ఈశాన్య రాష్ట్రాలపై చైనాకు సహకరిస్తామని యూనస్, చైనాకు హింట్ ఇచ్చారా?
బంగ్లా తాత్కాలిక పాలకుడి మాటలపై ఆగ్రహం వ్యక్తం చేసిన హిమాంత బిశ్వ శర్మ.. వీటిని సీరియస్ తీసుకోవాలని సూచన;
By : Praveen Chepyala
Update: 2025-04-01 08:35 GMT
మన పొరుగుదేశం బంగ్లాదేశ్, మరో సరిహద్దు దేశం చైనా. ఒక దేశం ఆది నుంచి గిచ్చి కయ్యం పెట్టుకునే జగడాల మారి. షేక్ హసీనా పలాయనం తరువాత బంగ్లాదేశ్ ప్రభుత్వ సలహదారు మహ్మద్ యూనస్ నేతృత్వంలోని జిహాదీ మతోన్మాద శక్తులు అక్కడి పాలనపై పట్టు బిగించడానికి ఢిల్లీనే బూచిగా చూపిస్తున్నాయి.
ప్రస్తుతం యూనస్ నాలుగు రోజుల పర్యటన నిమిత్తం చైనాకు వెళ్లారు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన బీజింగ్, తన ప్రభావాన్ని ఢాకా వరకూ విస్తరించాలని కోరారు.
ఈ సందర్భంగా ఆయన భారత్ లోని ఈశాన్య రాష్ట్రాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమ దేశం చుట్టూ ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయని, వాటికి బంగాళఖాతం తీరంగా లేదని, తాము మాత్రమే సముద్రానికి రక్షకులమని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయి వైరల్ గా మారాయి.
భూ పరివేష్టిత ప్రాంతం..
తన నాలుగు రోజుల పర్యటనలో జిన్ పింగ్ ను కలిసిన యూనస్, బీజింగ్ తో తొమ్మిది ఒప్పందాలపై సంతకం చేశాడు. భారత్ లోని ఏడు రాష్ట్రాలు భూపరివేష్టితంగా ఉన్నాయి.
వాటికి సముద్ర మార్గం లేదు. ఈ ప్రాంతంలోనే బంగ్లాదేశ్ ఉంది. దానికి రక్షకుడు ఢాకానే. ఇది చైనా ఆర్థిక వ్యవస్థకు గొప్పగా ఉపయోగపడుతుందని ఆయన వ్యాఖ్యానించారు.
మీకు ఈశాన్య రాష్ట్రాలతో సంబంధం ఏంటీ? భారత్..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆర్థిక సలహా మండలి సభ్యుడు సంజీవ్ సన్యాల్ ఈ వీడియోను సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేసి, యూనస్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అసలు యూనస్ కు భారత్ లోని ఈశాన్య ప్రాంతాలతో ఏంటీ సంబంధం అని ప్రశ్నించారు.
‘‘భారత్ లోని ఏడు రాష్ట్రాలు భూపరివేష్టితంగా ఉంది. యూనస్.. చైనీయులకు బహిరంగంగా విజ్ఞప్తి చేయడం ఆసక్తికరంగా ఉంది. బంగ్లాదేశ్ లో చైనా పెట్టుబడులు పెట్టడానికి ఆహ్వానించడం మంచి పరిణామమే, కానీ సెవెన్ సిస్టర్స్ భూపరివేష్టితంగా ఉందనడం, దాని ప్రాముఖ్యత ఏంటీ?’’ అని ఆయన ప్రశ్నించారు.
నదీ జలాలలో మాస్టర్ అంటా.. మంచి మిత్రుడని..
ఈ సందర్భంగా చైనాను యూనస్ పొగడ్తలతో ముంచెత్తాడు. ముఖ్యంగా నీటి నిర్వహణలో మాస్టర్ అంటూ కితాబునిచ్చాడు. తమకు నీటి నిర్వహణ కోసం 50 సంవత్సరాల ప్రణాళిక అవసరమని వివరించాడు. హిమాలయాలు, భారత్, బంగ్లాదేశ్ గుండా ప్రవహించే తీస్తా నదీ విషయంలో ఈ నిర్వహణ అవసరం ఉందన్నారు.
‘‘మేము మీ నుంచి నేర్చుకోవడానికి వచ్చాము. ప్రజలకు నీటి వనరులను ఎలా ఉపయోగించాలో మీ నుంచి తెలుసుకోవాలి’’ అన్నట్లు బంగ్లాదేశ్ అధికారిక వార్తా సంస్థ తెలియజేసింది.
తిరుగు ప్రయాణంలో భాగంగా యూనస్ మరో మాట అన్నారు. చైనా తమ దేశానికి మంచి మిత్రుడని, ఇది తన దేశానికి ముఖ్యమని అభివర్ణించారు. ఇందులో స్పష్టంగా న్యూఢిల్లీకి వ్యతిరేకంగా బీజింగ్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.
చైనాతో ద్వైపాకిక్ష సంబంధాలు కొత్త దశలోకి ప్రవేశిస్తాయని, తాను బీజింగ్ నుంచి అదే ఆశిస్తున్నట్లు యూనస్ ప్రభుత్వ వార్తా సంస్థ జిన్హువాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
హిమాంత బిశ్వ శర్మ..
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, బంగ్లాదేశ్ ప్రభుత్వ సలహదారు యూనస్ చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘‘ఇవి అభ్యంతరకరమైనది, తీవ్రంగా ఖండించదగినది’’ అన్నారు.
‘‘తాత్కాలిక ప్రభుత్వం అని పిలవబడుతున్న బంగ్లాదేశ్ కు చెందిన ఎండీ యూనస్ ఈశాన్య భారతంలోని ఏడు రాష్ట్రాలను భూ పరివేష్టిత రాష్ట్రాలుగా పేర్కొంటూ, బంగ్లాదేశ్ ను బంగాళాఖాతానికి సంరక్షకుడిగా పేర్కొనడం నిజంగా ఖండించదగినది’’ అని ఎక్స్ లో పేర్కొన్నారు.
మహ్మాద్ యూనస్ చేసిన ఇటువంటి రెచ్చగొట్టే ప్రకటనలు అంత తేలికగా తీసుకోకూడదు. ఎందుకంటే ఇవి లోతైన వ్యూహాత్మక పరిశీనలు, దీర్ఘకాలిక అజెండాలను ప్రతిబింబిస్తాయి’’ అని ఆయన అభిప్రాయ పడ్డారు.
ప్రమాదకరంగా చికెన్ నెక్ కారిడార్..
భారత్, ఈశాన్య రాష్ట్రాలను కలిపే చికెన్ నెక్ కారిడార్ అతి చిన్నగా ఉండటం ఇక్కడ ప్రస్తావించాల్సిన విషయం అని హిమాంత బిశ్వ శర్మ అన్నారు. ‘‘చారిత్రకంగా దేశంలోని అంతర్గత కొన్ని దుష్ట శక్తులు సైతం దేశం నుంచి ఈశాన్య భూభాగాలను విడదీయాలని చూశాయి.
అందువల్ల ఇక్కడ మరింత బలమైన రైల్వే, రోడ్ నెట్వర్క్ లను అభివృద్ది చేయాలి’’ అని శర్మ అన్నారు.
ఇక్కడ గణనీయమైన ఇంజనీరింగ్ సవాళ్లు ఉన్నప్పటికీ సంకల్పం, ఆవిష్కరణతో ఇవి సాధ్యమని, దీనివల్లే దేశంలోని ఇతర ప్రాంతాకు, ఈశాన్య ప్రాంతాలకు అనుసంధానం పెరిగే ప్రత్యామ్నాయా మార్గాలు వస్తాయని చెప్పారు.
ఈశాన్య రాష్ట్రాలకు ప్రమాదం: కాంగ్రెస్
ఈ అంశంపై కాంగ్రెస్ కూడా స్పందించింది. దేశాన్ని చుట్టుముట్టడానికి చైనాను బంగ్లాదేశ్ ఆహ్వనించడం ఈశాన్య రాష్ట్రాల భద్రతకు చాలా ప్రమాదకరమని, మణిపూర్ తో సహ ఈ ప్రాంతాన్ని ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించింది.
‘‘దేశాన్ని చుట్టముట్టమని బంగ్లాదేశ్, చైనాను ఆహ్వానిస్తోంది. బంగ్లాదేశ్ ప్రభుత్వ వైఖరి మన ఈశాన్య ప్రాంత భద్రతకు చాలా ప్రమాదకరం. ప్రభుత్వం మణిపూర్ ను పట్టించుకోలేదు. చైనా ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్ లోని చాలా భూభాగాల్లో గ్రామాలను ఏర్పాటు చేసింది.’’ అని కాంగ్రెస్ ప్రచార విభాగం అధిపతి పవన్ ఖేరా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు.
చైనాలో యూనస్ పర్యటన ఎలా సాగింది..
మార్చి 26న చైనా పర్యటన ప్రారంభించిన యూనస్.. మొదటగా హైనాన్ ప్రావిన్స్ లో అడుగుపెట్టారు. అక్కడ జరిగిన బోవో ఫోరం ఫర్ ఆసియా వార్షిక సమావేశంలో ప్రసంగించారు.
మార్చి 27 అనేక కార్యక్రమాలలో పాల్గొన్నారు. తరువాత పెకింగ్ యూనివర్శిటి నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఉపన్యాసం కూడా ఇచ్చారని బంగ్లాదేశ్ అధికారిక మీడియా తెలిపింది.
ఢాకాలో పాలన మార్పుకు దారితీసిన విద్యార్థుల నిరసనలను బంగ్లాదేశ్ ప్రధాన సలహదారుడు హైలైట్ చేసి, దేశంలో శాంతి, స్థిరత్వం లో బీజింగ్ ఎక్కువ పాత్ర పోషించాలని కోరాడు.
అధ్యక్షుడు జిన్ పింగ్ తో యూనస్ సమావేశం అయిన తరువాత చైనా- బంగ్లా మధ్య తొమ్మిది ఒప్పందాలు కుదిరాయి. చైనా ప్రభుత్వం నుంచి అదనంగా 2.1 బిలియన్ డాలర్ల పెట్టుబడులు, రుణాలు, గ్రాంట్లను పొందింది. యూనస్ - బంగ్లా జిన్ పింగ్ మధ్య సమావేశం తరువాత తీస్తా నదీ జలాల సమగ్ర నిర్వహణ, పునరుద్దరణ ప్రాజెక్ట్ లో పాల్గొనడానికి చైనా కంపెనీలను బంగ్లాదేశ్ స్వాగతించింది.