగా ఉంటాయి. చాలా ఇళ్లకు మనకిప్పుడు తెలిసిన పద్ధతిలో ప్రవేశద్వారాలు ఉండవు. జనం పై కప్పునుంచి మెట్లు దిగి ఇంట్లోకి ప్రవేశిస్తారు. ఈ నిర్మాణం రక్షణవ్యవస్థను సూచిస్తుందన్న జేమ్స్ మెలార్ట్ అభిప్రాయంతో థామ్సన్ విభేదిస్తూ, అది స్త్రీదేహాన్ని, మాతృగర్భాన్ని సూచిస్తూ ఉండచ్చని అంటాడు.
ఈ సందర్భంలో 19వ శతాబ్దికి చెందిన మానవశాస్త్రవేత్త జె. జె. బాహోఫెన్(J. J. Bachoven)ను ఆయన ఉటంకిస్తాడు. బాహోఫెన్ ప్రకారం, ఆచారాలు, ఆనవాయితీలే కాక నగరాల ఆవిర్భావం కూడా గ్రీకుదేవత అయిన డిమీటర్(Demeter)ఆరాధన కాలానికి చెంది ఉండవచ్చు. డిమీటర్ కు ఆయా తంతులు జరిపే తావులే నగరాలుగా అభివృద్ధి చెందాయి. వాటి చుట్టూ లేచిన గోడలు భూగర్భంనుంచి, అంటే మాతృగర్భంనుంచి పుట్టుకు రావడాన్ని సంకేతిస్తాయి. ఎక్కడైనా గోడ కట్టడంలో ఉద్దేశం, ఎవరు పడితే వారు యథేచ్ఛగా లోపలికి రావడాన్ని నిషేధించడమే. వాస్తవంగా ఆ నిషేధం పుట్టింది, మాతృగర్భానికి గల పవిత్రతనుంచే నన్నది బాహోఫెన్ అన్వయం. చాటల్ హ్యుయక్ నిర్మాణం ఆ అన్వయాన్ని ప్రతిబింబిస్తూ ఉండచ్చనని థామ్సన్ అంటాడు.
కనుక, చాటల్ హ్యుయక్ నిర్మాణం తీరు ఆక్రమణదారులనుంచి రక్షించుకోడానికి కాక, మతపరమైన తంతులు జరిగే లోపలి ప్రదేశంలో మడి, మైల పాటించడం కోసమూ; అపవిత్రుల ప్రవేశాన్ని నిషేధించడం కోసమేనని ఆయన వివరణ. అది వర్తకకేంద్రం కూడా కనుక వర్తకులు అక్కడ ఆగి సురక్షితంగా వస్తుమార్పిడి చేసుకోవచ్చు కానీ అది లోపల కాకుండా బయట మాత్రమే జరుగుతుంది. ఆ ప్రాంతాన్ని అంటిపెట్టుకుని ఉన్న పవిత్రత, మడి ఆక్రమణదారులను దూరంగా ఉంచి వర్తకులకు, అక్కడి ఇతర జనాలకు రక్షణ కల్పిస్తాయన్నమాట. పురాతనమైన అమ్మమతం ఏ ఒకరికో చెందినది కాక, సార్వత్రికం, విశ్వజనీనం కనుక ఏ సంస్కృతికి, ఏ తెగకు చెందినవారైనా కలిసిపోయే వాతావరణం చాటల్ హ్యుయక్ లో ఉంటుంది. అక్కడ పాటించే మడి, మైలకు సంబంధించిన నిషేధాలే ఒకరినుంచి ఒకరికి రక్షణ కల్పిస్తాయి. ఆవిధంగా నగరాలకు స్వాభావికమైన ఒక సంకీర్ణసంస్కృతికి అది అద్దం పడుతుంది.
ఇంతకుముందు చెప్పుకున్న లస్కో గుహలకు వస్తే, గుహ అమ్మదేవత దేహమైతే, గుహలోపలి చిత్రాలు ప్రాకృతికమైన అమ్మ గర్భంలోని జీవులు. అలాగే, చాటల్ హ్యుయక్ లోని లోపలి గదులు అమ్మగర్భాన్ని, అక్కడి చిత్రాలు ఆ గర్భంలోని జీవులను సంకేతిస్తాయి. పై కప్పు మీదనుంచి మెట్లు దిగి కింది గదుల్లోకి వెళ్ళేలా జరిగిన ఆ నిర్మాణాన్ని గమనించినప్పుడు మన దగ్గర, పైన చెప్పిన పాతాళ వినాయకుడు, ఇంకా అలాంటి దేవీ, దేవుళ్ళ గుడులకు సంబంధించిన మూలాలు ఎక్కడున్నాయో అర్థమవుతుంది. అయితే, అన్ని దేవతామందిరాలూ అలాగే ఉండవనీ, కొన్ని చోట్ల నేలమట్టంలో ఇరుకైన చిన్న చిన్న ప్రవేశమార్గాలు ఉంటాయనీ, వాటిలోకి చేతుల మీద, మోకాళ్ళ మీద పాకుతూ వెళ్లాల్సి ఉంటుందని కూడా థామ్సన్ అంటాడు. మన దగ్గర ఇందుకు సంబంధించిన ఉదాహరణలనూ పైన చెప్పుకున్నాం.
చాటల్ హ్యుయక్ లోపలి గదులు కొన్నింట్లో నిర్దిష్టంగా జంటదేవతల్లాంటి స్త్రీరూపాలే ఉంటాయి. కొన్ని గదులు నిర్దిష్టంగా పురుషరూపాలతోనూ, ఎద్దుకొమ్ముల చిత్రాలతోనూ ఉంటాయి. ఎద్దు, లేదా వృషభం అమ్మదేవతకూ, పురుషుడికీ, లేదా పుంస్త్వానికీ కూడా చెందిన ఉమ్మడి ప్రతీక అని ఇంతకుముందు చెప్పుకున్నాం. చాటల్ హ్యుయక్ లోని మరికొన్ని గుడులలో స్త్రీ, పురుషుల జంట చిత్రాలు, జంటదేవతా చిత్రాలు, ఎద్దు నీటిమీద తేలుతున్నట్టు చూపే చిత్రాలు కనిపిస్తాయి.
ఈవిధంగా చాటల్ హ్యుయక్ లోని ప్రతిమావ్యవస్థ మొత్తం స్త్రీ, పురుషశక్తులు జతకూడడంనుంచి పుట్టిన రాతియుగపు జనాల విశ్వసృష్టిభావనకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఆ తర్వాతి కాలంలో పురుషదేవుళ్లు, స్త్రీదేవతలు, అవతారాలు ఎన్ని వచ్చినా; మతవిశ్వాసాలు, తంతులు ఎన్ని మార్పులకు లోనైనా సృష్టికి సంబంధించి స్త్రీ, పురుషశక్తులు జతకూడడంనుంచి పుట్టిన ఈ మౌలికమైన, సహజసిద్ధమైన భావన మన పౌరాణికతాత్వికతలో ఏదో ఒక రూపంలో కొనసాగుతూనే ఉంది. మనదగ్గర దేవీభాగవతం వంటి పౌరాణికవాఙ్మయంలో, దర్శనాలలో ఈ మౌలికతాత్వికతను దర్శించవచ్చు.
కొత్తరాతియుగానికి చెందిన చాటల్ హ్యుయక్ వాస్తు, చిత్రకళావారసత్వాలు, ఆ తర్వాతి కంచుయుగానికి చెందిన గ్రీకు, మైసీనియాలకు ఎలా సంక్రమించాయో థామ్సన్ చెబుతాడు. చాటల్ హ్యుయక్ లోని ఒక గది గోడమీద ఉన్న జంటదేవత చిత్రానికి జేమ్స్ మెలార్ట్ ఇచ్చిన అన్వయం ప్రకారం, అందులో గ్రీకు, మైసీనియాలకు చెందిన డిమీటర్, ఆమె కూతురు కొరే(Kore) అనే దేవతల మూలాలు కనిపిస్తాయి. ‘కొరే’ను పెర్సాఫని (Persephone) అని కూడా అంటారు. దానికి ఎదురుగా ఉన్న గోడ మీద ఒక ఎద్దు చిత్రం ఉంటుంది. అది పురుషసూత్రానికి ప్రతీక.
అది కొరేను ఎత్తుకుపోవడానికి తెరచుకున్న పాతాళాన్ని తలపిస్తుంది. గ్రీకుపురాణకథ ప్రకారం, డిమీటర్, జియస్(Zeus)ల కూతురు- కొరే. ఆమెను హేడీస్(Hades) అనే పాతాళ, మృత్యుదేవుడు ఎత్తుకువెళ్ళి పెళ్లాడతాడు. ఆవిధంగా కొరే పాతాళదేవత అవుతుంది. ఈ కథకు వ్యవసాయ, ఋతుసంబంధమైన అన్వయం ఉంది. దాని ప్రకారం, డిమీటర్ పంటలను వృద్ధిచేసే దేవత. తన కూతురును హేడిస్ ఎత్తుకుపోవడంతో ఆమె దుఃఖంలో మునుగుతుంది. దాంతో పంటలు క్షీణిస్తాయి. జియస్ జోక్యంతో కొరే ఆరు నెలలు పాతాళంలో, ఆరునెలలు భూమిమీద ఉండే ఏర్పాటు జరుగుతుంది. ఋతువుల మార్పు మీద ఆధారపడే వ్యవసాయాన్ని ఈ కథ సూచిస్తుంది.
చాటల్ హ్యుయక్ వాస్తుశైలి గ్రీసులోని పురాతన క్రీటుద్వీపంలో ఉన్న నోసొస్(Knossos)రాజప్రాసాదంలో కనిపిస్తుంది. అక్కడ గజిబిజి దారులతో నిండిన పద్మవ్యూహంలాంటి ఓ భూగృహంలో మినోతోర్(Minotaur) అనే వృషభాసురుడు ఉంటాడు. జేసన్ అనే గ్రీకుయువకుడు ఆ గజిబిజిదారులగుండా వెళ్ళి ఆ రాక్షసుని జయిస్తాడు. ఆ భూగృహం చాటల్ హ్యుయక్ లోని నిర్మాణశైలిని తలపిస్తుంది.
మన దగ్గరి సింధునాగరికతకు సమకాలికమైన క్రీటుద్వీపం కూడా అమ్మమతానికి చెందినదే. అక్కడ మాతృస్వామికవ్యవస్థ ఉండేది. ప్రత్యేకించి మనకు ఆసక్తిగోలిపేది ఏమిటంటే, చాటల్ హ్యుయక్ చిత్రకళావారసత్వం సింధులోయ తవ్వకాలలో బయటపడిన ఒక స్త్రీ తాలూకు చిత్రంలో కనిపించడం! చాటల్ హ్యుయక్ లో ఒక చోట అమ్మదేవత గర్భం నుంచి కొమ్ములతో ఉన్న ఒక వృషభం పుట్టుకవస్తున్నట్టు సూచించే చిత్రం ఒకటి ఉంది. సింధులోయ చిత్రంలో తలకిందులుగా ఉన్న స్త్రీమూర్తి యోని నుంచి మొక్క పుట్టుకురావడం కనిపిస్తుంది.
చాటల్ హ్యుయక్ గురించిన మరికొన్ని విశేషాలు తర్వాత...


Tags:    

Similar News