హిడ్మాది ఎన్ కౌంటర్ కాదు, ముమ్మాటికీ హత్యే!
తిరుపతి రౌండ్ టేబుల్ సమావేశంలో వామపక్షాలు, పౌర, ప్రజాసంఘాల ఆరోపణ
హిడ్మా, ఆయన జీవిత సహచరి రాజె సహా ఆరుగురిది ఎన్కౌంటర్ కాదని, కేంద్ర రాష్ట్ర పోలీసు బలగాలు వారిని పట్టుకొచ్చి కాల్చిచంపేశాయని పలువురు వామపక్షాల నాయకులు, పౌర ప్రజాసంఘాల ప్రతినిధులు ఆరోపించారు. మావోయిస్టులను బూటకపు ఎన్ కౌంటర్ల ద్వారా చంపడాన్ని ఖండిస్తూ, వామపక్ష పార్టీలు, పౌర, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో శనివారం ఉదయం తిరుపతిలోని గంధమనేని శివయ్య భవనంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ, అడవుల్లో ఉండే ఖనిజ సంపదను కొల్లగొట్టి, కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడానికి అడ్డంకిగా ఉన్న మావోయిస్టులను ఎన్ కౌంటర్ల పేరుతో చంపేస్తున్నారని ఆరోపించారు.
సిపిఐ తిరుపతి జిల్లా కార్యదర్శి మురళి అధ్యక్షతన జరిగిన ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో, పౌరహక్కుల సంఘం రెండు తెలుగు రాష్ట్రాల సమన్వయ కర్త క్రాంతి చైతన్య మాట్లాడుతూ, దేశంలో పౌరహక్కుల పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందని అన్నారు. సాయుధ పోరాటం ద్వారా మార్పు తెస్తామని మావో యిస్టులు చెపుతున్న దానితో ఎవరు ఏకీభవించినా, ఎవరు ఏకీభవించకపోయినా, సిపీఐ(మావోయిస్టు)ను ఒక రాజకీయ పార్టీగా గుర్తించాలని కోరారు.
మావోయిస్టులు ముందుకు తెస్తున్న సమస్యలు సహేతుకమైతే ప్రభుత్వం ఆలోచించాలే కానీ, ‘‘మావో యిస్టులను తుదముట్టిస్తాం, వారిని నామరూపాలు లేకుండా చేస్తాం’’ అనడం రాజ్యాంగ వ్యతిరేకం అన్నారు. ఇలా మట్లాడిన హోంమంత్రి అమిత్ షా పై హత్యానేరం కింద కేసు పెట్టాలని కోరారు. రాజ్యాంగం పైన ప్రమాణం చేసి అధికారం చేపట్టిన వీరు జీవించే హక్కును కాల రాస్తున్నారని ఆరోపించారు. ఎన్ కౌంటర్లో పాల్గొన్న పోలీసులపైన హత్యానేరం మోపి కేసు పెట్టాలని పౌరహక్కుల సంఘం వాదిస్తే, కేసు పెట్టాలనే అయిదుగురు సభ్యుల హైకోర్టు ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. అయితే సుప్రీం కోర్టు 375 పేజీల ఆ తీర్పును ఒక్క పేజీతో కొట్టేసిందని ఆదేదన వ్యక్తం చేశారు. న్యాయవాదిగా మూడున్నర దశాబ్దాల అనుభవంలో మనకు స్వతంత్రమైన న్యాయవ్యవస్థ లేదన్న నిజాన్ని తెలుసుకున్నానని గుర్తు చేశారు. ఈ న్యాయస్థానాలు పౌరహక్కులను కాపాడాతాయని నమ్మకం సన్నగిల్లుతోందని, ప్రజలు పోరాడితే కొంత మేరకు పరిస్థితులు మెరుగుపడతాయని పేర్కొన్నారు.
పోలీసు ‘ఎన్కౌంటర్’ ల కు వ్యతిరేకంగా తిరుపతి లో జరిగిన రౌండ్ టేబుల్
సిపీఐ తిరుపతి జిల్లా కార్యదర్శి మురళి మాట్లాడుతూ, అడవుల నుంచి ఎస్సీ, ఎస్టీలను తరిమేయడానికి, అటవీ భూములను కబ్జాచేయడానికి జరుగుతున్న ఈ బూటకపు ఎన్ కౌంటర్లను కేంద్రంలో, రాష్ట్రంలో ఉన్న అదికార ప్రతిపక్ష పార్టీలు సమర్థిస్తున్నాయని ఆరోపించారు. దానికి వ్యతిరేకంగా తిరుపతి నుంచే ఒక ఉద్యమం ప్రారంభమయ్యేటట్టు అన్ని ప్రజాసంఘాల రాష్ట్ర నాయకులు చొరవ చూపాలని పిలుపునిచ్చారు.
సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామానాయుడు మాట్లాడుతూ, నక్సలైట్లు చంపుతున్నారు కనుక, వారిని చంపితే తప్పేమిటని ప్రజల్లో తప్పుడు అవగాహనను పాలకవర్గాలు పెంపొందిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అటవీ భూములను ఆదానీ కంపెనీలకు అప్పగించడానికే నక్సలైట్ల హననం సాగిస్తున్నారని ఆరోపించారు. మనుషులను చంపినంత మాత్రాన మార్క్సిజం చావదని, మానవ సమాజం ఉన్నంత కాలం మార్క్సిజం ఉంటుందని పేర్కొన్నారు. వచ్చే ఏడాది మార్చి 30 నాటికల్లా మావోయిస్టులను అంతం చేస్తామని కటాఫ్ డేట్ పెట్టుకున్న అమిత్ షా, నిరుద్యోగాన్ని, ఆదివాసీల సమస్యలను పరిష్కరించడానికి అమిత్ షా ఏదైనా కటాఫ్ డేట్ పెట్టుకున్నారా? అని ప్రశ్నించారు.నక్సలైట్ల పట్ల సీపీఐ ఎప్పుడూ సానుభూతితోనే ఉందని స్పష్టంచేశారు. కె.వి.బి. పురంలో ఏడుగురి ఎన్ కౌంటర్ జరిగితే, తొలిసారిగా అక్కడికి వెళ్ళింది ముగ్గురు సీపీఐ నాయకులని గుర్తు చేశారు.
సీనియర్ జర్నలిస్ట్ రాఘవ మాట్లాడుతూ, ఆదివాసీల పోరాటం వెనుక భూమి సమస్య ఉందని గుర్తు చేశారు. ఆదివాసులే ఈ దేశ మూల వాసులని, వారిని అడవి నుంచి గెంటివేయడానికి బ్రిటిష్ కాలంలో మొదలైన ప్రయత్నాలు స్వాతంత్ర్యానంతరం కూడా కొనసాగుతున్నాయని అన్నారు. భూమి సమస్య పరిష్కారం చేయనందునే మావోయిస్టు ఉద్యమం వచ్చిందని గుర్తు చేశారు. మన పాలకులు రాజ్యాంగ బద్దంగా పాలన సాగించినట్టయితే అసలు మావో యిస్టు ఉద్యమం పుట్టేదే కాదని వివరించారు.
సీపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు మాట్లాడుతూ, ఇది నక్సలైట్లపై జరుగుతున్న ఎన్ కౌంటర్ కాదని, రాజ్యాంగంపైన జరుగుతున్న ఎన్ కౌంటర్ అని వ్యాఖ్యానించారు. రాజ్యాంగంలో ఉన్న జీవించే హక్కును కాలరాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర పాలకులకు రాజ్యాంగంపైన ఏమాత్రం గౌరవం లేదని, ప్రజలను ఊర్లకు ఊర్లే పట్టుకెళ్ళి చంపేస్తున్నారని ఆరోపించారు. బీహార్ ఎన్నికల్లో ఎన్నో అక్రమాలు జరిగాయని, ప్రజల్లో సహనం చచ్చిపోతే శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ లో మాదిరిగా పాలకులను తరిమి తరిమి కొడతారని హెచ్చరించారు. కార్మికుల పైన పీడీ యాక్ట్ పెడతానని మన ముఖ్యమంత్రి హెచ్చరిస్తున్నారని, మావోయిస్టులను చంపడమేకాదు, కార్మికుల రక్తాన్ని పీల్చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడు తున్న పౌర హక్కుల సంఘం రెండు రాష్ట్రాల సమన్వయ కర్త క్రాంతి చైతన్య
రిపబ్లికన్ పార్టీ నాయకులు పి. అంజయ్య మాట్లాడుతూ, హిడ్మాను చంపడానికి ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయలను కేటాయించడం చాలా దుర్మార్గం అని విమర్శించారు. మావోయిస్టులను చంపేశాక, కమ్యూనిస్టులను కూడా చంపేయాలనేది ఆర్ ఎస్ ఎస్, విశ్వహిందూ పరిషత్ ధ్యేయమని ఆరోపించారు. ఎర్ర జెండా కనిపించ కూడదని, కాషాయ జెండానే కనిపించాలని ఆరెండు సంస్థలు భావిస్తున్నట్టు చెప్పారు. దీనికి ప్రత్యామ్నాయంగా బలమైన ప్రజాస్వామిక, రాజకీయ శక్తి ఎదగకపోతే దేశంలో ప్రజాస్వామ్యం బతికి బట్టకట్టడం సాధ్యం కాదని హెచ్చరించారు.
సీపీఐ(ఎం ఎల్) తిరుపతి నగర కార్యదర్శి వెంకటరత్నం మాట్లాడుతూ, కగార్ ప్రారంభమైనప్పుడు ఇది ఎటుపోతుందో నని చాలా మంది ఆవేదన చెందారని గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇది ఇలా విజృంభిస్తుందని ఊహించలేకపోయారన్నారు. ఆర్ ఎస్ ఎస్ సిద్దాంతం ప్రజాస్వామ్యానికి పెద్ద ఆటంకం అని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అర్బన్ నక్సలైట్ అనేస్తున్నారని గుర్తుచేశారు. ఈదేశంలో వంద సంవత్సరాల కమ్యూనిస్టు పార్టీ వల్లనే మనుషులు ఈ మాత్రమైనా బతకగలుగుతున్నారని అన్నారు. ఎన్ కౌంటర్ల పేరుతో ప్రభుత్వం సాగించే మానవ హననానికి వ్యతిరేకంగా పోరాడడానికి ఒక ప్రజా ఐక్య వేదిక అవసరం అని, బలమైన ప్రజా ఉద్యమం రావాలని ఆకాంక్షించారు.
పదమూడేళ్ళ పాటు ఛత్తీస్ గర్ జైళ్ళలో గడిపిన మాజీ నక్సలైట్ నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, తన కళ్ళెదుటే అనేక మందిని అంతం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కగార్ కు వ్యతిరేకంగా పోరాడి ఈ ప్రభుత్వాన్ని దింపాలని కోరారు. సోషలిస్టు యూనిటి సెంటర్ ఆఫ్ ఇండియా నాయకుడు హరీష్ మాట్లాడుతూ, ఎన్ కౌంటర్లు చేస్తున్న వారిని ప్రభుత్వం సన్మానిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నించేవారిని, విమర్శించేవారిని ఈప్రభుత్వం సహించలేకపోతోందని అన్నారు.
పీపుల్స్ వార్ మాజీ కార్యకర్త శంకర్ రెడ్డి మాట్లాడుతూ, ముప్పై అయిదేళ్ళ క్రితం ఈ చట్టబద్ద పాలనను నమ్మి బైటికి వచ్చానని, ఈ ముప్ఫై ఐదేళ్ళలో ఒక్క రోజు కూడా చట్టబద్ద పాలనను చూడలేకపోయానని అన్నారు. నక్సలైట్లను అంతం చేయడం కాదని, కుట్రలను, దోపిడీలను అంతం చేయాలని ప్రభుత్వానికి హితవుపలికారు. ఎవరూ పుట్టుకతో నక్సలైట్ గా పుట్టరని, సమాజానికి ఏదైనా మేలు చేయాలని నక్సలైట్ గా మారుతారని అన్నారు. పరిస్థితులు తుపాకీ పట్టుకునేలా చేస్తాయని వివరించారు.
బిఎస్ పి నాయకుడు శశికుమార్ మాట్లాడుతూ, కగార్ పేరుతో నక్సలైట్లను చంపడాన్ని వ్యతిరేకించాలని, అందు కోసం ఒక బలమైన కార్యాచరణను రూపొందించాలని కోరారు. సీనియర్ జర్నలిస్ట్ నాగరాజు మాట్లాడుతూ, ముప్ఫై ఏళ్ళుగా ఎన్ కౌంటర్లు జరుగుతున్నాయని, ఈ ఎన్ కౌంటర్ల కేసులను హైకోర్టులో వాదించేవారు తగ్గిపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ దేశంలో దోపిడీ జరుగుతోందని చెప్పేవాళ్ళను ఎన్ కౌంటర్ చేస్తే ఎలా అని ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఎన్ కౌంటర్ పేరుతో వెయ్యి మందిని చంపేశారని, ఆనాడే ఈ చైతన్యం ఉంటే ఇన్ని ఎన్కౌంటర్లు సాగేవి కావని, ఇప్పటికైనా నోరువిప్పుతున్నందుకు సంతోషమని పేర్కొన్నారు.
ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో రైతు కూలీ సంఘం జిల్లా నాయకుడు వెంకటయ్య, సీపీఐ చిత్తూరు జిల్లా నాయకుడు జనార్ధన్, ఏపీయూ డబ్ల్యుజే నాయకుడు ప్రసాద్, కార్మిక నాయకుడు ప్రభాకర్, సిపీఐ తిరుపతి పట్టణ కార్యదర్శి విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. దళిత హక్కుల పోరాట సమితి నాయకుడు కాళయ్య వందన సమర్పణలో మాట్లాడుతూ, హిడ్మా ఈ దేశ చేగువెరా అని కొనియాడారు.