వీవీప్యాట్‌లను ఎలా లెక్కిస్తారు.. అసలు ఓట్ల లెక్కింపు బాధ్యత ఎవరిది?

మన దేశంలో ఎన్నికలు జరిగిన ప్రతిసారీ వినిపించే మాట ఈవీఎం హ్యాక్. ఇది షరామామూలే అయినా దీనికి ఒక పరిష్కారంగా అధికారులు తీసుకొచ్చిన పరికరమే ‘వీవీప్యాట్’.

Update: 2024-05-23 12:36 GMT

మన దేశంలో ఎన్నికలు జరిగిన ప్రతిసారీ వినిపించే మాట ఈవీఎం హ్యాక్. ఓడిన వాళ్లు గెలిచిన వాళ్లు ఈవీఎంలను హ్యాక్ చేశారని ఆరోపణలు, విమర్శలు చేస్తుంటారు. ఇది షరామామూలే అయినా దీనికి ఒక పరిష్కారం కనుగొనాలను అధికారులు భావించారు. అందులో భాగంగా వారు తీసుకొచ్చిన పరికరమే ‘వీవీప్యాట్’. వీటిని ఓటింగ్ పట్ల విశ్వాసాన్ని మెరుగుపరచడానికి 2013లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇవి ఈవీఎంపై ఓటరు బటన్ నొక్కిన తర్వాత సదరు పార్టీ గుర్తు, అభ్యర్థి పేరు కలిగి ఉన్న ప్రింటెడ్ పేపర్ స్లిప్‌ను సిద్ధం చేస్తుంది. తద్వారా సదరు ఓటరు ఓటు తాను అనుకున్న అభ్యర్థికే పడిందా లేదా అనేది చూసుకోవచ్చు. ఓట్ల కౌంటింగ్ సమయంలో వీటిని కూడా లెక్కిస్తారు. అయితే ఈవీఎంలు, పోస్టల్ బ్యాలెట్ల మాదిరిగా జరగదు వీటి లెక్కింపు. వీటికంటూ ఓ ప్రత్యేక పద్దతిని అనుసరిస్తారు.

వీవీప్యాట్ లెక్కింపు ఇలా..

ఈవీఎంల లెక్కింపు పూర్తియన తర్వాత వీవీప్యాట్‌లను లెక్కించడానికి తీసుకొస్తారు. వీటిలో ఏఏ వీవీప్యాట్‌లను లెక్కించాలని అనే నిర్ణయాన్ని లాటరీ పద్దతిలో తీసుకుంటారు. అలా లాటరీ తీసి అందులో వచ్చిన వీవీప్యాట్‌ను లెక్కింపుకు తీసుకెళ్తారు. అందులోని స్లిప్పులను లెక్కించిన తర్వాత దానికి జోడీగా ఉన్న ఈవీఎంలో వచ్చిన ఓట్లను సరిచూస్తారు. అందులో ఏదైనా వ్యత్యాసం వస్తే వీవీప్యాట్ స్లిప్పులను మరోసారి లెక్కిస్తారు. అప్పటికి కూడా లెక్కలో తేడా ఉంటే వీవీప్యాట్ స్లిప్పుల సంఖ్యనే పరిగణనలోకి తీసుకుంటారు. ఇదిలా ఉంటే ఈవీఎంల లెక్కింపు పూర్తయ్యే సమయానికి ఎవరికి ఎన్ని సీట్లు వచ్చాయి అనేది అనధికారికంగా అర్థమవుతుంది. కానీ వీవీప్యాట్‌ల లెక్కింపు తర్వాత ఈ ఫలితాలు అధికారికం అవుతాయి.

ఎందుకు ఆలస్యం

ఒక రౌండ్ కౌంటింగ్ పూర్తయిన వెంటనే వాటి ఫలితాలను అధికారి ప్రకటించారు. ఒక రౌండ్ ఫలితాలను ప్రకటించాలంటే సదరు అధికారికి 30 నుంచి 45 నిమిషాల సమయం పడుతుంది. అందుకు రౌండ్ పూర్తయిన తర్వాత అంతా సక్రమంగానే జరిగిందని అంగీకరిస్తున్నట్లు స్వతంత్ర అభ్యర్థుల సహా అన్ని పార్టీల ఏజెంట్ల, కౌంటింగ్ ఏజెంట్ల సంతకాలు తీసుకోవాలి. ఆ తర్వాత మైక్రో అబ్జర్వర్, కేంద్ర ఎన్నికల పరిశీలకుల సంతకాలు కూడా తీసుకోవాలి. ఆతర్వాత ఏవైనా ఈవీఎంలలోని ఓట్లను ఎన్నికల పరిశీలకుడు రికార్డులతో సహా పరిశీలిస్తారు. ఈవీఎం ఓట్లు, వీవీప్యాట్ ఓట్లు సరిపోవాలి. అప్పుడు ఏజెంట్లు అందరూ కూడా తమకు అభ్యంతరం లేదని ప్రకటించాలి. అప్పుడు ఆర్వో ఆ రౌండ్ ఫలితాలను అధికారికంగా విడుదల చేస్తారు. ఇక్కడ ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేస్తే లెక్కింపు ప్రక్రియ మరింత ఆలస్యం అవుతుంది.

ఓట్ల లెక్కింపు బాధ్యత ఎవరిది..!

ఎన్నికల నిర్వహణకు మొత్తంపైన ఎన్నికల సంఘం బాధ్యత వహిస్తుంది. ఒక నియోజకవర్గంలో నిర్వహించే ఎన్నికలకు అక్కడి రిటర్నింగ్ అధికారే సర్వం బాధ్యత వహిస్తారు. ఇందులో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కూడా ఉంది. అంటే ప్రతి నియోజకవర్గంలో అక్కడి ఓట్ల లెక్కింపుకు అక్కడి రిటర్నింగ్ అధికారే బాధ్యత వహిస్తారు. ఎన్నికల ప్రక్రియతో పాటు లెక్కింపులో కూడా ఎటవంటి అవకతవకలు, అసాంఘిక ఘటనలు జరగకుండా వీళ్లే చూసుకోవాల్సి వస్తుంది.

కౌంటింగ్ కేంద్రాన్ని ఎలా నిర్ణయిస్తారు!

ఓట్ల కౌంటింగ్ జరిగే ప్రాంతాన్ని రిటర్నింగ్ అధికారే నిర్ణయిస్తారు. కానీ కౌంటింగ్ ఎప్పుడు జరగాలన్నీ తేదీ, సమయాన్ని మాత్రం ఎన్నికల సంఘం నిర్ణయిస్తుంది. ఈ ఓట్ల లెక్కింపు తతంగం ప్రధానంగా రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నిర్వహించాలి. ఈ లెక్కింపు రిటర్నింగ్ అధికారి ప్రత్యక్ష పర్యవేక్షణలో నిర్వహించాల్సి ఉంటుంది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటాయి. ఈ సందర్భాల్లో రిటర్నింగ్ అధికారి ప్రత్యక్ష పర్యవేక్షణలో వివిధ అసెంబ్లీ సెగ్మెంట్లకు ఒకే ప్రదేశంలో కానీ వేరువేరు ప్రాంతాల్లో కానీ లెక్కింపు జరుగుతుంది.

Tags:    

Similar News