‘ప్రజలు అనుకున్నదొకటి, జరిగింది మరొకటి’

తెలంగాణ స్వరాష్ట్ర మలి ఉద్యమంలో ప్రజలు తమ తమ డిమాండ్లను, ఉద్యమాలను భావజాలాలను పక్కన పెట్టి తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా..

Update: 2024-05-30 06:30 GMT

తెలంగాణ స్వరాష్ట్ర మలి ఉద్యమంలో ప్రజలు తమ తమ డిమాండ్లను, ఉద్యమాలను భావజాలాలను పక్కన పెట్టి తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా రెండు దశాబ్దాలకు పైగా ఉద్యమించారు. నాటి జాతీయోద్యమం స్పూర్తితో శాంతియుతంగా సాగారు. ఎన్నో దెబ్బలు తిన్నారు. ఎన్నో కేసుల్లో ఇరుక్కున్నా.

ఉద్యమంలో నిశ్శబ్దం ఆవరించినప్పుడు, కేంద్రం తాత్సారం చేస్తున్నప్పుడు, వ్యతిరేక శక్తులు ముందుకు వచ్చినప్పుడు వందలాది మంది యువతీ యువకులు ఆత్మ బలిదానాలు చేసుకొని ఉద్యమ జ్వాలకు ఇంధనంగా మారారు. విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు సబ్బండ కులాలు , కవులు కళాకారులు జర్నలిస్టులు, గల్ఫ్ కార్మికులు, ఇతర దేశాల్లో పని చేస్తున్నవారు చురుకుగా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తమ అన్ని సమస్యలకు పరిష్కారం అనుకున్నారు. కానీ అనుకున్నది ఒకటి జరిగిందొకటి.

చురుకుగా పాల్గొన్న ఆయా సామాజిక వర్గాలు, విద్యావంతులు, నిరుద్యోగులు, దున్నే వారికి 3 ఎకరాల భూమి వస్తుందనుకున్న పేదలు దళితులు, మహిళలు అంతా ప్రత్యేక రాష్ట్రంతో సాధికారికత వెల్లి విరుస్తుందనుకున్నారు. ఉద్యమకారులే ప్రజా ప్రతినిధులుగా, ప్రభుత్వ నేతలుగా పరిపాలన చేపడుతారనుకున్నారు. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న వారే 1947 తరువాత అన్ని రంగాలలో విస్తరించి పరిపాలన సాగించారు. ఆదర్శ వంతమైన రాజ్యాంగాన్ని, పరిపాలనను, న్యాయ వ్యవస్థను, ప్రాజెక్టులను, పరిశ్రమలను ప్రభుత్వ శాఖలను నిర్మించారు.

రాష్ట్రం ఏర్పడితే అలాంటి క్రమమే సాగుతుందని ఉద్యమకారులు, ప్రజలు భావించారు. అందుకు భిన్నంగా గత పదేళ్ల తెలంగాణ పరిణామాలు కొనసాగాయి. అంతులేని అవినీతి, అలసత్వం, వెలమ రెడ్డి కులాధిక్యత అన్న రంగాల్లో పుంజుకుని మిగతా వర్గాలను వెనక్కి నెట్టారు. అణిచి వేసారు. ఉద్యమ స్పూర్తితో ఎవరికి టికెట్ ఇచ్చినా గెలుస్తారని తెలిసి కూడా బీసీలను , ఉద్యమ కారులను వెనక్కి నెట్టి కేవలం రాజకీయాలు చేసే , డబ్బున్న వారినే ఎన్నికల్లో నిలబెట్టారు. మహిళలకు అవకాశాలు లేకుండా చేశారు. జీ హుజూర్ అనే వారిని, పేరుకు మాత్రం బడుగు బలహీన వర్గాల నుండి కొందరిని ఎన్నిక చేశారు. ఇలా ప్రారంభంలోనే తెలంగాణ ఆశయం వక్రమార్గం పట్టింది. 20 శాతం మేరకే ఉద్యమ నాయకులకు అవకాశం ఇచ్చారు. పైగా ఇక నుండి తమ పార్టీ పక్కా రాజకీయ పార్టీ అని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ ప్రకటించారు.

రాజకీయ రంగం ఇలా ఉద్యమ స్ఫూర్తి స్థానంలో స్వార్థ పరుల పెత్తనం పాలైంది తెలంగాణ. ఇక రియల్ ఎస్టేట్, కాంట్రాక్టులు పరిశ్రమలు పదవులు … ఒక్కటొక్కటే వాళ్ల వశం అయ్యాయి. అన్ని రంగాల్లో వారే- వారి దోపిడీకి అడ్డు లేకుండా పోయింది. దోచుకున్నవారికి దోచుకున్నంత! రాజకీయాల్లో అందరికి వాటా లభించదు. లక్షల మంది ఉద్యమిస్తే ఎంపీ, ఎమ్మెల్యే మొదలుకొని మండలాధ్యక్షులు , నామినేటెడ్ పోస్టులు అన్ని కలిపి 5 వేల మందికి మాత్రమే రాజకీయాల్లో అధికారం హోదా లభిస్తాయి.

అయితే ప్రజలు విద్యావంతులు ఉన్నత విద్య, ప్రభుత్వ ఉద్యోగం, ఉపాధి కల్పన కోరుకున్నారు. కూలీల్లా పని తీసుకునే ఔట్ సోర్సింగ్ స్థానంలో ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణన, 5 లక్షల.నూతన ఉద్యోగాల కల్పన కోరుకున్నారు. యువతరం ప్రధాన ఆకాంక్షలివే. సొంత రాష్ట్రం వస్తే ఇవి నెరవేరుతాయనుకున్నారు. నెరవేర లేదు.

ఏదో కొంప. మునిగి పోయినట్టుగా అన్ని శాఖలలో ఉన్న ఉద్యోగాల ఖాళీలను పక్కన పెట్టి వేలాది మందిని పోలీసులుగా రిక్రూట్ చేసుకున్నారు. చాలా మంది ఇదొక అపశకునంగా భావించారు. పరిపాలన , నిర్బంధాలు ఎలా సాగనున్నవో ఆ పోలీసుల నియామకాలు సందేశం అందించాయి. రాష్ట్ర భవిష్యత్తుకు బాట వేసే టీచర్ల కన్నా ఎన్నో రెట్లు ఎక్కువగా పోలీసులనే నియమించారు.

నక్సలైట్ల ఎజెండాయే. మా ఎజెండా అని నినాదాలు ఇచ్చారు. కాని, అందుకు పూర్తి భిన్నంగా ఆచరించారు. రైతుబంధు, ధరణి పోర్టల్ ద్వారా ఒకప్పుడు కాంగ్రెస్ , కమ్యూనిస్టుల, నక్సలైట్ల నాయకత్వంలో సొంతం చేసుకొని సాగుచేసుకుంటున్న పేదరైతుల, గిరిజన రైతుల లక్షలాది ఎకరాల భూమిని లాక్కున్నారు. రాళ్లు రప్పలు ఏరి ముళ్ల కంపలు కొట్టి సాగు నీటి వసతి కల్పించుకొని చేమటోడ్చి దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూములివి. ఈ ప్రజలను తొలగించి భూస్వాములకు ఈ భూములను దఖలు పరిచారు. భూమి రికార్డులలో అనుభవ దారు , కౌలుదారు ఆక్రమణదారు కాలమ్స్ తొలగించారు. తద్వారా ఆభూములకు ‘రైతుబంధు’ రొక్కాన్ని భూస్వాములకు చెల్లించి వారికి వాటిపై పూర్తి హక్కు కల్పించారు. వాటిని స్థిర పరుస్తూ ధరణి పోర్టల్ రూపొందించారు. ఈ రెండు పథకాలు భూస్వాములకు మేలు చేయడం కోసమనేది ఎవరికి తెలియకుండా. నినాదాలు ఇచ్చి వేల కోట్ల రూపాయలు ధార పోసారు. ఎక్కడెక్కడ అసైండ్ భూములు ఉన్నాయో గమనించి దొరికిన కాడికి ఆక్రమించుకున్నారు. అమ్ముకున్నారు. ఇలా భూస్వాములకు చెల్లింపుల కోసం అప్పులు చేసి ఆ అప్పులను వడ్డీతో సహా ప్రజల నెత్తిన రుద్దారు. ఇది ప్రజల పట్ల టీఆర్ఎస్ (నేడు బిఆర్ఎస్) ప్రభుత్వం. చేసిన నిర్వాకం.

ప్రయివేటు యూనివర్సిటీలు వద్దని చెప్తూనే అనుమతి ఇచ్చారు. ఇచ్చారు సరే. వాటిలో బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు లేకుండా చేసిన ఘనకీర్తి టీ ఆర్ ఎస్ ప్రభుత్వానిదే. ప్రభుత్వ కాలేజీలు యూనివర్సిటీలలో. నియామకాలు చేయకుండా ఉన్నత విద్యను బంజరు భూమిగా మార్చిన ఘనత కూడా వీరిదే. కరోనా కాలంలో ప్రైవేటు హాస్పటల్‌ల ఫీజుల నియంత్రణకు, ఆరోగ్యశ్రీ వర్తింపుకు ససేమిరా వ్యతిరేకించి వేలాది ప్రాణాలు ఆస్తులు గాలిలో కలిశాయి. అందుకుగాను ఎలక్టోరల్ బాండ్సు రూపంలో వేల కోట్లు పుచ్చుకున్నారు. ఆరోగ్యశ్రీ కి పెట్టే బడ్జెటుతో అంతకన్నా ఎన్నో హాస్పటళ్లు ప్రభుత్వం స్థాపించవచ్చు. ఆ విషయం వారికి తెలుసు. కార్పోరేటు హాస్పటల్స్‌కు మేలు చేయడానికే ఈ స్కీము వచ్చింది.

అన్ని రకాల ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాలు కలిసి జేఏసీలు ఏర్పడి ఉద్యమిస్తే ఉద్యోగ సంఘాలే అవసరం లేదని వాటిని విచ్చిన్నం చేశారు. ఆసరా పథకం, రైతుబంధు వంటి వాటితో రెండు కోట్ల మంది ఓటు బ్యాంకు వుంది నాకేమిటి అనుకున్నారు. అలా ఆర్థిక సాయంతో రాజకీయాల్లో ఆటాడుకోవచ్చు అనుకున్నారు. అయితే ప్రజలు ఆర్థిక అంశాలు అధిగమించి రాజకీయ చైతన్యం పెంచుకున్నారు. అలా టి ఆర్ ఎస్ ఓడి పోయింది. ఆ వచ్చిన ఓట్లు ఆర్థిక పథకాల వల్ల వచ్చినవే ఎక్కువ.

మరో వింతైన ఘోరమైన విషయం. తెలంగాణ సాధన కోసం దశాబ్దాలుగా లక్షలాది ప్రజలు ఉద్యమించారు. ఒకప్పుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ , ఆ తరువాత ఆచార్య కొత్తపల్లి జయ శంకర్ లను తెలంగాణ జాతి పితలుగా ప్రేమగా పిలుచుకున్నారు. వారని వెనక్కి నెట్టి అన్ని అనుభవిస్తున్నది చాలక తానే ‘తెలంగాణ జాతిపిత’ అని ప్రచారం చేయించుకున్నారు.

అయితే కెసిఆర్ చేసిన మంచి పనులు కొన్ని గుర్తు చేసుకోక తప్పదు. పదేళ్ల దాకా హైదరాబాద్ రెండు రాష్ట్రాలకు రాజధాని, ఆ పోలీసులపై రెండు ముఖ్యమంత్రులకు అధికారం వుంటుందని రాసారు. దీనికి విరుగుడుగా పోలీసులకు 300 పైగా ఇన్నోవా వాహనాలు కొని పెట్టి తెలంగాణ వైపు తిప్పారు.

చంద్రబాబుకు రహస్యంగా కర్రు కాల్చి వాత పెడితే విజయవాడలో పోయి పడ్డారు. అలా తెలంగాణ రాష్ట్ర సొంత అస్తిత్వానికి ఇతరులెవరూ అడ్డు రాకుండా చేశారు. తెలంగాణ వారి విద్య ఉద్యోగ అవకాశాలు ఇతరులు ఆక్రమించకుండా ఫీజు రీఅంబర్సు మెంటులో పెట్టిన మెలిక ఇతర ప్రాంతాల వారి ఆధిపత్య భావనను కూకటి వేళ్లతో కదిలించింది.

మనం వేరే రాష్ట్రంలో బెంగళూరు, చెన్నయి, కోల్ కతా, ముంబయిలలో వలే మన పరిధిలో మనం జీవించాలనే స్పృహను కలిగించడంలో గత ప్రభుత్వం విజయం సాధించింది. పాఠ్య పుస్తకాల ద్వారా పాక్షికంగానైనా తెలంగాణ భాషకు సాధికారికత కల్పించారు. గత పదేళ తెలంగాణ సాధించిన విజయాల్లో ఇవి కొన్ని. దీన్ని వైఫల్యాలతో పాలిస్తే, ఇది చాలా తక్కువ.

Tags:    

Similar News