ఇన్వెస్టర్లకు ప్రజాధనం పంచుతున్నఆంధ్రా ప్రభుత్వం
GOMs No. 215 ని రద్దు చేసి ప్రజాధనం దుర్వినియోగం ఆపాలి
రాష్ట్రాభివృద్ధికి, ప్రైవేట్ ప్రమోర్టర్ ల పెట్టుబడి అవసరం, రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే, చవకగా ప్రజల వనరులను, ముఖ్యంగా ప్రజల భూములను, ప్రైవేట్ ప్రోమోర్టర్ లకు ఇవ్వాలని, ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ-జనసేన ప్రభుత్వం ప్రభుత్వ విధానాలలో, ప్రైవేట్ యాజమాన్యాలకు అనుగుణంగా మార్పులు చేయడం జరిగింది. అదే కాకుండా, ప్రైవేటు యాజమాన్యాలకు వేలాది కోట్ల రూపాయల ప్రజా నిధులను రాయితీల రూపంలో ప్రభుత్వం ముట్టచెప్పడం కూడా జరుగుతున్నది.
అంటే, ఒక ప్రైవేట్ ప్రమోటర్, మన రాష్ట్రంలో, 10,000 కోట్ల రూపాయల పెట్టుబడి చేస్తానని ముందుకు వస్తే, అందులో 50% కి పైగా, అంటే 5,000 కోట్ల రూపాయలకు పైగా, ప్రజా నిధులను ప్రభుత్వం వారికి ప్రసాదిస్తున్నదన్నమాట. తాము స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కలిగిస్తామని, ప్రైవేట్ ప్రమోటర్ లు గతంలో హామీలు ఇచ్చినా, వారు ఆ హామీలను చిత్తశుద్ధితో అమలు చేయడం ఎప్పుడూ జరగలేదు.
ప్రైవేట్ ప్రమోటర్ లు చేసే పెట్టుబడులలో 50% కి పైగా, రాష్ట్ర ప్రజలే భరిస్తే, ఆ పెట్టుబడులు ప్రైవేట్ ఎలా అవుతాయి? పైగా, ప్రభుత్వరంగ సంస్థల్లో, SC/ST/OBC కి లభించే రిజర్వేషన్ లు, ప్రైవేట్ సంస్థలలో లభించవు. అంటే, ప్రైవేటు పెట్టుబడుల ముసుగులో, ప్రభుత్వం SC/ST/OBC యువతకు అన్యాయం చేయడం జరుగుతున్నది.
ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న పరిశ్రమల్లో విస్తృతంగా జరుగుతున్న ప్రమాదాల కారణంగా,అక్కడ పనిచేస్తున్న కార్మికులకు, చుట్టుపక్కల నివసిస్తున్న ప్రజలకు ప్రాణనష్టం జరుగుతున్నా, ఆ పరిశ్రమల యజమానులతో కుమ్మక్కు అయి, రాష్ట్ర రాజకీయ నేతలు, వారి మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం, అందరికీ తెలిసిన విషయం.
ఆ పరిశ్రమల కారణంగా, పరిసర ప్రాంతంలో నీటి వనరులు కాలుష్యానికి గురి అయి, ప్రజల ఆరోగ్యానికి హాని కలుగుతున్నా, రాజకీయ నాయకుల ఒత్తిడి వలన, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, APPCB, ఆ పరిశ్రమల యజమానుల మీద కఠినమైన చర్యలు తీసుకోవడం అరుదైన విషయం. అంటే, ప్రజలు ఎన్నుకున్న రాజకీయ నాయకులు, ప్రజలకు హానికలిగించే పరిశ్రమల యజమానుల తరఫునే పనిచేస్తున్నారమ్మమాట.
ఉదాహరణకు, సుమారు ఐదు నెలల క్రితం, తెలంగాణ రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లాలో, సిగాచి కంపెనీ వారి రసాయన పదార్థాలు ఉత్పత్తి చేసే పరిశ్రమలో, యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా జరిగిన ప్రమాదంలో, 50 మందికి పైగా కార్మికులు మృతి చెందారు. 30 మంది తీవ్ర గాయాలకు గురి అయ్యారు
అటువంటి పరిశ్రమ యాజమాన్యం, మన రాష్ట్రంలో అదే విధంగా రసాయన పదార్థాలు ఉత్పత్తి చేసే పరిశ్రమ స్థాపిస్తామని రాగానే, మన రాష్ట్ర రాజకీయ నాయకులు, వారిని స్వాగతించి, GOMs No 215 dated 13-11-2025 ద్వారా కర్నూలు జిల్లా ఓర్వకల్ మండలం గుట్టపాడు గ్రామంలో, కేవలం ఎకరానికి 30 లక్షల రూపాయల ధరకు, 95 ఎకరాల అతి విలువైన ప్రభుత్వ భూమిని ప్రసాదించడం, వారు చేసే 1100 కోట్ల రూపాయల పెట్టుబడులకు బదులుగా, వారికి 50% కి పైగా ప్రజా నిధులు రాయితీల రూపంలో ఇవ్వడం బాధాకరమైన విషయం. ఓర్వకల్ పారిశ్రామిక ప్రాంతంలో, అటువంటి భూమి మార్కెట్ విలువ వేలాది కోట్ల రూపాయలు, కాని, ఆ భూమిని, ప్రభుత్వం, కేవలం 28 కోట్ల రూపాయలకు ఇవ్వడం హాస్యాస్పదం. సిగాచి యాజమాన్యం చేసే 1100 కోట్ల రూపాయల పెట్టుబడి తో పోల్చి చూస్తే, అంతకు ఎన్నో రెట్లు ప్రభుత్వ ఖజానాకు నష్టం కలుగుతుంది.
సంగారెడ్డి జిల్లాలో సిగాచి పరిశ్రమలో జరిగిన భయంకరమైన ప్రమాదం గురించి దేశవ్యాప్తంగా ప్రజలలో చర్చ జరిగినా, ఆంధ్ర ప్రదేశ్ టీడీపీ-జనసేన నాయకులు ఏమీ తెలియనట్టు నటిస్తూ, ఆ పరిశ్రమ యాజమాన్యాన్ని స్వాగతించి, వారికి ఈ విధంగా, ప్రజల భూమిని, ప్రజల నిధులను ధారాదత్తం చేయడం మీద, నా ఉద్దేశంలో, కేంద్ర దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేపట్టాలి. అప్పుడే నిజానిజాలు బయట పడతాయి.
ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వెంటనే GOMs No 215 ను రద్దు చేయాలి.