పేదరికాన్ని పోగొట్టకుండా పిల్లలను అధికంగా కనమంటే ఎలా?

మాజీ ఐఎఎస్ అధికారి డా. పి.వి. రమేష్ విస్మయం;

By :  Admin
Update: 2025-04-03 11:49 GMT
సభలో ప్రసంగిస్తున్న మాజీ ఐఎఎస్ అధికారి డా. పివి రమేష్

సమాజం లో అన్ని రంగాలలో అభివృద్ధి జరగకుండా మరింతమంది పిల్లలను కనమని ప్రోత్సహించడం సహేతుకం కాదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లో పూర్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డా. పి.వి. రమేష్ పేర్కొన్నారు.

గురువారం నాడు తేదీన జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో గుంటూరులోని జన చైతన్య వేదిక సమావేశ మందిరంలో అధిక జనాభా వరమా? భారమా? అనే అంశంపై జరిగిన చర్చా గోష్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొని డాక్టర్ పి. వి.రమేష్ ప్రసంగించారు. 147 కోట్ల జనాభాతో ప్రపంచంలో అగ్ర భాగాన ఉన్న ఇండియాలో మరింతమంది పిల్లలను కనమని రాజకీయ నాయకులు పిలుపునివ్వడం సరైనది కాదన్నారు. ఈ సందర్భంగా నిరాక్షరాస్యత, పేదరికం, నిరుద్యోగం భారత దేశంలో ఎలా తాండివిస్తున్నదో ఆయన వివరిస్తూ, ఈ పిలుపు అవాంఛనీయ పరిణామాలకుదారితీస్తుందని డా.రమేష్ అభిప్రాయపడ్డారు.

ప్రపంచంలో 2000 సంవత్సరాల క్రితం 20 కోట్ల జనాభా ఉంటే నేడు 823 కోట్లకు చేరిందని, 2058 నాటికి 1000 కోట్లకు చేరుతుందని తెలిపారు. పారిశ్రామిక విప్లవం, విద్య, వైద్య రంగాలలో విప్లవాత్మక మార్పులు రావడం వలన మరణాల రేట్లు గణనీయంగా తగ్గుతూ జనాభా పెరుగుదలకు తోడ్పడిందన్నారు.

ప్రపంచ భూభాగంలో 2.4 శాతం భూభాగం మాత్రమే కలిగి ఉన్న భారతదేశం ప్రపంచ జనాభాలో 18శాతం జనాభాతో ప్రపంచంలో అగ్ర భాగాన ఉందన్నారు. శిశు మరణాల రేటు గణనీయంగా తగ్గిందని సగటు జీవిత కాలం 1951 లో 36 సంవత్సరాలు ఉండగా నేడు 73 సంవత్సరాలు కు పెరిగిందన్నారు.

స్త్రీల సంతోనోత్పత్తి 1951 లో ఆరు ఉండగా నేడు రెండు కు తగ్గిపోయిందని వివరించారు. పేదరికం, నిరక్షరాస్యత అధికంగా ఉన్న ప్రాంతాలలో కుల, మతాలకు అతీతంగా జనాభా పెరుగుదల రేటు ఎక్కువగా ఉంటుందని, అభివృద్ధి చెందిన ప్రాంతాలలో జనాభా పెరుగుదల రేటు తక్కువగా ఉందన్నారు. బీహార్ , మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్ లలో నేటికీ జనాభా పెరుగుదల రేటు 2.5 శాతంగా ఉండగా దక్షిణాది రాష్ట్రాలలో ఒక శాతం లోపుగానే ఉందన్నారు.

జపాన్, దక్షిణ కొరియా, ఫిన్ ల్యాండ్, చైనా లాంటి దేశాలలో జనాభా పెరుగుదలకు ఎన్నో ప్రోత్సాహకాలు అందిస్తునా జనాభా పెరుగుదలలో పెద్దగా మార్పు లేకపోవడం గుర్తించాలన్నారు. చర్చ గోష్టికి అధ్యక్షత వహించిన జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి ప్రసంగిస్తూ ప్రపంచంలో భారతదేశం ఆకలి సూచికలో 105వ స్థానం, ఆనందసూచికలో 118 వ స్థానం, మానవ వనరుల అభివృద్ధి సూచికలో 134వ స్థానం, తలసరి ఆదాయ సూచికలో 126వ స్థానంలో ఉంటున్న నేటి పరిస్థితులలో అధికంగా పిల్లలను కనమని చెబుతూ జనాభాను పెంచితే అత్యధిక సమస్యలను ఎదుర్కొంటామన్నారు.

కేవలం 2900 డాలర్ల తలసరి ఆదాయం మాత్రమే ఉన్న ఇండియాలో జనాభా నియంత్రణ అవసరం అన్నారు. నేడు ఇండియాలో ఏడాదికి కోటి 40 లక్షలు జనాభా పెరుగుతున్నారని ప్రపంచంలో దాదాపు 120 దేశాలలో జనాభా ఒక్కొక్క దేశంలో కోటి నలభై లక్షల లోపే జనాభా కలిగి ఉన్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్ లో నిరాక్షరాస్యత, నిరుద్యోగం, పేదరికం, అసమానతలు నివారించిన తర్వాతనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికంగా పిల్లలను కనమని కోరాలన్నారు. మాజీ శాసనమండలి సభ్యులు కె.ఎస్. లక్ష్మణరావు ప్రసంగిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి జనాభా పెరుగుదలను గూర్చి ఆలోచించడం మాని ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి, ఉపాధి కల్పన, నైపుణ్యాల అభివృద్ధి, వ్యవసాయ, పారిశ్రామిక రంగాలలో ఉత్పాదకత పెంపుదల కోసం కృషి చేయాలన్నారు. దక్షిణాది రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ అతి తక్కువ తలసరి ఆదాయంతో, అతి తక్కువ పట్టణ జనాభాతో ఉందని, నిర్మాణంలో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేయాలని, 90 వేల కోట్ల రూపాయలతో నిర్మించ తలపెట్టిన గోదావరి - బనకచర్ల ప్రాజెక్టు రూపకల్పనకు స్వస్తి పలకాలన్నారు. ప్రముఖ ఆర్థిక వేత్త ప్రొఫెసర్ డి.ఏ.ఆర్. సుబ్రహ్మణ్యం ప్రసంగిస్తూ ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు ముస్లింలను బూచిగా చూపి హిందు జనాభా పెరగాలని అంటున్నారని స్టాలిన్ లాంటి వారు డీలిమిటేషన్ దృష్ట్యా పెళ్లయిన జంటలను త్వరగా బిడ్డలను కనాలని పిలుపునిస్తున్నారని ,చంద్రబాబు లాంటి వారు అభివృద్ధి చెంది కొద్ది జనాభాతో ఉన్న జపాన్, దక్షిణ కొరియా, జర్మనీ లాంటి దేశాలలో ఉన్న పరిస్థితులతో పోల్చుకుని ఇండియాలో అధికంగా పిల్లలను కనాలని కోరడం మంచిది కాదన్నారు. ప్రముఖ వైద్యులు సామాజిక న్యాయం కోసం నిరంతరం కృషి చేస్తున్న డా||ఆలా వెంకటేశ్వరరావు ప్రసంగిస్తూ కులాంతర, మతాంతర వివాహాలను ప్రోత్సహించాలని కోరారు. అత్యున్నత విద్య, వైద్య సదుపాయాలను కల్పించవలసిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు డొక్కా మాణిక్య వరప్రసాద్, ఏపీ గెజిటెడ్ ఆఫీసర్స్ పూర్వ అధ్యక్షులు ఏ .వి .పటేల్, సెయింట్ లారెల్స్ స్కూల్ డైరెక్టర్ మేకల రవీంద్రబాబు, నేస్తం సహ వ్యవస్థాపకులు టి. ధనుంజయ రెడ్డి, రాజ్యాంగ చర్చా వేదిక కార్యదర్శి అవధానుల హరి, దళిత ఫ్రంట్ వ్యవస్థాపకులు కొరివి వినయ్ కుమార్ తదితరులు పాల్గొని ప్రసంగించారు.

Tags:    

Similar News