‘పెను సవాళ్ల మధ్య బిఆర్ నాయుడు ప్రస్థానం ప్రారంభం’

‘మీడియా సంస్థను నడిపినంత తేలికగా టీటీడీని నడపడం లేరు. టిటిడి నిర్వహించడం అంత సులువు కాదు.’

By :  Admin
Update: 2024-11-07 04:21 GMT


- కందారపు మురళి


'టీటీడీలో పాలన అంత తేలిక కాదు' అనేది గత చరిత్ర చూస్తే తెలుస్తుంది. రోజూ కొన్ని వేల మంది భక్తులు సందర్శించే దేవాలయాన్ని పరిపాలించే సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానాల(టిటిడి) సంస్థ అయిన ప్రతిచిన్నవిషయం జాతీయ వార్త అవుతుంది. ప్రజలు కూడా టిటిడిలో ఏంజరుగుతున్నదనే విషయాన్ని జాగ్రత్త గా గమనిస్తూ ఉంటారు. ఏంత చిన్నవివాదమయినా క్షణాల్లో ప్రపంచమంతా వ్యాపిస్తుంది. ప్రకంపనలు సృష్టిస్తుంది. అందుకే టిటిడిని వివాదాలకు దూరంగా నడపడం అంతతేలిక కాదని చెబుతారు.


తిరుమల తిరుపతి దేవస్థానంలో బోర్డు ఛైర్మన్ గా పగ్గాలు చేపట్టిన ‘టీవీ-5’ ఛైర్మన్ బిఆర్ నాయుడు గారికి ఈ పదవి కత్తి మీద సాము వంటిదే అనడంలో సందేహం లేదు. స్వతహాగా వివాదరహితుడైన బిఆర్ నాయుడుకి ఎంప్లాయి ఫ్రెండ్లీగా, సౌమ్యుడిగా పేరు ఉంది. టీవీ5 లో పనిచేసే ఏ ఉద్యోగిని అడిగినా ఇదే విషయం చెబుతారు. ఉద్యోగులను వారి కుటుంబాలను కష్టసుఖాలను పట్టించుకోవడంలో నాయుడు గారు ప్రథమంగా ఉంటారని చెబుతారు.


6000 మంది పర్మినెంట్ ఉద్యోగులు, 16 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్న టీటీడీ ఓ రకంగా చిన్న సైజు రాష్ట్ర ప్రభుత్వంతో సమానంగా ఉంటుంది. ఐదువేల కోట్ల రూపాయల బడ్జెట్ 80 కి పైగా విభాగాలు ప్రతినిత్యం విఐపి ల సందడి, రోజుకో పూజా విశేషంతో కూడిన అత్యంత ప్రతిష్ట కలిగిన సంస్థ. ప్రపంచంలో అతిపెద్ద ఆదాయం కలిగిన రెండవ ధార్మిక సంస్థ. వాస్తవంగా ఇక్కడి ఉద్యోగులు, అధికారులు, కార్మికులలో ఎంతో అంకితభావం కలిగిన వారు ఉన్నారు.



(కొత్త చెయిర్మన్ కు శుభాకాంక్షలు చెబుతున్న కందారపు మురళి, ఇతర సిఐటియు నాయకులు)

 


తిరుపతి ప్రజలకు కూడా టిటిడితో విడదీయరాని బంధం శతాబ్దాలుగా కొనసాగుతోంది. కుల మతాల కతీతంగా కొన్ని సాంప్రదాయాలు ఏర్పడి ఉన్నాయి. ఇక్కడి విద్యాలయాల్లో చదువుకోవడం ఉద్యోగులుగా కార్మికులుగా పనిచేయడం, టిటిడి అనుబంధ పరిశ్రమలు, సంస్థలు, వ్యాపారాలలో ఉపాధి కలిగి ఉండటం ఇక్కడి అదనపు అంశాలు. టీటీడీ లేని తిరుపతిని ఊహించలేము.


కరోనా సమయంలో తిరుపతికి యాత్రికులు రాకపోవడంతో దీనిపై ఆధారపడిన ప్రజలు అల్లాడిన తీరు దీనికో ఉదాహరణ. తప్పులు చేస్తే ఎంతటి పెద్దవారినైనా ప్రశ్నించగలిగే భక్తి భావంతో కూడిన అధికారుల సంఖ్య కూడా టిటిడిలో ఎక్కువే. బయట జరిగే వివాదాలు, రాద్ధాంతాలతో ఇక్కడి ఉద్యోగులకు, తిరుపతి ప్రజలకు ఏమాత్రం సంబంధం ఉండదు.


వెంకన్న స్వామిని అడ్డం పెట్టుకొని దేశమంతటా లబ్ది పొందాలన్నా స్వార్థపూరిత ప్రయోజనాలు కలిగిన శక్తులు తిరుమల పై కన్నేసి ఉన్నాయి. బిఆర్ నాయుడు గారు అప్రమత్తంగా ఉండాల్సింది వీరి తోనే. తెలివైన వారు వివాదాల జోలికి వెళ్లకుండా టీటీడీలో ఉన్న ఉద్యోగులు, వెంకన్నను దర్శించే భక్తులు, తిరుపతి ప్రజల ఆదరాభిమానాలు పొందిన వారు తమ పాలనలో జయప్రదం అయ్యారు.


వివాదం ముంగిట్లోకి తలదూర్చిన పెద్దలు ఎంతటి వారైనా ఇబ్బందులు పడిన సందర్భాలు గతంలో అనేకం చూశాం. బి.ఆర్ నాయుడు గారు ఏ తరహా ను ఎంచుకుంటారో వేచి చూడాల్సిందే. టీటీడీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బలమైన వ్యక్తులతో బోర్డు ఏర్పడింది.


సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగాను, జాతీయ మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ గాను పని చేసిన జస్టిస్ హెచ్ ఎల్ దత్తు లాంటి అత్యున్నత స్థాయి వ్యక్తి కూడా టీటీడీ బోర్డులో ఓ సభ్యుడుగా ఉండటం గతంలో ఎన్నడూ లేదు.


కేంద్ర పెద్దలు తమ పెత్తనం సాగించు కోవడానికి ఇప్పటికే నిబంధనలు సైతం మార్చేసి తమ అనుయాయులను సభ్యులుగా చేర్చారు. గత వైసిపి ప్రభుత్వం లోను వీరు సభ్యులైన విషయాన్ని నాయుడు గారు విస్మరించరాదు. వైసీపీలో ఉండి తెలుగుదేశంలో చేరిన మరికొందరు కూడా ప్రస్తుతం సభ్యులు అయ్యారు.


గతంలో వివాదాలకు కేంద్రమైన వారు ప్రస్తుతం సభ్యులుగా ఉన్న విషయాన్ని బి ఆర్ నాయుడు విస్మరించడం లేదని భావించాలి. మీడియా సంస్థను నడిపినంత తేలికగా టీటీడీని నడపడం అంత సులువు కాదు. ఇప్పటివరకు మీడియా అధిపతిగా ఇతరులను విమర్శించడం ప్రశ్నించడం చూశాం. ఇప్పుడు తాను కూడా అతీతం కాదనే విషయాన్ని నాయుడు గారు గ్రహించి ఉంటారు.


ప్రతి అంశాన్ని భూతద్దంలో చూసే ధోరణి ఉన్న ఇక్కడ బిఆర్ నాయుడు లాంటి వివాద రహితమైన వ్యక్తి రాజకీయ అవసరాల రీత్యా పాలక పార్టీలతో ఎలా వ్యవహరిస్తారు? ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కొంటారు? అన్నది నేడు పలువురిలో ఆసక్తికరమైన అంశంగా మారింది.


సామాన్య భక్తులకు, సేవలందించడం, ఉద్యోగుల పట్ల సానుకూలంగా వ్యవహరించడం, కాంట్రాక్టు కార్మికుల కష్టాలు తీర్చడంలో బి ఆర్ నాయుడు గారు సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తారని ఆశిస్తున్నాము.


తిరుమల కొండపై రాజకీయ దందా, దళారీల దందా, మీడియా దందా, పోలీసు దందా, జ్యుడీషరీ దందా, కార్పొరేట్ దందాలను అరికట్టడానికి, ఈ బోర్డు తగిన చర్యలు తీసుకుంటుందని మనమంతా ఆశిద్దాం... బిఆర్ నాయుడు గారు టీటీడీ ఛైర్మన్ గా జయప్రదం కావాలని ఆయనకు శుభాకాంక్షలు తెలియ జేద్దాం.



(కందారపు మురళి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి)




Tags:    

Similar News