అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థి మన తెలుగింటి అల్లుడే! ఎవరీ ఉషా చిలుకూరి?

తన భర్త రాజకీయ ప్రయాణంలో ఉషా చిలుకూరి ఓ అదృశ్యశక్తి. ఓ పక్క కుటుంబాన్నీ మరోపక్క ముగ్గురు పిల్లల్ని చూసుకుంటున్న ఉష మన తెలుగింటి అమ్మాయి కావడం గర్వకారణం.

Update: 2024-07-16 01:30 GMT

అమెరికన్ గ్రాండ్డ్ ఓల్డ్ పార్టీ- రిపబ్లికన్స్ గెలిస్తే అగ్రరాజ్య అమెరికాకి ఓ తెలుగింటమ్మాయి సెకండ్ లేడీ (రెండో మహిళ)గా నిలుస్తారు. రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష పదవికి డోనాల్డ్ ట్రంప్ ను ఆ పార్టీ సోమవారం సాయంత్రం ఎంపిక చేస్తే -- ట్రంప్ తన వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ గా ఒహాయో రిపబ్లికన్ సెనేటరు, తెలుగింటి అల్లుడు జేడీ వాన్స్ ను ఎంచుకున్నారు. 39 ఏళ్ల జేడీ వాన్స్‌ ఓ తెలుగు మూలాలున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. నవంబర్‌లో జరిగే ఎన్నికల్లో ట్రంప్ గెలిస్తే వాన్స్ భార్య ఉషా చిలుకూరి వాన్స్ యునైటెడ్ స్టేట్స్‌కి రెండవ మహిళ అవుతారు. మిల్వాకీలో జరిగిన పార్టీ సమావేశంలో డోనాల్డ్ ట్రంప్ జేడీ వాన్స్ పేరును ప్రకటించారు. ట్రంప్ పై శనివారం దాడి జరిగిన మరుక్షణమే స్పందించిన తొలి రాజకీయ నాయకుడు జేడీ వాన్స్. ట్రంప్ పై హత్యాప్రయత్నం వెనుక ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ పాత్ర ఉండవచ్చునని ట్వీట్ చేసిన రిపబ్లికన్ సెనేటర్ వాన్స్. ఒకప్పుడు ట్రంప్ విమర్శకుడిగా ఉన్న జెడి వాన్స్ ఇప్పుడు ట్రంప్ కి అత్యంత ఇష్టమైన అనుచరుడని అంటారు. ఆయన భార్య ఉషా చిలుకూరి ఒకప్పుడు డెమెక్రటిక్ పార్టీ సభ్యురాలు. కొన్నేళ్ళ కిందట ఆ పార్టీకి రాజీనామా చేసి రిపబ్లికన్ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. నేషనల్ లీగల్ ఏజెన్సీలో వ్యాజ్యకర్తగా (లిటిగేటర్) పని చేస్తూ ఎన్నో కేసుల్ని పరిష్కరించిన ఉషా చిలుకూరి మూలాలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి.

తెలుగు మూలాలున్న అమెరికన్..

ఇంతకీ ఎవరీ ఉషా చిలుకూరి? ఏమా కథ! జేడీ వాన్స్ పేరును ట్రంప్ ప్రకటించినప్పటి నుంచి రెండు మూడు గంటలుగా గూగుల్ హోరెత్తుతోంది. ఆమె ఎవరో తెలుసుకునేందుకు లింక్ డెన్ మొదలు ఫేస్ బుక్ వరకు ఒకటే వెతుకులాట సాగుతోంది. ది న్యూయార్క్ టైమ్స్ ప్రకారం భారతీయ వలసదారుల బిడ్డ. భారత సంతతికి చెందిన న్యాయవాది ఆమె. ఆమె తల్లిదండ్రులు సుదీర్ఘ కాలం కిందట ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం వెళ్లి స్థిరపడ్డారు. ఉషా కూడా కాలిఫోర్నియాలోనే పుట్టారు. శాన్ డియాగో, కాలిఫోర్నియాలో పెరిగారు. ప్రస్తుతం ఆమె వయసు 38. ఆమె లింక్డ్‌ఇన్ ప్రొఫైల్ ప్రకారం రాంచో పెనాస్క్విటోస్‌లోని మౌంట్ కార్మెల్ హై స్కూల్‌లో చదివారు. ఆధునిక చరిత్ర ఆమెకు ఇష్టమైన సబ్జెక్ట్. ప్రఖ్యాత యేల్ విశ్వవిద్యాలయం నుంచి చరిత్రలో బీఏ చదివారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ఆధునిక చరిత్రలో ఎంఫిల్ పట్టా పొందారు. యేల్ యూనివర్శిటీలో ఉన్నప్పటి నుంచే జేడీ వాన్స్ తో ఉషాకు పరిచయం ఉంది. ఆ పరిచయమే పెళ్లి వరకు వచ్చింది.
సుప్రీంకోర్టు లా క్లర్క్ గా...

ఎంఫిల్ పూర్తవుతూనే 2018లో అమెరికా సుప్రీం కోర్ట్‌కు లా క్లర్క్‌గా పని చేసిన ఆమె ఆ తర్వాత శాన్‌ఫ్రాన్సిస్కో, వాషింగ్టన్ డీసీలోని ముంగెర్, టోల్లెస్, ఓల్సన్ లో పనిచేశారు. కాలికేస్తే మెడకి, మెడకేస్తే కాలికేసే- సివిల్ లిటిగేషన్ల పరిష్కారంలో ఆమె దిట్ట. వ్యాపారం మొదలు కుటుంబ సమస్యల వరకు వివిధ రంగాలకు చెందిన అప్పీళ్లను కొలిక్కితేవడంలో ఆమెకు మంచి నైపుణ్యం ఉంది. మంచి లిటిగేటర్ గా పేరుంది.
వాన్స్ తో పరిచయం, పెళ్లి...
ఉషా చిలుకూరి యేల్ లా స్కూల్‌లో జేడీ వాన్స్‌ని 2013లో కలుసుకున్నారు. 2014లో పెళ్లి జరిగింది. పెళ్లి కాలిఫోర్నియాలో హిందూ సంప్రదాయం ప్రకారమే జరిగినట్టు తెలుస్తోంది. ఆమె పెళ్లి ఓ హిందూ పురోహితుడి ఆధ్వర్యంలో జరిగినట్టు ఆమె ఓ ఇంటర్వ్యూలో జరిగింది."తెల్లజాతీయులు ఎక్కువగా ఉండే అమెరికాలో సామాజిక క్షీణత" అనే అంశంపై డిబేట్ నిర్వహించేందుకు వీరిద్దరూ కలిసి పని చేస్తున్న సమయంలో వీళ్ల మనసులు కలిసినట్టు ది న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.
యేల్స్ స్పిరిట్ గైడ్ ఉష...
జేడీ వాన్స్ తరచుగా ఉషను అతని "యేల్ స్పిరిట్ గైడ్"గా పిలిచేవారట. ఎవరికైనా పరిచయం చేయాల్సి వచ్చినా అలాగే పరిచయం చేసేవారట. దీంతో వీరిద్దరి మధ్య బంధం త్వరగానే బలపడినట్టు చెబుతారు. యేల్ లా స్కూల్ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత వారు 2014లో వివాహం చేసుకున్నారు. యేల్‌లో చదువుతున్నప్పుడే ఉష యేల్ లా జర్నల్‌కు ఎగ్జిక్యూటివ్ డెవలప్‌మెంట్ ఎడిటర్‌గా, యేల్ జర్నల్ ఆఫ్ లా అండ్ టెక్నాలజీకి మేనేజింగ్ ఎడిటర్‌గా పనిచేశారు. ఆమె సుప్రీం కోర్ట్ అడ్వకసీ క్లినిక్, మీడియా ఫ్రీడమ్ అండ్ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ క్లినిక్, ఇరాకీ రెఫ్యూజీ అసిస్టెన్స్ ప్రాజెక్ట్‌లో పాలుపంచుకున్నారు.

జేడీ వాన్స్, ఉష దంపతులకు ముగ్గురు పిల్లలు. వీరిలో ఇద్దరు కుమారులు. వారి పేర్లలో ఒకటి వివేక్ కాగా పెద్దపిల్లాడి పేరు ఇవాన్. 2021లో వారికో కుమార్తె పుట్టారు. ఆమె పేరు మిరాబెల్. ఉష కుటుంబ సభ్యులు కాలిఫోర్నియాలోనే ఉన్నారు.
భర్తను రాజకీయాలవైపు మళ్లించిన ఉష...
తన భర్త జేడీ వాన్స్ రాజకీయ ప్రయాణంలో ఉష కీలకపాత్ర పోషించారు. తరచూ రాజకీయ కార్యక్రమాలకు వెళ్లేలా ప్రోత్సహించేవారు. వాన్స్ తో పాటు వెళ్లడమే కాకుండా దిశానిర్దేశం చేసేవారు. భర్త తీసుకునే రాజకీయ నిర్ణయాలకు ఆమె పూర్తి మద్దతు ప్రకటించేవారు.
2016లో వాన్స్ తొలిసారి సెనేటర్ గా పోటీ చేసినప్పుడు ఆమె ఆయన తరఫున విస్తృత ప్రచారం చేశారు. 2022లో తిరిగి మళ్లీ పోటీ చేసి గెలిచినపుడు కూడా ఆమె చాలా చురుగ్గా ప్రచారం చేయడంతో పాటు ప్రత్యర్థుల రాజకీయ ఎత్తుగడలను ధీటుగా ఎదుర్కొనడంలో క్రియాశీల పాత్ర పోషించారని ఆమె సహచరులు చెబుతారు. రాజకీయ సభలకు, ర్యాలీలకు చాలా ఎక్కువగా వెళ్లేవారట. 2018 నుంచి ఒహాయో రిపబ్లికన్‌గా ఓటు వేయడానికి ఆమె తన పేరును నమోదు చేసుకున్నారు. వాన్స్ ఉష మంచి ఇన్ఫులెన్సియర్ అని అందరి ముందే బాహాటంగా చెబుతుంటారు. ఆమె ప్రోత్సాహానికి కృతజ్ఞతలు చెబుతుంటారు. చివరకు సోమవారం కూడా జేడీ వాన్స్ ఆమెకు రిపబ్లికన్ వేదిక మీది నుంచే కృతజ్ఞతలు తెలపడం విశేషం.
పేరున్న లిటిగేటర్....
ఉషా 2018లో US సుప్రీం కోర్ట్‌కు లా క్లర్క్‌గా పని చేయడానికి ముందు 2015 నుంచి 2017 వరకు శాన్‌ఫ్రాన్సిస్కో వాషింగ్టన్ డీసీలోని వివిధ సంస్థలలో పని చేశారు. విద్య, వైద్యం, ప్రభుత్వం సహా వివిధ రంగాలలోని సంక్లిష్టమైన సివిల్ లిటిగేషన్లను, అప్పీళ్లను పరిష్కరించిన అనుభవం ఆమెకుంది. వివిధ అంశాలపై అవగాహన ఉన్న ఉష భర్త ఎన్నికై వైస్ ప్రెసిడెంట్ గా బాధ్యతలను స్వీకరిస్తే వైట్ హౌస్‌లోకి ప్రవేశించిన ఓ తెలుగింటి అమ్మయిగా చరిత్ర సృష్టించే అవకాశం ఉంది.
ఎవరీ జేడీ వాన్స్...
యువతకు గొంతుకగా నిలిచిన ఓ తెల్లజాతి వర్కింగ్ క్లాస్ యువకుడు. పేదరికం రుచితెలిసిన వాడు. ఒహాయోలోని అల్పాదాయ కమ్యూనిటీలలో పెరిగిన వాడు. పేదరికం-ఆర్ధిక పోరాటాలపై ఆయన రాసిన-హిల్‌బిల్లీ ఎలిజీ- అనే పుస్తకం 2016లో ఓ పెద్ద సంచలనం. గ్రామీణ అమెరికాలో చాలా మంది ఎదుర్కొంటున్న సవాళ్లకు ఈ పుస్తకం అద్దం పట్టింది. అనేక భాషల్లోకి అనువాదమైంది. మిలియన్ల కాపీలు అమ్ముడయ్యాయి. రాన్ హోవార్డ్ దర్శకత్వంలో సినిమా కూడా వచ్చింది. ప్రస్తుతం ఇతనో రైజింగ్ స్టార్. గ్రాండ్ ఓల్డ్ పార్టీ తరఫున వైస్ ప్రెసిడెంట్ గా పోటీ పడుతున్నారు.
కఠినమైన ఆర్థిక పరిస్థితులలో పెరిగాడు. అతని తల్లి మాదకద్రవ్యాల అలవాటుతో పోరాడింది. చిన్నతనంలోనే తండ్రిని పొగొట్టుకున్నాడు. తాతల ఇంటే పెరిగాడు. అందువల్లే తన ఇంటి పేరును కూడా మార్చుకున్నారు. తాతల పేర్లు వచ్చేలా జేడీ వాన్స్ అని పేరు పెట్టుకున్నాడు. ఇన్ని ఇబ్బందులున్నా వాన్స్ తన కుటుంబ పురోగతికి చాలా పాటు పడ్డాడు. మాజీ వెంచర్ క్యాపిటలిస్ట్. సక్సెస్పుల్ రచయిత. ప్రముఖ రాజకీయ నాయకుడు. ఇక వెనక్కి తిరిగి చూసే సూచనలే కన్పించడం లేదు.
తన భర్త రాజకీయ ప్రయాణంలో ఉషా చిలుకూరి ఓ అదృశ్యశక్తి. ఓ పక్క కుటుంబాన్నీ మరోపక్క ముగ్గురు పిల్లల్ని చూసుకుంటున్న ఉష మన తెలుగింటి అమ్మాయి కావడం గర్వకారణం.
Tags:    

Similar News