పాక్ మాజీ మంత్రి రాహుల్‌ను ఎందుకు ప్రశంసించారు? మోదీ ఎలా స్పందించారు?

పాకిస్తాన్ మాజీ మంత్రి చౌదరి ఫవాద్ హుసేన్ రాహుల్‌పై ప్రశంసలు కురిపించడంపై ప్రధాని మోదీ స్పందించారు. కాంగ్రెస్‌, పాకిస్తాన్‌కు మధ్య బద్ధం తేటతెల్లమైందని అన్నారు.

Update: 2024-05-02 12:18 GMT
పాకిస్తాన్ మాజీ మంత్రి చౌదరి ఫవాద్ హుసేన్ రాహుల్‌పై ప్రశంసలు కురిపించడంపై మోదీ స్పందించారు. రాహుల్‌ని ‘ప్రధానమంత్రి’ చేసేందుకు పాకిస్తాన్ తహతహలాడుతోందన్నారు. కాంగ్రెస్ పార్టీకి పాకిస్తాన్‌కు మధ్య బద్ధం తేటతెల్లమైందని వ్యాఖ్యానించారు. సెంట్రల్ గుజరాత్‌లోని ఆనంద్ ప్రాంతంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
ముస్లింలకు షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ), ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) రిజర్వేషన్లు కల్పించేందుకు భారత రాజ్యాంగాన్ని మార్చాలని కాంగ్రెస్ భావిస్తోందని ఆరోపించారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగాన్ని మార్చబోమని కాంగ్రెస్ లిఖితపూర్వకంగా ఇస్తుందా? అని ప్రధాని మోదీ సవాల్ విసిరారు.
గత పదేళ్లలో బీజేపీ ఎన్నో విజయాలు సాధించిందని చెప్పుకొచ్చారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి 24x7 పని చేస్తానని హామీ ఇచ్చారు. గత పదేళ్లలో తమ ప్రభుత్వం 14 కోట్ల ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఇచ్చిందని, కాంగ్రెస్ నేతృత్వంలోని 60 ఏళ్ల పాలనలో కేవలం 3 కోట్ల ఇళ్లకే ఇచ్చారని మోదీ గుర్తు చేశారు.
‘‘ఓట్ జిహాద్’’పై ఆగ్రహం
సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు సల్మాన్ ఖుర్షీద్ మేనకోడలు మరియా ఆలం 'ఓటు జిహాద్' అనడంపై కూడా మోదీ విమర్శలు గుప్పించారు. “ఇప్పుడు INDI కూటమి 'ఓటు జిహాద్' కోసం పిలుపునిస్తోంది. ‘లవ్‌ జిహాద్‌’, ‘ల్యాండ్‌ జిహాద్‌’ గురించి ఇప్పటి వరకు విన్నాం. ఈ మాట అన్నది కూడా ముస్లిం కుటుంబానికి చెందిన బాగా చదువుకున్న వ్యక్తి. జిహాద్ అంటే ఏమిటో మీ అందరికీ తెలుసనుకుంటున్నాను. అలా అనడం.. ప్రజాస్వామ్యాన్ని అవమానించడమే. ఏ ఒక్క కాంగ్రెస్‌ నాయకుడు కూడా ఖండించలేదు’’ అని మోదీ పేర్కొన్నారు.
Tags:    

Similar News