అర్ధనరేశ్వరి నుంచే అర్ధనారీశ్వరుడు వచ్చాడా?!

రామాయణంలో నిరుత్తరకాండ-31: సామాజికంగా, ఇతరత్రా స్త్రీ, పురుషుల స్థానాలు, హోదా తారుమారు అవుతూవచ్చిన క్రమాన్ని రామాయణంలో చారిత్రకంగా గుర్తించవచ్చు.

Update: 2024-10-24 06:10 GMT


విలియం ఇర్విన్ థామ్సన్ భారతీయపురాణకథలతోనూ, పాత్రలతోనూ, తాత్వికతతోనూ తగినంత పరిచయం ఉన్నవాడే కానీ, ఇంతకుముందు చెప్పుకున్న కుమారస్వామికథ ఆయన దృష్టికి వచ్చినట్టు లేదు. వచ్చి ఉంటే, ఎంకి గురించిన సుమేరుపురాణకథను వివరించే సందర్భంలో, దానితో చాలా దగ్గరి పోలికలున్న కుమారస్వామికథను ప్రస్తావించి ఉండేవాడేమో! ఎంకి కథ ఒక విప్లవాత్మకమైన పరివర్తనను సూచిస్తుందని చెబుతూ, దాని పూర్వరంగాన్ని ఆయన వివరించాడని అనుకున్నాం. ఎంకి, కుమారస్వామికథల మధ్యనున్న పోలికలు ఆ పూర్వరంగానికి కూడా విస్తరించే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు అందులోకి వెడదాం:

ఎగువ పాతరాతి యుగంతో మొదలుపెట్టి మధ్యరాతియుగం మీదుగా కొత్తరాతియుగంవైపు సాగిన థామ్సన్ అధ్యయనయాత్రలో రెండు ముఖ్యమైన మజిలీలు ఉన్నాయి. మొదటిది, మంచుయుగపు గుహాచిత్రాలున్న ఫ్రాన్స్ లోని లస్కో (Lascaux) గుహాసముదాయం; రెండోది, అనటోలియా అని పిలిచే నేటి తుర్కియే(టర్కీ)లో కొత్తరాతియుగానికి చెందిన చాటల్ హ్యుయక్((Çatalhöyük)) అనే ఒక పెద్ద జనావాసం.

లస్కో గుహల గోడలమీదా, పై కప్పుల మీదా అనేక తరాలపాటు చిత్రించిన 600 చిత్రాలు ఉన్నాయి. అవి ప్రధానంగా ఆ ప్రాంతంలోని ఎగువరాతియుగానికి చెందిన జంతుశిలాజాలు సూచించే అడవి దున్నలు మొదలైన భారీజంతువులను చిత్రించినవి. ఈ చిత్రాలు 17వేల నుంచి 22 వేల సంవత్సరాల వెనకటి కాలానికి చెందినవిగా అంచనా వేశారు. పశ్చిమ యూరప్ లో ఈ కాలాన్ని మగ్దలీనియన్(Magdalenian) సంస్కృతికి ప్రారంభదశగా చెబుతారు.

లస్కో గుహాచిత్రాలలో ‘The Shaft of the Dead Man’ అనేది ఒకటి. ఇందులో shaft అనే మాటకు బాణం, పొడవైన ఒక సాధనం, దండం మొదలైన అర్థాలున్నాయి. ప్రస్తుతసందర్భానికి అనుగుణంగా దండమనే అర్థం చెప్పుకుందాం. ‘మృతునికి చెందిన దండం’గా పై పేరును అనువదించుకోవచ్చు. ఇందులో ఒక పురుషాకృతి, ఒక అడవిదున్న, ఒక దండం, దాని మీద ఒక పక్షి చిత్రితమై ఉన్నాయి. పురుషుని తల పక్షిరూపంలో ఉంది; అతని జననాంగం నిక్కబొడుచుకుని ఉంది. పైపైన చూసినప్పుడు ఒక వేటగాడు ఒక అడవిదున్నను ఈటెతో పొడిచినట్టు, దాని పేగులు బయటికి వచ్చినట్టు ఇందులో కనిపిస్తుంది. థామ్సన్ వివరణ ప్రకారం, కొంచెం నిశితంగా చూస్తే జంతువును చిత్రించడంలో సహజత్వం కనిపిస్తుంది. లస్కో గుహాచిత్రాలు అన్నింటిలో జంతుచిత్రణ అలాగే ఉంటుంది. ఈ చిత్రంలోని మనిషి చిత్రణ మాత్రం రేఖాప్రాయంగా ఉంది. జంతుచిత్రణలోని సహజత్వానికీ, మిగతావాటి చిత్రణలోని అమూర్తత(abstract)కూ మధ్య సంధిదశను ఇది సూచిస్తుందని థామ్సన్ అంటాడు.

ఒక వేటగాడు ఒక అడవిదున్నను వధించడం అనే సాధారణార్థాన్ని మించి, ఈ చిత్రం ఒక విశేషార్థాన్ని చెబుతోందని ఆయన అంటాడు. ఉదాహరణకు, ఆ చిత్రంలోని పురుషుని జననాంగం నిక్కబొడుచుకుని ఉండడాన్ని ప్రస్తావించి, హింసాత్మక మరణమప్పుడు, కలల్లోనూ, దివ్యదర్శనాల్లోనూ, సమాధిస్థితిలోనూ, ‘కుండలిని’ మేలుకొన్నప్పుడూ కూడా జననాంగం నిక్కబొడుచుకుంటందంటాడు.

ఇక్కడే ఒక వివరణ ఇచ్చుకోవాలి. థామ్సన్ భారతీయతాంత్రికతను, అందులో భాగమైన కుండలినిని, దానికి సంబంధించిన ఇళ, పింగళ, సుషుమ్న, శక్తి తదితర పదజాలాన్ని తన పరిశీలనలోకి తీసుకొస్తాడు. తను క్రియాయోగాన్ని సాధనచేసేవాడిగా కూడా ఆయన చెప్పుకున్నాడు. ఆవిధంగా తాంత్రికతపై ఆయనకు సానుకూలదృక్పథం ఉంది. అయితే, తాంత్రికతపై అనుకూలత, లేక వ్యతిరేకత అనేవి ఇక్కడ చర్చనీయాలు కావు; ప్రత్యేకించి భారతదేశం, ఈజిప్టు, మెక్సికోలలో అభివృద్ధి చెందిన తాంత్రికత నిజానికి విశ్వజనీననేపథ్యం కలిగినదనీ, దాని మూలాలు ఎగువమధ్యరాతియుగానికి చెందిన తొలి సార్వత్రికమతమైన అమ్మ(Mother Goddess)మతంలో ఉన్నాయనీ, అప్పటినుంచీ ఇప్పటివరకూ భిన్నరూపాలలో అది కొనసాగుతోందనీ థామ్సన్ సాధికారంగా చెప్పడమే ఇక్కడ ఎక్కువ ఆసక్తికరమూ, అద్భుతమూ, ప్రస్తుత సందర్భానికి అవసరమైనదీ.

అలాగే ఇంకొక వివరణ కూడా ఇచ్చుకోవాలి. థామ్సన్ భారతీయ, సుమేరు, ఈజిప్టు, పశ్చిమాసియాలకు చెందిన పౌరాణిక, తాత్వికతలను చర్చకుతెస్తూనే; తనకు బాగా పరిచయమైన యూరప్ నేపథ్యం మీద ఎక్కువ ఆధారపడతాడు. భారతదేశపు పురాచరిత్రలోనూ, గుహాచిత్రాలు సహా దానికి సంబంధించిన పురావస్తు ఆధారాలలోనూ కూడా థామ్సన్ వివరణకు సాక్ష్యాలు దొరకవచ్చు. కాకపోతే, ఆ దిశగా ఎవరైనా కృషిచేసి తమ అధ్యాయనాలను వెలువరించారేమో తెలియదు. ఒకవేళ వెలువరించి ఉంటే వాటిని కూడా థామ్సన్ అధ్యయనానికి జోడించుకుని చూడవలసి ఉంటుంది.

తిరిగి పై చిత్రానికి వెడితే, సమాధిలో ఉన్న ఒక మాంత్రికుని(షామన్) శక్తి దర్శనంగా దానిని కొందరు అన్వయించిన సంగతిని థామ్సన్ ప్రస్తావిస్తాడు. కచ్చితంగా ఇదే అర్థమని చెప్పలేకపోయినా, దానిని ఒక స్వాప్నికదర్శనానికి చెందిన చిత్రంగానో. పౌరాణికకుడ్యచిత్రంగానో చూడడం ప్రారంభించినప్పుడు వాటికి సంబంధించిన లక్షణాలు ప్రస్ఫుటమవుతాయంటాడు. అప్పుడు, బయటికి వచ్చినట్టు కనిపించే అడవిదున్న పేగులు స్త్రీ జననాంగానికి సంకేతమైతే, ఈటె దానిని వధిస్తున్నట్టుగా కాక, స్త్రీ జననాంగంతో జతపడుతుంది; ఈటె అడవిదున్నకు గాయం చేయడం, పురుషుడి జనానాంగం స్త్రీ జననాంగానికి గాయం చేయడం లాంటిది. అలాగే, చిత్రంలోని మనిషి పురుషునికీ, అడవిదున్న స్త్రీకీ ప్రతీకలు. అతనిని మామూలు వేటగాడుగా కాక మాంత్రికునిగా అనుకుంటే, అతని దివ్యదర్శనంలో అమ్మదేవత(Mother Goddess) అడవిదున్న అవతారంలో కనిపించినట్టుగా ఈ చిత్రం చెబుతుంది.

అలాగే, చిత్రం మధ్యలో ఒక దండం మీద పక్షి వాలి ఉండడం, అందులోని మనిషి తల పక్షిరూపంలో ఉండడం గురించి థామ్సన్ ప్రస్తావిస్తూ, పక్షి వాలి ఉన్న దండం, లేదా సర్పం అల్లుకున్న టోటెమ్(గణచిహ్నం)స్తంభం అతి ప్రాచీనత కలిగిన విశ్వజనీన సంకేతాలంటాడు. ఈ దండం, లేదా స్తంభా(caduceus)నికి ‘పాశం’ అని కూడా నిఘంటువు అర్థం చెబుతోంది. మెర్క్యూరీ(Mercury) అనే దేవుడి చేతిలో ఉండే ఇలాంటి దండాన్ని థామ్సన్ ప్రస్తావిస్తాడు. మెర్క్యూరీనే మన దగ్గర బుధగ్రహంగా చెప్పుకుంటాం. అలాగే మన దగ్గర కుమారస్వామి చేతిలోనే కాక; అమ్మవారు, యముడు తదితర దేవతల చేతుల్లో కూడా పాశం, లేదా దండం ఉంటుంది. థామ్సన్ ప్రకారం, లస్కో గుహల్లోని ‘The Shaft of the Dead Man’ అనే పై చిత్రం మూలాలు ఎగువరాతియుగానికి చెందిన అమ్మమతంలో ఉన్నాయి. విశేషమేమిటంటే, ఆ అమ్మమతం తాలూకు వారసత్వాన్నే మనతో సహా అనంతర మతాలవారు అందుకున్నారు. ఇందుకు తార్కాణంగా మెర్క్యూరీ దండం తాలూకు చిత్రాన్ని కూడా థామ్సన్ తన పుస్తకంలో పొందుపరుస్తాడు.

పక్షీ, సర్పమూ మన మత, పురాణ, ఇతిహాస, జానపద, తాత్వికవాఙ్మయాలలో అతిముఖ్యచిహ్నాలన్న సంగతి మనకు తెలుసు. ఉదాహరణకు, సరస్వతి పక్కన నెమలి, శారదాదేవి భుజం మీద చిలుక కనిపిస్తాయి. విష్ణువు గరుడవాహనుడు, శేషుడనే సర్పాన్ని తల్పంగా చేసుకుంటాడు; కుమారస్వామి నెమలివాహనుడు, శివుడు నాగాభరణుడు. ఇతర పురాణగాథలకు వస్తే, గ్రీకు దేవత ఆఫ్రోడైటీ చేతి మీద పావురం వాలి ఉంటుంది. ఒక క్రైస్తవ ఉదంతంలో దేవుడైన హోలీ ఘోస్ట్ పావురం రూపంలో మేరీ దగ్గరికి వస్తాడు. కృష్ణుడు కాళియుడనే సర్పాన్ని మర్దించినట్టే, యెహోవా కూడా ఒక సర్పాన్ని జయిస్తాడు.

ఎగిరే పక్షిని ప్రాణానికి సంకేతంగా చెప్పుకుంటాం. సప్తసముద్రాలకు అవతల ఒక చెట్టుతొర్రలోని పక్షిలో మాంత్రికుడి ప్రాణం ఉండడం గురించిన కథలు మన జానపదవాఙ్మయంలో కనిపిస్తాయి. గాలిలో ఎగిరే పక్షీ, నేలమీద పాకే సర్పమూ ఇహలోక, పరలోకాలకు చెందిన తాత్వికార్థాన్ని బోధించడంలో ముఖ్యసంకేతాలయ్యాయి. పైన చెప్పుకున్న దండం, స్తంభం, లేదా పాశంతో సహా వీటన్నిటి మూలాలు పాతరాతియుగంలోనూ, అప్పటి అమ్మమతంలోనూ ఉన్న సంగతిని గుర్తించడమే ఇక్కడ కీలకం. అమ్మమతాన్ని విశ్వజనీనమతంగా, సార్వత్రికమతంగా థామ్సన్ పదే పదే నొక్కి చెబుతాడు.

లస్కో గుహలోని పై చిత్రం గురించిన మరి కొంత వివరణ చూడండి. అందులోని అడవిదున్నను స్త్రీసూత్రానికి, నిక్కబొడుచుకున్న జననాంగం కలిగిన పురుషుని పురుషసూత్రానికి ప్రతీకలుగా థామ్సన్ చెబుతాడు. ఎలాగంటే అడవిదున్న భారీతనాన్ని, మందకొడిలక్షణాన్ని, స్థిరత్వాన్ని, లేదా శాశ్వతత్వాన్ని సంకేతిస్తుంది; పురుషుడు ఒక పతాకస్థాయిని, పారవశ్యాన్ని సూచించే తక్షణతను సంకేతిస్తాడు. విచిత్రంగా మన తాత్వికతలో కూడా స్త్రీని జడంగానూ, ప్రకృతిగానూ; పురుషుని చైతన్యంగానూ చెప్పడం కనిపిస్తుంది. బాల్యం మొదలుకొని వృద్ధాప్యం వరకూ వివిధవయోదశల మీదుగా పురుషుడు స్త్రీకి ప్రతీక అయిన దున్నతో, లేదా వృషభంతో ఆడుకోవడాన్ని సూచించే చిత్రాలను కూడా థామ్సన్ ఉటంకిస్తాడు. వాటిలో, గడ్డంతో ఉన్న ఒక మనిషి వృషభాన్ని అధిరోహించి కనిపించే, చాటల్ హ్యుయక్ లోని కుడ్యచిత్రం ఒకటి.


Çatalhöyük wall-painting


బహుశా ఆ తర్వాతి కాలంలో ఈ సంకేతాలు తారుమారై తొలి అర్థం మరుగునపడినట్టు కనిపిస్తుంది. ఉదాహరణకు, ఇంతకుముందు చెప్పుకున్న సుమేరుపురాణగాథలోని ఎంకి అనే పురుషదేవుని వృషభంతో పోల్చడం చూశాం. అలాగే, మనం శివుని వృషభవాహనునిగా చెబుతాం. అదలా ఉంచి, 'వృషభవాహనుడైన శివు'ని మూలాలు మన దేశానికి అవతల నేటి తుర్కియేలోనూ, ఎగువరాతియుగంలోనూ ఉన్నాయన్నది ఇక్కడ గమనించవలసిన విశేషం.

స్త్రీ, పురుష జననాంగాలను ప్రకృతీ, కాలమూ, మతమూ, తాత్వికతల పరంగా అన్వయిస్తూ థామ్సన్ విస్తారంగా చర్చిస్తాడు. ఉదాహరణకు, పురాతనమతమైన అమ్మమతంలో కాలగమనాన్ని ఒక ఎముకమీద చెక్కిన జంతుచిత్రాల ద్వారా చంద్రసంబంధమైన కాలగణనం చెబుతుంది; అది ఋతువుల మార్పుపై ఆధారపడిన కాలగణనం. ఒక ఋతువులో జీవించినది ఇంకొక ఋతువులో మరణిస్తుంది. ఈ జననమరణాల మధ్య కాలాన్ని కొన్ని క్షణాలకు కుదించి చూపగలిగిన వాటిలో నిక్కబొడుచుకున్న పురుషుని జననాంగం ఒకటి. అది ఒక క్షణాన చిన్నదిగా, మృదువుగా ఉంటుంది; మరుక్షణంలో నాలుగురెట్లు పెద్దదై గట్టి పడుతుంది. ఆవిధంగా అది తక్షణతకు సహజమైన, పరిపూర్ణమైన ప్రతీక.

దానికి భిన్నంగా ఋతుకాలంలో రక్తాన్ని స్రవించే స్త్రీ జననాంగం ఋతుచక్రపరిభ్రమణానికి అంతే సహజమైన, పరిపూర్ణమైన ప్రతీక. ఈ స్త్రీ, పురుషసూత్రాల చుట్టూనే పురాణగాథలు అల్లుకున్నాయని థామ్సన్ అంటాడు. ఇలా వెలిగి అలా ఆరిపోయే క్షణికత్వాన్ని చాటే విషాదభరితుడు పురుషుడైతే, ఋతుచక్రంలా జననమరణాల నిరంతరాయతను, స్థిరతను చాటేది స్త్రీ. అందుకే పశ్చిమాసియాపురాణకథలన్నీ పురుషుడు మరణించడం గురించి చెబుతాయని థామ్సన్ అంటాడు. మన పురాణ, ఇతిహాసాల్లో కూడా ఇందుకు సంబంధించిన సాక్ష్యాలు లభిస్తాయి. ఊర్వశీ, పురూరవుల కథకు కొశాంబీ అన్వయం ఇలాగే ఉంటుంది. అది పురూరవుని మరణం గురించి చెబుతుంది. శివుడు మన్మథుని భస్మం చేయడం, భర్త మరణానికి రతీదేవి శోకించడం, తిరిగి మన్మథుడు జన్మించడం, శివపార్వతుల వివాహం జరిగి కుమారుడు పుట్టడం గురించి కుమారసంభవకథ చెబుతుంది. సుమేరు సహా ఇతరత్రా పురాణాల్లో కూడా ఇలాంటి కథలున్నాయి. దీనిని వ్యవసాయానికి అన్వయించడం కూడా ఉంది. ఈ వ్యాసకర్త రచించిన 'మంత్రకవాటం తెరిస్తే మహాభారతం మనచరిత్రే' అనే రచనలో దీని గురించి వివరంగా చూడవచ్చు.

పురుషుడి జననాంగం మరణించే దేహానికి ప్రతీక కనుకనే పురాతన గ్రీసు నగరమైన ఎఫెసొస్(Ephesus)లో డయానా(Diana) అనే దేవత గుడిలోని పూజారులు తమ జననాంగాన్ని ఛేదించుకుని దేవతకు సమర్పించుకునేవారంటాడు థామ్సన్. జననాంగాన్ని సమర్పించుకోవడమంటే, మరణరాహిత్యాన్ని, అంటే అమరత్వాన్ని ప్రసాదించమని అమ్మవారిని ప్రార్థించడమే. లైంగిక సంపర్కాన్ని త్యజించడం ద్వారా, అంటే బ్రహ్మచర్యాన్ని పాటించడం ద్వారా విశ్వజనీనమైన అమ్మ శక్తిని పురుషుడు సంతరించుకోవచ్చునన్నది ఇందులోని భావన. ఆలంకారికంగా, మార్మికంగా చెప్పిన ప్రతీకలను సామాన్యార్థంలో తీసుకునే అజ్ఞానం దీని వెనుక ఉందని థామ్సన్ అంటాడు. మన పురాణ, ఇతిహాసకథల్లో, మతవిశ్వాసాల్లో, ఆరాధనావిధానాల్లో కూడా ఇలాగే బ్రహ్మచర్యాన్ని నొక్కిచెప్పే ఉదంతాలు లెక్కలేనన్ని కనిపిస్తాయి.

ఎగువరాతియుగానికి చెందిన అమ్మమతానికి అద్దంపట్టే ‘The Shaft of the Dead Man’ తరహా చిత్రాలు కొత్తరాతియుగంలోనూ, ఆ తర్వాతి కాలానికి చెందిన నాగరికమతాల్లోనూ కూడా కనిపిస్తాయని థామ్సన్ అంటూ, లిథుయేనియాకు చెందిన పురాతత్వ, మానవశాస్త్రవేత్త మరియా గింబుటస్(Marija Gimbutas)ను ఉటంకిస్తాడు. ఆమె ప్రకారం, పక్షీ-సర్పరూపదేవతారాధన క్రీ.పూ. 6000లో మధ్య యూరప్ లో ప్రబలంగా ఉండేది. ఇందులో నీటిలో సంచరించే ఒక పక్షినీ, సర్పాన్నీ విడివిడిగా కాకుండా ఒకే మూర్తిగా కలిపి ఆరాధించడం ఉండేది. ఆ పక్షి మెడే సర్పంలానూ, పురుషుడి జననాంగంలానూ పొడవుగా ఉండేది. ఈ రూపం ఎగువరాతియుగానికి చెందిన మగ్దలీనియన్ సంస్కృతినుంచి సంక్రమించింది. ఈ మిశ్రమరూపానికి విడిగా సర్పదేవతరూపమూ ఉండేది; అది స్త్రీసూత్రానికి చెందినది.




 పక్షీ, సర్పమూ కలసి ఉన్నట్టు చూపే పై మిశ్రమరూపం (పై ఫోటో) ఎగువరాతియుగంనుంచీ అనేకవేల సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తున్నదే కాక, ద్విలింగ(bisexualism)స్వభావాన్ని చెబుతుందని మరియా గింబుటస్ అంటుంది. అంటే, ఎగువరాతియుగంనాటి అమ్మమతంలో పురుషసూత్రం, స్త్రీసూత్రం అనేవి విడివిడిగా లేవు; అంతా స్త్రీయే. క్రీ.పూ 7000-6000 ప్రాంతంలో ఎజియన్, బాల్కన్స్ ప్రాంతాలలోనూ ఈ మిశ్రమరూపమే ప్రబలంగా ఉండేది.

ప్రపంచవ్యాప్తంగా ఆదిమవాసుల కాలంనుంచి కొనసాగుతున్న మాంత్రిక(షామనిస్టిక్)ఉపాసనలో ద్విలింగస్వభావం ప్రస్ఫుటంగా కనిపిస్తుందని థామ్సన్ అంటాడు. తాంత్రికయోగమూ, దానితో ముడిపడిన కుండలినిలో కూడా ఇదే కనిపిస్తుంది. ఇందులో ఉపాసకుడు స్త్రీ ఆహార్యాన్ని ధరిస్తాడు. గ్రామదేవతలతో మొదలుపెట్టి, బ్రాహ్మణీయదేవతలవరకూ అమ్మవారి ఆరాధనలో ఇలా స్త్రీ ఆహార్యాన్ని ధరించడం కనిపిస్తుంది. విశేషమేమిటంటే, మన పురాణాలలోని అర్ధనారీశ్వరరూపానికి కూడా మూలం ఎగువరాతియుగానికి చెందిన ద్విలింగమూర్తిలోనే ఉన్నట్టు దీనినిబట్టి అనుకోవాలి. ఇప్పుడు మనం అర్ధనారీశ్వరూపాన్ని శివుడివైపునుంచి, అంటే పురుషుడి వైపు నుంచి చెబుతాం. కానీ అమ్మ మతం దానిని స్త్రీవైపునుంచి చెబుతుంది. ఆవిధంగా మొదట అది ‘అర్ధనరేశ్వరి’రూపమన్నమాట; ఆ తర్వాతే అర్ధనారీశ్వరరూపం వచ్చింది.

పక్షి-సర్పదేవత గురించి మరియా గింబుటస్ ఇచ్చిన సమాచారం ఎగువపాతరాతియుగానికి, కొత్తరాతియుగానికి ముడిపెడుతూ రెంటి మధ్యా అవిచ్చిన్నతను స్థాపిస్తోందని థామ్సన్ అంటాడు. ఎగువరాతియుగానికి చెందిన ఈ మతం ఏదో ఒక తెగవారి మూఢనమ్మకాలనుంచి పుట్టినది కాదనీ, అదే ప్రపంచవ్యాప్తంగా అన్ని సంస్కృతులకూ విస్తరించిన మొట్టమొదటి విశ్వజనీనమతమనీ, ఋతుస్రావానికి చెందిన నిగూఢతపైనా, చంద్రుని ఆధారం చేసుకున్న కాలగణనపైనా ఆధారపడిన మతమనీ అంటాడు.

***

ఈ మొత్తం వివరణలో ప్రస్తుత మన రామాయణసందర్భానికి అవసరమైన కోణం ఏమిటంటే, సామాజికంగా, ఇతరత్రా స్త్రీ, పురుషుల స్థానాలు తారుమారు అవుతూవచ్చిన క్రమాన్ని చారిత్రకంగా గుర్తించడం! మతవిశ్వాసాలు, ప్రతీకలు, వాటికి సంబంధించిన గుహాచిత్రాలు, కుడ్యచిత్రాలు, ఇతర పురావస్తు ఆధారాల మీదుగా థామ్సన్ చేసినదీ, మనకిప్పుడు కావలసినదీ అదే. ఎగువరాతియుగానికి చెందిన అమ్మమతానికి అద్దంపట్టే లస్కో గుహాచిత్రాలనుంచి ఆయన కొత్తరాతియుగానికి చెందిన చాటల్ హ్యుయక్ జనావాసానికీ, అక్కడి కుడ్యచిత్రాలకూ వచ్చి అందులో అమ్మమతం ఆనవాళ్లను, అందులో వచ్చిన మార్పుల్ని చెబుతాడు. అక్కడినుంచి సుమేరుదేవుడైన ఎంకి కథకు గల పూర్వరంగాన్ని ఎత్తుకుంటాడు.

వాటిల్లోకి తర్వాత...




Tags:    

Similar News