లెబనాన్ పేజర్ల దాడులతో కేరళకు లింకేంటి?

లెబనాన్‌లో ఇటీవల ఒక్కసారిగా పేజర్లు పేలిన ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 4 వేల మంది గాయపడ్డారు.

Update: 2024-09-21 09:38 GMT

లెబనాన్‌లో ఇటీవల ఒక్కసారిగా పేజర్లు పేలిన ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 4 వేల మంది గాయపడ్డారు. ఈ ఘటన వెనక ఇజ్రాయెల్ హస్తం ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం ఈ పేలుళ్లతో ఓ భార‌తీయుడికి సంబంధం ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. కేర‌ళ‌లో జన్మించిన రిన్సన్ జోస్ హిజ్‌బొల్లాకు పేజ‌ర్లు స‌ర‌ఫ‌రా చేసిన‌ట్లు ద‌ర్యాప్తులో తేలింది.

పేలిన పేజర్లపై తైవాన్ కంపెనీ ‘గోల్డ్ అపోలో’ పేరు ఉండడంతో ఆ దిశగా విచారణ మొదలుపెట్టారు. తమ ట్రేడ్‌మార్క్ లైసెన్సును మూడేళ్ల పాటు ఉపయోగించుకునే అవకాశాన్ని హంగేరీ రాజధాని బుడాపెస్ట్ కేంద్రంగా పనిచేస్తున్న బీఏసీ కన్సల్టింగ్ కేఎఫ్టీ సంస్థకు ఇచ్చినట్లు గోల్డ్ అపోలో వ్యవస్థాపకుడు, ప్రెసిడెంట్ హ్సు చింగ్-కువాంగ్ చెప్పారు. వాటిని బల్గేరియా రాజధాని సోఫియా కేంద్రంగా పనిచేస్తున్న నోర్టా గ్లోబల్ సంస్థ సరఫరా చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ సంస్థను ఏర్పాటు చేసిన వ్యక్తి కేరళలోని వాయనాడ్‌కు చెందిన రిన్సన్ జోస్‌గా గుర్తించారు. ప్రస్తుతం రిన్సన్ జోస్ ను వెతికే పనిలో ఉన్నాయి నిఘా వర్గాలు.

రిన్సన్ జోస్ ఎవరు?

కేరళలోని వాయనాడ్‌కు చెందిన 37 ఏళ్ల రిన్సన్ మాజీ సెమినరియన్. ఒన్మనోరమ నివేదిక ప్రకారం పదేళ్ల క్రితం నార్వేకు వలస వచ్చినట్లు తెలుస్తోంది. పాండిచ్చేరి యూనివర్సిటీ నుంచి MBA డిగ్రీ, ఓస్లో మెట్రోపాలిటన్ విశ్వవిద్యాలయం నుంచి ఇంటర్నేషనల్ సోషల్ వెల్ఫేర్ అండ్ హెల్త్ పాలసీలో మాస్టర్స్ పూర్తి చేశాడు. మార్చి 2022 నుంచి DN మీడియా గ్రూప్‌లో ఉద్యోగం చేస్తున్నాడని అతని లింక్డ్‌ఇన్ ప్రొఫైల్ ద్వారా తెలుస్తోంది. IT సేవలు, కన్సల్టింగ్, ప్రొక్యూర్‌మెంట్, రిక్రూటింగ్ కంపెనీ ‘NortaLink’ ను కూడా నడుపుతున్నట్లు సమాచారం. రిన్సన్ ప్రస్తుతం USలో ఉన్నట్లు సమాచారం. రిన్సన్ తండ్రి మనంతవాడిలో టైలర్. యుకెలో రిన్సన్‌కు ఒక సోదరుడు, ఐర్లాండ్‌లో ఒక సోదరి ఉన్నారు. కేరళలోని అతని కుటుంబానికి రిన్సన్ వ్యాపార లావాదేవీల గురించి ఏ సమాచారం లేదు. స్థానిక ప్రజలకు రిన్సన్ కుటుంబంపై మంచి అభిప్రాయం ఉంది. పత్రికల్లో వచ్చిన వార్తలను చూశాక తాము చాలా ఆందోళన కు గురయ్యామని, వెంటనే రిన్సన్‌ను సంప్రదించడానికి ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందని రిన్సన్ బంధువు ఒకరు చెప్పారు.

Tags:    

Similar News