రాయబరేలీలో రాహుల్ పెళ్లి ప్రస్తావన ఎందుకు చేసినట్టు?

దేశంలో అతి పురాతన పార్టీ కాంగ్రెస్. సుమారు 140 ఏళ్లు. అటువంటి పార్టీకి కురువృద్ధుడైన 81 ఏళ్ల మల్లికార్జున ఖర్గే నాయకత్వం వహిస్తుంటే..

Update: 2024-05-15 13:48 GMT

దేశంలో అతి పురాతన పార్టీ కాంగ్రెస్. సుమారు 140 ఏళ్లు. అటువంటి పార్టీకి కురువృద్ధుడైన 81 ఏళ్ల మల్లికార్జున ఖర్గే నాయకత్వం వహిస్తుంటే 53 ఏళ్ల వయస్కుడైన బ్రహ్మచారి రాహుల్ గాంధీ పార్టీ బరువు బాధ్యతలను మోస్తున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల బరువుబాధ్యతలను కూడా ఆయన తన భుజస్కందాలపై మోస్తున్నారు. ఒంటి చేత్తో పార్టీకి పునర్ వైభవం తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. అటువంటి రాహుల్ గాంధీ నోట ఇన్నేళ్ల తర్వాత పెళ్లి మాట వినపడింది. రాజీవ్ గాంధీ, సోనియా దంపతుల ముద్దుల కుమారుడైన రాహుల్‌ను ఇంతకాలం పెళ్లెప్పుడు చేసుకుంటారని ఎవరు అడిగినా ఈ సొట్టబుగ్గల చిన్నోడు నవ్వుతూ కొట్టిపారేస్తూ వస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సభలో రాహుల్ గాంధీ పెళ్లి ప్రస్తావన వచ్చింది. దానికాయన చెప్పిన మాట విని అందరూ ఒకింత ఆశ్చర్య చకితులయ్యారు. జల్దీ కర్నా పడేగీ (త్వరలో పెళ్లిచేసుకోవాలి) అని రాహుల్ గాంధీ చెప్పడం, దానికాయన చెల్లెలు, ఇద్దరు బిడ్డల తల్లి ప్రియాంక గాంధీ చప్పట్లు కొట్టడం, దానికి జనం కేరింతలు కొట్టడం ఏకకాలంలో జరిగింది.

రాయబరేలీలోనే ఎందుకామాట చెప్పారు?

కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న రాయ్‌బరేలీ నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు. నిజానికి ఆ సీటు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉంది. ఇప్పుడా కోటను కాపాడుకునేందుకు రాహుల్ గాంధీ రంగంలోకి దిగారు. ఈ నియోజకవర్గంలో రాహుల్ గాంధీ, ఆయన చెల్లెలు ప్రియాంక, ఆమె భర్త రాబర్ట్ వాద్రా ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో రాహుల్ గాంధీ ప్రసంగించి వెనుదిరుగుతూ.. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా అని అడిగారు. జనంలో నుంచి ఓ కాంగ్రెస్ అభిమాని.. "మీ పెళ్లి ఎప్పుడు?" అని అడిగారు. దానికి రాహుల్ కాసేపు తటపటాయిస్తూ ... నవ్వుతూ, "జల్దీ కర్నా పడేగీ" (త్వరలో పెళ్లి చేసుకోవాలి) అన్నారు. ఆ పక్కనే ఉన్న ప్రియాంక గాంధీ చిరునవ్వుతో చప్పట్లు కొట్టారు. జనం ఈలలు కేకలతో సభా ప్రాంగణాన్ని మార్మోగించారు. రాహుల్ గాంధీ ఆమాట చెప్పి ప్రేక్షకులకు చేయి ఊపుతూ వెనుదిరిగి వెళుతూ తన సోదరిని వేదిక ముందుకి పిలిచి.. ఆప్యాయంగా తల నిమిరి ప్రశంసాపూర్వకంగా ముద్దులు కురిపించారు.

రాహుల్ గాంధీ ప్రేమించిన ఆ అమ్మాయి ఎవరు?

నిజానికి కొన్నేళ్లుగా రాహుల్ గాంధీ పెళ్లి ప్రస్తావన ఏదో సందర్భంలో వస్తూనే ఉంది. రాహుల్ గాంధీ తల్లి సోనియాని సైతం అనేక మంది ఆయన పెళ్లి గురించి అడిగారు. దానికి ఆమె వైపు నుంచి కూడా చిరునవ్వే సమాధానంగా వచ్చేది. ప్రియాంక సైతం అదే మాట చెబుతూ వచ్చారు. ఆ ప్రశ్నేదో రాహుల్‌నే అడగండని చెబుతూ వచ్చారు. వాస్తవానికి ప్రియాంకకి ముందే రాహుల్ గాంధీ పెళ్లవుతుందని చాలామంది అనుకున్నారు. ఆయనకు ఓ ప్రముఖ హిందీ సినీనటుడు పెద్ద కుమార్తెతో పెళ్లి జరుగుతుందని ప్రచారం కూడా జరిగింది. ఆ నటుడి కుటుంబానికి రాజీవ్ కుటుంబంతో చాలా సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఏమి జరిగిందో తెలియదు కానీ ఆ సినీనటుడు తన కుమార్తెకు వేరే పారిశ్రామికవేత్తతో వివాహం జరిపించారు. అంతటితో ఆ కుటుంబానికి సోనియా కుటుంబానికి మధ్య సంబంధాలు తెగిపోయాయి. ఆ తర్వాత ఆ నటుడి భార్య ఉత్తరప్రదేశ్‌లోని ములాయం సింగ్ యాదవ్ స్థాపించిన సమాజవాదీ పార్టీ(ఎస్‌పీ)లో చేరి రాజ్యసభ సభ్యురాలు అయ్యారు.

చెల్లి పెళ్లికి అన్నయ్యే పెళ్లి పెద్ద..

ఈ సంబంధం చెడిపోయిన తర్వాతే ప్రియాంక గాంధీ తన ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టారు. పంజాబ్‌కి చెందిన ఓ ప్రముఖ ఇత్తడి శిల్పాల వ్యాపారి కుమారుడు రాబర్ట్ వాద్రాను వివాహం చేసుకున్నారు. ఈ సంబంధాన్ని సోనియా గాంధీ అయిష్టంగానే అంగీకరించారని ప్రచారం జరిగింది. అయితే రాహుల్ గాంధీ తన చెల్లెలి పక్షాన నిలిచి వారి పెళ్లికి పెద్దగా వ్యవహరించారు. ప్రియాంక పెళ్లి తర్వాత రాహుల్ గాంధీ కొంత కాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆ సమయంలో ఆయన ఓ విదేశీ యువతితో ప్రేమాయణం సాగించారని కూడా ప్రచారం జరిగింది. ఆమెను పెళ్లి చేసుకుంటారని కూడా మీడియా కోడై కూసింది. అందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అంగీకరించలేదంటారు. విదేశీయత కారణంగానే సోనియా ప్రధాని కాలేకపోయారన్నది కాంగ్రెస్ వాళ్ల వాదన. దానికి తగ్గట్టుగానే మహారాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శరద్ పవార్.. సోనియా దేశియతను ప్రశ్నించారు. ఆమెపై ఏఐసీసీ అధ్యక్షపదవికి పోటీ కూడా పడ్డారు.

కాంగ్రెస్ నాయకత్వమే వద్దందా?

గత అనుభవాల దృష్ట్యా రాహుల్ గాంధీ తాను ప్రేమించిన ఆ విదేశీ యువతిని వివాహం చేసుకోలేదని, పెళ్లి చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ విదేశీయుల పార్టీ అంటారని, అది పార్టీ ప్రభావాన్ని దెబ్బతీస్తుందని పార్టీ అధిష్టానం కూడా భావించింది. కారణాలు ఏవైనా ఆ వేళ కూడా రాహుల్ గాంధీ పెళ్లి చేసుకోలేదు. ఇప్పుడు తాజాగా త్వరలో చేసుకుంటానని చెబుతున్నారు. ఆమె ఎవరు, ఎక్కడి వారు అనే ప్రశ్న ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతోంది.

ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయని ప్రియాంక గాంధీ రాయబరేలీలో తన సోదరుడు కోసం విస్తృత ప్రచారం చేస్తున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి చెందిన స్మృతి ఇరానీ.. రాహుల్ గాంధీని ఓడించారు. ఈసారి అలా కాకుండా ప్రియాంక గాంధీ తన సోదరుడు రాహుల్ గాంధీ తరఫున రాయబరేలీలో మకాం వేసి ప్రచారం చేస్తున్నారు.

ఫిరోజ్ గాంధీతో మొదలు...

1952లో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరపున ఫిరోజ్ గాంధీ.. రాయబరేలీలో గెలిచారు. అప్పటి నుంచి ఆ సీటు కాంగ్రెస్ ఖాతాలో పడుతూనే వచ్చింది. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ భర్త ఫిరోజ్ గాంధీ రాయ్‌బరేలీలో గెలిచారు. 1952లో, 1957లో, 1960లో ఈ సీటును కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఫిరోజ్ గాంధీ మరణంతో జరిగిన ఉపఎన్నికల్లో ఆర్పీ సింగ్‌ను బరిలోకి దించి ఆ స్థానాన్ని నిలబెట్టుకుంది.

అన్నీ ప్రేమ వివాహాలే...

సోనియా గాంధీ వరుసగా నాలుగు సార్లు రాయ్‌బరేలీలో గెలిచారు. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని సోనియా గాంధీ నిర్ణయం తీసుకోవడంతో 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఇక్కడి నుంచి బరిలోకి దిగారు. ఈ సందర్భంగా సోనియాగాంధీ.. రాయ్‌బరేలీ ఓటర్లకు ఓ లేఖ రాశారు. "ఢిల్లీలో నా కుటుంబం ఉన్నా అది అసంపూర్ణమే. రాయబరేలీతోనే నా కుటుంబ బాంధవ్యం ముడిపడి ఉంది. నా కుటుంబం ఇదే" అని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలి హోదాలో రాసిన ఆ లేఖ తీవ్ర భావోద్వేగానికి గురిచేసింది. రాయ్‌బరేలీతో తన కుటుంబ సంబంధాలు పెనవేసుకుపోయాయని, రాయబరేలీని తన అత్తమామల నుంచి వచ్చిన "సౌభాగ్యం (అదృష్టం)"గా భావిస్తానని ఆమె పేర్కొంది.

రాయబరేలీతో ముడిపడిఉన్న గాంధీ కుటుంబం నుంచి ప్రాతినిధ్యం వహించిన ఇందిరా గాంధీ.. ఫిరోజ్ గాంధీని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇందిరా గాంధీ కోడలు సోనియా.. రాజీవ్ గాంధీని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సోనియా కుమార్తె ప్రియాంక గాంధీ.. రాబర్ట్ వాద్రాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఆ గడ్డపై రాహుల్ తన పెళ్లి ప్రస్తావన చేశారు. అంటే ఆయన కూడా ఎవరినైనా ప్రేమించి పెళ్లి చేసుకుంటారేమో చూడాలి.

Tags:    

Similar News