‘అమరావతి వరద’ కామెంట్ తో సుభాష్ ని సస్పెండ్ చేయవచ్చా?
అమరావతి వరద మీద ఫేస్ బుక్ లో పోస్టు పెట్టినందుకు వాణిజ్య పన్నులశాఖ తిరుపతి అసిస్టెంట్ కమిషనర్ (FAC) ఎస్.సుభాష్ చంద్రబోస్ ప్రభుత్వం సస్పెండ్ చేయడం సబబా?
By : డాక్టర్ ఎస్ రాము
Update: 2025-09-24 04:16 GMT
మన పేరు మీద మనం ఫేస్ బుక్, ఇన్స్టా, ట్విట్టర్ వంటి సోషల్ ప్లాట్ ఫామ్ లలో అకౌంట్ ఓపెన్ చేసుకుని రాస్తున్నామంటే...దాని అర్థం మన రాతలు, అభిప్రాయాలు వ్యక్తిగతం అని. అందుకే దాన్ని అఫీషియల్ మీడియా అని కాకుండా సోషల్ మీడియా అంటారు. మరీ అసభ్యకరమైన, అభ్యంతరకరమైన భాష వాడకుండా మనసులో మాటలు ఈ వేదికల మీద రాస్తే...దాన్ని ప్రభుత్వ వ్యతిరేక చర్యలుగా భావించి శిక్షించడం తప్పున్నర తప్పు.
తిరుపతి GST అధికారి సుభాష్ (Siddharthi Subhas చంద్రబోస్) గారిని అమరావతి వరదల మీద చేసిన వ్యాఖ్య నేపథ్యంలోనే గనక సస్పెండ్ చేసి ఉంటే అది అన్యాయం, అక్రమం. రాజధాని మీద ఆవేదనతో ఆయన చేసిన వ్యాఖ్యను స్పోర్టివ్ గా తీసుకోవడమో లేదా ఇగ్నోర్ చేయడమో చేయాలి గానీ ఉద్యోగం మీద వేటు వేయడం మర్యాదగా లేదు. ప్రభుత్వ వాదన కోర్టుల్లో కూడా నిలబడదని నాకు అనిపిస్తున్నది. ప్రభుత్వ చర్య ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో ఆలోచనాపరుల ఆగ్రహానికి కారణమై పెద్ద చర్చ లేవనెత్తింది. ఇది చంద్రబాబు గారి ప్రభుత్వానికి మంచిది కాదు.
ఏ ప్రభుత్వ ఉద్యోగీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కావాలని బాహాటంగా రాయరు. అందరికీ ఉద్యోగ భయం ఉంటుంది. జాబ్ కాపాడుకుని జాగ్రత్తగా బతకాలని ఉంటుంది. సర్వీసు నిబంధనల ప్రకారమే నడుచుకొని పెద్దల దృష్టిలో పడకుండా ఉండాలని అనుకుంటారు. ఆంధ్రా ప్రజలకు ఎంతో మనోవేదన కలిగిస్తున్న రాజధాని అంశం మీద రాసిన నాలుగు మాటలను మరీ సీరియస్ గా తీసుకుంటే ఎట్లా? ఫోటో ఫేక్ అయితే FB వాడికి ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ వాళ్ళతో రిపోర్ట్ చేయిస్తే పోయేది. అరబ్ స్ప్రింగ్ గానీ, జన్ జీ విప్లవం గానీ ఇలాంటి స్పార్క్స్ తోనే మొదలయ్యాయి.
ఇది రాయడానికి ముందు నేను సుభాష్ గారి వాల్ లో ఆయన గతంలో రాసిన పోస్టులు చూశాను. సోషల్ మీడియా లో కనిపించే రొడ్డ కొట్టుడు, బండ బూతు బ్యాచ్ కారు ఆయన. ఆయన పోస్టుల్లో సామాజిక కోణం ఉంది. భాష కూడా బ్యాలెన్స్ గా ఉంది. కులం మీద నిర్దిష్ట అభిప్రాయాలు ఉన్నా ఆయన పరుష పదాలు వాడకుండానే తన భావాలు వ్యక్తీకరించారు. బీజేపీ వ్యతిరేక పోస్టులు కొన్ని ఉన్నా దేశ హితం కోసం తపించే concerned citizen కనిపించారు.
జగన్ ప్రభుత్వం ఉండగా కూడా సుభాష్ గారు ఇట్లానే స్పందించి ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే పోస్టులు రాశారా? ఇప్పుడు ఎన్ డీ ఏ ప్రభుత్వం వచ్చాక మాత్రమే ఇట్లా రాస్తున్నారా? అన్నవి చూస్తే ఆయన నిష్పాక్షిత ఏమిటో తెలుస్తుంది. రోజూ పనికట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాస్తుంటే అనుకోవచ్చు గానీ ఎంతో ముఖ్యమైన రాజధాని మీద ఒక సిటిజన్ గా స్పందిస్తే చర్య తీసుకోవడం కక్ష సాధింపుగా స్పష్టమై ప్రభుత్వానికి నష్టం చేస్తుంది. యువత అంతా దీన్ని తేలిగ్గా తీసుకోరు.
అసమ్మతి (dissent) అనేది ప్రజాస్వామ్యానికి చాలా అవసరం. బరితెగింపు అసమ్మతి కాకుండా, సునిశిత విమర్శ అనేదాన్ని ఎవరు చేసినా హంబుల్ గా స్వీకరిస్తే మంచిది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిన్న విమర్శకే ఇంత అల్లల్లాడుతుంటే, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండి, జీతం తీసుకుంటూ అప్పటి పాలకులను నోటికొచ్చింది తిట్టి వీధుల్లోకి వచ్చిన తెలంగాణ ఉద్యమకారులను ఏమనాలి? ఉద్యోగులు ప్రభుత్వానికి, వ్యవస్థకు వ్యతిరేకంగా జాయింట్ యాక్షన్ కమిటీ కూడా ఏర్పాటు చేసి తెగించి పోరాడారే! దాన్ని ఏమనాలి?
అయితే, ఇంత ముఖ్యమైన నిర్ణయం మీద మన విప్లవ యోధుడు చే గువేరా భక్తుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి స్పందన వచ్చినట్లు నాకు కనిపించలేదు. సినిమా బిజీ లో ఉండడం వల్ల లేదా అభివృద్ధి మీద ఎక్కువ దృష్టి పెట్టడంవల్ల ఆయనకు ఈ కేసు కనిపించి ఉండకపోవచ్చు. మరీ కత్తి తిప్పకపోయినా ఇప్పుడైనా ఆయన స్పందిస్తే బాగుంటుంది.
జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగులు జట్టు కట్టబెట్టే బాబు గారి ప్రభుత్వం వచ్చింది. అప్పటి ఉద్యోగులు దండు లాగా రోడ్ల మీదకు వచ్చిన రోజే ఆ ప్రభుత్వ పతనం మొదలయ్యింది. ఈ విషయాలు మరిచిపోయి, పవర్ వచ్చాక చాలా భిన్నంగా ప్రవర్తిస్తే ప్రజలు గమనిస్తారు.
ఇక్కడ సుభాష్ గారికి ఒక సూచన. చట్ట ప్రకారం మీరు ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేయండి. కచ్చితంగా న్యాయం మీ వైపే ఉంటుంది. సోషల్ మీడియా లో కుల సంఘాల మాయలో పడకుండా, శృతి తప్పకుండా ముందుకుపోండి. భాష మీద, భావాల మీద నిగ్రహం లేకుండా బుర్రకు వచ్చింది రాసే వాళ్ళు చేసే హడావుడి మాయలో పడి బద్నాం కాకండి. మీ డిగ్నిటీ మీరు పాటించండి. ఇక్కడ యమ హడావుడి చేసే వాళ్ళు అవసరం అయినప్పుడు మీ పక్కన ఉంటారన్న గ్యారంటీ ఏమీ లేదు. సోషల్ మీడియాలో ఉండే నాన్ సీరియస్, తుంటరి బ్యాచ్ మాటలు ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకుని మీ గొంతుక వినిపించండి. ఆల్ ద బెస్ట్.
(The Federal seeks to present views and opinions from all sides of the spectrum. The information,ideas or opinions in the articles are of the author and do not necessarily reflect the views of The Federal Andhra Pradesh)