స్త్రీ తన గృహసామ్రాజ్యంలో తనే ఎలా బందీ అయింది?

రామాయణంలో నిరుత్తరకాండ-32: పురాణ, ఇతిహాసాల్లో ద్రోణుడు వంటి వారిని కుంభసంభవులు అనడంలోని సామాజిక విశేషం ఏమిటో పరిశోధకుడు కల్లూరి భాస్కరం చెబుతున్నారు.

Update: 2024-10-31 05:55 GMT

రాతియుగాల (Stone Age) కాలనిర్ణయం అన్ని ప్రాంతాలలోనూ ఒకే విధంగా లేదు. ఎగువపాతరాతియుగాన్ని వెనకటి 50వేల నుంచి 12వేల సంవత్సరాల మధ్యకాలంగానూ; మధ్యరాతియుగాన్ని వెనకటి 12వేల నుంచి 10వేల సంవత్సరాల మధ్యకాలంగానూ; కొత్తరాతియుగాన్ని వెనకటి 10 వేల నుంచి 8వేల సంవత్సరాల మధ్యకాలంగానూ; ఆ తర్వాతినుంచి నేటివరకు నాగరికయుగంగానూ చరిత్రకారులు ఉజ్జాయింపుగా అంచనావేశారు. విలియం ఇర్విన్ థామ్సన్ ప్రకారం, ఎగువపాతరాతియుగం నుంచి కొత్తరాతియుగంవరకూ అమ్మమతమే ప్రాబల్యం వహించింది. ఈ కాలాలకు చెందిన గుహాచిత్రాలు, కుడ్యచిత్రాలు, ఇతర పురావస్తు ఆధారాలు అదే చెబుతున్నాయి. సామాజికంగా చెబితే ఈ కాలం పూర్తిగా మాతృస్వామికదశకు చెందినది.

నాగరికకాలం దగ్గరికి వచ్చేసరికి పరిస్థితి తలకిందులై, మాతృస్వామ్యం స్థానాన్ని పితృస్వామ్యం పూర్తిగా ఆక్రమించుకోవడం మొదలైంది. అమ్మమతం ‘అయ్యమతం’గా మారే ఈ ప్రక్రియను ప్రాతిపదికగా చేసుకుని ఆహారసేకరణ వ్యవసాయదశకు ఎలా మళ్లిందో; జంతువుల పెంపకం ఎందుకు, ఎలా మొదలైందో; అది పితృత్వాన్ని నిర్దిష్టంగా గుర్తించడానికి ఎలా దోహదం చేసిందో థామ్సన్ చెప్పుకుంటూవస్తాడు. ఆహారసేకరణనుంచి వ్యవసాయంవైపూ, జంతువుల పెంపకం వైపూ సాగిన మొత్తం క్రమంలో కీలకపాత్ర వహించినది స్త్రీయే నంటాడాయన. మన దగ్గర శివుని పశుపతిగా చెబుతాం; కానీ మొదట్లో ఆ హోదా అమ్మదేవతదే. ఇంకో విశేషమేమిటంటే, చాలామంది భావించినట్టు జంతువుల పెంపకం ఆహారపు అవసరంగా మొదలు కాలేదనీ, మతకర్మలలో భాగంగా మొదలైందనీ థామ్సన్ అంటాడు.

థామ్సన్ అధ్యయనంలో మతం, సమాజం, సంస్కృతి, చరిత్ర ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉంటాయి; ఆవిధంగా అది బహుముఖీనం. ఎగువరాతియుగానికి చెందిన అమ్మమతం మధ్యరాతియుగంలోనూ, కొత్తరాతియుగంలోనూ కూడా తన ఆధిక్యాన్ని నిలుపుకుంది కానీ; ఇతరత్రా మార్పులు సంభవిస్తూవచ్చాయని ఆయన అంటాడు. వాతావరణంలో, దానిని అనుసరించి పర్యావరణంలో వచ్చిన మార్పులు మానవసంస్కృతిని ఎలా మార్చుతూవచ్చాయో చూపిస్తాడు. ఉదాహరణకు, భౌగోళికకాలమానంలో 53లక్షల 33వేల సంవత్సరాల క్రితం మొదలై, 2 లక్షల 58వేల సంవత్సరాల క్రితం వరకూ కొనసాగిన ఆదిమానవయుగం(Pliocene)లో తేమ, దానితోపాటే అడవులు క్షీణిస్తూ ఉష్ణమండలపు పచ్చికబయళ్ళు తెరచుకోవడం- వాతావరణంలో వచ్చిన ఒక కీలకమైన మార్పు. వానరాల మానవీకరణ(hominization)లో అదొక ముఖ్యమైన దశ. ఆ దశలోనే మనిషి నిటారుగా నిలబడడం(హోమో ఎరక్టస్) నేర్చాడు.

ఈ ఆదిమానవయుగంలో ఒక దశలో 15లక్షల సంవత్సరాలపాటు వాతావరణం నిలకడగా ఉంది. అప్పుడే హోమో ఎరక్టస్ కొన్ని పరిణామాలకు లోనయ్యాడు. ఈ క్రమంలో యూరప్ లో, మూడు లక్షల సంవత్సరాలక్రితానికి చెందిన రెండవ మంచుయుగపు అంతర్దశలో ఆధునికమానవుడి(హోమో సేపియన్) తాలూకు తొలి ఆధారాలు వెలుగు చూశాయి. ఈ కాలానికే చెందిన తొలి రాతిచెక్కడాలు, సాధనాలు బయటపడ్డాయి. మనిషి విశ్వాన్ని ఆయా సంకేతాల రూపంలో సంక్షిప్తీకరించుకోవడం(symbolization) కూడా ఇప్పుడే మొదలైంది. మనం ‘సంస్కృతి’ గా చెప్పుకునేది వాస్తవంగా మొదలైంది ఇప్పటినుంచే నంటాడు థామ్సన్.

సంస్కృతి అడుగుపెట్టడంతోనే మార్పు వేగాన్ని పుంజుకుంది. ఉదాహరణకు, మానవీకరణకు లక్షలసంవత్సరాలు పడితే, సంకేతీకరణ(symbolization)కు కొన్ని వందల వేలసంవత్సరాలు మాత్రమే పట్టింది. వాతావరణంలో వచ్చిన మార్పు సరికొత్త పర్యావరణానికి దారితీయడం, ఆ పర్యావరణం కొంతకాలంపాటు స్థిరంగా ఉండడం జరుగుతూవచ్చింది. ఆవిధంగా స్థిరత్వమూ, మార్పూ ఒకదానివెంట ఒకటిగా మార్చి మార్చి సంభవించాయి. మంచుయుగపు మానవసంస్కృతిలో ఆయా పరికరాల తయారీ, చిత్రకళాసంప్రదాయాలు నిలకడగా సునిశితత్వాన్ని, సంక్లిష్టతను తెచ్చుకున్నాయి. ఆవిధంగా చిత్రకళారీతులు వెయ్యేళ్ళపాటు అవిచ్ఛిన్నంగా కొనసాగడం విశేషమన్న, ఫ్రాన్స్ కు చెందిన పురాతత్వ, మానవశాస్త్రవేత్త లెరోయ్- గుర్హాన్(Leroi-Gourhan) వ్యాఖ్యను థామ్సన్ ఉటంకిస్తాడు.

పర్యావరణంలో నిలకడా, మార్పూ మానవసంస్కృతిని ఎలా ప్రభావితం చేస్తాయో, పశ్చిమయూరప్ నేపథ్యంనుంచి ఆయన వివరిస్తాడు. మంచుయుగంలో యూరప్ లోని ఎడారుల్లో ధ్రువప్రాంతపు జింకలు, గుర్రాలు, అడవిదున్నలు పెద్దసంఖ్యలో ఉండేవి. ఎగువరాతియుగంగా వర్గీకరించిన ఆ కాలంలో జనం వేట, ఆహారసేకరణ మీద ఆధారపడి ఉండేవారు; వారికి కావలసిన ఆహారం మందల కొద్దీ జంతువుల రూపంలో పుష్కలంగా అందుబాటులో ఉండేది; కడుపు మాడ్చుకోవాల్సిన పరిస్థితి చాలా అరుదుగా ఎదురయ్యేది. ఆపైన, వారానికి పదిహేను గంటల్ని మించి ఆహారసంపాదనకు వినియోగించాల్సిన అవసరం ఉండేది కాదు. ఆవిధంగా, ఒంటి పంట వేసి వర్షాల కోసం ఎదురు చూసే వ్యవసాయదారుల కన్నా; రోజులో గంటల తరబడి పనిచేసే పారిశ్రామికకార్మికుల కన్నా వారి పరిస్థితి ఎంతో మెరుగ్గా ఉండేదని థామ్సన్ అంటాడు. వేట, ఆహారసేకరణ జనాన్ని అనాగరికులుగా, అజ్ఞానులుగా చిత్రించడాన్ని ఆయన తప్పుపడుతూ, ‘అసలు సిసలు సంపన్నసమాజం’ వారిదే నంటాడు.

గంటలకొద్దీ తీరిక సమయాన్ని మతపరమైన తంతులకూ, కళలకూ, కథల అల్లికకూ వెచ్చించే వెసులుబాటు వారికి చిక్కింది. వారి ప్రకృతి అధ్యయనం నుంచి స్త్రీల ఋతుక్రమం మీదా, చంద్రుడి మీదా ఆధారపడిన కాలగణనం అభివృద్ధి చెందింది. వందల వేల సంఖ్యలో గుహాచిత్రాలు అవతరించాయి. వాటికన్ సిటీలో పోప్ అధికారికనివాసమైన సిస్టీన్ చాపెల్(Sistine Chapel)యూరప్ సాంస్కృతికపునరుజ్జీవనానికి అద్దంపట్టినట్టుగా; ఎగువరాతియుగంలో మగ్దలీనియన్ సంస్కృతి వికసించిన తీరుకు లస్కో గుహలు అద్దంపట్టాయి. సునిశితత్వాన్ని, సూక్ష్మదృష్టిని ప్రతిబింబించే ఆ గుహల్లోని చిత్రాలు అప్పటి వేట, ఆహారసేకరణ జనాలకు అందుబాటులో ఉన్న తీరిక సమయాన్నే కాక; విశ్వనిర్మాణం గురించిన వారి ఊహాశక్తిని వెల్లడిస్తాయనీ, వారిది ‘అత్యున్నత సంస్కృతి’గా అభివర్ణించడం అతిశయోక్తి కాబోదనీ థామ్సన్ అంటాడు.

అయితే, వాతావరణం మారి, పర్యావరణాన్ని మార్చడంతోనే ఆ సంస్కృతికి విఘాతం కలిగింది. ఋతుపవనాలు దిశను మార్చుకోవడంతో అంతవరకూ ఉత్తర ఆఫ్రికాను ముంచెత్తిన వర్షాలు పశ్చిమ యూరప్ వైపు మళ్ళాయి. హిమానీనదాలు వెనుకడుగు వేసి, సముద్రతీరం 300 అడుగుల మేరకు పైకి లేచింది. యూరప్ లోని మంచుటెడారులు అడవులుగా మారిపోయాయి. దాంతో మందలు మందలుగా తిరిగే జంతువులు అదృశ్యమైపోయాయి. ఆహారసేకరణజనాలు అంతవరకూ అభివృద్ధి చేసిన సంస్కృతి కూడా ఆ జంతువులతోపాటే అదృశ్యమైపోయింది. మంచుయుగంలో అప్పటికే ఒక జీవనవిధానానికి అలవాటుపడిన మనిషికి, తన పురాతనమైన అటవీజీవనం తిరిగి ప్రత్యక్షమవడం ఏమంత సంతోషం నింపేది కాదనీ; కొత్తగా అంది వచ్చిన విల్లమ్ములనే సాధనంతో ఒకటీ ఆరా జంతువులను వేటాడి జీవించే పరిస్థితికి వచ్చాడనీ థామ్సన్ అంటాడు.

ఈవిధంగా, ఒక దశలో శీతలవాతావరణం సాంస్కృతికవికాసానికి ఉత్ప్రేరకమైతే, ఇంకో దశలో ఉష్ణవాతావరణం మార్పులకు కారణమైందంటాడు. స్థిరత్వమూ, మార్పూ అనే చక్రభ్రమణాన్ని అనుసరించి సాగే మనిషి అస్తిత్వంలో స్థిరమైనదిగా కనిపించే ఏ దశ అయినా తాత్కాలికమేననీ; వేట, ఆహారసేకరణదశనే కానీ, నేటి పారిశ్రామికదశనే కానీ మార్పు అంటిపెట్టుకునే ఉంటుందనీ ఆయన వ్యాఖ్య.

ప్రత్యేకించి మన ప్రస్తుతాంశమైన స్త్రీ, పురుష సంబంధాలకు వస్తే; ఎగువరాతియుగానికి చెందిన మగ్దలేనియన్ సంస్కృతినుంచి మధ్యరాతియుగం మీదుగా కొత్తరాతియుగంవైపు సాగిన మానవప్రస్థానంలో అవి ఎలా మార్పు చెందాయో యూరప్ నేపథ్యం నుంచి థామ్సన్ చర్చిస్తాడు. మంచుయుగానికి చెందిన సంస్కృతులలో మగ్దలేనియన్ సంస్కృతే చివరిది. 22 వేల సంవత్సరాల వెనకటి నుంచి మధ్యరాతియుగం వరకు కొనసాగిన ఈ సంస్కృతి, పైన చెప్పిన స్థిరదశలలో ఒకటి. ఇది మతమూ, కళలూ, సాంకేతికపరిజ్ఞానాల మధ్య సామరస్యం, సమతూకం కలిగిన అంతస్సంబంధాన్ని పెంపొందించనట్టే; స్త్రీ, పురుష సంబంధాలలోనూ పెంపొందించింది. ఎలాగంటే, జంతువులు మందలు మందలుగా తిరిగే దశలో స్త్రీల మొక్కల సేకరణలానే, పురుషుల వేట కూడా చాలావరకూ సేకరణరూపంలోనే ఉండేది. ఆవిధంగా స్త్రీ, పురుషుల శ్రమలో సమతుల్యత ఉండేది. దైనందినజీవనంలో స్త్రీ, పురుష సూత్రాలమధ్య నెలకొన్న ఆ సమరస్యాన్నే అప్పటి గుహాచిత్రాలు ప్రతిబింబించాయి. ఆహారసేకరణతో మొదలుపెట్టి; అర్చకత్వం, కళలు, చేతివృత్తులతో సహా అన్నిటా స్త్రీ, పురుషుల మధ్య సమానత్వం ఉండేది.

ఆ తర్వాత 10వేల సంవత్సరాల క్రితం వరకూ కొనసాగిన మధ్యరాతియుగంలో స్త్రీ, పురుషుల మధ్య నెలకొన్న ఈ సామరస్యానికి, సమానత్వానికి భంగం కలిగిందంటాడు థామ్సన్. అది స్థిరత్వంనుంచి మార్పుదిశగా మనిషిని నడిపించిన కల్లోల కాలం. ఎందుకంటే, వాతావరణంతోపాటు పర్యావరణం మారినప్పుడల్లా దానికి అనుకూలంగా తన జీవనాన్ని మలచుకోవడం మనిషికి పెద్ద సవాలవుతుంది; ఒక సాంస్కృతికకాలంలో సంతరించుకున్న మానసికశక్తినంతటినీ దానికి వెచ్చించాల్సివస్తుంది. మధ్యరాతియుగం సరిగ్గా అలాంటి గొప్ప పరివర్తనకాలమంటాడు థామ్సన్. క్రీస్తుశకంలో చీకటియుగంగా చెప్పుకునే 5వ శతాబ్దంతో దానిని పోలుస్తాడు.

ఆయన ప్రకారం, మధ్యరాతియుగంలోనే స్త్రీ, పురుషుల మధ్య శ్రమవిభజనలో మార్పు రావడం మొదలైంది. పురుషులు జంతువుల పెంపకం ప్రారంభిస్తే, స్త్రీలు ఆహారపు మొక్కల సేకరణను మరింత విస్తరించారు. మతపరమైన తంతులలో భాగంగా జంతువుల పెంపకం ప్రారంభమైన తర్వాతే, ఆ అనుభవంనుంచే , శిశువు పుట్టుకలో పురుషుడి పాత్రను, అంటే పితృత్వాన్ని గుర్తించారు. అయితే, ఆ ఎరుక అప్పటికింకా అమ్మమతానికి చెందిన పౌరాణికవిశ్వాసవ్యవస్థలో భాగంగానే ఉంది తప్ప పితృస్వామ్యంగా వ్యవస్థీకృతం కాలేదు. ఒక వాస్తవాన్ని తెలుసుకోవడం వేరు; దానిని వ్యవస్థీకరించడం వేరని థామ్సన్ అంటాడు. ఉదాహరణకు, సాటిమనిషిని చంపడం అనేది మంచుయుగంలోనే మనిషి అనుభవానికి వచ్చి ఉండచ్చు కానీ; కొత్తరాతియుగం మలిదశలో కానీ అది యుద్ధాల స్థాయికి చేరుకోలేదంటాడు. అలాగే, మధ్యరాతియుగం నాటికి పితృత్వాన్ని గుర్తించినప్పటికీ, అమ్మమతం స్థానాన్ని అయ్యమతం ఇంకా ఆక్రమించుకోలేదని ఆయన వివరణ.

పితృత్వానికి సంబంధించి మరొక ఆసక్తికరమైన అంశాన్ని ఆయన ప్రస్తావిస్తాడు. శిశువు పుట్టుకకు, లైంగికసంపర్కానికి సంబంధముందని పితృత్వాన్ని గుర్తించడానికి ముందే రాతియుగం మనిషికి తెలుసుకానీ; గర్భధారణకు, లేదా శిశువుపుట్టుకకు లైంగికసంపర్కమే కారణమన్న అవగాహన వారికి లేదని అంటూ, ఆష్లే మాంటెగూ(Ashley Montegu)అనే బ్రిటిష్-అమెరికన్ మానవశాస్త్రవేత్తను ఆయన ఉటంకిస్తాడు. లైంగికసంపర్కానికీ; గర్భధారణకూ సంబంధముందని తెలిసినా, గర్భధారణకు అది మాత్రమే కారణమని ఆస్ట్రేలియా ఆదివాసులు అనుకోరనీ; గర్భధారణను శారీరకమైనదిగా వారు గుర్తించరనీ, పురుషుడి జననాంగంతో స్త్రీ జననాంగం తెరచుకుంటుందనీ, అప్పుడు అందులోకి శిశురూపంలోని ఒక ఆత్మ ప్రవేశిస్తుందని నమ్ముతారనీ మాంటెగూ అంటాడు.

ఆపైన, మందల కొద్దీ జంతువుల అందుబాటు లోపించిన ఫలితంగా పురుషులు, ఒకటీ, అరా జంతువులను వేటాడి తెచ్చే పరిస్థితి స్త్రీ, పురుష సంబంధాలతో సహా సంస్కృతిని ఎలా ప్రభావితం చేసిందో థామ్సన్ వివరిస్తాడు. స్త్రీలు, పిల్లలు తమకు దగ్గరలోనే పుష్కలంగా ఆహారపు మొక్కలను సేకరించుకునే వెసులుబాటు ఉండగా; జంతువుల వేటకు, చేపలు పట్టడానికి పురుషులు దూరదూరప్రదేశాలకు వెళ్లవలసివచ్చేది; ఒట్టి చేతులతో తిరిగి వెళ్ళడం నామోషిగా భావించి దూరప్రదేశాలలో తాత్కాలికంగా బస ఏర్పాటు చేసుకుని కొన్ని రోజులపాటు ఉండిపోవలసివచ్చేది. దాంతో స్త్రీ, పురుషుల మధ్య క్రమంగా దూరం పెరిగి ఉభయుల ప్రపంచాలూ వేరవుతూవచ్చాయి. వేట మకాంలో చలి కాచుకుంటూ పురుషులు చెప్పుకునే కథలూ; ఇంటి దగ్గర సమర్తాడిన అమ్మాయికి మహిళలు చెప్పే ముచ్చట్లూ ఒక లాంటివి కావని థామ్సన్ అంటాడు. విశేషమేమిటంటే, ఇలా మధ్యరాతియుగంలో వేరు పడిన స్త్రీ, పురుషప్రపంచాలు నేటి ఆధునికకాలంలో కూడా అలాగే విడివిడిగా కొనసాగుతూనే ఉన్నాయి. స్త్రీ, పురుషులు ఒకే ఇంట్లో ఒకరికొకరు దగ్గరగా జీవిస్తున్నా ఎవరి ప్రపంచమూ, ఎవరి భాషా, ఎవరి రహస్యాలూ వారివే కావడం చూస్తూ ఉంటాం.

ఈ విధంగా మొదట్లో అమ్మమతం చుట్టూ అల్లుకున్న స్త్రీల ప్రధానసంస్కృతిలో భాగంగా ఉంటూనే పురుషులు పెంపొందించుకున్న ఉపసంస్కృతి, క్రమంగా పితృస్వామ్యరూపంలో సమాంతరసంస్కృతిగానూ, ప్రధానసంస్కృతిగానూ అభివృద్ధి చెందింది. ఆ క్రమాన్ని కూడా థామ్సన్ ఎంతో ఆసక్తికరంగా వివరిస్తాడు. ఎలాగంటే, అడవిలో పెరిగే గోధుమ లాంటి తృణధాన్యాలను గుర్తించి సేకరించి సాగుచేసి వాటిని సంకరజాతికి మళ్ళించడం ద్వారా స్త్రీల మొక్కల సేకరణ కొత్తమలుపు తిరిగింది. పెరటిసాగు పూర్తిస్థాయి వ్యవసాయంవైపు అడుగువేయడం ప్రారంభించింది. అంతవరకూ జంతువులకు అధినాయకిగా ఉన్న అమ్మదేవత ఇప్పుడు పంటల అధినాయకిగా కూడా మారింది.

ఈ సందర్భంలో రోమన్ల పంటల దేవత అయిన సీరిస్(Ceres) ను థామ్సన్ ఉదహరిస్తాడు. మన దగ్గర కూడా పలువురు స్త్రీదేవతలను పంటలతో ముడిపెట్టి చెప్పుకుంటాం. ఉదాహరణకు, అమ్మవారిని స్తుతించే ‘లలితాసహస్రనామా’లలో పూవులు, వనాలు, రకరకాల అన్నాల ప్రస్తావనే కాక; ధనధాన్యాలను వృద్ధి చేసే దేవతగా అమ్మవారిని చెప్పడం కనిపిస్తుంది. అలాగే, గ్రీకు దేవతల్లో డిమీటర్ తృణధాన్యాలకు చెందిన దేవత; అర్తెమిస్ అటవీభూములకు, చిత్తడినేలలకు, పచ్చికబయళ్లకు చెందిన దేవత.

తను సాగు చేసిన పంటలను నిల్వ చేసే క్రమంలోనే స్త్రీ కుండల తయారీవైపు కూడా అడుగు వేసిందని థామ్సన్ చెబుతూ, కుండల ఆకారం స్త్రీ వక్షోజాలను తలపిస్తుందనీ, మొదట్లో అవి కుమ్మరి సారె మీద కాక, స్త్రీల వక్షోజాల మీద రూపొందినవనీ, కుండల తయారీ నిస్సందేహంగా స్త్రీకి చెందిన నిగూఢతలలో ఒకటనీ అంటాడు. మన పురాణ, ఇతిహాసాల్లో కూడా స్త్రీగర్భాన్ని కుండతో పోల్చడం; ద్రోణుడు మొదలైనవారిని కుంభసంభవులుగా పేర్కొనడం కనిపిస్తుంది.

తృణధాన్యాల సేకరణ, సాగు, కుండలతయారీ వగైరాలతో స్త్రీ గృహానికి సామ్రాజ్ఞి అయింది. స్త్రీ తాలూకు నిగూఢతలు అన్నింటికీ గృహం కేంద్రమైంది. మన దగ్గరే కాక, ప్రపంచంలో అనేకచోట్ల ఇప్పటికీ వాడుకలో ఉన్న గృహిణి, ఇల్లాలు అనే శబ్దాలు ఇంటికీ, స్త్రీకీ ఉన్న అన్యోన్యసంబంధాన్ని చెబుతాయి. అలాంటి స్త్రీ తనదే పైచేయిగా, తనే నిర్మించుకున్న గృహసామ్రాజ్యంలో చివరికి తనే బందీ అయిన క్రమాన్ని కూడా థామ్సన్ చెబుతాడు. కొత్తగా చేతికందిన విల్లమ్ములతో, ఇతర సాధనాలతో వేట దారి పట్టి, ఇంటికి దూరమైన పురుషుడు, ధాన్యసంపదను కూడబెడుతున్న స్త్రీని చూసి అంతవరకూ ఆత్మన్యూనతకు గురవుతూవచ్చాడు. ఇప్పుడు స్త్రీకీ, ఆమె సృష్టించిన సంపదకూ రక్షకుడిగా కొత్త అవతారమెత్తాడు. తన రక్షణ కింద ఉన్న స్త్రీని తన సొత్తుగా భావించడం ప్రారంభించాడు. తన ఆయుధాబలాన్ని సొంత సంపదను రక్షించుకోడానికే కాక; ఇతరుల సంపదను చేజిక్కించుకోవడానికీ ఉపయోగించవచ్చునని గ్రహించాడు. దాంతో వేటబృందం సైనికశక్తిగానూ, వేట యుద్ధంగానూ మారిపోయాయి. స్త్రీ తృణధాన్యాలను కనుగొనడం చివరికిలా పురుషుని యుద్ధాలవైపు నడిపించింది. అంతేకాదు, ఆహారాన్ని ఎక్కువరోజులపాటు నిల్వ చేసుకునే వెసులుబాటు చిక్కింది కనుక జంతువులవేట శత్రువుల వేటవైపే కాక; వాణిజ్యపు వేటవైపు కూడా పురుషుని నడిపించింది.

ఆపైన ఆ నడక మరో మలుపు తిరిగింది; పంటలవృద్ధి వల్ల కలిగిన ఆహారపుష్కలత్వంతో జనాభా పెరగడమూ, వాణిజ్యమూ, అనుకూల వాతావరణమూ కలగలిసి గ్రామాలనుంచి పట్టణాలవైపు, ఆ తర్వాత నగరాలవైపు నడిపించాయి. కొత్తరాతియుగం మీదుగా సాగిన ఆ ప్రస్థానంలో ఒక ముఖ్యమైన మజిలీ చాటల్ హ్యుయక్(Çatal hüyük).

దాని గురించి తర్వాత....

Tags:    

Similar News