పురాణాలు చెప్పే జలప్రళయం వెనుక చారిత్రకత ఎలాంటిది?

రామాయణంలో నిరుత్తరకాండ-26: జలప్రళయం తర్వాత జరిగిన మానవ జాతి ఆవిర్భావంలో స్త్రీ హోదా ఎలా ఉందో ప్రముఖ పరిశోధకుడు కల్లూరి భాస్కరం ఈ వారం చర్చిస్తున్నారు

Update: 2024-09-19 02:12 GMT

బ్రహ్మ ఒకానొక ప్రళయం తర్వాత స్వయంభువుగా అవతరించి నీటిని సృష్టించడం, అందులో తన బీజాన్ని నిక్షిప్తం చేయడం, అది బంగారు అండం(గుడ్డు)గా రూపొందడం, దానినుంచి హిరణ్యగర్భుడనే పేరుతో తిరిగి తనే జన్మించి పురుషునిగానూ, స్త్రీగానూ తనను విభజించుకుని ఆ ఇద్దరి ద్వారా ఒక విరాట్పురుషుని పుట్టించడం, ఆ విరాట్పురుషుడు సకలలోకాలకూ సృష్టికర్త అయిన స్వాయంభువమనువును సృష్టించడం, అయోనిజ అయిన శతరూప అనే కన్య పదివేల సంవత్సరాలు తపస్సు చేసి ఆ స్వాయంభువమనువును భర్తగా పొందడం...

ఈ బ్రహ్మపురాణకథనాన్ని ఇంతకుముందు చెప్పుకున్నాం. ఇది ప్రధానంగా మూడు విషయాలు చెబుతోంది. ఒకానొక ప్రళయం తర్వాత బ్రహ్మ స్వయంభువుగా అవతరించి సృష్టిని ప్రారంభించాడనడం మొదటిది. లోకాలనైనా, ప్రాణినైనా సృష్టించడంలో పురుషుడి పాత్రను చెప్పడమే కాక; పురుషుడి పాత్రనే ప్రముఖంగా చెప్పడం రెండవది. తనను తనే పురుషుడిగానూ, స్త్రీగానూ కూడా విభజించుకోగలిగిందీ; ఆ స్త్రీతో కలసి మరో ప్రాణిని పుట్టించగలిగిందీ కూడా పురుషుడే. ఆ విధంగా స్త్రీని ప్రవేశపెట్టడం ద్వారా సృష్టి చేయడంలో అనివార్యమైన స్త్రీపాత్రనూ చెప్పడం మూడవది. కాకపోతే, సృష్టిచేయడంలో ప్రథమస్థానాన్ని పురుషుడికిచ్చి ద్వితీయస్థానాన్ని మాత్రమే స్త్రీకి ఇస్తోంది. అంతేకాదు, స్త్రీ సృష్టిలో భాగస్వామి కావాలంటే తనకన్నా పై స్థానంలో ఉన్న పురుషుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి, అందుకోసం తపస్సు చేసి అతణ్ణి భర్తగా పొందాలి. కుమారసంభవకథలో పార్వతి తపస్సు చేసి శివుని భర్తగా పొందడం మరో ఉదాహరణ.

అంతిమంగా ఈ మొత్తం కథనం స్త్రీ-పురుష ప్రాధాన్యక్రమాన్ని తలకిందులు చేస్తోంది!

విశేషమేమిటంటే, పై మూడు విషయాలూ పౌరాణికమైన ముసుగును తప్పించుకుని, చారిత్రక సాక్ష్యాలతో గుర్తించగల అవకాశాన్ని మనకు ఇస్తున్నాయి. అది కూడా భారతీయులమైన మనకూ, మన పౌరాణిక కథనాలకు మాత్రమే పరిమితమవుతున్నది కాదు, ప్రపంచవ్యాప్తం!

ముందుగా ప్రళయం విషయమే చూద్దాం. పౌరాణిక, శాస్త్రవిజ్ఞాన రంగాలు రెండింటి ద్వారా కూడా మనకు బాగా తెలిసిన ప్రళయం- జలప్రళయం. వందల కోట్ల సంవత్సరాల భూమి అస్తిత్వంలో అనేకసార్లు సంభవించిన మంచుయుగాలతో ముడిపడిన ప్రళయమది. మంచుయుగాలలో అయిదింటిని అతి పెద్దవిగా శాస్త్రవేత్తలు గుర్తించారు. వాటిలో చివరిది 26లక్షల సంవత్సరాల క్రితం సంభవించింది. గత పదిలక్షల సంవత్సరాల కాలంలోనే పన్నెండు మంచుయుగాలు సంభవించాయి. వాటిలో ఒకటి 6లక్షల 50 వేల సంవత్సరాల క్రితం ఏర్పడి, 50వేల సంవత్సరాలు కొనసాగింది. మరో మంచుయుగం 29వేల సంవత్సరాల క్రితం ఏర్పడి 14వేల సంవత్సరాల క్రితం వరకూ కొనసాగింది. ఆ తర్వాత ఉష్ణవాతావరణం తిరిగి ఏర్పడుతోందనుకునేలోపల మళ్ళీ మంచు ముంతెత్తి 13వందల సంవత్సరాలు కొనసాగింది. ఆ దశను యంగర్ డ్ర్యాస్(Younger Dryas) అన్నారు. 11వేల 700 సంవత్సరాల క్రితం అది కూడా ముగిసిన తర్వాత భూమి తిరిగి ఉష్ణవాతావరణంలోకి అడుగుపెట్టింది. హలోసీన్(Holocene) అని పిలిచే ఆ వాతావరణదశలోనే ఇప్పుడు మనం ఉన్నాం.

మంచుయుగాలతో ముడిపడిన జలప్రళయాలను కూడా నేటి భూగర్భశాస్త్రవేత్తలు నిర్దిష్టంగా గుర్తించగలిగారు. దాదాపు 15వేల ఏళ్లక్రితం ఉత్తర అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రంలో కొలంబియానదికి చెందిన ప్రీస్ట్ ర్యాపిడ్ వ్యాలీ వద్ద సంభవించిన జలప్రళయం వాటిలో ఒకటి. నీరు వందల అడుగుల ఎత్తున పైకి లేచి గంటకు 80 మైళ్ళ వేగంతో ప్రవహిస్తూ ప్రీస్ట్ ర్యాపిడ్ వ్యాలీని కోసుకుంటూ వెళ్లింది; కొండలను, చరియలను పెద్ద ఎత్తున ముంచెత్తింది; కొత్త కొత్త కనుమలను, కాలువలను సృష్టించింది. ఆ హఠాత్పరిణామంతో మార్గమధ్యంలో ఉన్న మనుషులు, జంతువులతో సహా జీవజాలమంతా అంతరించిపోయింది. ఆఖరి మంచుయుగం పొడవునా ఇలాంటి భారీ వరదలు వందలసార్లు సంభవించాయని ఈ కథనం చెబుతుంది. ఈ కాలం అంతటా ఉత్తర అమెరికాలోని మంచుదిబ్బలు పెద్దవవడం, చిన్నవడం జరుగుతూనే వచ్చింది.

వెనకటి 80వేలు-15వేల సంవత్సరాల మధ్యకాలంలో కెనడాకు చెందిన కోర్డిలేరన్ మంచుదిబ్బ దక్షిణంవైపుగా విస్తరించే క్రమంలో దానినుంచి చీలివచ్చిన పెద్ద పెద్ద శకలాలు వాషింగ్టన్, ఐదహో, మోంటానాలవైపు కొట్టుకొచ్చాయి. వాటిలో ఒకటి ఐదహో, మోంటానా సరిహద్దులవరకూ వ్యాపించి రాకీ పర్వతాలపై ఒక మంచు ఆనకట్టగా మారి క్లార్క్ ఫోక్ నదిని అటకాయించింది. దాంతో ఆ ఆనకట్ట వెనుకనున్న లోయలన్నీ నీటితో నిండిపోయి మోంటానాలో మూడువేల చదరపు మైళ్ళ విస్తీర్ణం కలిగిన మిజూలా సరస్సును ఏర్పరిచాయి. వేల సంవత్సరాల కాలంలో ఆ మంచు ఖండం కారణంగా ఆ సరస్సుకు తరచు సంభవిస్తూవచ్చిన వరదలు వాషింగ్టన్ మధ్య, తూర్పు ప్రాంతాల నైసర్గికస్వరూపాన్ని మార్చివేశాయి.

ప్రళయాన్ని తలపించే ఇలాంటి భారీ వరదలను చూసి, అనుభవించి చెప్పడానికి మనిషి అంటూ మిగులుతాడా అని పై కథనం ప్రశ్నిస్తుంది. అటువంటి సాక్ష్యాలు లేకపోవచ్చు కానీ, స్థానిక అమెరికన్లకు చెందిన మౌఖికచరిత్రలలో ఈ వరదల గురించిన అనేక కథనాలు 14వేల సంవత్సరాలుగా వ్యాప్తిలో ఉన్నట్టు ఆ కథనం చెబుతుంది. చివరి మంచుయుగం ఉత్తర, దక్షిణ అమెరికాలు, కెనడాల మీదే కాక; యూరప్, ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, ఆసియా, ఆస్ట్రలేసియాల మీద కూడా ప్రభావం చూపించింది కనుక, పైన చెప్పిన వరదల గురించిన కథనాలు అక్కడ కూడా మౌఖికంగా వ్యాప్తిలో ఉండడం సహజమే. జలప్రళయం పేరుతో అవే పైన చెప్పిన ప్రాంతాలకు చెందిన పురాణకథలలో కూడా ప్రవేశించాయన్నమాట. ఇక్కడే ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలి. మన దగ్గర హిమాలయప్రాంతాలతోనూ, మన పొరుగున ఉన్న టిబెట్, చైనాలతోనూ పోల్చితే, మిగతాచోట్ల చివరి మంచుయుగం ప్రభావం తక్కువని కూడా సంబంధిత సమాచారం చెబుతోంది. కాకపోతే, మంచుయుగం ప్రభావాన్ని గరిష్ఠంగా చవిచూసిన ప్రాంతాలకు చెందిన జలప్రళయగాథలు, ఆ ప్రభావం అంతగా లేని ప్రాంతాలకు కూడా వ్యాపించడం సహజమే. ఆవిధంగా అతిపురాతనకాలంలోనే జరిగిన ‘ప్రపంచీకరణ’లలో ఒకటిగా జలప్రళయగాథల్ని కూడా చెప్పుకోవచ్చు.

జలప్రళయం గురించి, దాని తర్వాత తిరిగి ప్రారంభమైన సృష్టి గురించి చెప్పే కథలు మన దగ్గర శతపథబ్రాహ్మణంలోనూ, పురాణ, ఇతిహాసాలలోనూ; మెసపొటేమియా, గ్రీకు, అజ్ టెక్ పురాణకథల్లోనూ, బైబిల్ లోనూ ప్రవేశించడమే కాదు; అవి దాదాపు ఒక్కలానే కనిపిస్తాయి. శతపథబ్రాహ్మణంలోని కథనం ప్రకారం, మనువు చేతికి చిక్కిన ఒక చిన్న చేప తనను రక్షించమని కోరుతుంది. దానిని ఎందులో ఉంచినా దానిని మించి పెరిగిపోతుంది. చివరికి దానిని సముద్రంలో ఉంచినప్పుడు అది సంతోషించి జలప్రళయం రాబోతున్న సంగతిని మనువుకు చెప్పి ఒక నావను నిర్మించుకోమంటుంది. మనువు నావను నిర్మించి అందులో జీవజాలాన్ని ఉంచి, ఆ చేప చెప్పినట్టు నావను దాని కొమ్ముకు కడతాడు. చేప ఆ నావను హిమాలయపర్వాతలకు చేర్చుతుంది. ఒక ఏడాది గడిచాక జలంనుంచి ఒక కన్య జన్మించి మనువుకు భార్య అవుతుంది. వారిద్దరినుంచి కొత్తగా మానవాళి ఉద్భవిస్తుంది.

మెసపొటేమియాలోని ప్రాచీన సుమేరుకు చెందిన సృష్టిగాథ ప్రకారం, దేవతలు భూమిని సాగు చేయడానికీ, పశువుల పెంపకానికీ మట్టినుంచి మనుషులను సృష్టిస్తారు; ఆ వెంటనే నగరాలు అవతరిస్తాయి; అంతలోనే దేవతలు ఆగ్రహించి మనుషుల్ని తుడిచిపెట్టడానికి జలప్రళయాన్ని సంకల్పిస్తారు. ఎంకి అనే దేవుడు వారితో విభేదించి జలప్రళయం రాబోతున్న సంగతిని జియశూద్ర అనే ఒక ఉత్తముడికి చెప్పి, నావ నిర్మించుకుని దానినుంచి బయటపడమంటాడు. జియశూద్ర అలాగే చేస్తాడు. అందుకు ప్రతిగా అతను అమరత్వాన్ని, దైవత్వాన్ని పొందుతాడు.

బాబిలోనియాకు చెందిన గిల్గమేశ్ ఇతిహాసం ప్రకారం; జలప్రళయం రాబోతున్న సంగతిని దేవతలు ఉత్నపిష్టిం అనే ఒక ఉత్తముడికి చెప్పి, నావ నిర్మించుకుని దానినుంచి బయటపడమంటారు. ఉత్నపిష్టిం, అతని భార్యా దేవతలు చెప్పినట్టే ఒక పెద్ద నావను నిర్మించి అందులో మనుషుల్ని, జంతువులను ఉంచి రక్షిస్తారు. అందువల్ల వారికి కూడా దైవత్వం లభిస్తుంది. దేవతలు అత్రహాసిస్ అనే మరో ఉత్తముని ఇలాగే జలప్రళయం గురించి హెచ్చరించారనీ, అతను కూడా నావ నిర్మించుకుని ఆ ప్రళయాన్ని దాటాడనీ మరో మెసపొటేమియా పురాణకథ చెబుతుంది.

గ్రీకు పురాణకథ ప్రకారం, మానవాళిని సృష్టించిన ప్రమిథియస్ కుమారుడు, డ్యుకేలియన్. దేవతల రాజైన జ్యూస్ ఆగ్రహించి జలప్రళయాన్ని సృష్టించి మానవాళిని తుడిచిపెట్టడానికి పూనుకున్నప్పుడు డ్యుకేలియన్, అతని భార్య ఒక నావను నిర్మించుకుని అందులో పర్ణసస్ పర్వతం మీదికి చేరుకుని ప్రాణాలు కాపాడుకుంటారు. అమెరికా ఆదివాసీ తెగ అయిన అజ్ టెక్ ల పురాణకథ ప్రకారం, ఇప్పటి విశ్వానికి ముందు నలుగురు సూర్యుల రూపంలో నాలుగు ప్రపంచాలు ఉండేవి. ఏదో ప్రళయం సంభవించి మొదటి మూడూ నాశనమయ్యాయి; వాటితోపాటే మానవాళి కూడా అంతరించింది. నాలుగో సూర్యుడప్పుడు మాత్రం పెద్ద జలప్రళయం సంభవించగా ఒక పురుషుడు, ఒక స్త్రీ మాత్రం ఒక పెద్ద తమాల వృక్షం కింద ఆశ్రయం పొంది ప్రాణాలు దక్కించుకున్నారు.

బైబిల్ కథలో నాయకుడు నోవా. స్వచ్చమైన, పవిత్రమైన జీవితం గడుపుతున్న నోవాను ‘పేట్రియార్క్’ అంటుంది బైబిల్. ఇది మన దగ్గర ‘ప్రజాపతి’ అనే మాటకు దగ్గరగా ఉంటుంది. దక్షుడు, కశ్యపుడు మొదలైనవారిని మన పురాణాలు ప్రజాపతులుగా చెబుతాయి. నోవా తప్ప మిగతా మానవులందరూ దుర్మార్గులుగా, పాపులుగా మారిపోయినందుకు దేవుడు జలప్రళయం సృష్టించి వారందరినీ అంతమొందించాలనుకుంటాడు. తను సృష్టించబోయే ప్రళయం గురించి నోవాకు ముందే చెప్పి, ఒక నావ నిర్మించుకుని, దాని ద్వారా తననూ, తన కుటుంబాన్ని రక్షించుకోమనీ; జంతువులతో సహా అన్ని రకాల జీవులనూ కూడా రక్షించమనీ ఆదేశిస్తాడు. నోవా అలాగే నావ నిర్మించుకుని, అందులో అన్ని రకాల జీవులనూ ఉంచి దానిని అరారత్ పర్వతం మీదికి చేర్చి జలప్రళయంనుంచి బయటపడతాడు. అతని ముగ్గురు కొడుకులు, వారి భార్యలనుంచి కొత్తగా మానవసృష్టి జరుగుతుంది.

ఆశ్చర్యకరం ఏమిటంటే, వేర్వేరు ప్రాంతాలకు చెందిన పై పౌరాణికకథనాలు జలప్రళయం గురించి ఉమ్మడిగా చెబుతున్న అంశాలను నేటి పురాతత్వశాస్త్రజ్ఞుల పరిశోధనలు ధ్రువీకరిస్తున్నాయి; ఆ మేరకు పురాణకథనాలను చరిత్రకాలంలోకి తీసుకొస్తున్నాయి. పైన పేర్కొన్న చివరి మంచు యుగమూ, దాని కొనసాగింపుగా మళ్ళీ తలెత్తిన యంగర్ డ్ర్యాస్ – రెండూ ముగిసి, 11 వేల 700 సవత్సరాల క్రితం ‘హలోసీన్’ గా పిలిచే నేటి ఉష్ణవాతావరణం పుంజుకోవడం మొదలయ్యాక ఏం జరిగిందో టోనీ జోసెఫ్ తన ‘ఎర్లీ ఇండియన్స్(Early Indians)’లో వివరిస్తాడు. మంచుయుగం కలిగించిన చేదు అనుభవాలనుంచి కొత్త పాఠాలు నేర్చుకున్న మనిషి అడవిలో దొరికే రకరకాల ఆహారపు మొక్కలను సేకరించడం, సాగు చేయడం, అడవి జంతువులను మచ్చిక చేయడం ప్రారంభించాడు. అలా క్రమంగా పూర్తిస్థాయి వ్యవసాయంవైపు, పశుపోషణవైపు అడుగువేశాడు. టోనీ జోసెఫ్ ఉటంకించిన పురాతత్వశాస్త్రజ్ఞురాలు మిలిందా ఎ. జడర్ ప్రకారం, యంగర్ డ్ర్యాస్ ముగిశాక, తదుపరి 3వేల సంవత్సరాల కాలంలో- అంటే, క్రీ.పూ.9500-6500 మధ్యకాలంలో- ఫెర్టైల్ క్రెసెంట్ గా పిలిచే దక్షిణ ఇరాక్, సిరియా, జోర్డాన్, పాలస్తీనా, లెబనాన్, ఈజిప్టు, ఇజ్రాయిల్, టర్కీ, ఇరాన్ లలోని చాలాచోట్లకు వ్యవసాయమూ, పశుపోషణా వ్యాపించాయి.

ఆ తర్వాత టోనీ జోసెఫ్ ఇచ్చిన వివరణ, పైన చెప్పుకున్న పౌరాణికకథనాల వెలుగులో మరింత ఆసక్తికరంగానూ ఆశ్చర్యజనకంగానూ ఉంటుంది. మంచుయుగం విధించిన ఆహార నిర్బంధాల కారణంగా మొక్కలు, జంతువుల పెంపకానికి అలవాటుపడుతున్న జనం, వాతావరణం తిరిగి వేడెక్కడం మొదలైన దశలో, లేదా అంతకన్నా ముందే కొత్త చోట్లకు వలసపోవడం ప్రారంభించారు. వారితోపాటు పైన చెప్పుకున్న ఫెర్టైల్ క్రెసెంట్ లోని చాలా ప్రాంతాలకు మొక్కలు, జంతువులు రవాణా అయ్యాయి. క్రీ.పూ.8500 ప్రాంతంలో ఈ వలసజనాలు కొత్త ప్రదేశమైన సైప్రస్ దీవికి మొక్కలను, జంతువులను తీసుకెళ్ళడం మరింత ఆసక్తికరమని జోసెఫ్ అంటాడు. మిలిందా ఎ. జడర్ మాటల్లో చెప్పాలంటే, “జనాలు తమ పెంపకంలోని మొక్కలను, జంతువులను పడవల్లో ఎక్కించుకుని; వాటి పెంపకానికి సంబంధించిన జ్ఞానాన్ని వెంటబెట్టుకుని మధ్యప్రాచ్యతీరానికి 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న సైప్రస్ దీవికి చేరుకున్నారు”. పైన ఉదహరించుకున్న పురాణకథల మూలాలు ఏ చారిత్రకవాస్తవికతలో ఉన్నాయో ఈ వివరం మరింత స్పష్టంగా చెబుతోంది!

రామాయణం గురించని చెప్పి విషయాన్ని ఎక్కడెక్కడెక్కడికో తీసుకుపోతున్నారని పాఠకులు ఈపాటికి అనుకుంటూ ఉండవచ్చుకనుక ప్రత్యేకించి ఒక వివరణ ఇవ్వాల్సివస్తోంది. ఇందులో రాస్తున్నదేదీ రామాయణంతో సంబంధం లేనిది కాదు. రామాయణానికే కానీ, మన ఇతర పురాణ, ఇతిహాసాలకే కానీ ప్రపంచంలోని కొన్ని ఇతర వాఙ్మయాలతో, వాటి సామాజికనేపథ్యాలతో, అవి వెల్లడించే చారిత్రకాంశాలతో ఉన్న సామ్యాలను, సంబంధాలను ఎత్తిచూపే ప్రయత్నాన్ని ఈ వ్యాసాలలో పాఠకులు గమనించే ఉంటారు.

ఈ వ్యాసప్రారంభంలోని బ్రహ్మపురాణ కథనం ప్రస్తావించిన ప్రళయం, జలప్రళయంగా ఇతర పురాణాలకు కూడా ఎక్కిన సంగతినీ, దాని చారిత్రకతనూ చెప్పుకోవడంలో ఆ ప్రయత్నాన్ని మరింత స్పష్టంగా పోల్చుకునే ఉంటారు.

పై బ్రహ్మపురాణకథనం మొత్తం స్త్రీ-పురుష ప్రాధాన్యక్రమాన్ని తలకిందులు చేస్తోందని కూడా అనుకున్నాం. అది రామాయణంతో మరింత దగ్గరి సంబంధం ఉన్నది కూడా! దాని గురించి తర్వాత....

Tags:    

Similar News